rajnath Singh 00

విపక్షాల వదంతులే ‘రాజ్యాంగ సవరణ’ భయాలకు కారణం

rajnath singhప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న అసత్యాలు, వ్యాప్తి చేస్తున్న వదంతులే ‘రాజ్యాంగ సవరణ’ భయాలకు కారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. బిజెపి ముస్లింలకో మరే వర్గానికో వ్యతిరేకం కానేకాదని స్పష్టం చేశారు. కుల, మతాల భేదం లేకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందరికీ ఉపయోగపడతాయన్నారు. ప్రధానమంత్రి వ్యాఖ్యలకు విపరీతార్థాలు తీసి ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు. ప్రజల్లో భయాన్ని సృష్టించి ఓటు బ్యాంకును ఉపయోగించుకోడానికే ప్రతిపక్షాలు ప్రజలను హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు మొదలైన వర్గాలుగా విభజించాలని భావిస్తున్నాయన్నారు. ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎన్డీయే విజయావకాశాలు, గత పదేళ్లలో నరేంద్ర మోదీ సాధించిన విజయాలు, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు తదితర అంశాలపై మాట్లాడారు.

ప్ర: 2024 ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశాలేమిటి?

జ: గత పదేళ్లలో ప్రభుత్వ పనితీరుపై నేను ఎక్కువగా మాట్లాడతాను. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి, అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి అధిరోహించిన కొత్త శిఖరాల గురించి మాట్లాడతాను. మా ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాలు గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. క్షేత్ర స్థాయిలో ప్రజలకు కూడా ఈ వాస్తవాల గురించి తెలుసు. అంతర్జాతీయంగా ఇనుమడించిన భారత్ ప్రతిష్ఠ గురించి ప్రజలు గర్వపడుతున్నారు.

ఇండీ కూటమిపై ప్రజలకు నమ్మకం పోయినట్లు కనిపిస్తోంది. ఓటర్లలో గందరగోళం సృష్టించే ప్రతికూల అంశాలను మాత్రమే వారు లేవనెత్తుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం గురించి వారు మాట్లాడుతున్నారు. కానీ స్వతంత్ర భారత చరిత్రను పరిశీలిస్తే కాంగ్రెస్ హయాంలోనే అత్యధికంగా 85 రాజ్యాంగ సవరణలు జరిగాయి. వారు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీని ప్రకటించారు. రాజ్యాంగ సభ రాజ్యాంగ పీఠికను నెలల తరబడి చర్చించింది. ఇది రాజ్యాంగం ఆత్మ, కానీ వారు దానిని కూడా మార్చారు. ఇంత ఘోర తప్పిదం చేసి ఇప్పుడు మమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారా? మేం ఏం చేశాం? మేం ప్రజాస్వామ్యాన్ని అణచివేసినట్లు వారు చెబుతున్నారు, అది వారు చేసారు. మమ్మల్ని జైలులో పెట్టారు – నేను 18 నెలలు జైలులో ఉన్నాను, అందులో రెండు నెలలకు పైగా ఏకాంత నిర్బంధంలో ఉన్నాను. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు పెరోల్ ఇవ్వలేదు.

ప్ర: కానీ ముఖ్యంగా దళితులు, మైనారిటీలలో ఆందోళన స్వరాలు వినిపిస్తున్నాయి. 400కి పైగా సీట్లతో బిజెపి ఏం చేస్తుందా అని….

జ: వారు (కాంగ్రెస్) ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పుకార్లు, అసత్యాలు వ్యాప్తి చేయడమే దీనికి కారణం. 60 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారు. వారు చేపట్టిన సామాజిక-ఆర్థిక సాధికారత కార్యక్రమం ఒకటి చెప్పండి… కొన్ని ఉండవచ్చు, కానీ ఇవి సరిపోవు. మా రికార్డు చూడండి. 10 సంవత్సరాలలో, మేం 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తుల్ని చేశాం.

ప్ర: కానీ, రాజ్యాంగాన్ని మేం ముట్టుకోబోం అని చెప్పే నాయకులు బిజెపిలో ఉన్నారు. అనంత‌కుమార్ హెగ్డే, జ్యోతి మిర్ధా, ల‌ల్లూ సింగ్ వంటి కొంత మంది పార్టీ నేత‌లు రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని చెప్పడం వల్ల ఇప్పుడు వీరిలా అంటున్నారా?

జ: అయితే ఇది (రాజ్యాంగాన్ని మార్చడం)…(కాంగ్రెస్) ఇప్పటికే చేసింది. కాంగ్రెస్ ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు ఉండవచ్చు కానీ పీఠికలో కాదు. మీరు ప్రజల గొంతు నొక్కి, వారి ప్రాథమిక హక్కులను నిలిపివేస్తారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు.

ప్ర: మీరు వీటిని పుకార్లు అంటున్నారు. ఇవి మీ విజయావకాశాలను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారా?

జ: లేదు, మాకు అలాంటి భయాలు లేవు. ప్రజలకు చాలా అవగాహన ఉందని నేను నమ్ముతున్నా. భారతీయులు గత 75 సంవత్సరాలుగా తమ ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. వారు తప్పుడు వార్తల వలలో పడరు. వారిని తప్పుదారి పట్టించలేం. వారు (ప్రతిపక్షాలు) ఎలాంటి అబద్ధాలు ప్రచారం చేసినా వాటిని ఎదుర్కోడానికి ప్రయత్నిస్తున్నాం. మీరు ఎన్నికల్లో పోరాడాలనుకుంటే, సమస్యలపై పోరాడండి. ప్రజలను తప్పుదోవ పట్టించడం లేదా వారిని మోసం చేయడం రాజకీయాల్లో ఆమోదయోగ్యం కాదు.

ప్ర: సూరత్, ఇండోర్ లలో బిజెపి సునాయాసంగా గెలుస్తుందని అంటారు. కానీ అక్కడ పార్టీ కావాలనే పోటీ లేకుండా చేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది…?

జ: మేమేం చేశాం? భారతదేశంలో కనీసం 28 సార్లు పోటీలేని ఎన్నికలు జరిగాయి. ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో 20 మంది కాంగ్రెస్ వాళ్ళే.

ప్ర: మహిళా సాధికారత, నారీశక్తిని బిజెపి నొక్కి చెబుతోంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడికి, మిత్రపక్షం జెడిఏ (ఎస్) ప్రజ్వల్ రేవణ్ణకు టికెట్ ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటుంది? ఇటీవల పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి?

జ: ప్రజ్వల్ రేవణ్ణ జేడీ(ఎస్) నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు. ఎలా వెళ్ళాడు? అతనికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? బ్రిజ్ భూషణ్ సింగ్ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. తప్పు జరిగిందని కచ్చితంగా చెప్పలేం. ఇది ఇంకా రుజువు కాలేదు.

ప్ర: ఈ ఎన్నికల ప్రచారంలో ముస్లిం వ్యతిరేక ప్రకటనలపై మీ అభిప్రాయం ఏమిటి?

జ: బిజెపిని మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వం అని మీరు అనలేరు. మా పథకాల అమలులో కులం, మతం లేదా వర్గం ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపుతున్నామా? ఈ పథకాల నుంచి ఎవరైనా లబ్ధి పొందవచ్చు.

ప్ర: కొన్ని నిర్దిష్ట వర్గాలకు వ్యతిరేకంగా ప్రకటనల గురించి ఏం చెబుతారు?

జ: అవి కేవలం వివరణలు మాత్రమే. మా రాజకీయ ప్రత్యర్థులు గందరగోళాన్ని సృష్టించినప్పుడు ప్రజల్లో అపోహలను తొలగించేందుకు మేం ఇచ్చే వివరణలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మైనారిటీల విషయానికొస్తే, వారిని భయాందోళనలకు గురి చేయడం మా విధానం కాదు. వారి మద్దతును పొందేందుకు మేం వారిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలనుకుంటున్నాం. ఎన్నికల ప్రయోజనాల కోసం మైనారిటీల్లో భయాందోళనలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పౌరసత్వ (సవరణ) చట్టాన్నే తీసుకోండి. ప్రతిపక్షాలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాయి. రాజకీయాల్లో వారి మద్దతు పొందడానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందా? ప్రజలకు అబద్ధాలు చెప్పడం నేరం. మాకు ప్రపంచం మొత్తం ఒక కుటుంబమే. కానీ ప్రతిపక్షాలు ప్రజలను హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు మొదలైన వర్గాలుగా విభజించాలని అనుకుంటున్నాయి. ఇది కేవలం భయాన్ని సృష్టించి ఓటు బ్యాంకును ఉపయోగించుకోడానికే. కానీ ఆ వర్గాలలో కూడా అవగాహన ఉందని నేను విశ్వసిస్తున్నాను. దేశంలో మైనారిటీలు రెండవ శ్రేణి పౌరులు కాదు. మేం వారిని ఇతరులతో సమానంగా చూస్తాం. మెజారిటీ అయినా, మైనారిటీ అయినా అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. సమాజంలో అణగారిన, సామాజిక ఆర్థికంగా వెనుకబడిన వారిని ఉద్ధరించడమే మా లక్ష్యం.

ప్ర: తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలను ఉద్దేశించి ‘ఎక్కువ సంతానం ఉన్నవారు,’ ‘అక్రమ వలసదారులు’ వంటి పదాలను ఉపయోగించారు. ప్రత్యర్థి పార్టీలు మంగళసూత్రాలు తీసేసుకుని ముస్లింలకు ఇస్తారు అని కూడా అన్నారు.

జ: అక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సామ్ పిట్రోడా వారసత్వ పన్ను గురించి మాట్లాడారు. మీరే చెప్పండి, ఇది ఆర్థిక మాంద్యానికి దారితీయదా? ఇటువంటి ప్రకటనలు సంపద సృష్టించకుండా ప్రజలను నిరుత్సాహపరుస్తాయి. వారసత్వ పన్ను వంటి పన్ను విధానాల వల్ల నష్టపోయిన వెనిజులా వంటి దేశాలు ఉన్నాయి. మంగళ సూత్రం పదానికి లేనిపోని అర్థాలు వెతకవద్దు. ఆయన ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. బంగారాన్ని గురించి చెప్పేటప్పుడు ఇది అందరికీ అర్థమయ్యే పదం. రాహుల్ గాంధీ సంపద సర్వే గురించి మాట్లాడుతున్నారు… ఆయన ఎందుకు సర్వే చేయాలనుకుంటున్నారు?

ప్ర: ప్రచారంలో ఉపయోగించిన భాష గురించి ఏమిటి?

జ: కొన్నిసార్లు ప్రజలు నిర్దిష్ట సమస్యను లేదా ప్రతిపక్షాల ప్రకటనల వెనుక ఉన్న వాస్తవికతను అర్థం చేసుకోవడానికి మేం కొన్ని పదబంధాలను ఉపయోగించవచ్చు. సూటిగా చెబితే వాళ్లకు విషయాలు అర్థం కాదు. ప్రతిపక్షాలు ‘ఎక్స్‌రే’ చేయడం లేదా ఆర్థిక సర్వేలు చేయడం గురించి మాట్లాడినప్పుడు, మేం ప్రజలకు పరిస్థితిని వివరించాలి. ఇవి సాధారణ ప్రజలు అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన అంశాలు.

ప్ర: గత 10 ఏళ్లుగా సంకీర్ణాలను నిర్మించే విషయంలో బిజెపి విధానం మారిందా? పార్టీలు విడిపోయి బిజెపిలో చేరడం చూశాం, మీరు నైతిక రాజకీయాల గురించి తరచుగా మాట్లాడుతున్నారు…

జ: అనైతికంగా మేం ఏం చేశాం? రాజకీయ పార్టీలు చీలిపోతే అందుకు మమ్మల్ని ఎందుకు నిందించాలి? పార్టీని విచ్ఛిన్నం చేసే వారిని అడగాల్సిన ప్రశ్నలు ఇవి.

ప్ర: రాజకీయ నాయకులను ప్రలోభపెట్టి బిజెపి ఫిరాయింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి?

జ: ఇలాంటి ఆరోపణలకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీరు అబద్ధాలు చెప్పి ప్రజలను మీ పార్టీలోకి రప్పించలేరు. పార్టీలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి? మీ ఆలోచనలో, పనితీరులో, భావజాలంలో లోపాలు ఉన్నాయి… పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. (ప్రతిపక్షం) బలహీనతలకు మమ్మల్ని నిందించలేరు. బిజెపి మారలేదు, బిజెపి ఎలా ఉందో అలాగే ఉంటుంది.

ప్ర: అయితే ఈడీ, సీబీఐ, ఆదాయం పన్ను శాఖ వంటి దర్యాప్తు సంస్థలను మీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపై ప్రయోగించడం వాస్తవం కాదా?

ప్ర: ఈ సంస్థలను మా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. గతంలో ప్రభుత్వం వాటిని పని చేయనివ్వలేదు. వారికి ఉన్న స్వయంప్రతిపత్తిని వారు ఎన్నడూ అనుభవించలేదు. వారికి మేం స్వయంప్రతిపత్తి కల్పించాం. యూపీఏ, ఎన్డీయే హయాంలో జప్తు చేసిన ఆస్తుల విలువను ఒక్కసారి చూడండి. యుపిఎ హయాంలో ఈడి జప్తు చేసిన చేసిన ఆస్తుల విలువ కేవలం రూ.5,086 కోట్లు; ఎన్డీయే హయాంలో రూ.1.2 లక్షల కోట్లు. మేం దేశానికి నష్టం చేస్తున్నామా లేక మేలు చేస్తున్నామా?

ప్ర: కానీ రాజకీయ కేసుల్లో చాలా వరకు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటున్నాయి?

జ: అక్రమాలకు పాల్పడిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ఒక వేళ మేం తప్పు చేశామని భావిస్తే మీరు కోర్టులకు ఎందుకు వెళ్లరు? కోర్టులు మీకు ఎందుకు ఉపశమనం ఇవ్వడం లేదు?

ప్ర: అదే ప్రతిపక్ష నాయకులు బిజెపిలో చేరినప్పుడు వారిపై కేసులు కొట్టేయడమో లేదా నీరుగార్చడమో జరుగుతోంది. ఈడీ మౌనంగా ఉంటుంది.

జ: ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవారే తమ నేతలపై ఈడీ తప్పుగా చర్యలు తీసుకుందని అన్నారు. వారే స్వయంగా చెప్పారు… వారందరినీ తప్పించారన్నది నిజం కాదు. ప్రభుత్వ సంస్థలు తమ పనిని కొనసాగిస్తాయి.

ప్ర: మీరు హోం మంత్రిగా, రక్షణ మంత్రిగా ఉన్నారు… బిజెపి మూడోసారి గెలిస్తే మీరు ఎలాంటి పాత్రను ఆశిస్తున్నారు?

జ: మూడోసారి గెలిస్తే నేను ఏ పని చేయాలో నిర్ణయించేది పార్టీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి. ‘రాజ్‌నాథ్ సింగ్, నువ్వు గడ్డి కోయాలి’ అని వారు చెబితే నేను ఆ పని చేస్తాను. నీళ్లు తీసుకెళ్లమని చెబితే చేస్తాను. ఈ వయసులో సరిహద్దులకు వెళ్ళి అక్కడ ఉండు, అంటే వెళతాను.

ప్ర: దేశవ్యాప్తంగా చాలా చోట్ల అగ్నివీర్ పథకం అమలుపై ఆందోళనలు జరిగాయి. ప్రధానంగా దాని తక్కువ వ్యవధి గురించి వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని సరిదిద్దే ప్రణాళికలు ఉన్నాయా?

జ: ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫలితాలు రావడం మొదలయ్యాక ప్రజలకు అర్థమవుతుంది. 18-19 సంవత్సరాల వయస్సులో వారు దళాలలో చేరతారు. వారు నాలుగు సంవత్సరాలు పని చేస్తారు, వారి చేతిలో ఏకమొత్తం (రూ.11 లక్షలకు పైగా) ఉంటుంది. వారికి ఇంటర్మీడియట్ కోర్సులు, నైపుణ్యాలకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉంటాయి. వారికి పారామిలటరీ బలగాలలో, ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల్లో ఉద్యోగాలకు రిజర్వేషన్లు ఉంటాయి. ప్రైవేటు పరిశ్రమలు కూడా వీరికి ఉపాధి కల్పించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. మా ప్రభుత్వం ఎవరి జీవితాలను సంక్షోభంలోకి నెట్టదని నేను హామీ ఇస్తున్నాను. భవిష్యత్తులో చేయాల్సిన పని ఏదైనా ఉంటే అది కూడా చేస్తాం. కానీ మా ప్రభుత్వం మన దేశంలోని ఏ యువకుడి జీవితంతో ఆడుకోదు. మన సమాజంలో అణగారిన వర్గాల గురించి ఆలోచిస్తున్నప్పుడు, మన సరిహద్దులను రక్షించే జవాన్ల గురించి మేం ఆలోచించమా?

ప్ర: లోక్‌సభలో మీకు 303 స్థానాలతో మెజారిటీ ఉంది. మీరు గత 10 సంవత్సరాలలో అనేక విధానాలు, చట్టాలలో మార్పులు తీసుకువచ్చారు. ఇప్పుడు ఎన్డీయే 400కు పైగా సీట్లను లక్ష్యంగా చేసుకుంది. అంత మెజారిటీతో ఏం చేస్తారు?

జ: అది మా అంచనా. మా సామర్థ్యం, పనితీరు ఆధారంగా మేం మా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం. ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన విశ్వాసాన్ని మదింపు చేసుకున్న తర్వాత, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు 400 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని మేం నమ్ముతున్నాం. ఆ సంఖ్యతో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా లేదా వికసిత్ భారత్‌గా మారుస్తాము.

అభినవ్