Bankim chandra

భారతదేశ ఆత్మ, ఐక్యతలకు ప్రతీక ‘వందేమాతరం’

150 ఏళ్ల క్రితం బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘వందేమాతరం’ నేటికీ భారత జాతి హృదయ స్పందనగా, స్ఫూర్తిగా నిలిచి ఉంది. ఇది కేవలం గేయం కాదు, దేశభక్తికి, జాతీయ చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం. ‘వందేమాతరం’ పవిత్రతను నేడు కొందరు స్వయంప్రకటిత మేధావులు ప్రశ్నించడం విచారకరం. కొన్నిసార్లు దానిని మతపరమైనదిగా కొట్టిపారేయడం, మరికొన్నిసార్లు దాని సార్వజనీనతను సంకుచిత వర్గాలకే పరిమితం చేయాలని చూడటం జరుగుతోంది. అయితే ఇది కేవలం ఒక పదబంధం కాదు; ఇది భారతీయ ఆత్మ శాశ్వత హృదయ స్పందన. ఈ పుణ్యభూమి అంతరాత్మలో ఒకటిన్నర శతాబ్దానికి పైగా ప్రతిధ్వనిస్తున్న జాతీయ చైతన్యపు దివ్య మంత్రం. బానిస సంకెళ్ళలో మగ్గుతున్న జాతికి వెలుగునిచ్చింది, నిరాశలో మునిగిపోయి ఉన్న అస్తిత్వాన్ని పునరుజ్జీవింపజేసింది. ప్రతిఘటనకు బలాన్నిచ్చింది. అంతిమంగా స్వేచ్ఛకు రూపాన్ని ఇచ్చింది ఈ గేయం.

ఈ గేయంలో అధికార లాలస లేదు, కులం, మతం, ప్రాంతం వంటి సంకుచిత భావనలు లేవు. ఇది వేల సంవత్సరాల నాగరికత, సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాల ద్వారా రూపుదిద్దుకున్న భారతదేశ సామూహిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక దేశమంటే కేవలం భౌగోళిక భూభాగం కాదని, అది సజీవంగా ప్రజల్ని పోషించే తల్లి అని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఆమె పట్ల మనకున్న గౌరవం, భక్తి, విధేయతలే మన నిజమైన అస్తిత్వాన్ని, గుర్తింపును నిర్వచిస్తాయి. ‘వందేమాతరం’ దేశభక్తిని రాజకీయాలకే పరిమితం చేయకుండా, మాతృభూమి పట్ల భక్తి, క్రమశిక్షణ, నిస్వార్థ సేవ రూపంలో వ్యక్తమయ్యే భారతీయ జీవన తత్త్వాన్ని ప్రతిఫలిస్తుంది.

‘వందేమాతరం’ ఆవిర్భావం ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని సూచిస్తుంది. బ్రిటిష్ పాలన భారతదేశ సాంస్కృతిక, మతపరమైన చైతన్యాన్ని అణచివేయాలని చూసిన సమయంలో, బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని తన ‘ఆనందమఠ్’ నవలలో పొందుపరచడం ద్వారా జాతి స్ఫూర్తికి కొత్త జీవం పోశారు. ఆనందమఠ్‌లోని సన్యాసులు ‘వందేమాతరం’ పాడినప్పుడు, అది కేవలం మాతృభూమిని స్తుతించడం మాత్రమే కాదు; అది స్వేచ్ఛ కోసం ఇచ్చిన పిలుపు. వలస పాలనకు వ్యతిరేకంగా భారతదేశ మొట్టమొదటి ఆత్మవిశ్వాస వ్యవస్థీకృత వ్యక్తీకరణ అయిన సన్యాసి ఉద్యమం దీనికి ప్రేరణ. 1875లో ఛటర్జీ ‘సుజలాం సుఫలాం/ మలయజశీతలాం/ సస్యశ్యామలాం/ మాతరం’ అనే పదాలను రాసినప్పుడు నిద్రిస్తున్న భారతదేశ ఆత్మను మేల్కొల్పారు. 1905 నాటి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం సమయంలో స్వేచ్ఛా స్వప్నం కదిలిన ప్రతి వీధిలో, పాఠశాలల్లో, సమావేశాల్లో, ర్యాలీల్లో ‘వందేమాతరం’ ప్రతిధ్వనించింది. విప్లవకారులు ఉరికొయ్యలను ఎదుర్కొన్నప్పుడు వారి నోటి చివరి మంత్రంగా ఇది మారింది. రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని ఆలపించినప్పుడు, ఆ రాగం ఒక ఆధ్యాత్మిక అనుభవంగా మారింది. ఇది మతం, దేశభక్తి, భక్తి, విధిని ఒక పవిత్ర భావనగా మేళవించింది. అసంఖ్యాక భారతీయులు స్వాతంత్య్ర యజ్ఞంలో తమను తాము అర్పించుకోవడానికి ఇది ప్రేరణనిచ్చింది.

జాతీయ గేయంగా ఏకగ్రీవ ఆమోదం

స్వతంత్ర భారతదేశ రూపశిల్పులు ‘వందేమాతరం’ను దేశ ఆత్మకు చిహ్నంగా గౌరవించారు. నేటికీ ఇది తరాల భారతీయ ప్రజలలో గర్వం, గౌరవం, ఐక్యతను రేకెత్తిస్తూనే ఉంది. ఇది కాలం, భౌగోళిక సరిహద్దులకు అతీతమైనది. నాగరికత, సంస్కృతి, శాశ్వత చైతన్యానికి సజీవ రూపమైన భారత మాత దివ్యత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన తరుణం. ఎంతోమంది దేశభక్తులు ప్రాణాలర్పించడానికి ప్రేరణనిచ్చిన స్ఫూర్తితో మనం నిజంగా జీవిస్తున్నామా? మాతృభూమి పట్ల అదే భక్తి, క్రమశిక్షణ, అంకితభావాన్ని మన ప్రవర్తనలో ప్రతిబింబిస్తున్నామా? ‘వందేమాతరం’ ఏ ఒక్క మతం, వర్గం, సమూహానికి చెందిన గేయం కాదు; అది భారతీయ ఆత్మ స్వరం. ఇది మాతృభూమి పట్ల గౌరవాన్ని వ్యక్తం చేసే గీతం. అందుకే, 1950 జనవరి 24న భారత రాజ్యాంగ పరిషత్ ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా ఏకగ్రీవంగా ఆమోదించింది. నేడు భారతదేశం ఆత్మనిర్భరత, అభివృద్ధి మార్గంలో ధైర్యంగా అడుగులు వేస్తున్నప్పుడు, ఈ ప్రయాణానికి మార్గనిర్దేశం చేసే స్ఫూర్తి సరిగ్గా ఒకటిన్నర శతాబ్దం క్రితం ఛటర్జీ వెలిగించినదే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ మంత్రంతో దేశం ముందుకు సాగుతున్న తరుణంలో ‘వందేమాతరం’ మన ఐక్యతా భావనను బలోపేతం చేస్తూనే ఉంది.

‘వందేమాతరం’ మాతృభూమికి కేవలం వందనం మాత్రమే కాదు; ఆమెను రక్షించడానికి, సుసంపన్నం చేయడానికి, ఆమె గౌరవాన్ని నిలబెట్టడానికి చేసిన ప్రతిజ్ఞ. ఒక రైతు తన పొలంలో శ్రమించినప్పుడు, సైనికుడు దేశ సరిహద్దులకు కాపలా కాసినప్పుడు, ఉపాధ్యాయుడు యువతను తీర్చిదిద్దినప్పుడు, లేదా యువత ఆవిష్కరణల ద్వారా దేశానికి పేరుప్రతిష్టలు తెచ్చినప్పుడు, వారి చర్యలలో ‘వందేమాతరం’ సజీవంగా వ్యక్తమవుతుంది. ఈ గేయం సారాంశాన్ని యువత తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ గేయం మాతృభూమి ఒక నైరూప్య భావన కాదని, అది ఒక సజీవ శక్తి అని గుర్తు చేస్తుంది. ఆమెను గౌరవించడం జీవితంలో అత్యున్నత కర్తవ్యాలలో ఒకటి. ‘వందేమాతరం’ దేశభక్తి అనేది తాత్కాలిక భావోద్వేగం కాదని, అది జీవితాంతం కొనసాగే భక్తి, విధ్యుక్త ధర్మమని మనకు బోధిస్తుంది.

యోగి ఆదిత్యనాథ్,
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి