వినతి పత్రాలిచ్చేందుకు సచివాలయానికి వెళ్లినా అరెస్టే!
తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించేందుకు సెప్టెంబర్ 3న సచివాలయానికి ఆకస్మికంగా పాదయాత్ర చేపట్టారు. విద్యార్థుల న్యాయమైన సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో కూడిన విజ్ఞాపనలను వ్యక్తిగతంగా అందజేసేందుకు సమయం కేటాయించాలని కోరుతూ మూడు రోజుల క్రితమే రేవంత్ రెడ్డికి లేఖ రాసినప్పటికీ సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో, విద్యార్థుల ఆవేదనను నేరుగా ప్రభుత్వానికి వినిపించాలనే దృఢ సంకల్పంతో ఆయన బిజెపి కార్యకర్తలతో కలిసి సచివాలయానికి తరలివెళ్లారు.
సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకోవడంతో, అక్కడే బైఠాయించి విద్యార్థుల హక్కుల కోసం పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తున్న ఎన్. రాంచందర్‌రావును, బిజెపి శ్రేణులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన అక్రమ అరెస్ట్‌పై రాంచందర్ రావు తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15,000 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమై వారి జీవితాలు సర్వనాశనమయ్యాయని మండిపడ్డారు. తాను ఇప్పటికే నిరాహార దీక్ష చేశానని, ముఖ్యమంత్రికి లేఖలు రాశానని, 8 లక్షల మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతిపత్రాలను సేకరించినా ఈ సిగ్గులేని ప్రభుత్వం ఇసుమంతైనా చలించలేదని, ఇది కాంగ్రెస్ అహంకారానికి, విద్యార్థి వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. విద్యార్థుల సహనం నశించడంతోనే వారి గొంతుకగా మారి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది నన్ను కాదు… ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిరీక్షిస్తున్న 40 లక్షల మంది విద్యార్థుల గొంతును అరెస్ట్ చేసింది. మీరు నన్ను నిర్బంధించగలరేమో గానీ, 40 లక్షల మంది విద్యార్థుల ఆక్రందనను, ఆగ్రహాన్ని మాత్రం ఆపలేరు. తెలంగాణ విద్యార్థులకు అందాల్సిన ప్రతి పైసా విడుదలయ్యేంత వరకు బిజెపి పోరాటం ఆగదని హెచ్చరించారు. రాష్ట్రంలోని విద్యార్థి లోకానికి పూర్తి న్యాయం జరిగే వరకు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ విడుదల చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా రాంచందర్‌రావు స్పష్టం చేశారు.

