దేశప్రజల కష్టాన్ని అవమానిస్తున్న రాహుల్
తీవ్రమైన ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ బలమైన వృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం జీడీపీ వృద్ధి, తయారీ, సేవా రంగాల విస్తరణ, అలాగే దాదాపు 700 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారక నిల్వలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. సెప్టెంబర్ 1న అమెరికాలో జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సు సందర్భంగా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మల సీతారామన్ ప్రభుత్వ సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు, జీ20 కూటమిలో భారత్ భాగస్వామ్యం, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు, ప్రపంచ అనిశ్చితుల మధ్య దేశాన్ని నిలకడగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరంగా మాట్లాడారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్ర: ఇప్పుడు వెలువడిన తొలి త్రైమాసిక (క్యూ 1) జీడీపీ గణాంకాలపై మీ తొలి స్పందన ఏమిటి?
జ: జీడీపీ గణాంకాలపై నేను ఎంతో సంతృప్తిగా ఉన్నాను. కేవలం అంకెలు బాగున్నాయన్నది మాత్రమే కాదు, అంతర్జాతీయ సవాళ్లు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, భారత ప్రజలు పడుతున్న కష్టానికి దక్కిన ప్రతిఫలమిది. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు తగ్గడం లేదు. అలాంటి పరిస్థితుల్లోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-2027) తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి చెందిందంటే, ప్రజల శ్రమ ఫలించిందని అర్థం. ఇది ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇది ఏదో ఒక్క రంగానికి పరిమితమైన సంఖ్య కాదు. అన్ని రంగాలు విస్తరిస్తున్నాయి. తయారీ రంగం 9.2 శాతం, ఆర్థిక, వృత్తి సేవల రంగం 12.1 శాతం చొప్పున వృద్ధి చెందగా, విదేశీ మారక ద్రవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇవి సాధారణ సంఖ్యలు కావు. ప్రజలు తమ వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోవడంతో పాటు, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధన దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరుకు ఇది నిదర్శనం. ఎదురవుతున్న ప్రతికూలతలన్నింటినీ అధిగమించి ఈ స్థాయి వృద్ధిని సాధించగలిగాం. ఇది ఈ ఏడాది మొత్తం వృద్ధిని మరింత బలోపేతం చేస్తుంది. తొలి త్రైమాసికం ఇలా ప్రారంభమైతే, రాబోయే త్రైమాసికాల్లోనూ ఇదే తరహా గణాంకాలను కొనసాగించగలమని భావిస్తున్నాను. అయితే, ఈ సమయంలో ప్రతిపక్షాలు భారత్‌ను చిత్రీకరిస్తున్న తీరు కొంత నిరాశ కలిగిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్షం నిలదీయడం ప్రజాస్వామ్యంలో సహజం, సరైనదే. మాట్లాడే బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి అవసరం. కానీ, ఇటువంటి నిలకడైన వృద్ధి గణాంకాలు కనిపిస్తున్నప్పటికీ, రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థను ‘మృత ఆర్థిక వ్యవస్థ’ అని నిరంతరం వర్ణించడం విడ్డూరంగా ఉంది. ఇది భారత పౌరుల కష్టాన్ని తక్కువ చేసి చూపించడమే అవుతుంది. రాత్రింబవళ్లు కష్టపడుతూ జీడీపీ వృద్ధికి ప్రధాన కారకులుగా నిలుస్తున్న భారత పౌరులను అవమానించే హక్కు ఎవరికీ లేదు. ప్రతిపక్షాలు ప్రజల శ్రమను గుర్తించాలని, వారిని చిన్నచూపు చూస్తూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచిన ఏడాదిన్నర కాలంలో ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంది.
ప్ర: ప్రపంచ ఆర్థిక ప్రతికూలతలను భారత్ సమర్థంగా తట్టుకోవడానికి మీరు తీసుకున్న విధానాలు ఏమిటి?
జ: ఈ విజయంలో రాష్ట్రాల పాత్ర కూడా ఉంది. సులభతర వాణిజ్యానికి ముందుకు వచ్చిన అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అభినందిస్తున్నాను. మేం చట్టాల సంస్కరణ, నిబంధనల సరళీకరణ, కాలం చెల్లిన చట్టాల రద్దు ద్వారా పౌరులు, వ్యాపారులపై ఉన్న నిబంధనల భారాన్ని గణనీయంగా తగ్గించాం. వెయ్యికి పైగా చట్టాలను రద్దు చేశాం; దాదాపు 40,000 నిబంధనలను సరళీకరించాం. పరిశ్రమలు, వ్యాపారాలు, వాణిజ్య వర్గాలతో మేం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు, ఇప్పుడు పెట్టుబడిదారుల పరిరక్షణ ఒప్పందాలను కూడా వేగవంతం చేస్తున్నాం. రిజర్వ్ బ్యాంకు ద్వారా భారతీయ బ్యాంకులు పొందుతున్న ఇటీవలి ఎఫ్సీఎన్ఆర్ బ్యాంక్ డిపాజిట్లు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచే చర్యలే. స్పష్టంగా విదేశీ డిపాజిట్లు పెరుగుతున్నాయి, విదేశాల్లోని భారతీయ పౌరులు పెట్టుబడులు పెడుతున్నారు. నిర్ణీత సమయానికి ముందే మనం సాధించిన ఈ గణాంకాలు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపైన, భారత ఆర్థిక వ్యవస్థపైన ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈ సానుకూల వాతావరణాన్ని మేం మరింత ముందుకు తీసుకెళ్తాం.
ప్ర: జీడీపీ గణాంకాలపై ప్రతిపక్షాల స్పందన గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
జ: కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక సలహా మండలి తరహాలో పని చేసే కొంతమంది ఆర్థికవేత్తలు ఉన్నారు. వారు వాస్తవాలను తిరస్కరించలేరని నాకు తెలుసు. ప్రజలు సాధిస్తున్న పురోగతిని పక్కన పెట్టి, కేవలం రాజకీయం కోసం భారత ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రచారం చేయడం సరికాదు. కొన్ని రంగాల్లో పనితీరును మరింత మెరుగుపరచాల్సి ఉండవచ్చు. అంతమాత్రాన గణాంకాల ద్వారా వ్యక్తమవుతున్న మెరుగైన దృశ్యాన్ని కాదనలేం. ప్రతి త్రైమాసికంలోనూ మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ఆ వాస్తవాన్ని తిరస్కరించి వ్యతిరేకంగా మాట్లాడటం చూస్తుంటే… హిందీలో ఒక సామెత చెప్పినట్లు, ‘ఇలాంటివి ఎంతో కాలం సాగవు’ అనిపిస్తోంది.
ప్ర: మీరు ఇక్కడ (అమెరికా) జీ20 ఆర్థిక మంత్రుల సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ భారత్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొనగా, వైట్ హౌస్ భారత్‌ను ‘చురుకైన ఆర్థిక వ్యవస్థ’గా అభివర్ణించింది. నేటి ప్రపంచంలో భారత్‌ను మీరు ఎలా నిర్వచిస్తారు?
జ: మనకు సవాళ్లు ఉన్నాయనే వాస్తవంతోనే నేను ప్రారంభిస్తాను. అందులో సందేహం లేదు. మనం ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తుల అతిపెద్ద దిగుమతిదారులలో ఒకరిగా ఉన్నాం. యూరియా, అమ్మోనియా, డీఏపీ వంటి వివిధ రకాల ఎరువులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయంగా కొంత ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పటికీ, మనం దిగుమతులపై ఆధారపడుతున్నాం. అందుకే విదేశీ మారక ద్రవ్యం అనవసర ప్రయాణాలకు వ్యర్థం కాకుండా కొన్ని చర్యలు ఆలోచించాం. ఎవరి ప్రయాణాలనూ అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు, కానీ వృద్ధిపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇవన్నీ ఒక చురుకైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనాలు. ప్రపంచంలో వచ్చే మార్పులకు అనుగుణంగా స్పందిస్తూ, మన వృద్ధి దెబ్బతినకుండా సర్దుబాట్లు చేసుకునే శక్తి మనకు ఉంది. రిజర్వ్ బ్యాంకు కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలను వెలువరిస్తోంది, అవన్నీ సానుకూల దిశలోనే ఉన్నాయి. సవాళ్లు ఉన్నాయి, కానీ ప్రతి సవాలునూ భారత్‌కు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తూనే ఉంటుంది.
ప్ర: జీ20 కూటమిలో భారత్ పోషిస్తున్న పాత్ర గురించి వివరించగలరా?
జ: వృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రపంచ ఆర్థిక అసమానతలపై ఆందోళన వ్యక్తం చేయడం వంటి అంశాలపై అమెరికా అధ్యక్షతన జరుగుతున్న చర్చలలో అనేక అంశాలపై మన దృక్పథం వారితో ఏకీభవిస్తోంది. ఎంతో ప్రాధాన్యమైన ఆర్థిక అక్షరాస్యత అంశానికి అమెరికా అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ విషయాలన్నింటిలో మనం అమెరికాతో కలిసి పనిచేస్తున్నాం. ఈ అంశాలపై పారదర్శకమైన, ముక్కుసూటి చర్చలు జరగాలని కోరుకుంటున్నాం. జీ20 లో ఆర్థిక వ్యవహారాలపై జరిగే చర్చలకు ‘వృద్ధి’ కేంద్ర బిందువు. అలాగే ప్రపంచ ఆర్థిక అసమానతలను పరిష్కరించుకోవాల్సి ఉంది. అందుకే ఈ అంశాలను తెరపైకి తెచ్చిన అమెరికాను అభినందిస్తున్నాను. ఈ చర్చలలో మేం మా వంతు పాత్ర పోషించాం. అమెరికా ఆర్థిక మంత్రి బెస్సెంట్‌తో ఎంతో సానుకూల, నిర్మాణాత్మకమైన ద్వైపాక్షిక చర్చలు జరిగాయని కూడా చెప్పగలను.
ప్ర: ఇతర ద్వైపాక్షిక చర్చల వివరాలను తెలియజేస్తారా?
జవాబు: పోలాండ్, ఖతార్, కొరియా, రష్యా దేశాల ప్రతినిధులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. అవన్నీ ఎంతో సానుకూల వాతావరణంలో ముగిశాయి. భారత్ వృద్ధికి సంబంధించిన వాస్తవాలు అందరి వద్ద ఉన్నాయి, వారంతా భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
ప్ర: కస్టమ్స్, బ్యాంకింగ్ సంస్కరణలపై మీరేమి చెప్పదలచుకున్నారు?
జ: అవసరాన్ని బట్టి క్రమంగా సంస్కరణలు చేపడుతున్నాం. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నాం. కస్టమ్స్ సుంకాల్లో కొన్ని మార్పులు చేశాం, మరిన్ని చేయాల్సి ఉంది. రేవుల్లో ఎగుమతులు, దిగుమతులు వేగంగా, అంతరాయం లేకుండా జరిగేలా చూస్తున్నాం. అధునాతన స్కానర్లను తీసుకువచ్చి, కేవలం ఎక్కువ ప్రమాదం (హై-రిస్క్) ఉన్న దిగుమతులను మాత్రమే తనిఖీలకు పంపి, మిగిలిన వాటికి స్వయంచాలకంగా (ఆటోమేటిక్‌గా) అనుమతి ఇచ్చే వ్యవస్థను తేబోతున్నాం. కస్టమ్స్ రంగంలో అనేక సంస్కరణలు వస్తున్నాయి. ఇక బ్యాంకింగ్ విషయానికొస్తే, ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా బ్యాంకింగ్ రంగాన్ని తీర్చిదిద్దడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాం. ఆ కమిటీ త్వరలోనే తన నివేదికను సమర్పిస్తుంది.

