అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ భరోసా పీఎం-ఎస్వైఎం
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన (పీఎం-ఎస్వైఎం) అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతను అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛంద, చందా-ఆధారిత పెన్షన్ పథకం. అసంఘటిత రంగానికి చెందిన, నెలకు రూ.15,000 వరకు ఆదాయం ఉన్న కార్మికులకు 60 ఏళ్ల తర్వాత నెలకు కనీసం రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 50 శాతం వాటా కలిగిన అసంఘటిత రంగ కార్మికులకు పెద్దవయసులో ఆసరా కల్పించడం ఈ పథకం లక్ష్యం. అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఇళ్ళ నుంచి పనిచేసేవారు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, హమాలీలు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, చెత్త ఏరుకునేవారు, ఇళ్ళలో పనులు చేసేవారు, రజకులు, రిక్షా కార్మికులు, భూమిలేని కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, ఆడియో విజువల్ వర్కర్లు లేదా ఇలాంటి ఇతర వృత్తుల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ-శ్రమ్ పోర్టల్ ప్రకారం, 2024 డిసెంబర్ 31 నాటికి 30.51 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు రిజిస్టర్ చేసుకున్నారు.
పీఎం-ఎస్వైఎంలో ముఖ్యాంశాలు
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ పథకం అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పిస్తూ అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
కనీస హామీ పింఛను: 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000
ప్రభుత్వ వాటా: కేంద్ర ప్రభుత్వం కార్మికుల వాటాతో సమానంగా 1:1 ప్రాతిపదికన వాటా సమకూరుస్తుంది.
స్వచ్ఛంద, వాటా లేదా చందా ఆధారిత పథకం: ఈ పథకం స్వచ్ఛందంగా, కార్మికులకు వారి స్థోమత, అవసరాన్ని బట్టి చందా చెల్లించేందుకు వీలుకల్పిస్తుంది.
కుటుంబ పెన్షన్ : లబ్ధిదారుడు మరణిస్తే, జీవిత భాగస్వామికి పెన్షన్ మొత్తంలో 50 శాతం కుటుంబ పెన్షన్‌గా లభిస్తుంది. కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది.
నిష్క్రమణ నిబంధనలు: పాల్గొనేవారు కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో పథకం నుండి నిష్క్రమించవచ్చు (సెక్షన్ 9 లో దీని వివరాలు ఉంటాయి).
సులువుగా చేరవచ్చు: అర్హులైన కార్మికులు కామన్ సర్వీస్ సెంటర్లలో (సీఎస్సీ) లేదా మాన్‌ధన్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.
నిధి నిర్వహణ: ఆర్థిక స్థిరత్వం, విశ్వసనీయతకు భరోసా నిస్తూ ఈ పథకాన్ని ఎల్ఐసీ నిర్వహిస్తుంది.
అర్హత ప్రమాణాలు
పీఎం-ఎస్వైఎంలో నమోదు చేసుకునే వారికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్లు.
ఆదాయ పరిమితి: నెలవారీ ఆదాయం రూ.15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
అసంఘటిత రంగ ఉపాధి: వీధి వ్యాపారులు, చెత్త ఏరుకునేవారు, రిక్షా పుల్లర్లు, భవన నిర్మాణ కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు, గృహ కార్మికులు, నేత కార్మికులు, చేతివృత్తులవారు, మత్స్యకారులు, తోలు కార్మికులు మొదలైన వృత్తుల్లో నిమగ్నమైన కార్మికులు ఈ పథకంలో చేరవచ్చు.
మినహాయింపులు
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్), ఈఎస్ఐసీ, జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్) పరిధిలోకి వచ్చేవారు ఈ పథకంలో చేరడానికి అర్హులు కారు.
ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అర్హులు కారు.
మరే ఇతర ప్రభుత్వ పింఛను పథకం నుంచి ప్రయోజనాలు పొందకూడదు.
అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు
ఐఎఫ్ఎస్సీ కోడ్ తో సహా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా జన్‌ధన్ ఖాతా వివరాలు
మొబైల్ నెంబరు
నమోదు ప్రక్రియ
పీఎం-ఎస్వైఎంలో దేశవ్యాప్తంగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ల (CSC) ద్వారా సులభంగా చేరవచ్చు.
దీనికి ముందుగా ఆధార్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో CSCని సందర్శించాలి
ఆధార్ ఉపయోగించి బయోమెట్రిక్ ధ్రువీకరణ చేసుకోవాలి
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం నింపాలి
మొదటి చందాను నగదు రూపంలో చెల్లించాలి.
బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ సదుపాయాన్ని ఎంచుకోవాలి.
విజయవంతంగా నమోదు చేసుకున్న తరువాత పీఎం-ఎస్వైఎం కార్డును పొందుతారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని కార్మిక కార్యాలయాలు, ఎల్ఐసీకి చెందిన అన్ని బ్రాంచ్ కార్యాలయాలు, ఈఎస్ఐసీ/ఈపీఎఫ్ఓ కార్యాలయాలు అసంఘటిత కార్మికులకు ఈ పథకం గురించి పూర్తి సమాచారం అందించేందుకు అనుసంధాన కేంద్రాలుగా పనిచేస్తాయి.
అమలు, ప్రస్తుత స్థితి
అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకుంటోంది.
రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం
రాష్ట్ర కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC) అధికారులతో క్రమం తప్పకుండా సమావేశం
స్వచ్ఛంద పొడిగింపు, నిలిపివేసిన వాటిని పునరుద్ధరించడం వంటి కొత్త ఫీచర్లను ప్రారంభించడం, క్లెయిమ్ స్థితి, ఖాతా స్టేట్మెంట్
నిద్రాణంగా ఉన్న ఖాతాల పునరుద్ధరణ గడువును ఏడాది నుంచి 3 ఏళ్లకు పొడిగింపు
పీఎం-ఎస్వైఎం, ఇ-శ్రమ్ వ్యవస్థల అనుసంధానం
అవగాహన కల్పించేందుకు ఎస్ఎంఎస్ ల ద్వారా ప్రచారం
పీఎం-ఎస్వైఎం పథకం కింద కేటాయింపులకు సంబంధించి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో సమాచార మార్పిడి
పీఎం-ఎస్వైఎం పెన్షన్ పథకం కింద తమ సిబ్బంది ప్రీమియం చెల్లించేలా యాజమాన్యాలను ప్రోత్సహించడానికి డొనేట్-ఎ-పెన్షన్ మాడ్యూల్ ప్రారంభం
పథకం నుంచి నిష్క్రమణ, నిధుల ఉపసంహరణ
అసంఘటిత కార్మికుల ఇబ్బందులు, ఉపాధి, ఉద్యోగాల్లో అస్థిరతకు పరిగణనలోకి తీసుకొని పథకం నుంచి నిష్క్రమించడానికి నిబంధనలను సరళంగా రూపొందించారు.
10 సంవత్సరాలకు ముందు నిష్క్రమణ: కార్మికుడు 10 సంవత్సరాల కంటే ముందు ఈ పథకం నుంచి ఉపసంహరించుకోవాలనుకుంటే వాటా మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటుతో సహా తిరిగి చెల్లిస్తారు.
నిష్క్రమణ 10 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల లోపు: లబ్ధిదారుడు వాస్తవంగా ఫండ్ కు వచ్చిన ఆదాయం లేదా సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే ఆ వడ్డీతో తన వాటా మొత్తాన్ని తిరిగి పొందుతాడు.
60 సంవత్సరాలకు ముందు మరణం లేదా ప్రమాదం వల్ల కలిగే శాశ్వత అంగవైకల్యం: ఇటువంటి సందర్భాల్లో జీవిత భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు లేదా వాటా మొత్తాన్ని వాస్తవంగా ఫండ్ కు వచ్చిన ఆదాయం లేదా సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే ఆ వడ్డీతో సహా వెనక్కి తీసుకోవచ్చు.
60 ఏళ్ల తర్వాత మరణం: జీవిత భాగస్వామి 50 శాతం పెన్షన్‌ను కుటుంబ పెన్షన్‌గా పొందుతారు. చందాదారుడు, అతని/ఆమె జీవిత భాగస్వామి మరణించిన తరువాత మొత్తం కార్పస్ (అసలు మొత్తం) తిరిగి ఫండ్ కు జమ అవుతుంది.
చందాదారుడు క్రమబద్ధంగా వాటా చెల్లించనట్లయితే, ప్రభుత్వం నిర్ణయించిన పెనాల్టీ ఛార్జీలతో సహా మొత్తం బకాయిలను చెల్లించడం ద్వారా అతను/ఆమె తన వాటాను క్రమబద్ధీకరించుకోవచ్చు. లక్షల మంది అసంఘటిత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే కీలక పథకం పీఎం-ఎస్వైఎం. నెలకు రూ.3,000 పింఛన్ ఇవ్వడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత కార్మికులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఇది దోహదపడుతుంది. పెద్ద సంఖ్యలో నమోదులు, కొనసాగుతున్న ప్రచార కార్యక్రమాలతోపీఎం-ఎస్వైఎం సార్వత్రిక పెన్షన్ కవరేజీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత్ లో మరింత సమ్మిళిత సామాజిక భద్రతా వ్యవస్థ సృష్టికి దోహదం చేస్తోంది.

