‘లఖ్పతి దీదీ’లతో గ్రామీణ పరివర్తన
భారత్ లో సామాజిక భాగస్వామ్యంతో కూడిన అభివృద్ధి ప్రయోగాల్లో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ఉద్యమం అత్యంత విజయవంతమైన వాటిలో ఒకటి. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) సుమారు 92 లక్షల స్వయం సహాయక సంఘాల ద్వారా 10 కోట్ల మందికి పైగా గ్రామీణ మహిళలను సంఘటితం చేసింది. ఇది వారిలో పొదుపు అలవాటును, సంస్థాగత రుణ సదుపాయాన్ని, జీవనోపాధులను పెంపొందించడంతో పాటు కుటుంబ, సామాజిక నిర్ణయాల్లో వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేసింది. ఈ ఉద్యమ పరిణామ క్రమంలో ‘లఖ్పతి దీదీ’ కార్యక్రమం ఒక కీలక మైలురాయి. కేవలం సభ్యత్వం, పొదుపు లేదా రుణాల మంజూరుతోనే కాకుండా, ఆదాయాల్లో, ఆర్థిక అవకాశాల్లో నిలకడైన వృద్ధి సాధించడమే ఈ కార్యక్రమ విజయానికి గీటురాయిగా నిలవాలి. ఒక జాతీయ ఆకాంక్షను కార్యాచరణ ప్రణాళికలుగా మార్చడం, కొత్త లక్ష్యాల సాధన దిశగా సంస్థలను సమాయత్తం చేయడం వంటి ప్రజా నాయకత్వ పాఠాలను ఇది అందిస్తోంది.
2023 ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవం నాడు, స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు చెందిన మహిళలు ఏటా కనీసం లక్ష రూపాయల ఆదాయం ఆర్జించేలా 2 కోట్ల మంది ‘లఖ్పతి దీదీ’లను తయారు చేయాలనే లక్ష్యాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. తదనంతరం ఈ లక్ష్యాన్ని 3 కోట్లకు, ఆపై 2026 ఫిబ్రవరి నాటికి.. 2029 మార్చి కల్లా 6 కోట్ల మందికి పెంచారు. ఇది ఇప్పటికే అమలవుతున్న కార్యక్రమానికి ఒక నిర్దిష్ట దిశానిర్దేశం చేయడంతో పాటు, మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి పెద్దపీట వేసింది. ప్రధానమంత్రి పేర్కొన్న ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదానికి ఈ విధానం ఆచరణాత్మక రూపాన్ని ఇచ్చింది: సమ్మిళిత అభివృద్ధి, సంస్థలపై విశ్వాసం, స్పష్టమైన ఫలితాల కోసం సమష్టి కృషి ఇందులో ఇమిడి ఉన్నాయి.
విభిన్న ఆర్థిక పరిస్థితులు, సంస్థాగత సామర్థ్యాలు కలిగిన రాష్ట్రాలలో ఈ భారీ లక్ష్యాన్ని లక్షలాది ఆచరణయోగ్యమైన కుటుంబ జీవనోపాధి ప్రణాళికలుగా మార్చడం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఒక సవాలుగా నిలిచింది. ఇందుకోసం సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేయకుండా, ఇప్పటికే ఉన్న డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేసే మార్గాన్ని ఎంచుకున్నారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, క్లస్టర్ స్థాయి సమాఖ్యలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీ) ప్రధాన సంస్థాగత మాధ్యమాలుగా మారాయి. వివిధ శాఖల సమన్వయంతో కూడిన ఈ వ్యూహం ఐదు కీలక అంశాలను ఏకతాటిపైకి తెచ్చింది. అవి: ఉత్పాదక ఆస్తులు, నైపుణ్యాలు, ఆర్థిక సహాయం, మార్కెట్లు, సాంకేతికత.
ఇంతటి బృహత్తర జాతీయ కార్యక్రమం కేవలం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో మాత్రమే విజయవంతం కాలేదు. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధుల మిషన్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ విధానాన్ని మలుచుకుంటూ, జీవనోపాధి అవకాశాలను గుర్తించి, వివిధ శాఖలను సమన్వయం చేస్తున్నాయి. జిల్లా యంత్రాంగాలు జీవనోపాధి ప్రణాళికలను వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, బ్యాంకింగ్, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్లతో అనుసంధానిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు అర్హులైన లఖ్పతి దీదీలను గుర్తించి, వారి జీవనోపాధులను మదింపు చేసి, ప్రణాళికలు రూపొందిస్తూ తగిన సహాయ సహకారాలు అందేలా తోడ్పడుతున్నారు. ఎస్‌హెచ్‌జీ సమాఖ్యలు వ్యాపార అభివృద్ధికి, మార్కెట్ అనుసంధానానికి వేదికలుగా పనిచేస్తున్నాయి. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడం, జీవనోపాధులను వైవిధ్యీకరించడం, రుణ వితరణ, వసూళ్ళను సమర్థంగా నిర్వహించడం, కొనుగోలుదారులతో బేరసారాలు జరపడం, తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మహిళలు తమ ఆర్థిక నిర్ణయాలతోనే నాయకత్వ పటిమను చాటుకుంటున్నారు. 2026 ఫిబ్రవరి నాటికి 3 కోట్ల మంది లఖ్పతి దీదీల మైలురాయిని అధిగమించడం జరిగింది. 2025 నవంబర్ నుండి 2026 మార్చి మధ్యకాలంలో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 6,500 మందిపై ఐఐఎం అహ్మదాబాద్ నిర్వహించిన ప్రభావ అంచనా అధ్యయనం.. కుటుంబ ఆదాయాలు, పొదుపు, జీవనోపాధుల వైవిధ్యీకరణ, నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపడినట్లు వెల్లడించింది. అయితే సాధించిన ఈ ఆర్థిక ప్రగతిని నిలబెట్టుకోవడం ఇప్పటికీ ఒక సవాలుగానే ఉంది. వ్యవసాయ ఆదాయాల్లో ఒడిదుడుకులు, చిన్న తరహా వ్యాపారాలకు అనిశ్చిత మార్కెట్ పరిస్థితులు ఎదురవుతున్నాయి; అంతేకాకుండా కేవలం రుణ సదుపాయం లభించినంత మాత్రాన లాభదాయకతకు భరోసా ఉండదు. వివిధ కాలాల్లో చేసే అసంఘటిత పనుల ద్వారా ఆదాయం సమకూరుతున్నప్పుడు, కుటుంబ ఆదాయాన్ని కచ్చితంగా అంచనా వేయడం కూడా కష్టతరమవుతోంది. అందువల్ల తదుపరి దశలో ఆదాయ స్థిరత్వం, వ్యాపారాల మనుగడ సామర్థ్యం, ఉత్పత్తిదారుల సంఘాలు, మార్కెట్ అనుసంధానాలు, అదనపు సహాయం అవసరమైన కుటుంబాలకు నిరంతర తోడ్పాటుపై మరింత దృష్టి సారించాలి. మహిళల ఆర్థిక పురోగతిలోని నాణ్యత, మన్నికలపై కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. బలమైన మార్కెట్లు, అధిక ఉత్పాదకత, తగిన సాంకేతికత, గిట్టుబాటైన ఆర్థిక వనరులు, సంస్థాగత మద్దతు ద్వారా నమ్మకమైన ఆదాయాన్ని సృష్టించగల జీవనోపాధులను కల్పించాలి.
పెట్టుబడులను నిర్వహించే, వ్యాపారాన్ని అభివృద్ధి చేసే, మార్కెట్లో బేరసారాలు చేసే లేదా మరో మహిళా పారిశ్రామికవేత్తకు మార్గనిర్దేశం చేసే మహిళ కేవలం ఆదాయానికే పరిమితం కాకుండా అనేక ఇతర సామర్థ్యాలను అలవర్చుకుంటుంది. ఇవి ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర భావాన్ని, నిర్ణయాధికారంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. జాతీయ స్థాయిలో దిశానిర్దేశం చేయడం, ఆచరణయోగ్యమైన వ్యవస్థలను నిర్మించడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం, పౌరులు తమ ప్రగతికి తామే బాధ్యత వహించేలా ప్రోత్సహించడం వంటి బహుళ స్థాయిల నాయకత్వంపైనే పరివర్తనాత్మక కార్యక్రమాల విజయం ఆధారపడి ఉంటుందని ‘లఖ్పతి దీదీ’ అనుభవం స్పష్టం చేస్తోంది. మహిళలు ఉత్పత్తిదారులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఆర్థిక నిర్ణేతలుగా ఎదగడం అనేది నిలకడైన ఆర్థిక స్వయం ప్రతిపత్తి దిశగా, పౌరుల సామర్థ్యాలు, ఆకాంక్షల ఆధారంగా రూపుదిద్దుకునే అభివృద్ధి దిశగా ఒక లోతైన మార్పునకు నాంది పలుకుతుంది.
శైలేష్ కుమార్ సింగ్,
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి

