NRR Andolana

రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి దిగజారిన కాంగ్రెస్!

Lawyers Andolanaలోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ శ్రేణులు అక్టోబర్ 12న సుప్రీంకోర్టు వద్ద ప్రదర్శించిన నాటకీయ వైఖరిని యావత్ దేశ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సాగిస్తున్న కుట్రలను నిరసిస్తూ అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ), రాష్ట్రపతి వ్యవస్థ వంటి అత్యున్నత రాజ్యాంగ సంస్థలపై రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ గౌరవం, ఆదరణ, విశ్వాసం ఉండాలన్నారు. సుప్రీంకోర్టు జడ్జిల అపాయింట్‌మెంట్ అడిగి రాజకీయ మెమోరాండాలు ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో పేరుమోసిన సీనియర్ న్యాయవాదులు ఉన్నప్పటికీ, న్యాయస్థానాల్లో పిటిషన్లు ఎలా దాఖలు చేయాలో రాహుల్ గాంధీకి కనీస సలహా కూడా ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోర్టుల వద్ద ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ రాజ్యాంగ వ్యవస్థలను అప్రతిష్టపాలు చేసే సంస్కృతిని సమాజం ఎన్నటికీ హర్షించబోదని తేల్చిచెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ను లక్ష్యంగా చేసుకుని కేరళం కాంగ్రెస్ అధికారికంగా పోస్టులు పెడుతూ, సీజేఐ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం న్యాయవ్యవస్థపై సాగిస్తున్న ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు. దేశంలో అశాంతిని, హింసను ప్రేరేపిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రతో కాంగ్రెస్ భారత ప్రజలపై యుద్ధం ప్రకటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో రాహుల్ గాంధీ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే, బంగ్లాదేశ్‌లో జమాతే ఇస్లామీ ర్యాలీలు తీయడం వెనుక దాగి ఉన్న శక్తులెవరో దేశ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. గతంలో అనేకసార్లు కోర్టుల్లో అనేకసార్లు క్షమాపణలు చెప్పిన చరిత్ర కలిగిన రాహుల్ గాంధీకి న్యాయవ్యవస్థ అన్నా, న్యాయవాదులు అన్నా, ప్రజాస్వామ్య విలువలు అన్నా ఎలాంటి గౌరవం లేదని విమర్శించారు.

ఎస్ఐఆర్ ద్వారా 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారంటూ కాంగ్రెస్ నేతలు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ నిర్దేశిత రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఓట్ల నమోదు, తొలగింపు ప్రక్రియ జరుగుతుందని, ఎక్కడా ఒక్క ఓటు కూడా చట్టవిరుద్ధంగా తొలగించలేదని తేల్చిచెప్పారు. ఆధారాలు లేని అసత్య ప్రచారాలను ఇప్పటికైనా మానుకోకపోతే ప్రజలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.