FCRA

విదేశీ నిధుల మూలాలు, ఉద్దేశాలపై నిఘా అవసరం

”ప్రపంచం సమతలంగా మారింది” అని థామస్ ఫ్రీడ్ మన్ ఒకసారి వ్యాఖ్యానించారు. ప్రపంచీకరణ నిశ్చయంగా వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో సమాన అవకాశాలను కల్పించింది. అయితే కొన్ని శక్తులు ఈ ప్రపంచాన్ని సామాజికంగా, సాంస్కృతికంగా కూడా ఒకే రూపంలోకి (సమతలం) తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అది దాని వైవిధ్యభరితమైన అందాన్ని తగ్గిస్తుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల (ఔదార్యం) ప్రపంచీకరణ తెచ్చిన ఈ ప్రమాదాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణలపై పార్లమెంట్ చర్చకు సిద్ధమవుతున్న తరుణంలో, అనేక పౌరసమాజ భాగస్వామ్య సంస్థలు ఈ ప్రతిపాదిత మార్పులను విమర్శించడమే కాకుండా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశాయి. అయితే, విదేశీ నిధులతో నడిచే ఉద్యమాల విషయంలో భారతదేశ అనుభవాలు, అలాగే ఇతర దేశాల ఉదాహరణలు ఈ నియంత్రణ చట్రాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని తగినంతగా చాటిచెబుతున్నాయి.

కాలక్రమేణా నిజమైన స్వచ్ఛంద సేవ స్థానంలో వృత్తిపరమైన ఉద్యమశీలత వచ్చి చేరింది. ఒకప్పుడు నిబద్ధత, త్యాగం, క్షేత్రస్థాయి భాగస్వామ్యానికి పేరుగాంచిన సంస్థలు క్రమంగా ఎన్జీవో (NGO) నమూనాను స్వీకరించాయి. భారీ దాతల నిధులు లభించడంతో వారి ప్రాధాన్యాలు మారిపోయాయి. అందులో కొన్ని సంస్థలు ప్రభావవంతమైన శక్తులుగా ఎదిగి, స్థానిక అవసరాల కంటే దాతల ఎజెండాలకే ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాయి. విదేశీ నిధుల శీఘ్ర విస్తరణ ఈ ధోరణిని మరింత ప్రోత్సహించింది. ఈ విషయంలో ఇతర దేశాల అనుభవాలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. 1997లో లాటిన్ అమెరికాపై రాస్తూ, విదేశీ నిధులతో నడిచే ఎన్జీవోలు అస్తిత్వ, ప్రపంచీకరణల భావజాలాన్ని ప్రచారం చేస్తూనే, దాతల అభీష్టానికి అనుగుణంగా ప్రాజెక్టులను రూపకల్పన చేయడంలో దిట్టలుగా మారాయని పరిశోధకుడు జేమ్స్ పెట్రాస్ వాదించారు. ఇది బాహ్య నిధులపై ఆధారపడే తత్వాన్ని పెంచి, ఆ సంస్థలను నయా-ఉదారవాద ప్రాధాన్యాలతో ముడిపెట్టిందని, ఫలితంగా స్వతంత్ర క్షేత్రస్థాయి ఉద్యమాలను బలహీనపరిచిందని ఆయన పేర్కొన్నారు. అలాగే విదేశీ సాయం తొలగించడం కష్టంగా మారిన ఒక విషవలయం లాంటి ఆధారపడే తత్వాన్ని సృష్టించిందని ఆఫ్రికాలోని పరిశోధకులు కూడా వేలెత్తి చూపారు. పేదరిక నిర్మూలనపై విదేశీ సాయం పెద్దగా ప్రభావం చూపడం లేదని భారతదేశంలో జరిగిన పరిశోధనలు సైతం వెల్లడిస్తున్నాయి. 

దీని అర్థం ప్రతీ దాతను తప్పుపట్టడం కాదు. అలాగని విదేశీ నిధులను పూర్తిగా నిషేధించాల్సిన అవసరమూ లేదు. సమాజం, దాతలు, అలాగే లబ్ధిదారుల సంక్షేమం దృష్ట్యా కఠిన పరిశీలన అత్యవసరం. ఈ కోణంలో చూస్తే, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలు ఈ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి, ప్రమాదాలను తట్టుకునేలా రూపుదిద్దడానికి ఉద్దేశించినవి. పరిపాలనాపరమైన స్పష్టతను తీసుకురావడం, విదేశీ నిధుల వినియోగాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించడం, నిష్క్రియగా ఉన్న సంస్థలను గుర్తించడం, జవాబుదారీతనాన్ని నిర్దేశించడం, విదేశీ నిధులు ఏ ఉద్దేశంతో అందాయో దానికే వినియోగించేలా చూడటం వీటి ముఖ్య లక్ష్యం. ఈ సవరణలు జాతీయ భద్రత, సార్వభౌమాధికారాలకు భంగం కలిగించేలా విదేశీ డబ్బు దేశీయ రాజకీయ, సామాజిక, సిద్ధాంతపరమైన ఫలితాలను ప్రభావితం చేయకుండా చూస్తాయి. నిజానికి విదేశీ నిధులను నియంత్రించడానికి రాజ్యం సార్వభౌమాధికారాన్ని, జాతీయ భద్రతను కారణంగా చూపడాన్ని సుప్రీంకోర్టు తీర్పు కూడా సమర్థించింది. ఇక్కడ కీలకమైన ప్రశ్న ఒక నిర్దిష్ట సంస్థకు ఈ నిబంధనల వల్ల కలిగే శ్రమ/ఖర్చు కాదు; దేశంలో జరిగే కార్యకలాపాలకు అందుతున్న విదేశీ నిధుల మూలం, ఉద్దేశం మాత్రమే. అంతేకాకుండా, ప్రతిపాదిత నియంత్రణ చట్రం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉంది — అంతర్జాతీయంగా సార్వభౌమ దేశాలు దేశీయ స్వచ్ఛంద కార్యకలాపాలపై ఇదే విధమైన, కొన్నిసార్లు అంతకంటే కఠినమైన నియంత్రణలను కలిగి ఉన్నాయి.

ఈ ప్రతిపాదిత ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలు మత రహితమైనవి. ఏ ఒక్క రంగానికి ఉద్దేశించినవి కావు. ఇవి మతపరమైన, లౌకిక సంస్థల మధ్య గానీ, లేదా వేర్వేరు మతాల మధ్య గానీ ఎలాంటి వివక్ష చూపవు. కొన్ని వర్గాలు ఈ మార్పులను వ్యతిరేకించినప్పటికీ, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, సేవా సంస్థలతో సహా మెజారిటీ స్వచ్ఛంద సంస్థలు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. విదేశీ నిధులను పారదర్శకంగా, ప్రకటించిన ఉద్దేశాల కోసమే ఉపయోగించే సంస్థలకు హెచ్చించిన జవాబుదారీతనం వల్ల ఎలాంటి ముప్పూ ఉండదు. ఈ సవరణలు నిజంగానే స్వచ్ఛంద సంస్థల రంగాన్ని ప్రమాదంలో పడేసేవైతే, వ్యతిరేకత మరింత విస్తృతంగా ఉండేది. ఎఫ్‌సీఆర్‌ఏ పరిధికి అతీతంగా ఈ రంగంలో పెరిగిపోయిన తీవ్రమైన వ్యాపారాత్మకత/వృత్తిపరమైన ధోరణిని కూడా ప్రభుత్వం అరికట్టాల్సి ఉంది. సంస్కృతీ సాంప్రదాయాలలో వేళ్లూనుకున్న, సమాజ ఆధారిత స్వచ్ఛంద సేవా దృక్పథాన్ని భారతదేశం తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది.

వినయ్ సహస్రబుద్ధే,
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు