తెలంగాణలో కాంగ్రెస్ సీట్లు తగ్గడంపై సోనియా, ఖర్గే అసహనం!
కేవలం 6 నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పుకోదగిన సీట్లు గెలవలేక పోవడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పైగా, కాంగ్రెస్ తో సమానంగా బిజెపి ఎంపీ సీట్లు గెల్చుకోవడం పట్ల ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పార్లమెంటరీ కమిటీ సమావేశాల సందర్భంగా ఈ విషయమై ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నిలదీసినట్లు సమాచారం.
తెలంగాణలోని 17 సీట్లలో కాంగ్రెస్, బిజెపి చెరీ 8 సీట్లు గెల్చుకోగా, ఏఐఎంఐఎం ఒక సీటు గెల్చుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెల్చుకోలేక పోయింది. పైగా, రెండు సీట్లలో మినహా మూడో స్థానంలోకి పడిపోయింది. లోక్ సభ ఎన్నికలు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండమని, 14 సీట్లు తప్పకుండా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకే కాంగ్రెస్ దాదాపుగా పరిమితమయింది. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ పరిధిలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ గణనీయంగా తగ్గింది.
తెలంగాణ ఫలితాలు నిరాశ కలిగించాయని సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ అన్నట్టు సమాచారం. 12 సీట్లు ఆశిస్తే, అంత తక్కువ ఎందుకొచ్చాయని ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రేవంత్ రెడ్డి జరిపిన భేటీలలో ఈ అంశమే ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో ఎంపీ ఫలితాలు, పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై వీరికి రేవంత్ వివరణ ఇచ్చుకోవలసి వచ్చినట్టు తెలిసింది. ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై ఆరా తీసిన సోనియా గాంధీ ముఖ్యంగా ఎంపీ ఫలితాలపై అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రభుత్వంలో ఉంటూ బిజెపితో సమానంగా సీట్లు రావడం ఏమిటి? అని ప్రశ్నించారని తెలిసింది. ఎక్కడ లోపం జరిగిందని, కారణం ఏమిటని అడిగినట్టు సమాచారం. ఉత్తరాదిలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తే, ఎంతో నమ్మకం పెట్టుకున్న తెలంగాణ, కర్ణాటకల్లో మాత్రం పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తున్నది. మరోవైపు, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో కొనసాగలేదు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు ఈ రాష్ట్రాల్లో ఫలితాలు రాలేదు’’ అంటూ ఆయన పేర్కొనడం రేవంత్ రెడ్డి పనితీరును ప్రశ్నించినట్లుగా పలువురు భావిస్తున్నారు.
ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహించి, తక్షణమే వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని ఖర్గే తేల్చి చెప్పారు. ఇదే సమయంలో నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించినా వెంటనే చర్చించేందుకు సోనియా సానుకూలత చూపలేదు. మరోసారి చర్చిద్దామని వాయిదా వేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించలేక పోయారు. అక్కడి నుండి గట్టిపోటీ ఇచ్చిన బిజెపి అభ్యర్థి డి.కె. అరుణ గెలుపొందారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం మల్కాజ్ గిరిలోనూ కాంగ్రెస్ ఓటమి చెంది బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందారు. కేవలం 8 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెల్చుకున్న బిజెపి ఏకంగా 8 లోక్ సభ స్థానాలను గెల్చుకోవడం, గత ఎన్నికలలో గెల్చుకున్న 4 స్థానాలను రెట్టింపు చేసుకోవడం గమనిస్తే తెలంగాణలో ఆ పార్టీ బీఆర్ఎస్ ను త్రోసివేసి రాబోయే రోజులలో కాంగ్రెస్ ను సవాల్ చేసే స్థితికి ఎదగబోతున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లయింది. అందుకే ఈ ఫలితాలు కాంగ్రెస్ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
కృష్ణ చైతన్య

