Rahul Gandhi

‘ఆడలేక మద్దెల ఓడు’ అంటున్న రాహుల్

‘ఆడలేక మద్దెల ఓడు’ అనే సామెత ఒకటి ఉంది. పని చేతకాని వాడు పనిముట్లను నిందిస్తాడు. రాజకీయాల్లో ఓటమిని జీర్ణించుకోలేని నేతలు ఎన్నికల అంపైర్‌నే తప్పుబడుతుంటారు. ప్రతి ఓటమికి ఒక స్పష్టమైన కారణం ఉంటుంది, ప్రతి కారణమూ ఆత్మపరిశీలనను కోరుతుంది. అయితే, ఓటర్లు తమ పార్టీని ఎందుకు పదేపదే తిరస్కరిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడానికి బదులుగా రాహుల్ గాంధీ మరోసారి భారత ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ) బోనులో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన తాజా ఆందోళన, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ ఒక ప్రాథమికమైన ప్రశ్నను లేవనెత్తుతున్నాయి: ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ స్వతంత్రత గురించి ఇతరులకు హితోపదేశం చేసే నైతిక హక్కు అసలు కాంగ్రెస్‌కు ఉందా? 

ఎన్నికల సంఘంతో కాంగ్రెస్‌ గతంలో వ్యవహరించిన తీరు, రాజ్యాంగబద్ధమైన సంస్థను ఎలా చూడకూడదో చెప్పడానికి ఒక పాఠం వంటిది. ఎన్నికల నిర్వహణకు నేతృత్వం వహించిన అధికారులకు పదవీ విరమణ తర్వాత నజరానాలు ఇవ్వడం కాంగ్రెస్ హయాంలో పరిపాటిగా మారింది. దేశ రెండవ సీఈసీగా పనిచేసిన కె.వి.కె. సుందరంను పదవీ విరమణ అనంతరం లా కమిషన్ చైర్మన్‌గా నియమించడమే కాకుండా పద్మవిభూషణ్‌తో సత్కరించారు. ఆ తర్వాత ఆ పదవిలో ఉన్న ఆర్.కె. త్రివేదిని గుజరాత్ గవర్నర్‌గా నియమించి పద్మభూషణ్ ఇచ్చారు. 1996 నుంచి 2001 వరకు సీఈసీగా సేవలు అందించిన ఎం.ఎస్. గిల్, కాంగ్రెస్ టికెట్‌పై రాజ్యసభకు ఎన్నికై యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. చివరికి టి.ఎన్. శేషన్ సైతం 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు. 2001 నుండి 2004 వరకు సీఈసీగా వ్యవహరించిన జె.ఎమ్. లింగ్డో రిటైర్మెంట్ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఈ రకంగా మధ్యవర్తికి (రెఫరీ), ఆటగాడికి మధ్య ఉన్న తేడా కేవలం మసకబారడమే కాదు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 

ఇక ప్రస్తుతపు “ఓట్ల తొలగింపు” వివాదం విషయానికి వస్తే, నకిలీ ఓటర్లపై కాంగ్రెస్ వైఖరిలో ఉన్న విచిత్రమైన వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తోంది; దానికి గణాంకాలే సాక్ష్యం. ఆగస్టు 2018లో రాజస్థాన్ ఓటర్ల జాబితాలో 42 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని ఇదే కాంగ్రెస్ ఆరోపించింది; ఇప్పుడు ఎస్‌ఐఆర్ ముసాయిదా జాబితా నుంచి 41.85 లక్షల పేర్లను తొలగించారు. సెప్టెంబర్ 2018లో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 50 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఫిర్యాదు చేయగా, తెలంగాణలో సుమారు 70 లక్షల తప్పుడు నమోదులు ఉన్నాయని ఏఐసీసీ పేర్కొంది. నేడు ఏపీలో 44.28 లక్షల పేర్లు పరిశీలనలో ఉండగా, తెలంగాణ ముసాయిదా జాబితా నుంచి 73.39 లక్షల పేర్లను తొలగించారు. 2021లో కేరళలో 4.34 లక్షల నకిలీ లేదా రెండుచోట్ల పేరున్న ఓట్లు ఉన్నాయని రమేష్ చెన్నితల ఫిర్యాదు చేయగా, అక్కడ తుది జాబితాలో ఇప్పుడు 8.57 లక్షల ఓట్లను తొలగించారు. ఆఖరికి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన జవహర్ సర్కార్ కూడా పశ్చిమ బెంగాల్‌లో 90 లక్షలకు పైగా నకిలీ ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ కాంగ్రెస్ వైఖరిలో ఒక ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. జాబితాలో తప్పులు ఉన్నప్పుడు ఎన్నికలు ”నకిలీ ఓటర్లతో మేనేజ్ అవుతున్నాయి” అంటారు. అదే ఎన్నికల సంఘం జాబితాను ప్రక్షాళన చేయడానికి సంకల్పిస్తే ఆ చర్య ”రాజకీయ దాడి”గా మారిపోతుంది. శస్త్రచికిత్స కావాలని డిమాండ్ చేసి, ఆ తర్వాత పడిన గాయం మచ్చను చూసి కాంగ్రెస్ ఫిర్యాదు చేయకూడదు.

రాహుల్ గాంధీ తరహా పాత పద్ధతిలోనే సాగుతున్న ప్రస్తుత ఆందోళన కూడా అబద్ధాలపైనే ఆధారపడి ఉంది. అందులో అత్యంత ఘోరమైనది, వివాదాస్పదమైనది ఏమిటంటే—ఏకంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఏకపక్షంగా “తొలగించారు” అని ఆరోపించడం. అయితే దీని వెనుక ఉన్న అసలు వివరాలను పరిశీలిస్తే పూర్తి భిన్నమైన చిత్రం కనిపిస్తుంది. ఇందులో సుమారు 2.8 కోట్ల మంది మరణించిన ఓటర్లు, 3 కోట్ల మంది అందుబాటులో లేనివారు లేదా వివరాలు దొరకనివారు, 6.3 కోట్ల మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లినవారు, కోటి మంది నకిలీ/రెండుచోట్ల పేరున్న ఓటర్లు ఉన్నారు. వీటిపై దరఖాస్తులు, అభ్యంతరాలు, అప్పీళ్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఒక ప్రాథమిక చట్టపరమైన ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. నవంబర్ 2025లో రాహుల్ గాంధీ “ఓట్ల చోరీ”కి సంబంధించిన ఆధారాలను బయటపెడతానని హామీ ఇచ్చారు. కానీ అక్టోబర్ 12 నాటికి వచ్చేసరికి, అసలు అలాంటి చోరీ జరగలేదని ప్రభుత్వం, ఎన్నికల సంఘమే నిరూపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇది చట్టంలోని “సాక్ష్యాధారాల సమర్పణ బాధ్యత” (బర్డెన్ ఆఫ్ ప్రూఫ్) సూత్రానికే విరుద్ధం. ఆరోపణలు చేసే వ్యక్తే వాటిని నిరూపించాలనేది ప్రాథమిక చట్ట నియమం.

కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లలో గెలిచింది కూడా ఈ “ఓట్ల చోరీ” ద్వారానేనా? రాహుల్ గాంధీ ప్రస్తుతం తీవ్రంగా విమర్శిస్తున్న అదే ఎస్‌ఐఆర్ ద్వారా సవరించిన జాబితాలతోనే యూడీఎఫ్ ఈ ఏడాది కేరళలో ఘనవిజయం సాధించిందా? ఆప్ పంజాబ్‌లో గెలవడం కానీ, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని దెబ్బతీయడం కానీ ఓట్ల చోరీ వల్లే జరిగాయా? కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు మాత్రమే “ఓట్ల చోరీ” కుట్ర అవుతుందా, అదే కాంగ్రెస్ గెలిస్తే అది ప్రజాస్వామ్యం అయిపోతుందా? అంతకంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే రాహుల్ గాంధీ మిత్రుడు ప్రశాంత్ భూషణ్ “ప్రభుత్వం మార్పు” గురించి, అలాగే నేహా బోరా బంగ్లాదేశ్‌లోని తాజా అలజడుల నుండి ప్రేరణ పొందడం గురించి చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలే గనుక కాంగ్రెస్ ఆందోళనల వెనుక ఉన్న అసలు లక్ష్యాలను ప్రతిబింబిస్తుంటే, ఒక ప్రశ్న తలెత్తక మానదు: ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ఈ ఆందోళనల ఉద్దేశమా? లేక వీధుల్లో ఒత్తిడి పెంచి, ప్రజలు ఓటు ద్వారా ఇచ్చిన తీర్పును రద్దు చేయడమే లక్ష్యమా? భారతదేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించాల్సింది ఓటు మాత్రమే, వీధుల్లో బారికేడ్లు కావు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల పట్ల ఉన్న అంకితభావం వల్లే ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్లు, కుళాయి నీరు, బ్యాంకు ఖాతాలు, పక్కా ఇళ్లు, ఉచిత రేషన్లు నేడు కోట్ల మంది నిరుపేదల ఇళ్లకు చేరాయి. దాంతో ఓటర్లు కాంగ్రెస్ నాటకాల కంటే మోదీ పాలనా పనితీరుకే ఓటేశారు. కాంగ్రెస్ ఇప్పటికైనా “ఓట్ల చోరీ”కి, “ఓటర్ల తిరస్కారానికి” మధ్య ఉన్న తేడాను గుర్తించాలి. నిరంతర ఆందోళన స్థితిలోనే ఉండిపోకుండా, ఆత్మపరిశీలన దశలోకి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేయనంత కాలం రాహుల్ గాంధీ తన సొంత బ్యాటింగ్‌ను తప్పించి… పిచ్, బంతి, అంపైర్‌లతో సహా మిగతా అన్నింటినీ నిందించే బ్యాట్స్‌మెన్‌గానే ఉండిపోతారు.

జైవీర్ షేర్గిల్,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి