వన్‌ధన్ వికాస్ కేంద్రాలతో ఆదివాసీల సాధికారత
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 12.48 లక్షల మందికి పైగా ఆదివాసీలు వన్‌ధన్ వికాస్ కేంద్రాలతో (వీడీవీకే) అనుసంధానమయ్యారు. 2026 జూలై 31 నాటికి ప్రధానమంత్రి ఆదివాసీ (జన్ జాతి) వికాస్ మిషన్ (పీఎం వీజేవీఎమ్) కింద దేశవ్యాప్తంగా 4,172 వన్‌ధన్ వికాస్ కేంద్రాలకు ఆమోదం లభించింది. వీటిలో 2,911 కేంద్రాలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కేంద్రాలన్నీ కలిపి ఇప్పటివరకు సుమారు రూ.168 కోట్ల విలువైన విక్రయాలను నమోదు చేశాయి. ఈ గణాంకాలు అటవీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న కీలక మార్పునకు నిదర్శనం. తరతరాలుగా ఆదివాసీలు అడవుల్లో మహువా పువ్వులు, తేనె, లక్క, చింతపండు, వెదురు తదితర అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ వస్తున్నారు. అయితే వాటిని సేకరించిన వారు ఒకరైతే, వాటిని శుద్ధి చేసి విలువ జోడించి ఉత్పత్తులుగా మార్చేవారు మరొకరు. వాటికి బ్రాండ్ పేర్లు పెట్టి మార్కెట్‌లో విక్రయించేవారు ఇంకొకరు. చివరకు ఆ వ్యాపారంలో వచ్చే లాభాల్లో అధిక భాగం ఇతరుల జేబుల్లోకే వెళ్లేవి. ప్రధానమంత్రి ఆదివాసీ వికాస్ మిషన్ ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. అటవీ ఉత్పత్తులను సేకరించే వ్యక్తినే వ్యాపారవేత్తగా, పారిశ్రామికుడిగా తీర్చిదిద్దాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ ఆలోచనకు మన ప్రాచీన నాగరికతలోని ఒక మౌలిక సత్యమే ప్రేరణ. భారతదేశ ఆదివాసీ సమాజాలు ఎప్పుడూ అడవుల నుంచి జీవనోపాధి పొందడమే కాకుండా, అడవులతో మమేకమై జీవించాయి. అధర్వణ వేదం భూమిని తల్లిగా అభివర్ణించింది. అదే స్ఫూర్తితో వన్‌ధన్ నమూనా అటవీ సంపదను కేవలం వినియోగించుకునే వనరుగా కాకుండా, సంరక్షించాల్సిన, అభివృద్ధి చేయాల్సిన, విలువ జోడించి భావితరాలకు అందించాల్సిన వారసత్వ సంపదగా పరిగణిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 ఏప్రిల్ 14న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వన్‌ధన్ యోజనను ప్రారంభించారు. బస్తర్ ప్రాంతంలోని ఆకాంక్షాత్మక జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ యోజన ప్రధానమంత్రి జన్ జాతి వికాస్ మిషన్‌లో భాగంగా కొనసాగుతోంది. వన్‌ధన్ వికాస్ కేంద్రాల నమూనాకు ఇది పునాదిగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఈ కేంద్రాల విస్తరణకు దోహదపడుతోంది. ఈ మిషన్‌కు ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్) నోడల్ ఏజెన్సీ (సమన్వయ సంస్థ)గా వ్యవహరిస్తోంది.
పునాది కనీస మద్దతు ధర
అటవీ ఉత్పత్తులకు విలువ జోడించే ప్రక్రియలో మరో కీలకమైన అంశం కనీస మద్దతు ధర (ఎమ్మెఎస్పీ) హామీ. ప్రధానమంత్రి జన్ జాతి వికాస్ మిషన్ కింద చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణకు కనీస మద్దతు ధర విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం 87 రకాల అటవీ ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర వర్తిస్తోంది. దీనివల్ల మార్కెట్‌లో ఏ రోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అటవీ ఉత్పత్తులను సేకరించే ఆదివాసీలకు కనీస ధర లభించే భరోసా ఏర్పడుతోంది. ఒకవైపు కనీస మద్దతు ధర ఆదివాసీలకు నష్టదాయకమైన అమ్మకాలను నివారిస్తుండగా, మరోవైపు వన్‌ధన్ వికాస్ కేంద్రాలు అదనపు ఆదాయం, లాభాల ఆర్జనకు అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ రెండు వ్యవస్థలూ కలిసి అటవీ ఉత్పత్తుల సేకరణదారులకు మార్కెట్‌లో బేరసారాలు చేసే శక్తిని పెంచుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం అడవిలోకి వెళ్లి ఉత్పత్తులను సేకరించే ప్రజల చేతుల్లోకి ఆర్థిక నిర్ణయాధికారాన్ని తీసుకువస్తున్నాయి.
తొలుత ఆదివాసీ అటవీ ఉత్పత్తుల సేకరణదారులను స్వయం సహాయక సంఘాలుగా (ఎస్‌హెచ్‌జీలు) ఏర్పాటు చేస్తారు. ఇలాంటి 15 స్వయం సహాయక సంఘాలను, మొత్తం సుమారు 300 మంది సభ్యులతో కలిపి ఒక వన్‌ధన్ వికాస్ కేంద్రంగా తీర్చిదిద్దుతారు. ఈ కేంద్రాల యాజమాన్యానికి సంబంధించి ఒక నిర్దిష్ట నిబంధన ఉంది. ప్రతి కేంద్రంలోని సభ్యుల్లో కనీసం 60 శాతం మంది షెడ్యూల్డ్ తెగలకు చెందినవారై ఉండాలి. తద్వారా ఏ వర్గం అభ్యున్నతి కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారో, అదే వర్గానికి వాటి యాజమాన్యం, నిర్వహణలో ప్రధాన పాత్ర లభిస్తుంది. ఈ కేంద్రాల నిర్వహణ కోసం తప్పనిసరిగా కొత్త భవనాలను నిర్మించాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుల ఇళ్లలోనూ, ప్రభుత్వ భవనాల్లోనూ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనూ వీటిని నిర్వహించవచ్చు. ప్రతి కేంద్రానికి మౌలిక సదుపాయాలు, శిక్షణ కోసం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది.
అటవీ ఉత్పత్తులను సక్రమంగా సేకరించి, శుద్ధి చేసి, ప్రాసెసింగ్ చేసినప్పుడే వాటికి అదనపు విలువ చేకూరుతుంది. అందుకే ఈ నమూనాలో శిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో అటవీ ఉత్పత్తులను సేకరించడం, వాటిని సమర్థంగా వినియోగించుకోవడం గురించి కేంద్రాల్లో సభ్యులకు శిక్షణ ఇస్తారు. అటవీ సంపదకు ఎలాంటి హాని కలిగించకుండా, దాని నుంచి గరిష్ట ప్రయోజనం పొందడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం. ప్రతి వన్‌ధన్ వికాస్ కేంద్రంలోని 30 మంది సభ్యులకు స్థిరమైన, పర్యావరణహిత సేకరణ పద్ధతులు, ఉత్పత్తులకు విలువ జోడించే ప్రక్రియపై శిక్షణ అందిస్తారు. ఇందుకోసం అవసరమైన ముడిసరుకుతో పాటు శిక్షణ సమయంలో ఉపయోగించేందుకు ప్రత్యేక కిట్లను కూడా అందజేస్తారు. స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులకు అనుగుణంగా పరికరాలను సమకూరుస్తారు. ఉదాహరణకు, వెదురు అధికంగా లభించే ప్రాంతంలోని కేంద్రానికి అవసరమైన పరికరాలు, చింతపండు ఉత్పత్తులు అధికంగా లభించే ప్రాంతంలోని కేంద్రానికి అవసరమైన పరికరాలు ఒకే విధంగా ఉండవు. సమీప ప్రాంతాల్లో లభించే చిన్న తరహా అటవీ ఉత్పత్తుల స్వభావాన్ని బట్టి ఈ పరికరాలను ఎంపిక చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపార సంస్థలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో పెట్టుబడి కొరత ఒకటి. ప్రధానమంత్రి జన్ జాతి వికాస్ మిషన్ ఈ సమస్యను అధిగమించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, జాతీయ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక, అభివృద్ధి సంస్థతో అనుసంధానమవుతోంది. ఈ భాగస్వామ్యాల ద్వారా కేంద్రాలకు నిర్వహణ మూలధనం అందుబాటులోకి వస్తుంది. అలాగే గిడ్డంగులు, రవాణా సదుపాయాలను అద్దె ప్రాతిపదికన కల్పిస్తున్నారు. దీనివల్ల పరిమిత ఆర్థిక వనరులున్న చిన్న సంఘాలు సొంతంగా గిడ్డంగులు, వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు.
వారపు సంతలతో మార్కెట్ అనుసంధానం
ఉత్పత్తి చేయడం మాత్రమే సరిపోదు. వాటిని కొనుగోలు చేసే వినియోగదారులు, మార్కెట్లు అందుబాటులో ఉన్నప్పుడే ఉత్పత్తికి అసలైన ప్రయోజనం చేకూరుతుంది. అందుకే వన్‌ధన్ వికాస్ కేంద్రాలు స్థానిక మార్కెట్లతో పాటు దూర ప్రాంతాల్లోని మార్కెట్లతోనూ అనుసంధాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. స్థానిక హాట్ బజార్లు లేదా వారపు సంతలకు సమీపంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. చాలా కాలంగా అటవీ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలకు ఈ వారపు సంతలే ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. దేశంలోని గిరిజన ప్రాంతాల్లో 5,000కు పైగా హాట్ బజార్లు ఉన్నాయి. వీటికి సమీపంలో వన్‌ధన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల అటవీ ఉత్పత్తులను సేకరించే ఆదివాసీలు దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సిన అవసరం తగ్గుతుంది. వ్యాపారం కూడా వారి నివాస ప్రాంతాలకు చేరువలోనే జరుగుతుంది. హాట్ బజార్లను కూడా ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నారు. దశలవారీగా వాటికి శాశ్వత భవనాలు, నిల్వ సదుపాయాలు, తాగునీరు, నీడ, తూకం వేసే యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సరైన తూనికలు, కొలతల పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల మధ్యవర్తులు తక్కువ తూకం వేసి ఆదివాసీలను మోసం చేస్తున్నారన్న చిరకాల ఫిర్యాదుకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ట్రైఫెడ్ మార్కెట్ పరిస్థితులు, రోజువారీ ధరలు, ఈ-కామర్స్ ద్వారా విక్రయ అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని వన్‌ధన్ కేంద్రాలకు అందిస్తోంది.
అటవీ సంపదకు బ్రాండింగ్
ప్రధానమంత్రి జన్ జాతి వికాస్ మిషన్ లక్ష్యం కేవలం గ్రామీణ సంతలకే అటవీ ఉత్పత్తులను పరిమితం చేయడం కాదు. ఆదివాసీ ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్, ప్రచారం, మార్కెటింగ్ కల్పించడంపై కూడా దృష్టి సారిస్తోంది. ఇందుకోసం పండుగలు, ప్రదర్శనలు, చేతివృత్తుల మేళాల ద్వారా ఆదివాసీ ఉత్పత్తులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరిస్తోంది. అలాగే ఆదివాసీ ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగులు పొందేందుకు కూడా ఈ మిషన్ ప్రోత్సాహం అందిస్తోంది. ఒక ఉత్పత్తికి సంబంధించిన ప్రత్యేక లక్షణాలు లేదా దాని మార్కెట్ ప్రతిష్ఠ నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం నుంచి ఉద్భవించినప్పుడు దానికి భౌగోళిక గుర్తింపు లభిస్తుంది. అటవీ ఉత్పత్తుల విషయంలో ఈ గుర్తింపునకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి చెందిన ప్రత్యేకతను మార్కెట్‌లో అదనపు విలువగా మార్చగలుగుతుంది.
మహిళా శక్తికి ఆర్థిక సాధికారత
ఈ మిషన్‌లో అత్యంత విశేషమైన అంశం దాని వెనుక ప్రధాన చోదకశక్తిగా నిలుస్తున్న మహిళల పాత్ర. అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయాల్లో అధిక భాగం మహిళలే నిర్వహిస్తుంటారు. అందువల్ల ప్రధానమంత్రి ఆదివాసీ వికాస్ మిషన్ ఆదివాసీ మహిళల ఆర్థిక సాధికారతకు కీలకమైన సాధనంగా మారుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఒక వన్‌ధన్ వికాస్ కేంద్రం ఈ విధానం క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తోందో చాటిచెబుతోంది. లెపరాడా జిల్లాలోని న్యిగమనే, హో యోర్బే, మెదుంహగ్దుమ్ వన్‌ధన్ వికాస్ కేంద్రం 2021 అక్టోబరులో ఏర్పాటైంది. ఈ కేంద్రం ద్వారా 300 మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. స్థానికంగా లభించే కలపేతర అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి విక్రయించదగిన వస్తువులుగా మార్చడం వీరి ప్రధాన లక్ష్యం.
అంత్యోదయ స్ఫూర్తి
సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందాలన్నదే పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతం. మారుమూల గ్రామాల్లో నివసిస్తూ అడవుల నుంచి ఉత్పత్తులను సేకరించే ఆదివాసీల కంటే మార్కెట్లకు దూరంగా ఉన్నవారు అరుదు. అలాంటి ప్రజలకు మార్కెట్ అవకాశాలను చేరువ చేయడమే వన్‌ధన్ కార్యక్రమం లక్ష్యం. ఈ పథకం ఆదివాసీలను ఉపాధి కోసం అడవుల నుంచి దూరం చేయడం లేదు. వారి సంప్రదాయ పరిజ్ఞానాన్ని పారిశ్రామిక ఉత్పత్తి విధానాలతో భర్తీ చేయాలని కూడా ప్రయత్నించడం లేదు. ఏ ఆకును ఎప్పుడు సేకరించాలి, ఏ వేరును ఎలా ఆరబెట్టాలి, ఏ కాలంలో ఏ అటవీ ఉత్పత్తిని సేకరించాలి వంటి తరతరాలుగా వారు సంపాదించుకున్న పరిజ్ఞానంపైనే ఈ కార్యక్రమం ఆధారపడుతోంది. దానికి అదనంగా ఆధునిక పరికరాలు, శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెట్ అనుసంధానాన్ని కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో వన్‌ధన్‌ను కేవలం సంక్షేమ పథకంగా కాకుండా, పారిశ్రామిక, వ్యాపారాభివృద్ధి పథకంగా పరిగణించవచ్చు. ఇది ప్రజలకు తాత్కాలిక ఆర్థిక సహాయం అందించి చేతులు దులుపుకోవడం లేదు. స్వయంగా ఆదాయం సంపాదించుకునే సామర్థ్యాన్ని వారిలో పెంపొందిస్తోంది.
వివేక్ కుమార్

