Make in India weapons

రక్షణ రంగంలో స్వదేశీ  స్ఫూర్తి

బలం హి ధర్మస్య మూలం, బలం రాష్ట్రస్య జీవనమ్।

బలేన రక్ష్యతే ధర్మో, బలం సర్వస్య సాధనమ్॥

“శక్తియే ధర్మానికి పునాది, దేశానికి జీవధార. ఆ శక్తియే ధర్మాన్ని రక్షిస్తుంది, ప్రతీ ఉన్నత లక్ష్య సాధనకు తోడ్పడుతుంది.”

ఒక దేశం సమగ్రత, భద్రత, పురోగతులకు దాని జాతీయ బలమే ప్రాతిపదిక అనే శాశ్వత సత్యాన్ని ఈ ప్రాచీన లోకోక్తి మనకు గుర్తుచేస్తోంది. నేటి ఆధునిక ప్రపంచంలో, జాతీయ శక్తి కేవలం మన త్రివిధ దళాల శౌర్యపరాక్రమాలపైనే కాకుండా, జాతీయ భద్రతకు అత్యంత కీలకమైన సాంకేతికతలను స్వతంత్రంగా రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి చేయగల మన సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల దేశ ప్రయోజనాలను పరిరక్షించాలన్నా, ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) దిశగా పయనించాలన్నా సుదృఢమైన, స్వయం సమృద్ధ రక్షణ సామర్థ్యం అత్యంత ఆవశ్యకం.

సంగచ్ఛధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతామ్॥ (ఋగ్వేదం 10.191.2)

“అందరం కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం, మన మనస్సులను, సంకల్పాలను ఏకం చేద్దాం.”

ఆత్మనిర్భర్ భారత్ వైపు సాగుతున్న మన ప్రయాణం ఈ సనాతన సందేశాన్నే ముందుకు తీసుకెళ్తోంది. ప్రభుత్వం, సాయుధ దళాలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, పౌరులందరూ ఒకే జాతీయ సంకల్పంతో కలసికట్టుగా శ్రమిస్తున్నారు. స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించడం, రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడం,  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ఆలోచనా విధానాలైన ‘స్వదేశీ’ (ఆత్మనిర్భరత), ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’, ‘వికసిత్ భారత్ @2047’ లక్ష్యాలను సాకారం చేయడమే వీరి ప్రధాన ఉద్దేశం. భారతదేశం ఇటీవలే తన 80వ స్వాతంత్య్ర దినోత్సవ మైలురాయిని చేరుకుంది. ఈ చారిత్రక ఘట్టం కేవలం రాజకీయ స్వాతంత్య్రం నుంచి ఆర్థిక పురోగతి వరకు సాగిన ప్రయాణాన్ని నెమరువేసుకునే సందర్భం మాత్రమే కాదు; పరాధీనత నుంచి ఆత్మవిశ్వాసానికి, ఆత్మనిర్భరత దిశలో మనం సాధించిన మార్పును అర్థం చేసుకునే మహత్తర అవకాశం. ఈ అద్భుత పరివర్తనకు రక్షణ రంగం ఒక ఉజ్జ్వల నిదర్శనంగా నిలుస్తోంది.

2014లో ఎర్రకోట వేదికగా చేసిన తన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశంపై ఒక నూతన దృక్పథాన్ని ఆవిష్కరించారు.  “రండి, ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగస్వాములు కండి. ప్రపంచంలో ఎక్కడైనా విక్రయించుకోండి, కానీ తయారీ మాత్రం ఇక్కడే చేయండి” అని ప్రపంచానికి పిలుపునిచ్చారు. అలాగే, భారతీయ పరిశ్రమలు “జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్” (లోపరహిత ఉత్పత్తి, పర్యావరణానికి హాని కలిగించని తయారీ) సూత్రాన్ని అవలంబించాలని, అత్యున్నత నాణ్యత కలిగిన ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేస్తూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఈ చారిత్రక ప్రసంగం దేశంలో ఒక నూతన తయారీ విధానానికి పునాది వేయడమే కాకుండా, స్వదేశీ సామర్థ్యాలపై దేశ ప్రజలలో బలమైన నమ్మకాన్ని నింపింది. గడచిన పన్నెండేళ్ల కాలంలో ఈ ఆలోచన ఒక జాతీయోద్యమంగా, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంగా రూపాంతరం చెందింది. ప్రధానమంత్రి  మోదీ నాయకత్వంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మార్గదర్శకత్వంలో రక్షణ రంగంలో ఆత్మనిర్భరత జాతీయ భద్రతకు ఒక కీలకమైన స్తంభంగా అవతరించింది. ఈ విధానం భారతీయ ‘స్వదేశీ’ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఒక బలమైన, ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశం తన సొంత జ్ఞాన సంపద, నైపుణ్యం, ఆవిష్కరణలు, పారిశ్రామికుల ఆధారంగా సాంకేతికతలను, ఉత్పత్తులను రూపకల్పన, అభివృద్ధి, తయారీ చేయగల సామర్థ్యాన్ని స్వయంగా పెంపొందించుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం.

నేడు రక్షణ రంగంలో స్వదేశీకరణ అంటే కేవలం దిగుమతులను తగ్గించుకోవడం మాత్రమే కాదు. ప్రభుత్వం, త్రివిధ దళాలు, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), స్టార్టప్‌లు, ఉన్నత విద్యాసంస్థలు అన్నీ కలిసికట్టుగా ప్రపంచ స్థాయి సాంకేతికతలను, సామర్థ్యాలను అభివృద్ధి చేసే ఒక సుదృఢమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది ‘వికసిత్ భారత్ @2047’ అనే జాతీయ లక్ష్య సాధనలో ఒక ప్రధానమైన అడుగు. ఈ విజయాల వెనుక అనేక కీలకమైన సంస్కరణలు ఉన్నాయి. రక్షణ ఉత్పత్తుల సేకరణ డిఎపి-2020 స్వదేశీ సేకరణకు మొదటి ప్రాధాన్యమిచ్చింది.  ‘స్వదేశీకరణ జాబితాలు’ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి. ‘సృజన్’  పోర్టల్ ద్వారా ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు రక్షణ తయారీలో భాగస్వాములు కావడానికి నూతన అవకాశాలు లభించాయి. మరొకవైపు, ఉత్తరప్రదేశ్, తమిళనాడులలో ఏర్పాటు చేసిన రక్షణ పారిశ్రామిక కారిడార్లు  ఆధునిక తయారీ కేంద్రాలుగా మారి, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా విస్తృతంగా సృష్టించాయి. గత పన్నెండేళ్ల ప్రయాణం ఆత్మనిర్భరత కేవలం ఒక ఆర్థిక విధానం మాత్రమే కాదని, అది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి, సాంకేతిక స్వావలంబనకు, జాతీయ ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది అని నిరూపించింది. ఈ స్వదేశీ స్ఫూర్తే భారతదేశాన్ని మరింత బలమైన, సురక్షితమైన, ఆత్మనిర్భరమైన భవిష్యత్తు వైపు నడిపిస్తోంది.

భవిష్యత్ యుద్ధాలు సాంకేతికత, నూతన ఆవిష్కరణలపైనే ఎక్కువగా ఆధారపడతాయని గుర్తించిన రక్షణ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖకు 2025 సంవత్సరాన్ని “సంస్కరణల సంవత్సరం”గా ప్రకటించారు. ప్రక్రియలను సరళీకృతం చేయడం, త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంచడం, స్వదేశీ సామర్థ్యాల వికాసాన్ని వేగవంతం చేయడం, అత్యంత వేగంగా స్పందించే, పారదర్శకమైన, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థను రూపాందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ సుదూర దార్శనికతతోనే  భారత్ ఒక బలమైన రక్షణ ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించింది. ఐడెక్స్ (iDEX), అదితి (ADITI), టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (టీడీఎఫ్), డీఆర్డీఓ -పరిశ్రమల భాగస్వామ్యాల వంటి కార్యక్రమాల ద్వారా వందలాది స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు డ్రోన్లు, ఏఐ, స్వయంప్రతిపత్తి వ్యవస్థలు, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అత్యధునిక రక్షణ పరికరాలు, ప్రక్రియలపై పనిచేస్తున్నాయి. రక్షణ రంగ ఆవిష్కరణలు ఇప్పుడు కేవలం ప్రభుత్వ ల్యాబొరేటరీలకే పరిమితం కాలేదు; ఇవి భారతీయ యువత నైపుణ్యం, సృజనాత్మకత,  ఆకాంక్షలతో నడిచే ఒక జాతీయ సమష్టి కృషిగా మారాయి. 2026 జూలై 18న స్కైరూట్ ఏరోస్పేస్ యువ బృందంతో ముఖాముఖి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిగ్గా ఇదే భావనను వ్యక్తం చేశారు.

‘ఆపరేషన్ సింధూర్’ కూడా మన స్వదేశీ రక్షణ సామర్థ్యాల ప్రాముఖ్యాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఆకాశ్, ఆకాశ్-తీర్, బ్రహ్మోస్, స్వదేశీ డ్రోన్లు, సమీకృత వైమానిక రక్షణ వ్యవస్థలు తమ పాటవాన్ని యుద్ధరంగంలో అత్యంత సమర్ధంగా నిరూపించుకున్నాయి. మన సాయుధ దళాలు కూడా ఈ ప్రయాణంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత వైమానిక దళం 76,000కి పైగా రక్షణ విడిభాగాలను స్వదేశంలోనే సేకరిస్తోంది. మిలిటరీ పరికరాల స్వదేశీ మరమ్మతులు, నిర్వహణ, వినియోగ కాలం పెంపు కార్యక్రమాలు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, దళాల కార్యాచరణ సమర్థతను పెంచాయి. మొత్తం రక్షణ తయారీ వ్యవస్థ కూడా వేగంగా విస్తరించింది. నేడు దేశవ్యాప్తంగా 16 రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, దాదాపు 500 లైసెన్స్ పొందిన ప్రైవేట్ రక్షణ కంపెనీలు, సుమారు 17,000 ఎంఎస్‌ఎంఈలు స్వదేశీ రక్షణ ఉత్పత్తిలో తమ వంతు కృషి చేస్తున్నాయి. రక్షణ రంగానికి ఇచ్చే పారిశ్రామిక లైసెన్సుల సంఖ్య 2015లో 258 మాత్రమే ఉండగా, అది మార్చి 2026 నాటికి 834కి పెరిగింది. ఇది పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న  నమ్మకానికి,  భారత్‌లో బలోపేతమవుతున్న స్వదేశీ తయారీ వ్యవస్థకు నిదర్శనం. దీంతోపాటు భారతదేశ రక్షణ దౌత్యం కూడా గణనీయంగా బలపడింది. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, ఆసియాన్  దేశాలతో భారతదేశం ఏర్పరచుకున్న భాగస్వామ్యాలు ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతిక సహకారంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. నేడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ మార్కెట్లలో ఒకటి మాత్రమే కాదు; ఒక విశ్వసనీయ వ్యూహాత్మక భాగస్వామిగా, రక్షణ తయారీ కేంద్రంగా, బాధ్యతాయుతమైన సాయుధ శక్తిగా ఆవిర్భవిస్తోంది.

ఈ అద్భుత పరివర్తన వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం జాతీయ భద్రతకే పరిమితం కాలేదు. రక్షణ తయారీ రంగం నాణ్యమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది, అత్యున్నత స్థాయి తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తోంది, ఎగుమతులను పెంచుతోంది,  ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఏఐ, అత్యాధునిక పరికరాలు, సెమీకండక్టర్లు వంటి రంగాలలో ఆవిష్కరణలకు బాటలు వేస్తోంది. రక్షణ అవసరాల కోసం అభివృద్ధి చేసిన అనేక సాంకేతికతలు ఇప్పుడు పౌర  రంగాలలో కూడా వినియోగంలోకి వస్తున్నాయి. ఇది ‘వికసిత్ భారత్ @2047’  మౌలిక లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ మహాత్కార్యంలో మహిళలు, యువత భాగస్వామ్యం పెరుగుతుండటం ఎంతో స్ఫూర్తిదాయకం. స్వదేశీ నౌక ఐఎన్ఎస్వి  త్రివేణిపై త్రివిధ దళాలకు చెందిన  తొమ్మిది మంది మహిళా అధికారులు విజయవంతంగా పూర్తి చేసిన ‘సముద్ర ప్రదక్షిణ’ యాత్ర నవ భారతం ధైర్యం, క్రమశిక్షణ, జాతీయ ఐక్యత, ఆత్మవిశ్వాసాలను ప్రపంచానికి చాటిచెప్పింది. భారతదేశం ‘వికసిత్ భారత్ @2047’ దిశగా పయనిస్తున్న తరుణంలో, మన లక్ష్యం కేవలం దేశ రక్షణ అవసరాలను తీర్చుకోవడం మాత్రమే కాదు. రక్షణ రంగంలో ఆవిష్కరణలు, రూపకల్పన, అభివృద్ధి, తయారీకి భారతదేశాన్ని ఒక అంతర్జాతీయ ప్రధాన కేంద్రంగా తయారుచేయడమే మన విస్తృత లక్ష్యం. ఈ దార్శనికతను సాకారం చేయాలంటే పరిశోధన, అభివృద్ధిలో నిరంతర పెట్టుబడులు, డీఆర్డీఓ-విద్యాసంస్థలు-పరిశ్రమల మధ్య బలమైన సహకారం, ఎంఎస్‌ఎంఈల ఇతోధిక భాగస్వామ్యం, వేగవంతమైన సాంకేతిక పురోగతి,  స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలకు నిరంతర ప్రోత్సాహం అత్యంత ఆవశ్యకం. ఒక దేశం సుసంపన్నత ఉత్తమ పరిపాలన, బలమైన వ్యవస్థలు, క్రమశిక్షణ కలిగిన నాయకత్వంపై ఆధారపడి ఉంటుంది. సమకాలీన యుగంలో ఈ దార్శనికత సాంకేతికలో స్వావలంబన, బలమైన వ్యవస్థలు, స్వదేశీ సామర్థ్యాల రూపంలో ఆవిష్కృతమవుతోంది. ‘స్వదేశీ’ అంటే ప్రపంచంతో సంబంధాలను తెంచుకోవడం కాదు. మన దేశంలోనే ప్రపంచ స్థాయి సామర్థ్యాలను పెంపొందించుకోవడం, పూర్తి ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ సమాజంతో అనుసంధానం  కావడం. స్వదేశీకరణ అంటే కేవలం దిగుమతులకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడం మాత్రమే కాదు; జ్ఞాన సృష్టిని, ఆవిష్కరణలను ప్రోత్సహించడం,  ఉత్తమమైన తయారీ నైపుణ్యాలను పెంపొందించుకుని, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని సాధించడం.

ఇదే ‘స్వదేశీ’ స్ఫూర్తి.

ఇదే ‘ఆత్మనిర్భరత’ సారాంశం.

ఇదే ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సంకల్పం.

సంజయ్ సేథ్,
కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి