Modi Odisha CM

ఒడిశాలో కొలువుదీరిన బిజెపి ప్రభుత్వం

Odisha Swearing డిశాలో తొలిసారి బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్‌ చరణ మాఝి జూన్ 12న భువనేశ్వర్‌ జనతా మైదానంలో.. ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా కనకవర్ధన్‌ సింగ్, ప్రభాతి పరిడ, 8 మంది క్యాబినెట్‌ మంత్రులుగా, ఐదుగురు స్వతంత్ర హోదా గల మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 చోట్ల గెలిచిన బిజెపి.. రెండున్నర దశాబ్దాలుగా ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌ను ఓడించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాఝీని ప్రకటించింది. ఒడిశాలో తొలిసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడటంతో ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తరలివచ్చారు. పాతికేళ్లుగా ఒడిశాను పాలించిన నవీన్‌ పట్నాయక్‌ను సీఎం మాఝి వ్యక్తిగతంగా కలిసి, ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్‌ గమాంగ్‌.. గిరిజనుల నుంచి ఒడిశాకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. తాజాగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన మోహన్‌ చరణ్‌ మాఝి (52) ప్రముఖ గిరిజన నేత. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. మాఝి విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌కు దగ్గరయ్యారు. డిగ్రీ పూర్తయిన తర్వాత సరస్వతీ విద్యామందిర్‌లో ఉపాధ్యాయుడిగానూ, తర్వాత న్యాయవాదిగానూ పనిచేశారు. సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కేంఝర్‌ అసెంబ్లీ స్థానం నుంచి 2000, 2009, 2019, 2024ల్లో  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ హయాంలో శాసనసభలో బిజెపి సభా పక్ష కార్యదర్శిగా, చీఫ్‌ విప్‌గా వ్యవహరించారు.

అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణం

Arunachal Pradesh Sweartinఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్​లో బిజెపి సర్కార్ మరోసారి ఏర్పాటైంది. జూన్ 13న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్​ ఖండూ చేత ప్రమాణం చేయించారు. రాజధాని ఈటానగర్​లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్ జరిగినఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 46 స్థానాల్లో గెలుపొందింది. నేనషల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీఈపీ) ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్​సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బిజెపి ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు.