Drought

తాగు నీటికి కటకట, సాగు నీరు లేదు.. చేతులెత్తేసిన సీఎం

ఎల్ నినో ప్రభావంతో సంభవించిన వాతావరణ మార్పులు, నీటి ఎద్దడి, పర్యావరణ క్షీణత, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో సహా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఓవైపు సవాల్ ఎదుర్కొంటూ ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలన గాలికి వదిలి దిల్లీ చుట్టూ ప్రదక్షిణలతో గడుపుతుంది. భూగర్భ జలాలు అడుగంటి హైదరాబాద్ లో తాగు నీటికి కటకట ఏర్పడింది. సాగు నీటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, లభించే కొద్దిపాటి నీటిని నిల్వచేసుకొనే ప్రయత్నం చేయకపోవడంతో సాగుకు నీరు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో సాగునీళ్లు ఇవ్వలేమని రైతుల సాక్షిగా ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే మీ ఖర్మ అనేలా వ్యాఖ్యానించారు. కరువుపై తానేమీ చేసే పరిస్థితి లేదని చేతుల్తేశారు. “అందుకే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా.  ప్రభుత్వం మీ మేలు కోరుకుంటున్నది, మీ కష్టాలు తీర్చాలనుకుంటున్నది, ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నది, ఆరుతడి పంటలు వేయండి, కూరగాయలు పండించండి. పాలకూర, మెంతికూర, టమాటలు, వంకాయలు, మిరపకాయలు, మక్కజొన్న, పసుపు ఇంకా ఆరుతడి పంటలు పండించాలి” అంటూ  సూచించారు. నీళ్లు ఎక్కువ అవసరం ఉన్న పంటలు పండిస్తే నీళ్లు ఉండవని స్పష్టం చేశారు. వచ్చే 8-10 నెలలపాటు వానలు ఉండవని, ఉన్న నీళ్లు దాచి పెట్టుకొని వాడుకునే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. లాభం రాకపోయినా సరే పెట్టుబడి నష్టపోయే పరిస్థితి రాకూడదని, ప్రభుత్వం చెప్పినట్టు వింటే మేలు జరుగుతుందని లేకపోతే నష్టం తప్పదని హెచ్చరించారు. 

మురసు తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను నిలువునా ముంచేసింది. చేతికి అందివచ్చి నేడో రేపో కోతలకు సిద్ధమైన వరి పంట పూర్తిగా వర్షార్పణమైంది. నీళ్లలోని వరి కంకులు నానుతూ ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే అప్పుల ఊబిలో చిక్కుకుపోతామని రైతన్నలు వేడుకుంటున్నారు. అయినా, ప్రభుత్వం వారి గోడు పట్టించుకొనే పరిస్థితుల్లో కన్పించడం లేదు. తుఫాను తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతులను ఆదుకొనే అంశాలపై చర్చలు చేపట్టిన దాఖలాలు లేవు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా మేడిగడ్డ బరాజ్‌కు మరమత్తులు చేసే ప్రయత్నం చేయడం లేదు. మేడిగడ్డ గేట్లు ఎత్తకుండా నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యమని చెప్తున్న ముఖ్యమంత్రి ఇందుకు ప్రత్యామ్నాయంగా ఇంజినీర్లు, సాగునీటి నిపుణులు, కేంద్ర సంస్థలు సూచించినట్టు కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి నీళ్లు ఎత్తిపోయవచ్చని చెప్పినా ఎందుకు వినలేదనే ప్రశ్నలు వస్తున్నాయి.  

వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిన పరిస్థితుల్లో పంటలు పండే పరిస్థితి లేదు. ఇప్పటికే ఆయనే స్వయంగా వరి సాగుచేయొద్దని పిలుపునిచ్చారు. దీంతో మార్కెట్లో వరితోపాటు ఇతర పంట ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఇది తన వల్లేనని చెప్పుకుంటున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లో నీటి కొరత రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది.  భూగర్భ జలాలు అత్యంత దారుణంగా పడిపోతున్నాయి. అక్టోబర్‌ నెలాఖరు వరకు గ్రేటర్‌లోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో సగటున 12.59 మీటర్ల దిగువకు చేరుకున్నాయి. కేవలం ఒక్క నెలలోనే 1.01 మీటర్ల కిందికి భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. గతేడాదితో పోలిస్తే కోర్‌ అర్బన్‌ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం సుమారు 6.85 మీటర్ల దిగువకు పడిపోయింది. నగరంలో దాదాపు 96 శాతం మంది భూర్భ జలాలపై ఆధారపడటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అటు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానుల బంద్‌తో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ పరిణామం హాస్టళ్లు, అపార్ట్‌మెంట్లు, విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. నీరు అందుబాటులో లేక విద్యార్థులు, ఉద్యోగులు, నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

నీటి కొరత ప్రభావం కార్పొరేట్ విద్యాసంస్థలపైనా పడుతోంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాస్టళ్లలో ఉంటూ చదువుకునే కాలేజీలకు రోజూ భారీగా నీరు అవసరం అవుతుంది. తాగునీటితో పాటు స్నానాలు, వంట, ఇతర అవసరాలకు సరిపడా నీరు అందకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ కష్టంగా మారుతోంది. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకునే ప్రయత్నాలు చేసినా అవసరాలకు తగినంత సరఫరా లభించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను తాత్కాలికంగా ఇళ్లకు పంపించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నీటి దందా కారణంగా తమ ఇళ్లలోని బోర్లు ఎండిపోతున్నాయని పలు కాలనీల ప్రజలు హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయానికి వచ్చి కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి సమస్యలను తీసుకెళ్తున్నారు. నివాస ప్రాంతాల్లోని బోర్ల కంటే వ్యాపార అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న కొన్ని బోర్లు చాలా లోతుగా ఉంటున్నాయని, వాటి నుంచి భారీగా నీటిని తోడేస్తుండటంతో స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు.

మొత్తంగా హైదరాబాద్‌లో నీటి కొరత, ట్యాంకర్ల బంద్, అక్రమ బోర్లపై చర్యలు ఒకేసారి ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నీటి వనరుల పరిరక్షణతో పాటు నివాసితులు, విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఇప్పుడు శీతాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వేసవి వచ్చే సమయానికి ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కోవాలో అని నగరవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

కృష్ణ చైతన్య