మొదటి నుంచీ కాంగ్రెస్ తీరు రావణ కాష్టమే

1857 మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సూయూజ్ కెనాల్ సత్వర పూర్తితో అణిచివేసినప్పటికీ, అది సృష్టించిన భయం బ్రిటిష్ వారిని దశాబ్దాల పాటు వెంటాడింది. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేందుకే నాటి గవర్నర్ జనరల్ డఫ్రీన్ కుట్రపూరిత ఆలోచనల నుంచి పుట్టిందే భారత జాతీయ కాంగ్రెస్. పేరులో భారత జాతీయ అని ఉన్నా, దాని లక్ష్యం మాత్రం బ్రిటిషర్లకు సేవ చేయడమే. రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఏ.ఓ.హ్యూమ్ చే స్థాపితమైన కాంగ్రెస్ దశాబ్ద కాలం బ్రిటిష్ వారికి ఊడిగం చేసే రీతిలో తీర్మానాలు చేసి, స్వామిభక్తిని చాటుకుంది. కాంగ్రెస్‌ను ఒక బానిస విధానాల సంస్థగా వర్ణిస్తూ మహోన్నత దేశభక్తుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ స్వాతంత్ర్యం నా జన్మహక్కు, అది సాధించి తీరుతాను అన్న పిలుపునిచ్చారు. అలాంటి బాలగంగాధర్ తిలక్ ను కాంగ్రెస్ ఎప్పుడూ జాతీయ అధ్యక్షుడిని కానివ్వలేదు.

సర్దార్ పటేల్ లాంటి మరో దేశభక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో రెండవ సారి అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు, నేతాజీని సహించని వారు స్థానిక అభ్యర్థి పట్టాభి సీతారామయ్యతో ఓడించే ప్రయత్నం చేసి, వైఫల్యం చెందారు. అప్పుడు గెలిచిన సుభాష్ చంద్రబోస్‌ను నెగలనీయకుండా కాంగ్రెస్ బయటకు గెంటేసింది. స్వాతంత్ర్య పోరాటం సమయంలో తొలి దేశ ప్రధానిగా పటేల్ కు మద్దతు తెలుపుతూ ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ, పార్టీ ఇష్టానికి వ్యతిరేకంగా నెహ్రూను దేశం మీద రుద్దడం ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తోన్న ఓటు చోరీకి నిదర్శనం. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950లో స్వర్గస్థులవడంతో కాంగ్రెస్ నెహ్రూ కుటుంబ జేబుసంస్థగా మారడం ఆరంభమైంది.

1969లో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ కాంగ్రెస్‌లో తిరుగుబాటుకు బలమైన బీజం వేసింది. పార్టీ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి నీలం సంజీవ రెడ్డికి పోటీగా వి.వి.గిరిని దింపి అంతరాత్మ ప్రబోధం పేరుతో సొంత పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించి, పార్టీ చీలికతో రావణ కాష్టంగా మారటానికి ఇందిరా గాంధీ ఆజ్యం పోసింది. ఇందిరా గాంధీ రాయ్ బరేలీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో పూర్తి నియంతగా మారిన ఇందిరా గాంధీ, దేశంపై ఎమర్జెన్సీ విధించి, ప్రతిపక్ష నేతలను జైల్లో బంధించి, తన పదవికి రక్షణగా రాజ్యాంగాన్ని ఇష్టానుసారం సవరించి, స్నేహలతా రెడ్డి చావుతో పాటు ఎన్నో దారుణాలను, అకృత్యాలను జరిపించింది. తీవ్ర ప్రజాగ్రహానికి గురై, కొడుకుతో పాటు తను కూడా ఎంపీగా ఓటమిపాలై, తదనంతరం తన సొంత పార్టీచే ఇందిరా గాంధీ బహిష్కరణకు గురైంది. రెండవ చీలికతో ఇందిరా కాంగ్రెస్ ప్రారంభించి, దక్షిణాది రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు- మర్రి చెన్నారెడ్డి, గుండూ రావు అండగా జాతీయ స్థాయిలో మళ్లీ అధికారంలోకి వచ్చి, అదే మర్రి చెన్నా రెడ్డిని దించి, తన కృతజ్ఞతను వెళ్లగక్కుకున్న ఇందిరా గాంధీ, తనను బహిష్కరించిన కాసు బ్రహ్మానంద రెడ్డిని తన పార్టీలోకి తీసుకుంది. ఇది కాంగ్రెస్ అవకాశవాద దుర్మార్గ రాజకీయాలకు ప్రతీక. 

ఖలిస్తానీ ఉగ్రవాదులు ఇందిరా గాంధీని హత్య చేసిన సమయంలో, కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజీవ్ గాంధీని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించి, హత్యానంతరం సానుభూతి పవనాలతో 400 పైచిలుకు సీట్లు సాధించారు. అయితే, అసమర్థ, అవినీతి, హిందూ వ్యతిరేక పాలనతో రాజీవ్ గాంధీ అధికారం కోల్పోయి, ఎల్టీటీఈ ఉగ్రవాదుల బాంబుదాడిలో హతమైత్యకు గురయ్యారు. ఆ సానుభూతితో సీట్లు పెంచుకొని, అధికారంలోకి వచ్చి, నెహ్రూ, ఇందిరాల కన్నా మెరుగ్గా పరిపాలన సాగించి, దేశ ఆర్థిక పరిస్థితికి ఒక దిశ ఇచ్చిన పి.వి.నరసింహా రావును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించింది. 

2004-14లో దశాబ్ద కాలం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో దేశంలో అవినీతికి, హింసకు అంతు లేకుండా పోయింది. ఏ టూ జెడ్ కుంభకోణాలు, వందల కొద్దీ బాంబ్ బ్లాస్టులు, ఘోర మానభంగాలు జరగడంతో దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో 12 సంవవత్సరాల గుజరాత్ అద్భుత పాలనతో గుర్తింపు పొందిన మోదీ నాయకత్వంలోని బిజెపిని ప్రజలు సంపూర్ణ మెజారిటీతో గెలిపించి, కాంగ్రెస్ పార్టీకి అత్యంత అధ్వాన పరిస్థితిని ఈ ఫలితాల్లో ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఇంతకు ముందు ఉన్న అసమ్మతికి, ఇప్పటి నుంచి వస్తున్న అసమ్మతికి తేడా ఉన్నప్పటికి రావణ కాష్టం చరిత్రను మాత్రం కొనసాగిస్తూ వచ్చింది. సోనియా గాంధీ జేబు సంస్థగా మారిన కాంగ్రెస్ అత్యంత అసమర్థుడైన సోనియా కొడుకును దశాబ్దానికి పైగా కాంగ్రెస్‌పై రుద్దడంతో దేశవ్యాప్తంగా ప్రజల వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. పార్టీలో అసమ్మతి మరింత పెరుగుతూ వస్తోంది. 

కేసీఆర్ మీది తీవ్ర వ్యతిరేకతతో, కర్నాటకలో బిజెపి ఓడిపోవడం, కాంగ్రెస్ గెలవడంతో మారిన తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో, రేవంత్ రెడ్డి గారడీ మాటలు, బూటకపు హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ గద్దె నెక్కినప్పటికీ, హామీల అమలులో, పార్టీ క్రమశిక్షణలో రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ సంపూర్ణంగా వైఫల్యం చెందాయి. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పని చేసిన పాత నేతలు, మాజీ మంత్రులే బాహాటంగా ఆరోపిస్తున్నారు, కొందరు బయటకు వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్‌ను తన గుప్పిట్లోకి పూర్తిగా తెచ్చుకోవాలనుకుంటున్న రేవంత్ రెడ్డి పాత కాంగ్రెస్ నాయకులను కాకుండా తనతో వచ్చిన టీడీపీ, ఇతర నేతలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఏ అధికారం లేనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులుగా పాత టీడీపీ వృద్ధులనే ప్రకటిస్తూ ఉండడంతో, జిల్లాల్లో బలమైన పట్టున్న ఒక కుటుంబం నవతరం అమ్మాయి ఏకంగా రేవంత్ రెడ్డి కళ్లు నెత్తికొచ్చాయంటూ, ”21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత కావాలన్న రేవంత్ రెడ్డి డైపర్ వేసుకొని తిరిగే 77 ఏళ్ల వయస్సున్న నాయకులను అభ్యర్థులుగా ప్రకటించడం ఏమిటని” సహేతుక ప్రశ్నతో కాంగ్రెస్ ఇరుకున పడ్డది. ”కాంగ్రెస్ పార్టీలో పనులు కావాలంటే డబ్బు మూటలు ఇవ్వాలి, ఇంకా మరో ఘోరమైన పనులు చేయాలని” మాజీ మంత్రి, సీనియర్ నేత షబ్బీర్ అలీ టెలిఫోన్ సంభాషణ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోని కాంగ్రెస్ ఇప్పుడు బీసీ బిడ్డపై ఎలా చర్యలు తీసుకుంటుందని బీసీ సమాజంలో ఆలోచన మొదలైంది. 

గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రాథమిక లక్షణాన్ని బయటపెడుతూ ”కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్” అని స్వయానా సీఎం రేవంత్ రెడ్డి అనడం, ఆ పార్టీని ఘోరంగా అవమానించిన షబ్బీర్ అలీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పార్టీలో జరుగుతున్న తప్పులను నిర్భయంగా ప్రకటించిన బీసీ వర్గానికి చెందిన ఒక యువ మహిళ కుటుంబంపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం, కాంగ్రెస్ కేవలం ముస్లింల కోసమే హిందువుల కోసం ముఖ్యంగా బీసీల కోసం కాదని మరోమారు బహిర్గతమైంది. కాంగ్రెస్ పుట్టుకతో వచ్చిన వక్ర ధోరణి శతాబ్దంన్నర కాలంగా రూపాంతరం చెందినప్పటికీ రావణ కాష్టంలా అసమ్మతితో నిరంతరం మండుతూనే ఉంది. ఎందుకంటే, కాంగ్రెస్ పుట్టింది యూరోపియన్ దేశస్తుడి చేతిలోనే, ఇప్పుడున్నది యూరప్‌లో పుట్టిన మహిళ గుప్పిట్లో ఉంది.