కొండా సురేఖ అసమ్మతితో ఒంటరిగా రేవంత్ రెడ్డి!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం ప్రారంభమైంది. తక్షణమే ఆమెపై తగిన చర్య తీసుకోలేక తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మీడియా సమావేశం పెట్టించి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తప్పించాలని డిమాండ్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మితా పటేల్‌పై అధిష్ఠానం సీరియస్ అయిందని, మంత్రి పదవి నుంచి సురేఖను బర్తరఫ్ చేయడం ఖాయమని ఆయన మద్దతుదారులు మీడియాలో ప్రచారం చేశారు. కానీ, రాజకీయాల్లోకి ఇంకా అడుగుపెట్టని ఒక యువతి చేసిన విమర్శను, విసిరిన చిన్నపాటి సవాల్‌ను మేనేజ్ చేయలేని నాయకత్వం, భవిష్యత్తులో ప్రధాన ప్రతిపక్షాలను ఎలా ఎదురొంటుందని ఏఐసీసీ అగ్రనేత ఒకరు ముఖ్యమంత్రి పైననే తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. సమస్యలను పరిష్కరించడంలో, సీనియర్లను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ప్రజలు ఎంతో విశ్వాసంతో అధికారాన్ని అప్పగిస్తే, పాలనపై పట్టు సాధించకుండా రోజుకో సర్కస్ ఫీట్‌తో ప్రభుత్వం పరువు తీస్తున్నారని సీరియస్ అయినట్టు చెప్తున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సమన్వయంపై దృష్టి సారించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సదరు అగ్రనేత స్పష్టం చేసినట్టు తెలిసింది.
మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర కాంగ్రెస్‌లో తన పట్టును చాటిచెప్పేందుకు రేవంత్ రెడ్డి వర్గం సీఎల్పీ వేదికగా సుమారు 40 మంది ఎమ్యెల్యేలతో మీడియా సమావేశం పెట్టించే ప్రయత్నం విఫలమైన్నట్లు ఈ సందర్భంగా తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి ఎంతగా ఒత్తిడి చేసినా 17 మంది మించి రాలేదని చెబుతున్నారు. దానితో 66 మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలలో ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తున్నవారు అంతంతమాత్రమే అని స్పష్టమైంది. ఆమెపై చర్య తీసుకొంటే బీసీలకు ఆగ్రహం కలగకుండా ఆమెతో పాటు పార్టీ సీనియర్ నాయకుడు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డిపై చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి మద్దతుదారులు ప్రచారం ప్రారంభించారు. శాసనసభ ఎన్నికలలో తనకు మొదట టికెట్ ఖరారు చేసి, ఆ తర్వాత డబ్బులు తీసుకొని మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు గుప్పించడం గమనార్హం. ఇంకోవైపు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి స్కీంలో విలీనం చేసే ఆలోచనపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలతో భాగంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చెన్నూరు పట్టణంలో కార్మిక శాఖ మంత్రి వివేకా వెంకటస్వామి ఇంటికి వెళ్లి వినతిపత్రం ఇస్తూ స్పష్టమైన హామీ ఇవ్వమని కోరగా ఆయన నిర్వేదంగా ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది. “నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఇప్పుడు మంత్రిగా నేను ఉన్నా.. రేపు నేను ఓడిపోతా.. మా ప్రభుత్వం పోతది.. నా గ్యారెంటీతో మీకేం ఫాయిదా?” అని పేర్కొన్నారు. మరోవంక, ముఖ్యమంత్రి దేశంలో లేని సమయంలో అసంతృప్త నేతలు, ఎమ్మెల్యేలు మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్ లో రహస్య భేటీ జరిపినట్లు తెలుస్తున్నది. 15-18 మంది ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో ఇద్దరు రేవంత్‌రెడ్డి క్యాబినెట్ సహచరులు కూడా పాల్గొన్నారన్న వార్తలు కలకలం రేపుతున్నది.
ఇటీవల ప్రభుత్వంపై తీవ్రస్థాయి లో విరుచుకుపడుతున్న ఓ మాజీ ఎంపీకి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ నేతలు కలుసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహారశైలి, ఆయన సోదరులపై వస్తున్న ఆరోపణలు, పాలనా వివాదాలు ఫామ్‌హౌస్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులే లాభపడుతున్నారని, పార్టీకి సుదీర్ఘంగా సేవలందించిన తమలాంటి వారికి ఒరిగిందేమీ లేదని వారంతా నిర్వేదం వ్యక్తం చేశారని చెబుతున్నారు. కాగా, సీఎల్పీ కార్యాలయంలో కొందరు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించి, మంత్రి కొండా సురేఖపై బహిరంగంగా విమర్శలు చేయడంపై ఏఐసీసీ పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. సొంత ప్రభుత్వంలోని బీసీ మంత్రి, పైగా మహిళను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం, దీనికి సీఎల్పీ ప్రాంగణాన్ని వేదికగా చేసుకోవడం పార్టీ పెద్దలకు ఏమాత్రం మింగుడు పడలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం, కులగణన, జనగణనతోనే న్యాయం జరుగుతుందని, బీసీ, బహుజన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే ప్రధాన ఎజెండాతో దేశవ్యాప్తంగా ముందుకు సాగుతున్న వేళ.. పార్టీ ఎమ్మెల్యేల చేష్టలు ఇబ్బందికరంగా మారాయని ఏఐసీసీ అగ్రనేత మండిపడినట్టు తెలిసింది. ఏదిఏమైనా పార్టీలో, ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి క్రమంగా ఒంటరి అవుతున్నారా? అనే అనుమానం కలుగుతుంది.
కృష్ణ చైతన్య

