Bihar Win

‘డబుల్ ఇంజన్’కే జై కొట్టిన బిహార్

Bihar Winబుల్ ఇంజన్ సర్కార్ కు బిహార్ మరోసారి జై కొట్టింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్, మోదీల జోడీ సూపర్‌హిట్‌ కొట్టింది. అంచనాలను మించి ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్‌ పోల్స్‌కూ అందనంతగా అప్రతిహత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే 202 సీట్లతో అందనంత ఎత్తున నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌ చావుదెబ్బ తింది. కేవలం 35 సీట్లతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. ఇక సంచలనం సృష్టిస్తానని మొత్తం 243 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ పార్టీ జన్‌ సురాజ్‌ అసలు ఖాతానే తెరవలేదు. 32 సీట్లలో పోటీ చేసిన ఎంఐఎం 5 చోట్ల గెలిచింది. సమన్వయం, అభివృద్ధి హామీలు, మహిళలకు నగదు బదిలీ వంటి వాటితో ఎన్డీయే అద్భుత ఫలితాలను సాధించింది. అంతర్గత కలహాలు, సీట్ల సర్దుబాటులో అయోమయం, నేతల మధ్య సమన్వయ లోపం వల్ల విపక్ష కూటమి చతికిలపడింది. 

బిహార్‌లోని 9 రీజియన్లలోనూ ఎన్డీయే కూటమి భారీ విజయాలను నమోదు చేసింది. ముస్లింల ప్రాబల్యమున్న సీమాంచల్‌లాంటి ప్రాంతాల్లోనూ ఆర్జేడీని మట్టికరిపించింది. ముస్లిం-యాదవ్‌ల సమీకరణాన్ని నమ్ముకున్న మహాగఠ్‌బంధన్‌ ఆ వర్గాలకు పట్టున్న చోట్లా పాగా వేయలేకపోయింది. ఎన్డీయే తలకెత్తుకున్న మహిళ-యువత (ఎం-వై) సూపర్‌హిట్‌కాగా.. ఆర్జేడీ ఫార్ములా ముస్లిం-యాదవ్‌ (ఎం-వై) అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. 

అతి పెద్ద పార్టీగా బిజెపి

ఈ ఎన్నికల్లో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి 101 సీట్లలో పోటీ చేసి 89 చోట్ల గెలుపొందింది. 88శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. 101 సీట్లలోనే పోటీ చేసిన జేడీయూ 85 చోట్ల విజయం సాధించింది. ఎన్డీయే కూటమిలోనే ఉన్న లోక్‌ జన్‌శక్తి (రాంవిలాస్‌) పార్టీ 28 చోట్ల పోటీ చేసి 19 చోట్ల గెలిచింది. ఒకచోట ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. జీతన్‌రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) 6 చోట్ల పోటీ చేసి 5 చోట్ల గెలిచింది. రాష్ట్రీయ లోక్‌ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) 6 చోట్ల పోటీ చేసి 4 చోట్ల విజయం సాధించింది.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. పార్టీని గెలిపించడం మాట అటుంచి తానే సొంతంగా గెలిచేందుకు అపసోపాలు పడ్డారు. ఆయన పోటీ చేసిన రాఘోపుర్ లో 14,532 ఓట్ల సాధారణ మెజారిటీతో బిజెపి అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్ పై గెలిచారు. 141 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 చోట్ల గెలిచి పార్టీ చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. 61 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్‌ మరీ ఘోరంగా 6 చోట్లే గెలిచింది. 20 చోట్ల పోటీ చేసిన లెఫ్ట్‌ పార్టీలు 3 చోట్ల విజయం సాధించాయి. 12 చోట్ల పోటీ చేసిన వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ ఒక్కచోటా గెలవలేదు.

ఎన్డీయే ప్రభంజనానికి మహిళలే ఆయువుపట్టుగా నిలిచారు. రాష్ట్రంలో పురుషుల కంటే 10శాతం అధికంగా మహిళలు ఎన్డీయేకే పట్టం కట్టినట్లు ఫలితాల సరళినిబట్టి తెలుస్తోంది. 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సామాజిక పింఛన్ల పెంపు, ముఖ్యమంత్రి రోజ్‌గార్‌ యోజన పేరుతో దాదాపు కోటి మంది మహిళల ఖాతాల్లో 10,000 జమ వంటివి ఎన్డీయే విజయానికి దోహదం చేశాయి. దీంతోపాటు ఆర్జేడీ వస్తే జంగిల్‌రాజ్‌ మళ్లీ వస్తుందని ప్రధాని మోదీ ప్రచారం చేయడం కలిసివచ్చింది. ఆశా, అంగన్‌వాడీ జీవికలతోపాటు అసంఘటిత రంగంలో కార్మికులకు స్టైపెండ్‌ రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ ఫలితాలనిచ్చింది. మద్య నిషేధం కూడా ఎన్డీయేకు కలిసివచ్చింది. రాష్ట్రంలో దాదాపు 20శాతం దాకా ఉన్న దళితులు ఎన్డీఏనే విశ్వసించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని ఆర్జేడీ, కాంగ్రెస్ కార్యకర్తలే నమ్మలేదు. జానపద గాయని మైథిలి ఠాకూర్ అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు సృష్టించారు. 25 ఏళ్ల వయస్సులోనే ఆమె అలీనగర్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా గెలిచారు. హరియాణా, మహారాష్ట్ర, దిల్లీల్లో ప్రభంజనం.. తాజాగా బిహార్‌లో ఘన విజయం ఎన్డీయేకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చినట్లయింది.

ఇక పశ్చిమబెంగాల్‌ వంతు..

మరోసారి జంగిల్‌రాజ్‌ రావొద్దని బిహార్‌ యువత నిర్ణయించుకున్నారు. ప్రజానుకూల ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇక పశ్చిమబెంగాల్‌లో జంగిల్‌రాజ్‌ను నేలకూల్చాలి. బిజెపి విజయపరంపర బిహార్‌ నుంచి బెంగాల్‌ వరకూ గంగా ప్రవాహంలా కొనసాగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలి. తద్వారా జాబితాల సవరణ కార్యక్రమానికి అంతా సహకరించాలి.

-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధానిపై అచంచల విశ్వాసం

బిహార్‌ ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అపూర్వ విజయాన్ని అందిస్తూ ఇచ్చిన తమ తీర్పుతో ‘జంగిల్‌ రాజ్‌’కు బిహార్‌లో ప్రవేశం లేదనే బోర్డు పెట్టారు. హరియాణా, మహారాష్ట్ర, దిల్లీ.. ఇప్పుడు బిహార్‌ వంటి వరుస ఎన్నికల్లో ప్రజలు మోదీపై అచంచలమైన విశ్వాసాన్ని చూపించారు.

-బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా

అభివృద్ధికే బిహార్‌ ప్రజలు పట్టం కట్టారు

అభివృద్ధి చెందిన బిహార్‌ను విశ్వసించే ప్రతి బిహారీకి ఈ విజయం చెందుతుంది. ఆటవిక పాలన, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి ఇక రాష్ట్రాన్ని దోచుకునే అవకాశం ఉండదు. ప్రజలు ఇప్పుడు పనితీరు ఆధారంగా మాత్రమే తీర్పు ఇస్తున్నారు. ఎన్డీయే సర్కార్‌ ఇకపై బిహార్‌ అభివృద్ధికి మరింత అంకిత భావంతో పనిచేస్తుంది.

-కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా