ప్రజాస్వామ్యమా? మూకస్వామ్యమా?
ప్రజాస్వామ్యంలో వీధుల్లో గుమిగూడే జనసమూహం రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక సాధనంగా మారగలదా? ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) చుట్టూ నెలకొన్న వివాదం, సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణల నేపథ్యంలో ఈ ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా అసమ్మతిని వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టవచ్చు. ఎన్నికల సంఘం నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. చివరకు న్యాయస్థానాల తీర్పులపై కూడా విమర్శలు చేయవచ్చు. అయితే, ప్రజాస్వామ్యం కల్పించిన ఈ స్వేచ్ఛనే న్యాయస్థానాల నిర్ణయాలను ప్రభావితం చేసే సాధనంగా వీధుల్లోని జనసమూహాన్ని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి.
2026 అక్టోబర్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్కు సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరిగిన విచారణ మరోసారి ఈ అంశాన్ని చర్చనీయాంశంగా మార్చింది. అక్టోబర్ 5న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ఇతర ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేదా భాగస్వామ్యం లేకుండానే తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, జ్ఞానేశ్ కుమార్ను పదవి నుంచి తప్పించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అలాగే, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఎలాంటి మధ్యంతర ఆదేశాలనూ జారీ చేయలేదు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జ్ఞానేశ్ కుమార్, ఇతర సంబంధిత అధికారుల నుంచి సమాధానాలు కోరింది. కేవలం ఒక వార్తా కథనం ఆధారంగా తాము ఆదేశాలు జారీ చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. తొలుత రికార్డులను పరిశీలించాలని, సంబంధిత పక్షాల నుంచి వివరణలు తీసుకోవాలని, ఆ తర్వాతే సదరు నిర్ణయాలు చట్టప్రకారం తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారించాలని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ, ”కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. లేకపోతే దేశం తగలబడిపోతుంది” అని వ్యాఖ్యానించారు.
ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రతి రాజ్యాంగ సంస్థ ఎదుటా ఒక నిర్ణయం ‘తప్పు’ దిశలో వెళ్తే రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని, నిరసనలు పెరుగుతాయని లేదా దేశంలో అశాంతి నెలకొంటుందని పదేపదే వాదిస్తే, క్రమంగా చట్టబద్ధమైన పాలన స్థానంలో పరిణామాల పట్ల భయం ఆధిపత్యం చెలాయించే ప్రమాదం ఉంది. అప్పుడు నిర్ణయాలు చట్టం ప్రకారం తీసుకోవాలన్న సూత్రం కంటే, వాటి వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న ఆందోళనే ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఇక్కడే ‘మూకస్వామ్యం’ (మాబోక్రసీ) అనే భావన తెరపైకి వస్తుంది. మూకస్వామ్యం అంటే కేవలం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటం కాదు. భారీ జనసమూహం కూడా ప్రజాస్వామ్య నిరసనలో భాగమే కావచ్చు. అయితే, జనసమూహం సంఖ్యాబలం, రాజకీయ సమీకరణలు, ఒత్తిడి, అశాంతి చెలరేగే అవకాశాలను ఒక నిర్ణయం తీసుకునే రాజ్యాంగ సంస్థ ముందు అలా ప్రదర్శించినప్పుడు, ఆ సంస్థ తన నిర్ణయం చట్టపరంగా సరైనదా కాదా అన్నదానికంటే, వీధుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభిస్తే, అది మూకస్వామ్యంగా మారుతుంది.
ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే, న్యాయస్థానం నిర్వహించాల్సిన పని ప్రజాభిప్రాయ సేకరణ కాదు. ఒక పక్షం వెనుక ఎంతమంది ఉన్నారు, మరో పక్షానికి ఎంత మద్దతు ఉంది అన్నది లెక్కించడం కోర్టు బాధ్యత కాదు. చట్టం ఏం చెబుతోంది, రాజ్యాంగం దేనికి అనుమతిస్తోంది, న్యాయస్థానం ముందు ఉన్న రికార్డులో ఎలాంటి ఆధారాలున్నాయి అన్నది నిర్ధారించడమే దాని విధి. న్యాయవ్యవస్థపై బాహ్య ఒత్తిళ్లు, న్యాయమూర్తుల నిర్ణయాలకు రాజకీయ ఉద్దేశాలను ఆపాదించడం వల్ల కలిగే ప్రమాదాలపై సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే 2020లోనూ ఇలాంటి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక తీర్పును విమర్శించవచ్చని, న్యాయమూర్తి అభిప్రాయంతో విభేదించడం కూడా తప్పు కాదని, అయితే ఒక తీర్పు వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఏదైనా ఒక తీర్పు ఇస్తే పత్రికలు ఏమి రాస్తాయో, కోర్టు వెలుపల ఉన్న ప్రజలు ఎలా స్పందిస్తారోనన్న భయంతో న్యాయమూర్తి వెనుకడుగు వేస్తారని ఒక న్యాయవాది లేదా కక్షిదారు భావించడం ప్రారంభిస్తే అది ఆందోళన కలిగించే పరిణామమని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుత వివాదంలోనూ ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎస్ఐఆర్పై రాజకీయ, న్యాయపరమైన విభేదాలు ఉండవచ్చు. ఎన్నికల సంఘం నిర్ణయాల చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు. ఓటర్ల జాబితాల్లో పేర్ల తొలగింపు లేదా కొత్త పేర్ల చేర్పుపై ఫిర్యాదులు రావచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పనితీరుపై విచారణ జరపాలన్న డిమాండ్లు కూడా వినిపించవచ్చు. అయితే, ఈ అంశాలన్నింటినీ అంతిమంగా సంబంధిత రికార్డులు, చట్టాలు, రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఆధారంగానే పరిశీలించాలి. ఎన్నికల సంఘం చట్టాన్ని ఉల్లంఘించిందన్న ఆరోపణ కోర్టు ముందుకు వస్తే, సంబంధిత పత్రాలను కోరవచ్చు. అవసరమైన మెజారిటీ లేకుండానే నిర్ణయం తీసుకున్నట్లయితే, అందుకు సంబంధించిన వివరాలను అధికారిక రికార్డులు నిరూపించగలవు. నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లయితే, వాటిపై న్యాయస్థానం తగిన ఆదేశాలు ఇవ్వవచ్చు. ఇదే న్యాయప్రక్రియ. అందుకే అక్టోబర్ 5న జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అనుసరించిన వైఖరి గమనార్హం. సదరు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించకుండా, ముందుగా సంబంధిత పక్షాల నుంచి వివరణలు కోరింది. రికార్డులను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. చట్టాన్ని అనుసరించలేదని తేలితే అవసరమైన చర్యలు తీసుకునే అధికారం న్యాయస్థానానికి ఉందని ప్రధాన న్యాయమూర్తి కూడా వ్యాఖ్యానించారు.
ఎస్ఐఆర్కు సంబంధించి మరో అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. 2026 మేలో బిహార్లో ఎస్ఐఆర్ నిర్వహణ చెల్లుబాటును సుప్రీంకోర్టు సమర్థించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఇలాంటి ప్రక్రియను చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని, బిహార్లో నిర్వహించిన ఈ ప్రక్రియ చట్టబద్ధమైన పరిధిలోనే ఉందని న్యాయస్థానం పేర్కొంది. ఇక్కడి నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ చుట్టూ సాగుతున్న రాజకీయాలు, నిరసనల ద్వారా ఒత్తిడి తెచ్చే విధానం గురించి మరింత విస్తృతమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకోవాలనే ఉద్దేశంతో పదేపదే వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టడం, ఆ ప్రదర్శనల ద్వారా తమ బలాన్ని చాటుకోవడం, న్యాయప్రక్రియకు సమాంతరంగా ఒత్తిడి వ్యవస్థను నిర్మించడం ప్రజాస్వామ్య సంస్థలకు భిన్నమైన సవాలును విసురుతుంది. ఇక్కడ ప్రశ్న నిరసన జరిగిందా లేదా అన్నది కాదు. ఆ నిరసన ఉద్దేశం ప్రజా చర్చను ప్రభావితం చేయడమా, లేక రాజ్యాంగ సంస్థ తీసుకునే నిర్ణయాన్ని ప్రభావితం చేయడమా అన్నదే అసలు ప్రశ్న. ఈ తేడాను అర్థం చేసుకోవడం నేటి పరిస్థితుల్లో మరింత అవసరం. ఎందుకంటే, సామాజిక మాధ్యమాలు, 24 గంటల రాజకీయ వార్తా ప్రసారాల వ్యవస్థ వీధుల్లో గుమిగూడిన జనసమూహాన్ని కేవలం వ్యక్తుల సమూహంగా కాకుండా, దేశవ్యాప్తంగా ఒక కథనాన్ని నిర్మించగల శక్తిగా మార్చేశాయి. ఒక నిరసన కొన్ని గంటల్లోనే జాతీయ స్థాయి చర్చగా మారవచ్చు. కెమెరాలు, హ్యాష్ట్యాగ్లు, నినాదాలు, రాజకీయ ప్రచారం కలిసి ఒక న్యాయపరమైన అంశం చుట్టూ ప్రత్యేక వాతావరణాన్ని సృష్టించగలవు. అలాంటి పరిస్థితుల్లో అసలు చట్టపరమైన ప్రశ్న వెనుకబడిపోయి, రాజకీయ చర్చే ప్రధానాంశంగా మారే ప్రమాదం ఉంది.
న్యాయవ్యవస్థ విషయంలో ఈ అంశం మరింత కీలకమైనది. ఎందుకంటే, న్యాయస్థానాలు ఎన్నికల్లో పోటీ చేయవు. వాటికి రాజకీయ సంస్థలు ఉండవు. ప్రజలను సమీకరించి భారీ ర్యాలీలు నిర్వహించే యంత్రాంగం కూడా ఉండదు. వీధుల్లోని జనసమూహం బలాబలాలను చూసి న్యాయస్థానాలు కేసులను నిర్ణయిస్తాయనే అభిప్రాయం ఏర్పడితే, వాటి తీర్పుల చట్టబద్ధతతోపాటు సంస్థాగత విశ్వసనీయత కూడా దెబ్బతినవచ్చు. అదేవిధంగా, తగినంత మంది ప్రజలను సమీకరించడం, తగినంత ఒత్తిడి సృష్టించడం, రాజకీయంగా ఉద్రిక్త వాతావరణాన్ని పెంచడం ద్వారా రాజ్యాంగ సంస్థ నుంచి తమకు కావాల్సిన నిర్ణయాన్ని రాబట్టవచ్చని రాజకీయ వర్గాలు భావించడం ప్రారంభిస్తే, అది ఒక్క కేసుకే పరిమితమైన సమస్యగా మిగలదు. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి సున్నితమైన రాజ్యాంగ వివాదానికీ అది ప్రమాదకరమైన పూర్వదృష్టాంతంగా మారవచ్చు. నేడు వివాదం ఎన్నికల సంఘం చుట్టూ ఉండవచ్చు. రేపు మరో రాజ్యాంగ సంస్థ వంతు రావచ్చు. ప్రస్తుతం చర్చ ఎస్ఐఆర్ గురించి సాగుతుండవచ్చు. భవిష్యత్తులో మరో న్యాయపరమైన వివాదం తెరపైకి రావచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వోన్నతులు. అయితే, ప్రజల సర్వోన్నతత్వం అంటే వీధుల్లోని జనసమూహమే న్యాయమూర్తిగా మారిపోవాలని కాదు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది. ప్రభుత్వం పాలన సాగిస్తుంది. ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తుంది. న్యాయస్థానాలు చట్టాలను వ్యాఖ్యానిస్తాయి. ఈ రాజ్యాంగ వ్యవస్థలో ప్రతి చోటా ప్రజల గొంతుకకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ప్రతి సంస్థ తనకు రాజ్యాంగం కల్పించిన అధికార పరిధిలోనే నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యానికి నిజమైన బలం వీధుల్లో గుమిగూడే జనసమూహం సంఖ్యాబలంలో కాదు; చట్టం, రాజ్యాంగం, వ్యవస్థల స్వతంత్రతకు ఇచ్చే గౌరవంలో ఉంది.
కరణ్ ఠాకూర్,
న్యాయవాది

