దళితులపై కాంగ్రెస్ కపట ప్రేమ
‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ అంబేద్కర్’ (అంబేద్కర్ అడుగుజాడల్లో) పుస్తక రచయిత భగవాన్ దాస్ ఇలా వ్రాశారు: “వార్తాపత్రిక గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఆజాద్, సుభాష్ చంద్రబోస్, జిన్నా గురించి చాలా విషయాలు ప్రచురించేది కానీ అంటరాని వర్గాల గురించి చాలా తక్కువ రాసేది. ‘మా నాయకుడు ఎవరు?’ అని నేను అనుకుంటూ ఉండేవాడిని, నేను ఇదే ప్రశ్న మా నాన్నను అడిగాను, అయన ఇలా సమాధానమిచ్చాడు, ‘ఆశ కలిగించేవాడు (మన నాయకుడు), ఉమీద్కర్’. మా నాన్న బాబాసాహెబ్ అంబేద్కర్ను అలా చూశారు.” ఒక జాతి జీవితంలో గతం గురించి సామూహిక ఆత్మపరిశీలన చేసుకుని, భవిష్యత్తుపై వ్యూహరచన చేయవలసిన సందర్భాలు ఉంటాయి. ఒక పాఠశాల విద్యార్థిగా, నాయకుల జయంతులు, వర్ధంతులు నిర్వహించడం వెనుక ఉన్న లక్ష్యాల గురించి తరచుగా ఆలోచించేవాడిని. ఇప్పుడు, సామాజికంగా, మేధోపరంగా కొంత ఎదిగినందున విషయాలను విభిన్న కోణాల నుంచి అర్థం చేసుకోవడం ప్రారంభించాను. అంబేద్కర్ జయంతి మా చిన్నతనం నుంచి ఉత్సుకత, ఉత్సాహాన్ని రేకెత్తించింది. 2012లో నిర్వహించిన ఒక పోల్లో, గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి ప్రముఖ నాయకులను మించి అంబేద్కర్ ‘గొప్ప భారతీయుడు’గా ఎన్నికయ్యారు.
అంబేద్కర్ వారసత్వం
దళితులకు సంబంధించి ఏప్రిల్కు ప్రత్యేక స్థానం ఉంది. బాబూ జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ల జయంతి వంటి సందర్భాలను వేదికలుగా వారి దార్శనికతలను, వాటి సాకారం దిశగా జరిగిన పురోగతిని సమీక్షించుకునేందుకు ఈ నెల అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా అంబేద్కర్ మరణానంతరం దశాబ్దాల పాటు ఆయన సిద్ధాంతాలు, వారసత్వంపై వివాదాలు కొనసాగాయి. రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా రిజర్వు బ్యాంకు వంటి సంస్థలు, అణగారిన వర్గాలకు అండగా నిలిచే రాజకీయ పార్టీల వెనుక ఉన్న శక్తి కూడా ఆయనే. ఆయన వారసత్వాన్ని కాంగ్రెస్ రాజకీయం చేసింది. అంబేద్కర్ వాద రాజకీయాలను అనుసరించేవారు ఆయనకు భారతరత్న రావడానికి దశాబ్దాలు ఎందుకు పట్టిందని ఆశ్చర్యపోతున్నారు. ‘కాంగ్రెస్ అస్పృశ్యులకు నిజంగా ప్రాతినిధ్యం వహించదు’, వారి ప్రయోజనాల కోసం పార్టీ ప్రవచించే మద్దతు ‘కేవలం వ్యూహం తప్ప మరేమీ కాదు’ అని అంబేద్కర్ వాదించారు.
టైమ్ మ్యాగజైన్ 2024ని ఎన్నికల సంవత్సరంగా ప్రకటించింది. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో రాజకీయ పరిణామాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ప్రజాస్వామ్యం గొంతులేని వారికి, సామాజికంగా అట్టడుగున ఉన్న వారికి రాజకీయ సమానత్వాన్ని అందించింది, వీరికి అంబేద్కర్ స్ఫూర్తిగా నిలిచారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాల కాలంలో దళిత రాజకీయాలు మౌలికమైన పరివర్తనను వీక్షించాయి. ప్రత్యేక నియోజకవర్గాల చుట్టూ ఉన్న సమస్యల నుంచి పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో ప్రాతినిధ్యం వరకు, దళిత రాజకీయాల ప్రపంచం తమ అస్తిత్వాన్ని నొక్కిచెప్పే దశ నుండి ఆకాంక్షల స్థాయికి విస్తరించింది.
దళిత రాజకీయాలు-కాంగ్రెస్ శైలి
చిత్తశుద్ధి లేకుండా ప్రతీకాత్మకంగా దళిత రాజకీయాలు నడిపే కాంగ్రెస్ శైలిని ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయ రాజకీయాలు విఫలం కావడానికి కారణాలున్నాయి. రాజకీయ పరపతి కోసం కులగణన, ప్రాతినిధ్యాలను కాంగ్రెస్ సమర్థించవచ్చు కానీ దాని పద్ధతులు అందుకు భిన్నమైన వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. మొన్నటి వరకు రాజస్థాన్లో, ఛత్తీస్ గడ్ లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పార్టీయే అధికారంలో ఉంది. రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్యదర్శులను ప్రభుత్వంలో చేర్చడాన్ని గురించి చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్లో ఒక్క కార్యదర్శి కూడా ఈ వర్గాల నుంచి రాలేదు. దళితుల చైతన్యంలో వచ్చిన మార్పును రాజకీయ నాయకత్వం గ్రహించాలి. రాజకీయం ఇకపై ఫోటోల కోసం సహపంక్తి భోజనాలు చేయడం కాదు. ఇవి గౌరవం, గుర్తింపు గురించి ఉండాలి.
మహారాష్ట్రలో మహా వికాస్ అగాడి (ఎంవిఎ) నుంచి ప్రకాష్ అంబేద్కర్ నిష్క్రమణ ఈ మార్పునకు సూచన. అంబేద్కర్ మనవడు కూడా ఆయన ఆలోచనలు వికసించిన రాష్ట్రంలో తనకు అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు చేయడం మన రాజకీయ వ్యవస్థ స్థితిని వెల్లడిస్తోంది. సామాజిక న్యాయ ఉద్యమాలలో తమ మూలాలు ఉన్న పార్టీలు అట్టడుగు వర్గాలకు కాక కొన్ని ప్రత్యేక కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటి ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఇప్పుడు సామాజిక న్యాయం అనేది వ్యక్తిగత ప్రయోజనాల నెరవేర్చుకునేందుకు ఒక సాధనంగా మారింది.
నెహ్రూ కాలంలో మాదిరిగానే ఎస్సీ వర్గాలకు చెందిన డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా రిజర్వ్డ్ నియోజకవర్గాలను కూడా భూస్వామ్య వర్గాల ఇలాకాలుగా మార్చే ధోరణిని ప్రముఖ మేధావులు గమనించారు. ఈ పద్ధతిని అంబేద్కర్ ఖండించారు. ఆ యుగానికి కాలం చెల్లిందని కాంగ్రెస్, రాజకీయ వర్గాలు గుర్తించాలి. దళితులు ఇప్పుడు పార్లమెంటులోనే కాకుండా మీడియా, విశ్వవిద్యాలయాలు, మేథోమథన సంస్థలు, న్యాయవ్యవస్థ, పారిశ్రామికరంగంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ అంబేద్కర్ వారసత్వానికి ఇదే నిజమైన నివాళి.
– గురు ప్రకాష్, బిజెపి అధికార ప్రతినిధి