అక్రమ వలసలపై బిజెపి ‘3డి’ విధానం

Amit Shah ఏడాది అక్టోబర్ లో దిల్లీలో నరేంద్ర మోహన్ స్మృతి ఉపన్యాసం, సాహిత్ సృష్టి సమ్మాన్ కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ”చొరబాటు, జనాభా మార్పు, ప్రజాస్వామ్యం’ అనే అంశంపై చేసిన ప్రసంగంలో అక్రమ చొరబాట్లు, వాటి ఫలితంగా వస్తున్న జనాభా మార్పులు, భారత ప్రజాస్వామ్యం, జాతీయ భద్రతకు పొంచి ఉన్న ముప్పు గురించి వివరించారు. అక్రమ చొరబాటుదారులతో వ్యవహరించడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న త్రిముఖ వ్యూహం – ‘గుర్తించు, తొలగించు, బహిష్కరించు’ (డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్) విధానాన్ని ఆయన పునరుద్ఘాటించారు. స్వాతంత్య్రం అనంతర జనగణన (1951-2011) లెక్కల ఆధారంగా భారతదేశ మతపరమైన జనాభాలో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో వస్తున్న మార్పులకు సంతానోత్పత్తి రేట్లు మాత్రమే కారణం కాదని, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి జరుగుతున్న అక్రమ వలసలే ప్రధాన కారణమని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

ఈ వేదికపై ఉన్న దైనిక్ జాగరణ్ ఎడిటర్-ఇన్-చీఫ్ సంజయ్ గుప్తా, విశిష్ట, నిష్ణాతులైన సాహితీవేత్త ప్రసూన్ జోషితో సహా ఇక్కడకు విచ్చేసిన ప్రముఖులందరికీ గౌరవపూర్వక నమస్కారాలు. దైనిక్ జాగరణ్ నిర్వహించిన ఈ నరేంద్ర మోహన్ స్మారక ఉపన్యాసంలో ప్రసంగించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నరేంద్ర మోహన్ గురించి చాలా చెప్పవచ్చు. ఆయనను వ్యక్తిగతంగా కలిసే అదృష్టం నాకు లేనప్పటికీ, ఆయన గురించి చాలా చదివాను, విన్నాను. దేశ ప్రజాస్వామ్యం అత్యంత కఠిన పరీక్షను ఎదుర్కొన్న కాలం ఎమర్జెన్సీ. పత్రికా స్వేచ్ఛకు అసలైన పరీక్ష ఎదురైన రోజు ఎమర్జెన్సీ విధించిన మరుసటి రోజు, అంటే 27న వార్తాపత్రికలు మార్కెట్‌లోకి వచ్చినప్పుడు నరేంద్ర మోహన్ నాయకత్వంలో దైనిక్ జాగరణ్ దృఢంగా, నిర్భయంగా నిలబడింది. ఈ పోరాటంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అది కేవలం ధిక్కార చర్య మాత్రమే కాదు; అది భారతీయ ప్రజాస్వామ్య ఆత్మ కోసం చేసిన పోరాటం. అందుకే, జీవితంలో అనేక పాత్రలు పోషించిన మహోన్నత వ్యక్తి అయిన నరేంద్ర మోహన్ స్మృతికి నేను హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. 

చొరబాట్లపై మౌనానికి స్థానం లేదు 

చొరబాట్లు, జనాభా మార్పు, ప్రజాస్వామ్యం – ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఈ అంశాలపై నా ఆలోచనలను పంచుకోవడానికి ఈ రోజు నన్ను ఆహ్వానించారు. ఈ మూడు అంశాలు లోతుగా ముడిపడి ఉన్నాయి. నేను చెప్పే విషయాలు అందరికీ నచ్చకపోవచ్చు. కానీ నిజం తెలిసినా నేను మౌనంగా ఉంటే, నా విధిని నేను నెరవేర్చడంలో విఫలమవుతాను. అలా జరగడానికి నేను ఒప్పుకోను.

5 శాతం తగ్గిన హిందూ జనాభా 

మన దేశంలో 1951, 1971, 1991, 2011లలో జనగణనలు జరిగాయి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఈ జనగణన నివేదికల వాస్తవ విశ్లేషణే తప్ప నా వ్యక్తిగత వ్యాఖ్యానం కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ జనగణనలో సంప్రదాయబద్ధంగా మతంపై ఒక ప్రశ్న ఉంది. 1951 నాటి ఆ నిర్ణయం వెనుక గల కారణం నాకు తెలియదు, కానీ అప్పుడు మా పార్టీ ఉనికిలో కూడా లేదు.

అధికారిక రికార్డుల ప్రకారం:

1951 జనగణనలో హిందువులు 84% ఉండగా, ముస్లింలు 9.8% ఉన్నారు.

1971 నాటికి హిందువుల వాటా 82%కి తగ్గగా, ముస్లింల వాటా 11%కి పెరిగింది.

1991లో హిందువులు 81%, ముస్లింలు 12.12%గా ఉన్నారు.

2011 నాటికి హిందువులు 79%కి తగ్గగా, ముస్లింలు 14.2%కి పెరిగారు.

నేను ఈ రెండు మత సమూహాలను మాత్రమే ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. నేను చొరబాట్ల గురించి మాట్లాడుతున్నాను. దీనికి మన దేశ చారిత్రక విభజనతో ఎలా సంబంధం ఉందో తర్వాత వివరిస్తాను. 1951, 2011 మధ్య, హిందువుల జనాభా శాతం దాదాపు 4.5% తగ్గగా, ముస్లిం జనాభా దాదాపు 24.6% పెరిగింది. ఈ మార్పును కేవలం సంతానోత్పత్తి రేట్ల ద్వారా మాత్రమే వివరించలేము; ఇది ఎక్కువగా సరిహద్దుల గుండా జరుగుతున్న చొరబాట్ల పర్యవసానమే.

బంగ్లాదేశ్‌లో తగ్గిన హిందూ జనాభా 

మతం ఆధారంగా భారతదేశం విభజన జరిగినప్పుడు, పాకిస్తాన్, తరువాత బంగ్లాదేశ్ అనే రెండు కొత్త దేశాలు ఏర్పడ్డాయి. మన సరిహద్దు ప్రాంతాలలో జనాభా మార్పులు ఈ ప్రాంతాల నుంచి అక్రమ వలసల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఒకప్పుడు అవిభక్త భారతదేశంలో భాగమైన ఆ పొరుగు దేశాలలో ఏం జరిగిందో కూడా చూద్దాం.

1951లో పాకిస్తాన్ జనాభాలో హిందువులు 13% ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 1.73%కి పడిపోయింది.

బంగ్లాదేశ్‌లో ఒకప్పుడు హిందువులు 22% ఉండేవారు, అది ఇప్పుడు 7.9% కి పడిపోయింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఒకప్పుడు దాదాపు 2,20,000 మంది హిందువులు, సిక్కులు ఉండేవారు, ఇప్పుడు కేవలం 150 మంది మాత్రమే మిగిలారు.

నేను ఈ సంఖ్యలను హిందూ-ముస్లిం పోలిక కోసం చెప్పడం లేదు, కానీ చొరబాటుదారులకు, శరణార్థులకు మధ్య ఉన్న కీలకమైన తేడాను వివరించడానికి చెబుతున్నాను. అక్కడ తగ్గిన సంఖ్యలోని హిందువులు మతం మారలేదు, చాలామంది పారిపోయి భారతదేశంలో ఆశ్రయం పొందారు. దీనికి విరుద్ధంగా ఇక్కడ ముస్లిం జనాభా పెరుగుదల కేవలం సహజ పెరుగుదల ఫలితం మాత్రమే కాదు; కాలక్రమేణా పెద్దసంఖ్యలో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన వారు దీనికి కారణం.

సీఏఏతో చారిత్రక అన్యాయం దిద్దుబాటు 

విభజన సమయంలో రెండు దేశాలలోనూ అన్ని మతాల ప్రజలు మత స్వేచ్ఛను అనుభవిస్తారని భావించారు. భారతదేశం ఆ హామీని నిలబెట్టుకుంది — మన రాజ్యాంగంలోని అధికారణాలు 19, 21 పౌరులందరికీ రక్షణకు హామీ ఇస్తున్నాయి. కానీ పాకిస్తాన్, ఆ తరువాత బంగ్లాదేశ్ తమను ఇస్లామిక్ రిపబ్లిక్‌లుగా ప్రకటించుకున్నాయి. ఇది విస్తృతమైన అణచివేతకు దారితీసింది. అనేకమంది హిందువులు రక్షణ కోసం భారత్ కు పారిపోయేలా చేసింది. ఆ సమయంలో భారతదేశ నాయకులు వారికి ‘పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది, వెంటనే రావద్దు. కానీ మీరు తిరిగి రావాలనుకున్నప్పుడు, భారతదేశంలో మీకు ఎప్పుడూ స్వాగతం లభిస్తుంది’ అని హామీ ఇచ్చారు. ఇది అప్పటి భారత ప్రధాని స్వయంగా సంతకం చేసిన నెహ్రూ-లియాఖత్ ఒప్పందంలో భాగం. చివరకు అలా వచ్చినవారిని శరణార్థులుగా పరిగణించారు. వారికి పౌరసత్వం ఇవ్వలేదు. కొంతమంది 1965లో, కొంతమంది 1971, 1981, 1991, చివరకు 2001లో వచ్చారు, ఇప్పుడు నాలుగు తరాలు గడిచాయి. అయినా వారు దేశంలేని వారుగానే మిగిలిపోయారు. ఎందుకు? భారతదేశం బలవంతంగా అంగీకరించాల్సి వచ్చిన విభజన రేఖ అవతలి నుంచి వచ్చారు కాబట్టి. అలా గూడు చెదిరిన వారు తిరిగి భారత్ కు వస్తే వారికి పౌరసత్వం కల్పిస్తాం అని 1951లో భారత్ హామీ ఇచ్చింది. కానీ దశాబ్దాలుగా లక్షల మంది చట్టబద్ధమైన పౌరసత్వ హక్కులు లేకుండా అనిశ్చితిలో ఉన్నారు. బిజెపికి సంపూర్ణ మెజారిటీ వచ్చి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి, ఆ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి మేము ‘పౌరసత్వ (సవరణ) చట్టం’ (సీఏఏ) తీసుకు వచ్చాం. అయినప్పటికీ, సీఏఏ ముస్లింల పౌరసత్వాన్ని లాక్కుంటుందని తప్పుదారి పట్టించే ప్రచారం విస్తృతంగా చేశారు. నేను పదేపదే స్పష్టంగా చెప్పినప్పటికీ మీడియా తరచుగా పట్టించుకోనప్పటికీ, నిజం చాలా సరళం: సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయదు. ఇది కేవలం హింస, అణచివేతలకు గురైన శరణార్థులకు పౌరసత్వాన్ని మంజూరు చేస్తుంది. ఈ చట్టంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు లేదా క్రైస్తవుల పౌరసత్వాన్ని హరించే ఒక్క నిబంధన కూడా లేదు.

సీఏఏ ఒక చారిత్రక దిద్దుబాటు, 1951 నుండి 2014 వరకు కొనసాగిన లోపాలను సరిదిద్దే నైతిక చర్య. మోదీ ప్రభుత్వం మొదట ఆ శరణార్థులకు దీర్ఘకాలిక వీసాలు, తరువాత నివాస ధృవపత్రాలు, చివరకు పూర్తి పౌరసత్వానికి మార్గాన్ని కల్పించింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి మోదీ జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు. తరతరాలుగా ఈ శరణార్థులు సొంత పేర్లతో ఇళ్లను కొనలేకపోయారు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోయారు, ప్రజా ఆరోగ్య సంరక్షణను పొందలేకపోయారు, రేషన్ ప్రయోజనాలు కూడా అందుకోలేకపోయారు. ఈ 2.5 లేదా 3 కోట్ల మంది ప్రజలు చేసిన పాపమేమిటి? వారికి ప్రతి భారతీయుడికి ఉన్న హక్కులు ఉండకూడదా? సీఏఏను ప్రవేశపెట్టినప్పుడు దానిని అపఖ్యాతిపాలు చేయడానికి రాజకీయ దురుద్దేశంతో ప్రచారం జరిగింది, అల్లర్లు కూడా జరిగాయి. అయినప్పటికీ, సీఏఏ అమలులో ఉంది. భారతదేశంలోని ప్రతి నిజమైన శరణార్థికి ఇప్పుడు పౌరసత్వం పొందే హక్కు ఉంది.

చొరబాటుదారుడికి, శరణార్థికి తేడా 

1951 నుంచి వారికి నిరాకరించినదాన్ని ఇప్పుడు కల్పించాం. ఇప్పుడు కొందరు అడుగుతున్నారు: చొరబాటుదారుడికి, శరణార్థికి తేడా ఏమిటి? నేను ఈ రోజు దానిని స్పష్టం చేయాలనుకుంటున్నాను. తన మతాన్ని కాపాడుకోవడానికి, మన రాజ్యాంగంలోని అధికారణాలు 19, 21 హామీ ఇచ్చిన హక్కును వినియోగించుకోవడానికి భారతదేశానికి వచ్చి, తన మతాన్ని రక్షించుకోవడానికి ఇక్కడ ఆశ్రయం కోరే వ్యక్తి శరణార్థి. మతం కాపాడుకోవడానికి పారిపోయి వచ్చినవారు హిందువులు మాత్రమే కాదు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అటువంటి సమూహాలందరికీ పౌరసత్వం ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది.

మరి చొరబాటుదారులు ఎవరు? మతపరమైన హింసను ఎదుర్కోకుండా, ఆర్థిక కారణాల వల్ల లేదా ఇతర ఉద్దేశాలతో అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించే వ్యక్తులు. ఇక్కడికి రావాలనుకునే ప్రతి ఒక్కరినీ ఇష్టానుసారం అనుమతిస్తే, మన దేశం అందరికీ ఒక ధర్మశాల అవుతుంది. దేశం ఇలా నడవదు. ఎవరికిపడితే వారికి మన దేశంలో స్వేచ్ఛగా ప్రవేశించే హక్కు లేదు. విభజన సందర్భంలో అన్యాయాలకు గురైన వారు, న్యాయం దక్కని వారికి ఇక్కడ స్వాగతం లభిస్తుంది. ఒక వ్యక్తి కేవలం ఆర్థిక కారణాలతో లేదా హింసకు సంబంధం లేని ఇతర కారణాల వల్లో వస్తే, భారతదేశం వారిని ఎలా అంగీకరించగలదు? అందువల్ల శరణార్థులను, చొరబాటుదారులను ఒకే విధంగా చూడకూడదు. ఇక్కడ జీవించడానికి ఇష్టపడిన, మన చట్టాలను పాటించే ముస్లింలకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు; వారి పౌరసత్వం గురించి ఎటువంటి ప్రశ్నలూ లేవనెత్తరు.

అసోం, బెంగాల్‌లో చొరబాట్లు వాస్తవం

 కొన్ని ప్రాంతాల్లో ఏం జరిగిందో నేను మీకు చెబుతాను. అసోం 2011 జనగణన మా ప్రభుత్వంలో కాదు, కాంగ్రెస్ పాలనలో జరిగింది. భారతదేశంలోని ఉదారవాదులమని చెప్పుకొనే వారు, కాంగ్రెస్ మమ్మల్ని నిందించలేరు. ఆ జనగణనలో అసోంలోని మన ముస్లింలలో దశాబ్దపు జనాభా పెరుగుదల రేటు 29.6% ఉంది. ఏ విధమైన చొరబాటు లేకుండా ఆ సంఖ్య అసాధ్యం. పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాలలో ఈ పెరుగుదల రేటు 40% కూడా దాటింది. చొరబాట్లు ఒక అబద్ధం అని వాదించే వారిని నేను అడగాలనుకుంటున్నాను, మీరు దీనిని ఎలా సమర్థిస్తారు? కొన్ని సరిహద్దు జిల్లాల్లో పెరుగుదల రేటు 70% కి చేరుకుంది. ఇది చొరబాట్లు వాస్తవమని రుజువు చేస్తుంది.

చొరబాట్లకు రాజకీయ సమర్థన 

చొరబాట్లు, జనాభా మార్పు లేదా ఎస్ఐఆర్ (ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ) సమస్యను రాజకీయాలకు ముడిపెట్టవద్దని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఒక సమయం వస్తుంది, అప్పుడు మీకు కూడా ఈ సమస్య తప్పదు. ఇది రాజకీయ సమస్య కాదు; ఇది జాతీయ సమస్య. ఒకరు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినప్పుడు, జిల్లా అధికారులు వారిని గుర్తించడంలో విఫలమైతే దీనిని ఎవరు ఆపగలరు? మాకు గుజరాత్‌లో, రాజస్థాన్‌లో కూడా సరిహద్దులు ఉన్నాయి. అక్కడ ఎందుకు చొరబాటు జరగదు? సరిహద్దులు ఉన్నాయి, కంచెలు ఉన్నాయి, బీఎస్‌ఎఫ్ కూడా అదే. మరి తేడా ఏమిటి? తేడా ఉద్దేశంలో ఉంది. చొరబాటును రాజకీయంగా చూడకూడదు, దానికి రాజకీయ రక్షణ లభించకూడదు.

శరణార్థికి, చొరబాటుదారుడికి మధ్య తేడాను అర్థం చేసుకోలేని వారు ఆత్మవంచన చేసుకుంటున్నారు. 1970లలో ఇడి అమిన్ ఉగాండాను పాలించినప్పుడు, చాలా మంది భారతీయులు హింస నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎందుకు ఆశ్రయం ఇచ్చింది? వారు వేరే ఎక్కడికి వెళ్ళగలరు? భారతదేశం వారికి సహజమైన ఆశ్రయం. అందుకే వారు శరణార్థులు. అక్కడ రాజకీయ పరిస్థితులు మారాయి; వారు హింసకు గురయ్యారు. మేము వారికి ఆశ్రయం కల్పించాం. అదేవిధంగా తమ మతాన్ని, కుటుంబాలను, మహిళల గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చేవారికి ఆశ్రయం ఇవ్వడం మన నైతిక బాధ్యత. ఇది 1951లో భారత యూనియన్ చేసిన వాగ్దానం. అందువల్ల, చొరబాటుదారులను, శరణార్థులను వేరుగా చూడాలి. వారి పరిస్థితులను వేరుగా అంచనా వేయాలి. నేను ఇటీవల జార్ఖండ్‌ను సందర్శించినప్పుడు, గిరిజన జనాభాలో తీవ్రమైన తగ్గుదలను గమనించాను. ఎందుకు? బంగ్లాదేశ్ నుండి చొరబాట్ల కారణంగా.

ఓటర్ల జాబితా సవరణ ఈసీ రాజ్యాంగబద్ధ విధి

ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) నిర్వహించినప్పుడు, కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. వాస్తవాలను గ్రహించేందుకు నిరాకరించింది. వారికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్పేది అబద్ధం; వారు ఊహించిన అబద్ధాలు మాత్రమే నిజం. ఎస్ఐఆర్ మొదటిసారి జరగడం లేదు, ఇది 1951 నుంచి జరుగుతోంది. రాజకీయ ప్రక్రియను శుభ్రంగా ఉంచడం ఎన్నికల సంఘం రాజ్యాంగ బాధ్యత. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూసే బాధ్యతను మన రాజ్యాంగం ఎన్నికల సంఘానికి అప్పగించింది. ఓటరు జాబితాలు ఓటరు నిజమైన నిర్వచనాన్ని ప్రతిబింబించినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఓటరు మొదటి అర్హతను స్పష్టంగా నిర్వచించింది. ఆ వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి. మీరు దానిని మార్చాలనుకుంటే, భారతదేశంలో ఎవరైనా ఓటు వేయవచ్చని పార్లమెంటులో ఒక ప్రతిపాదన తీసుకురండి. రెండవ అర్హత వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు ఒకరికి 18 ఏళ్లు వచ్చాయా లేదా అని ధృవీకరించడానికి లేదా ఒకరు భారతీయ పౌరుడా కాదా అని ధృవీకరించడానికి మీరు వారిని అడగాలి. అదే ఎస్ఐఆర్ చేస్తుంది. వారికి ఇది తెలుసు. అయినా వారు దానిని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే తొలగింపులు వారి ఓటు బ్యాంకులను ప్రభావితం చేస్తాయి. అనేక ప్రాంతాలలో 30%, 20%, 15%, చివరకు 11% చొరబాటుదారులను గుర్తించారు. ఎస్ఐఆర్ లేదా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రెండు విషయాలను ధృవీకరించాలి. ఆ వ్యక్తికి 18 ఏళ్ళ వయసు ఉందా, అతను భారతీయ పౌరుడా అని. ఇది కేవలం కమిషన్ హక్కు మాత్రమే కాదు; ఇది దాని రాజ్యాంగ విధి. ఈ ప్రక్రియలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు.

దేశవిభజన చారిత్రక తప్పిదం 

ఈ రోజు చొరబాట్లపై చర్చ సందర్భంగా ప్రపంచంలోని 90% దేశాలు భౌగోళిక రాజకీయ దేశాలు అని నేను చెప్పాలనుకుంటున్నాను. మనం భౌగోళిక రాజకీయ దేశం కాదు; మనం భౌగోళిక సాంస్కృతిక దేశం. ఈ భౌగోళిక సాంస్కృతిక దేశం ఆత్మను నిజంగా అర్థం చేసుకోవాలంటే, రాష్ట్రాల సరిహద్దుల సంకుచిత పరిధులకు మించి ఎదగాలి. మనం కొంతమందికి ఎందుకు ఆశ్రయం ఇచ్చాం? ఎందుకంటే ఈ దేశం 1951లో ఒక వాగ్దానం చేసింది, మనం ఈ రోజు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాము.

మతం ఆధారంగా ఈ దేశాన్ని విభజించడం ఒక చారిత్రక తప్పిదం అని నేను ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నాను. మీరు భారత మాత రెండు చేతులనూ నరికి, బ్రిటిష్ వారి కుట్రకు తోడ్పడ్డారు. అది ఎప్పటికీ జరిగి ఉండకూడదు. మన దేశంలో శతాబ్దాలుగా అనేక మతాలు సహజీవనం చేస్తున్నాయి. మన చరిత్రలో మతం పేరుతో ఎప్పుడూ సంఘర్షణ లేదు. కనుక జాతీయ గుర్తింపు లేదా పౌరసత్వాన్ని మతపరమైన ప్రాతిపదికన ఎలా నిర్ణయిస్తారు? మతం, జాతీయతను వేరుగా ఉంచాలి. మతం, జాతీయతను వేరుగా ఉంచకపోవడం వలన ఈ వివాదాలు, విభజనలు అన్నీ ఉత్పన్నమయ్యాయి. 1951 నాటి నెహ్రూ-లియాఖత్ ఒప్పందాన్ని సరిగా అమలు చేసిఉంటే శరణార్థులు, చొరబాటుదారులపై ఇప్పుడీ వివాదం ఉండేది కాదు.

‘డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్’: బిజెపి త్రిసూత్ర పరిష్కారం 

చొరబాటుదారులు ఓటరు జాబితాలలో చేరినప్పుడు వారు మన ఎన్నికల ఫలితాల్లో భాగమవుతారు. ఈ వేదిక నుంచి నేను దేశంలోని ప్రతి పౌరుడిని అడగాలనుకుంటున్నాను – ఈ దేశ పౌరులు తప్ప మరెవరికైనా ఈ దేశానికి ప్రధాని ఎవరు అవుతారో నిర్ణయించే హక్కు ఉండాలా? మీరు చొరబాటుదారులను రక్షిస్తే మీరు మన ప్రజాస్వామ్యాన్ని, మన పవిత్ర రాజ్యాంగ స్ఫూర్తిని భ్రష్టు పట్టించినట్టే. అందుకే బిజెపి 1950ల నుంచి మూడు సూత్రాలను స్వీకరించింది – గుర్తించు, తొలగించు, బహిష్కరించు. (డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్). మేం చొరబాటుదారులను గుర్తిస్తాం, వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించేలా చూస్తాం. వారిని వారి దేశానికి తిరిగి పంపుతాం. దీని గురించి ఎటువంటి సందేహం ఉండకూడదు. ఈ ‘మూడు డి’ల అంశంపై దేశ ప్రజలు బిజెపికి మద్దతు ఇస్తారని నమ్ముతున్నాను, ఎందుకంటే ఈ మూడు ‘డి’లు దేశ ఆత్మను, దాని సంస్కృతిని, దాని ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉద్దేశించినవి.

ఈ దేశంలో కోట్లమంది ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు శాంతియుతంగా జీవిస్తున్నారు. ఎవరూ వారిని నిందించలేదు. వారు ఓటు వేస్తారు, ఎన్నికలలో పాల్గొంటారు. వారి ఓట్లకు స్వాగతం. ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు సంవత్సరాలుగా మమ్మల్ని అధికారానికి దూరంగా ఉంచారు. అది కూడా పూర్తిగా ఆమోదయోగ్యమే. మేం అనేక రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓడిపోయాం. అటల్ జీ ఆరేళ్ల పాలన తర్వాత కూడా మేం సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాం. ఫలితాలు వచ్చాయి, మేం వాటిని అంగీకరించాం. కానీ ఓటు హక్కు ఈ దేశ పౌరులకు మాత్రమే, దాని సంస్కృతికి, భాషకు, ప్రజాస్వామ్యానికి విధేయులైన వారికి మాత్రమే ఉండాలి.

జనాభా మార్పు కార్యక్రమం 

ఎస్ఐఆర్ మొదటిసారి జరగడం లేదు. రాహుల్ గాంధీకి తెలియకపోవచ్చు, కానీ కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయన ముత్తాత దాన్ని చేపట్టారని, ఆయన నాయనమ్మ, ఆయన తండ్రి దాన్ని అమలు చేశారని గుర్తు చేసుకోవాలి. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఓటరు జాబితాను శుద్ధి చేయడం ఒక పవిత్రమైన పని అని, అది మన ప్రజాస్వామ్యాన్ని శుభ్రపరుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే, ఈ ఆగస్టు 15న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి హై-పవర్ డెమోగ్రాఫిక్ చేంజ్ మిషన్ ఏర్పాటును ప్రకటించారు. ఈ మిషన్ అనేక ముఖ్యమైన అధ్యయనాలను చేపడుతుంది:

అక్రమ వలసల వల్ల కలిగే జనాభా మార్పులను శాస్త్రీయంగా అంచనా వేస్తుంది.

దేశ మత, సామాజిక జీవితంపై ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది.

జనాభా మార్పులకు కారణాలను విశ్లేషిస్తుంది.

అసాధారణ స్థిరనివాస నమూనాలను, సమాజంపై వాటి దీర్ఘకాలిక ప్రభావాలను పరిశీలిస్తుంది.

వీటి వల్ల సరిహద్దు నిర్వహణపై పడే భారాన్ని మదింపు చేస్తుంది.

ఈ పరిశోధనలన్నింటి తర్వాత, ఇది కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పిస్తుంది.

ప్రచారాలకు ప్రభావితం కాకుండా వాస్తవాలను లోతుగా పరిశీలించాలని ప్రజలకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన హక్కుల గురించి మనం – ఈ దేశ పౌరులు – స్పృహతో ఉండనంత కాలం ప్రపంచంలో ఎవరూ మనల్ని రక్షించలేరు. తమ హక్కులను కాపాడుకునే బాధ్యత పౌరులదే. మతపరమైన హింస కారణంగా పొరుగు దేశాల నుంచి వచ్చేవారు చొరబాటుదారులు కాదు; వారు శరణార్థులు. శరణార్థులకు భారతదేశంలో స్వాగతం లభిస్తుంది. వారికి పౌరసత్వం లభిస్తుంది. దాని కోసం చట్టం ఇప్పటికే ఉంది. అయితే చొరబాటుదారులకు, మూడు మార్గాలు మాత్రమే మిగిలి ఉన్నాయి: గుర్తించు, తొలగించు, బహిష్కరించు. ఇదే చెప్పాలనుకుంటున్నాను.