ప్రతి పోలింగ్ బూత్ లో 370 ఓట్లు సాధించాలి
ప్రతి పోలింగ్ బూత్ లో 370 ఓట్లు అంటే సుమారుగా పోలైన ఓట్లలో 50 శాతం సాధించేందుకు బిజెపి శ్రేణులు కృషి చేయాలని బిజెపి తెలంగాణ శాఖ తీర్మానించింది. బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత కోసం ప్రతి నాయకుడు తమ తమ పోలింగ్ బూత్ లలో కోఆర్డినేటర్లుగా పని చేయాలని ఆదేశించింది. నామినేషన్లలోపు బూత్ స్థాయిలో ఓటరు జాబితాపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంతి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన మార్చ్ 24న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఎన్నికలలోపు ప్రతి ఓటరును కనీసం మూడు సార్లు కలిసేలా కార్యాచరణ రూపొందించారు. నామినేషన్ల వరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాల నిర్వహణ సహా అనేక అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బిజెపి జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె.లక్ష్మణ్ తదితరులు దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఏప్రిల్ 25న నామినేషన్లు ముగిసే వరకు పార్టీ పటిష్టత కోసం కార్యాచరణ ప్రకటించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అనుసరించి ముఖ్యంగా పోలింగ్ బూత్ స్థాయిలో మోదీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను, స్వయం సహాయక బృందాలను (మహిళా సంఘాలు) సంప్రదించాలి. బిజెపి ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 6న పోలింగ్ బూత్ వారీగా ‘టిఫిన్ సమావేశాలు’ నిర్వహించాలి. నమో యాప్ ద్వారా చిన్న చిన్న విరాళాలు (మైక్రో డొనేషన్స్) సేకరించాలి. ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించాలి. ప్రతి పోలింగ్ బూత్ లో పార్టీ బలాన్ని బట్టి ఎ, బి, సి, డిలుగా వర్గీకరించి వాటి బలోపేతానికి కృషి చేయాలి. పార్లమెంట్ అభ్యర్థి నేరుగా పాల్గొనేలా సమావేశాలు నిర్వహించాలి. పార్లమెంటు, అసెంబ్లీ స్థాయిలో ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశాలు తరచుగా నిర్వహించి, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయాలి. గ్రామ నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిల్లో కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించాలి. వివిధ మోర్చాలు.. ముఖ్యంగా యువమోర్చామొదటిసారి ఓటేస్తున్న యువతను ఆకర్శించే విధంగా, కిసాన్ మోర్చా రైతులలో, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మోర్చాలు ఆయా వర్గాలతో నిరంతర సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చేవిధంగా కృషి చేయాలి.
ఈ సమావేశంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కన్వీనర్లు, ప్రభారీలు, మోర్చాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభ్యులతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

