అట్టహాసంగా వారణాసిలో మోదీ నామినేషన్
వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 14న నామినేషను దాఖలు చేశారు. పలువురు ఎన్డీయే నేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రధానికి సంఘీభావం తెలిపారు. ఉదయాన్నే గంగాతీరంలోని దశాశ్వమేధ్ ఘాట్‌లో హారతి కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అనంతరం కాలభైరవ ఆలయంలో పూజలు ముగించుకొని జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. గంగా సప్తమి, పుష్యనక్షత్రం కలగలిసిన శుభ ముహూర్తంలో వారణాసి నుంచి ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ తన నామినేషను దాఖలు చేశారు. 2019లో మోదీ నామినేషన్‌ను నలుగురు భిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రతిపాదించగా.. ఈసారి కూడా భిన్న సామాజికవర్గాలకు చెందిన నలుగురు సామాన్యులు మోదీ పేరును ప్రతిపాదించడం విశేషం. ప్రముఖ జోతిష్యుడు, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిత్ గణేశ్వర్ శాస్త్రి, వారణాసి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సేవాపురికి చెందిన ఓబీసీ వర్గీయుడు, సుదీర్ఘకాలంగా జన్‌సంఘ్, బిజెపితో కలిసి పనిచేస్తున్న బైజ్‌నాథ్ పటేల్, సుదీర్ఘకాలంగా బిజెపి కార్యకర్తగా ఉన్న సిగ్రా ప్రాంతవాసి లాల్‌చంద్ కుశ్వాహా, వారణాసి జిల్లా బిజెపి అధ్యక్షుడు, దళిత సామాజికవర్గానికి చెందిన సంజయ్ సోంకర్ మోదీ నామినేషన్ ను ప్రతిపాదించారు. ప్రధాని వెంట ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
మోదీ తన ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో క్లుప్తంగా వివరించారు. మొత్తం చరాస్తుల విలువ రూ.3.02 కోట్లకు పైగా ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ఎక్కువ భాగం (రూ.2.85 కోట్లు) ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇవికాక ప్రస్తుతం తన వద్ద రూ.52,920 నగదు, రూ.2.67 లక్షల విలువ చేసే నాలుగు బంగారు ఉంగరాలు (45 గ్రాములు) ఉన్నట్లు పేర్కొన్నారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో ప్రధాని రూ.9.12 లక్షల పెట్టుబడి పెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.3 లక్షల ఆదాయపన్ను మినహాయింపు పొందినట్లు తెలిపారు. స్థిరాస్తులు ఏమీ లేవన్నారు. మోదీ జీవిత భాగస్వామి పేరును జశోదాబెన్‌గా పేర్కొన్నారు. ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నందున ఆమె పేరిట ఉన్న ఆస్తుల విలువ ‘తెలియదు’ అని పేర్కొన్నారు. ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగులో లేవన్నారు. తనను అహ్మదాబాద్ వాసిగా పేర్కొన్న మోదీ.. 1967లో ఎస్‌ఎస్‌సీ, 1978లో దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ.. 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేసినట్లు అఫిడవిట్‌లో వివరించారు.
2014 లోక్‌సభ ఎన్నికల అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ రూ.1.65 కోట్లుగా వెల్లడించిన మోదీ 2019 నాటికి రూ.2.5 కోట్లుగా చూపించారు.
నామినేషను కార్యక్రమంపై ‘ఎక్స్’ వేదికగా ప్రధాని తన స్పందన తెలియజేస్తూ.. ‘‘ఈ చారిత్రక నగర ప్రజలకు సేవ చేయడం ఓ గౌరవం. ఎన్డీయే కూటమి నేతలు హాజరుకావడం నన్నెంతో సంతోషపరచింది’’ అని తెలిపారు. దీంతోపాటు మోదీ షేర్ చేసిన వీడియోలో వారణాసితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘2014లో నేను కాశీకి వచ్చినప్పుడు ఆ గంగమ్మే నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించింది. ఈ పదేళ్ల కాలం తర్వాత గంగమ్మ నన్ను దత్తత తీసుకొందని చెప్పగలను’’ అని భావోద్వేగపూరితంగా వెల్లడించారు. బిజెపి అధ్యక్షుడు జె.పి.నడ్డా.. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితర కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, ఎన్టీయే కూటమి నేతలు నామినేషను కార్యక్రమానికి తరలివచ్చి ప్రధానిని అభినందించారు.

