Stock Market

భారత స్టాక్ మార్కెట్‌లో స్వదేశీ శకం

కప్పుడు భారత స్టాక్ మార్కెట్ విదేశీ ఇన్వెస్టర్ల కదలికలకు అనుగుణంగా స్పందిస్తూ, వారి కనుసన్నల్లోనే నడిచేదని చెప్పడం అతిశయోక్తి కాదు. విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్ఐఐ)లు ఒకే సెషన్‌లో రూ.3,000 నుంచి రూ.4,000 కోట్ల షేర్లను విక్రయిస్తే చాలు, సెన్సెక్స్ కుప్పకూలేది, నిఫ్టీ ‘రక్తపాతాన్ని’ చూసేది. దీనికి భిన్నంగా విదేశీ పెట్టుబడులు స్వల్పంగా పెరిగినా దలాల్ స్ట్రీట్‌లో పండుగ వాతావరణం నెలకొనేది. దశాబ్దాల తరబడి భారత మార్కెట్లు విదేశీ పెట్టుబడిదారులనే ‘సూత్రధారుల’ చేతిలో ‘కీలుబొమ్మలు’గా ఉండేవి. నా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రోజుల్లో మేం ఎఫ్ఐఐల కదలికలను నిశితంగా గమనించేవాళ్లం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (మన రిజర్వు బ్యాంకు వంటిది) వడ్డీ రేట్ల పెంపు సూచనలు ఇచ్చినా, అమెరికా బాండ్ ఆదాయాలు పెరిగినా, లేదా ప్రపంచంలో ఎక్కడో ఒక భౌగోళిక రాజకీయ ప్రకంపనలు వచ్చినా.. నిమిషాల్లో ముంబై మార్కెట్‌లో దాని ప్రభావం కనిపించేది. అప్పట్లో మార్కెట్ పరంగా మనం ఒక అనిశ్చితిలో బతికేవాళ్లం. అయితే, ఆ కాలం పూర్తిగా ముగిసిపోయిందని చెప్పడం తప్పు కావచ్చు, కానీ ప్రస్తుతం దాని ఆధిపత్యం మాత్రం తగ్గింది.

2025లో రూపుమారిన భారత మార్కెట్

2025 నాటి భారత స్టాక్ మార్కెట్‌లో నిర్మాణపరమైన మార్పులు వచ్చాయి. మోదీ ప్రభుత్వ విధానాల వల్ల మార్కెట్ మరింత స్థితిస్థాపకతను (పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం), ఆత్మవిశ్వాసాన్ని సంతరించుకుంది. భారత ఈక్విటీల కేంద్ర బిందువు ఇప్పుడు శాశ్వతంగా మారిపోయింది. విదేశీ మూలధనం ఇప్పటికీ ముఖ్యమే, కానీ అది దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్‌ను శాసించే స్థాయిలో లేదు. భారతీయ కుటుంబాలు, స్వదేశీ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ నిధులు, దీర్ఘకాలిక సంస్థాగత మూలధనం ఇప్పుడు మార్కెట్ స్థిరత్వానికి కొత్త సంరక్షకులుగా మారాయి. మధ్యతరగతి ఉద్యోగుల నుంచి వస్తున్న ‘క్రమబద్ధమైన మదుపు ప్రణాళిక’ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్-సిప్) విదేశీ పెట్టుబడులపై ఆధారపడటాన్ని తగ్గించింది. ఇది ఒక్కరోజులో జరగలేదు. గతంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టిన ప్రజలు ఇప్పుడు ఎస్‌ఐపి (సిప్) ల వైపు మళ్లారు. డిజిటలీకరణ తెచ్చిన విప్లవం వల్ల ప్రజల ఆలోచనా విధానం మారింది. గతంలో వందల కాగితాలు, మధ్యవర్తులు, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటివి ఉండటంతో ప్రజలు భయపడేవారు. కానీ నేడు డిజిటలీకరణ అన్ని అడ్డంకులను తొలగించి, సగటు భారతీయుడిని ఆత్మవిశ్వాసం కలిగిన ఇన్వెస్టర్‌గా మార్చింది.

డిజిటల్ విప్లవం, ఆర్థిక సమ్మిళితత్వం 

ప్రభుత్వ ఆర్థిక సమ్మిళితత్వ విధానాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరాయి. జన్ ధన్ ఖాతాలు కోట్లమందిని అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చాయి. ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ప్రజల్లో నమ్మకాన్ని కలిగించింది. యూపీఐ విప్లవం డిజిటల్ కరెన్సీని సామాన్యుడికి చేరువ చేసింది. ప్రధాని మోదీ డిజిటలీకరణ కార్యక్రమాల కింద సెబీ, ఆర్బీఐ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ఇన్వెస్టర్లలో భయాన్ని పోగొట్టాయి. “మ్యూచువల్ ఫండ్స్ సహీ హై” వంటి ప్రచారాలు, జెరోధా, అప్‌స్టాక్స్ వంటి ఆర్థిక సాంకేతిక (ఫిన్ టెక్) ప్లాట్‌ఫారాలు పెట్టుబడి పెట్టడాన్ని ఒక సులభమైన దైనందిన ప్రక్రియగా మార్చేశాయి.

మధ్యతరగతి ప్రజలు తమ మిగులు పొదుపును కేవలం బంగారం, రియల్ ఎస్టేట్‌లోనే కాకుండా భారత్ అభివృద్ధిపై పెట్టుబడిగా పెడుతున్నారు. ఇది ఎస్‌ఐపిల పెరుగుదలలో స్పష్టంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలలో ఎస్‌ఐపిల ద్వారా రూ.24,500 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇది ఆగస్టు కంటే ఎక్కువే గాక ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ మొత్తం. కేవలం ఒక్క నెలలోనే 66 లక్షల కొత్త ఎస్‌ఐపిలు ప్రారంభమయ్యాయి, దీనితో మొత్తం క్రియాశీల ఎస్‌ఐపి ఖాతాల సంఖ్య దాదాపు 9.5 కోట్లకు చేరుకుంది. 2025లో సగటు ఎస్‌ఐపి పెట్టుబడులు నెలకు రూ.30,000 కోట్లను చేరాయి. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా భారతీయులు దీర్ఘకాలిక పెట్టుబడులకు కట్టుబడి ఉన్నారని ఇది నిరూపిస్తోంది.

ఎల్ఐసీ, ఆత్మనిర్భర్ భారత్

ఈ పరివర్తనలో భారతీయ జీవన బీమా సంస్థ (ఎల్ఐసీ) పాత్రను తక్కువగా అంచనా వేయలేం. ఎల్‌ఐసీ అధికారికంగా భారత ప్రభుత్వ హామీ కలిగిన సంస్థ కాకపోయినా, దాని పనితీరు అలాగే ఉంటుంది. మార్కెట్ అనిశ్చితిలో ఉన్నప్పుడు ఎల్ఐసీ ఒక స్థిరీకరణ శక్తిగా పనిచేస్తుంది. సెంటిమెంట్ బలహీనపడినప్పుడు అది పెట్టుబడులతో ముందుకు వస్తుంది. ఈపీఎఫ్‌ఓ, స్వదేశీ మ్యూచువల్ ఫండ్స్‌తో కలిసి ఎల్ఐసీ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా ఉంది. మన సొంత సంస్థలే ఇప్పుడు మూలధన కల్పన ప్రక్రియను నడిపిస్తున్నాయి. మరి విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్ఐఐ) లు వెనక్కి తగ్గారా? అంటే అవుననే చెప్పాలి. కానీ అది భారత ఆర్థిక వ్యవస్థపై నమ్మకం లేక కాదు. అంతర్జాతీయ పెట్టుబడి ఎప్పుడూ అవకాశవాదంతో వ్యవహరిస్తుంది. ఇటీవల విదేశీ పెట్టుబడిదారులు అమెరికాలోని కృత్రిమ మేధ (ఏఐ) రంగం వైపు, జపాన్, లాటిన్ అమెరికా మార్కెట్ల వైపు మొగ్గు చూపారు. మరోవైపు, 2023 నుండి సెబీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌ (సట్టా తరహా వ్యాపారం) పై నిఘా పెంచింది. ప్రమాదకరమైన సట్టా (స్పెకులేటివ్) పెట్టుబడులను అరికట్టింది. దీనివల్ల తక్షణ లాభాల కోసం ప్రయత్నించే స్వల్పకాలిక విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ఇది మార్కెట్ ప్రవర్తనను క్రమబద్ధీకరించడానికి చేసిన ప్రయత్నం.

పరిణతి చెందిన మార్కెట్

విదేశీ సంస్థాగత మదుపుదారులు మళ్లీ వస్తారా? కచ్చితంగా వస్తారు. ప్రపంచ మూలధన ప్రవాహం ఎప్పుడూ వలయంలా ఉంటుంది. కానీ పాత ఆధిపత్యం మాత్రం తిరిగి రాదు. ఎఫ్ఐఐలు మళ్లీ పెద్ద కొనుగోలుదారులుగా మారవచ్చు కానీ వారు మార్కెట్‌ను శాసించలేరు. ఇప్పుడు మన స్వదేశీ ఇన్వెస్టర్లే మార్కెట్ గమనాన్ని నిర్ణయిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు ఇకపై భారత్ దిశను శాసించవు. దానికి బదులుగా భారతదేశ వృద్ధిని చూసి స్పందిస్తాయి. ఇది ఒక గొప్ప మార్పు. ఇది భారత మార్కెట్ పరిణతికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. నేడు భారత స్టాక్ మార్కెట్లు స్వయంసమృద్ధిని సాధించాయి. ప్రపంచాన్ని గమనిస్తాయి కానీ భయంతో వణికిపోవు!

సయ్యద్ జాఫర్ ఇస్లాం,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి