ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం
ఉపాధి, ఉద్యోగాలపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అనేక అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 12.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం సగటు ద్రవ్యోల్బణం రేటును దాదాపు 5 శాతం దాటి వెళ్ళలేదు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు 2009-2014 మధ్యకాలంలో ద్రవ్యోల్బణం దాదాపు 9 శాతం ఉండేది, కొన్ని సార్లు 10 శాతానికి కూడా చేరుకుంది.
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రతిపక్ష నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రభృతులు ప్రచారం చేస్తున్న అబద్ధాల గురించి ప్రజలకు తెలియాలి. రాహుల్ గాంధీ పార్లమెంటులో హిందూ ధర్మాన్ని అగౌరవ పరచడమే కాదు, ఆయన అబద్ధాలు చెప్పే తీరును చూస్తే ఆయన అబద్ధాల మతాన్ని స్వీకరించినట్లు కూడా కనిపిస్తోంది. భారతదేశంతో ప్రత్యక్ష సంబంధం లేని ప్రధాన బ్యాంకులు తమ అంచనాలను కేవలం సమాచారం, వారి అనుభవాల ఆధారంగా రూపొందిస్తాయి. ఆ బ్యాంకుల నివేదికల ప్రకారమే భారతదేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది, ఉద్యోగ కల్పనలో దేశం మొదటి స్థానంలో ఉంది. రిజర్వు బ్యాంకు నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగింది. మొత్తం శ్రామిక శక్తి 57.9 కోట్ల నుండి 64.3 కోట్లకు పెరిగింది. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే గణనీయంగా సుమారు 5 కోట్ల ఉద్యోగాలు పెరిగాయి. ఇవి ఆర్‌బీఐ ప్రకటించిన గణాంకాలు. గత 10 సంవత్సరాలలో 12.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగింది. ఇదీ ఒక రికార్డు. ఉద్యోగాల కల్పనలో భారత్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన దేశంగా నిలిచింది.
దేశానికి లబ్ధి చేసే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకున్నందుకు దేశ ప్రజలను అభినందించాలి. ఇటువంటి నిర్ణయాలకు బలమైన రాజకీయ సంకల్పం, నాయకత్వం అవసరం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ఈ సంకల్పాన్ని ప్రదర్శించింది. నిర్మాణాత్మక లేదా విధాన సంస్కరణల ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతోంది. అనేక దేశాలు వృద్ధి కోసం పోరాడుతున్న తరుణంలో భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాలు, వృద్ధి జోరుగా ఉన్నట్టు కొనుగోళ్ళ సమాచార సూచీ, సేవారంగం, తయారీ రంగాల గణాంకాలు అన్నీ స్పష్టం చేస్తున్నాయి. 2004 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వానికి ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ నేతృత్వం వహించారు. అయితే ఆయన హయాంలో పదేళ్ల కాలంలో కేవలం 2.9 కోట్ల ఉద్యోగాలు మాత్రమే కల్పించగా, మోదీ ప్రభుత్వం పదేళ్లలో దానికి పది రెట్ల ఉద్యోగాలు కల్పించింది. 2017లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు ఇప్పుడు 3.2 శాతానికి పడిపోయింది. ఈ సూచికలు భారత్ బలమైన ఆర్థిక వృద్ధి, సానుకూల ఉద్యోగ కల్పన ధోరణులను ప్రతిబింబిస్తాయి. ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్ఓ)లో నమోదైన ఉద్యోగుల సంఖ్య రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది.
ఈ విజయానికి నరేంద్ర మోదీ పిఎల్ఐ (ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాలు పథకం) కారణమని చెప్పవచ్చు. పిఎల్ఐ పథకానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రచారాలు చేసినప్పటికీ దాని వల్ల దేశానికి, ప్రజలకు జరిగే ప్రయోజనాలను ప్రధానమంత్రి గుర్తించారు. ఇది అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని, దేశాన్ని స్వయం సమృద్ధం చేయడంలో కీలక పాత్ర వహిస్తుందని నమ్మారు. టెలికమ్యూనికేషన్స్ రంగంలో పిఎల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టడంతో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది. 2014కి ముందు భారత్ 5 కోట్ల మొబైల్ ఫోన్‌లను ఉత్పత్తి చేసింది. 21 కోట్ల ఫోన్లను దిగుమతి చేసుకుంది. నేడు పిఎల్‌ఐ పథకం అమలు, దేశ నాయకత్వం దూరదృష్టితో తీసుకున్న చర్యల కారణంగా మనదేశం 33 కోట్ల ఫోన్లను తయారు చేస్తూ 5 కోట్ల ఫోన్లను ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వ దార్శనికతకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇలాంటి విజయవంతమైన ఉదాహరణలను వివిధ రంగాలలో చూడవచ్చు. గతంలో భారత్ రక్షణ రంగంలో విదేశాలపై ఎక్కువగా ఆధారపడేది. అయితే మోదీ విధానాలు, చొరవ కారణంగా దేశం ఇప్పుడు రక్షణ రంగంలో స్వయంసమృద్ది (ఆత్మనిర్భర్) సాధించింది. దాదాపు రూ.22,000 కోట్ల విలువైన ఎగుమతులను కూడా చేసింది.
భారతదేశంలో ప్రధాన ద్రవ్యోల్బణం (ఆహరం, ఇంధన ధరలతో కలిపి) ప్రస్తుతం 4.75 శాతం, మౌలిక ద్రవ్యోల్బణం (ఆహారం, ఇంధనం ధరలు మినహాయించి) 3.33 శాతంగా ఉంది. మోదీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యుత్తమమైన రీతిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తోంది. ఎన్‌డిఎ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ద్రవ్యోల్బణం సగటున 5 శాతంగా ఉంది. అదే యుపిఎ హయాంలో దాదాపు రెట్టింపు, 9 శాతం ఉంది. 2009 నుండి 2014 వరకు యుపిఎ హయాంలో సగటు ద్రవ్యోల్బణం రేటు సుమారు 10 శాతం వరకు ఉంది. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ సగటు ద్రవ్యోల్బణ రేటును 5శాతం దగ్గరే కట్టడి చేయగలిగింది. యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త, అసమర్థ నిర్వహణ ఫలితంగా బ్యాంకులు కుదేలయ్యాయి. అందుకు భిన్నంగా నేడు బ్యాంకులు భారీగా పెట్టుబడి నిధులు సమకూర్చుకున్నాయి. మొండిబాకీల సమస్యను సమర్థంగా పరిష్కరించుకుని మళ్ళీ గాడిలో పడ్డాయి. బ్యాంకులు ఇప్పుడు అన్ని విధాలుగా బలంగా ఉన్నాయి. ప్రజలకు మరిన్ని రుణాలను అందించే స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు క్షుణ్ణమైన పరపతి మూల్యాంకన ప్రక్రియ ఆధారంగా అర్హులైన వ్యక్తులకు మాత్రమే రుణాలు ఇస్తున్నారు. దీంతో బ్యాంకులు ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకున్నాయి. బ్యాంకులు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఉంటాయి. బ్యాంకులు ఇప్పుడు రుణ సౌకర్యాలను విస్తరించే స్థితిలో ఉన్నాయి. లాభాల బాటలో నడుస్తున్నాయి.
బిజెపి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచింది. భారతదేశాన్ని ప్రపంచంలో 11 వ స్థానం నుంచి 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకువచ్చింది. ఆర్థిక వృద్ధిని గమనిస్తే 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారి దేశ ప్రజల కలలు నెరవేరబోతున్నాయి. ప్రధాన మంత్రి అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) ను ఆకాంక్షిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న తీరు, చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న తీరు చూస్తుంటే త్వరలోనే అమెరికా, చైనాల స్థాయికి సరితూగేలా భారత్ దూసుకుపోతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే ఈ మైలురాయికి పునాదిని సిద్ధం చేయడం నేటి నాయకత్వం బాధ్యత. అందుకే గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి సంస్కరణలను అమలు చేశారు. ఈ చర్యలు పన్నుల వసూళ్లను మెరుగుపరిచాయి, బ్యాంకులను బలోపేతం చేశాయి.
ప్రస్తుత వర్షపాతం, సాగు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ శతాబ్దపు సగటు వర్షపాతం పరంగా ఈ ఏడాది అత్యుత్తమంగా ఉండవచ్చని అంచనా. అదే జరిగితే, స్థూల జాతీయోత్పత్తిలో సాగు రంగం వాటా 3 నుంచి 5 శాతం పెరుగుతుంది. దీనివల్ల మొత్తం జిడిపి కూడా పెరిగి ప్రస్తుతం అంచనా వేసిన 7 శాతం వృద్ధి రేటును దాటుతుంది.
రాహుల్ గాంధీ తరచుగా దేశం గురించి అసత్య ప్రచారాలు చేస్తారు. ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ప్రతిపక్ష నాయకులు అదే చేస్తున్నారు. నిరుద్యోగం, మాంద్యం ఉన్నాయని, ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా లేదని వారు చెబుతున్నారు. కానీ ఎప్పటికప్పుడు ప్రచురితమవుతున్న సమాచారం, గణాంకాలు వారి తప్పుడు ప్రచారాలను ఎండగడుతున్నాయి.
డా. సయ్యద్ జాఫర్ ఇస్లాం,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి

