rytu

సీసీజెడ్ : రైతు సారథ్యంలో ఆర్థిక సాధికార విప్లవం

రల అస్థిరత, సంక్షోభం, ఆర్థిక అభద్రతతో భారత రైతులు చాలాకాలంగా పోరాడుతున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, దానికి పరిమితులున్నాయి. ఒక పరివర్తనాత్మక నమూనా అయిన సహకార సరకు మండలాలు (సీసీజెడ్) ధర భద్రత, మార్కెట్ లభ్యత, ఆర్థిక స్థితిస్థాపకతను పెంచడం ద్వారా రైతుల సమస్యలకు మరింత స్థిరమైన పరిష్కారాన్ని అందిస్తాయి. ప్రపంచ వ్యవసాయం సుస్థిరత, స్థితిస్థాపక (పరిస్థితులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మారే) సరఫరా గొలుసుల వైపు పయనిస్తున్న తరుణంలో భారత్ రైతులకు న్యాయమైన ప్రతిఫలం, ఆర్థిక సాధికారత కల్పించే రైతు-కేంద్రిత నమూనాను అమలు చేయాల్సి ఉంటుంది. సీసీజెడ్ నమూనా ‘సహకర్ సే సిద్ధి’ (సహకారం ద్వారా శ్రేయస్సు), సహకార భాగస్వామ్యం, స్థానిక సంస్థల వ్యాపార కార్యకలాపాలను, స్వయం సమృద్ధిని ప్రోత్సహించే దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. దళారులు, సట్టా వ్యాపారులపై ఆధారపడకుండా సరుకుల వ్యాపారంలో రైతులు కీలక భాగస్వాములు కావడానికి ఈ నమూనా దోహదపడుతుంది.

భారతదేశ సరకుల మార్కెట్ వ్యవస్థ ప్రస్తుతం వ్యాపారులు, సట్టా వ్యాపారులకు అనుకూలంగా ఉంది, ఇది రైతుల భాగస్వామ్యాన్ని పరిమితం చేస్తుంది. మండీలలో (ఏపీఎంసీ మార్కెట్లు) తరచుగా ధరలను అణచివేసే వ్యాపారుల కూటములు ఆధిపత్యం వహిస్తాయి. ఇది రైతులకు న్యాయమైన ప్రతిఫలం దక్కకుండా చేస్తుంది. సరకుల ట్రేడింగ్ కోసం ఎన్సీడీఈఎక్స్, ఎంసీఎక్స్ వంటి వేదికలు ఉన్నప్పటికీ, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం, సరైన గిడ్డంగి వ్యవస్థ లేకపోవడం వల్ల అవి చిన్న రైతులకు అందుబాటులో లేవు. దీనివల్ల చాలామంది తక్కువ ధరలకు అయినకాడికి తమ సరకును అమ్ముకునేటట్టు చేస్తోంది. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు భారతదేశ ఎంఎస్పీ వ్యవస్థను ‘ఆర్థిక వక్రీకరణ’గా విమర్శించాయి. వారి మార్కెట్-ఆధారిత సిఫార్సులు పెద్ద వ్యవసాయ వ్యాపార సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తాయి, చిన్నచిన్న భూకమతాలు, సరిపడా నిల్వసౌకర్యాలు లేకపోవడం, వాతావరణ అనిశ్చితులు వంటి భారతదేశ వ్యవసాయ వాస్తవాలను విస్మరిస్తాయి. ఎంఎస్పీపై ఈ సంస్థలు చేసే సూచనలు, చర్చలు బహుళజాతి వ్యాపార సంస్థలకే తప్ప భారతీయ రైతులకు ఉపయోగపడవు. 

సీసీజెడ్ నమూనా రైతు-కేంద్రిత ఆర్థిక కేంద్రాల అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఈ జోన్లు స్థిరమైన ధరలు, న్యాయమైన వాణిజ్యం, మెరుగైన ఆదాయాలకు భరోసానిస్తూ సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్పీఓ), స్టోరేజ్ యూనిట్లు, ప్రాసెసింగ్ కేంద్రాలు, డిజిటల్ ప్లాట్ ఫారాలను ఏకీకృతం చేస్తాయి. ఎంఎస్పీపై మాత్రమే ఆధారపడకుండా, సీసీజెడ్లు ‘ఎంఎస్పీ ప్లస్’ నమూనాను అందిస్తాయి. ఇక్కడ రైతులు ఎంఎస్పీ లేదా అధికమైన మార్కెట్ ఆధారిత ధరను పొందుతారు. సీసీజెడ్ లు సహకార ఆధారిత సేకరణ, నిల్వ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తాయి. తద్వారా రైతులు సరైన ధరలకు విక్రయించడానికి వీలు కలుగుతుంది. సహకార సంఘాల ద్వారా సరకు ట్రేడింగ్ లో పాల్గొనడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకుని ధరల పెరుగుదల నుంచి ప్రయోజనం పొందవచ్చు. డిజిటల్ వేదికలు, సహకార సమీకరణలు జాతీయ, ప్రపంచ మార్కెట్లలో ప్రత్యక్ష ట్రేడింగ్ కు వీలు కల్పిస్తాయి. మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. సీసీజెడ్ లలో నిల్వ మౌలిక సదుపాయాలు ధరలను స్థిరీకరిస్తాయి. పంట కోత అనంతర నష్టాలను తగ్గిస్తాయి. సహకార గోదాములు, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాల ద్వారా రైతుల తక్షణ ఇబ్బందులను నివారించవచ్చు. విలువ జోడింపు, ప్రాసెసింగ్ కేంద్రాలను ఏకీకృతం చేయడం వల్ల ముడి ఉత్పత్తులు అధిక-విలువ గల ఉత్పత్తులుగా రూపాంతరం చెందుతాయి, రైతు లాభదాయకతను పెంచుతాయి.

ఈ-కామర్స్, ప్రత్యక్ష అమ్మకం మార్గాల ద్వారా సీసీజెడ్ లు ఒక పారదర్శకమైన, రైతు-కేంద్రిత మార్కెట్ ను సృష్టిస్తాయి, ఇక్కడ రైతులు ధరలను నిర్ణయిస్తారు. కృత్రిమ మేధ ఆధారంగా ధరల అంచనా, బ్లాక్ చెయిన్ ఆధారిత పారదర్శకత, మొబైల్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ లతో ఎప్పటికప్పుడు ధరల నిర్ణయం, సురక్షిత లావాదేవీలను అందించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు రైతులకు రుణాలు, పంటల బీమా, హెడ్జింగ్ యంత్రాంగాలపై అవగాహన కల్పిస్తాయి. విజయవంతమైన ప్రపంచ నమూనాలు సహకార ఆధారిత సరకు నిర్వహణ సామర్థ్యాన్ని, ప్రయోజనాలను వెల్లడిస్తున్నాయి. నెదర్లాండ్స్, కెనడా, భారతదేశం అమూల్ డెయిరీ నమూనా సహకార సంఘాలు వ్యవసాయ రంగంలో సంపదను ఎలా సృష్టించగలవో నిరూపించాయి. ధాన్యాలు, పప్పులు, ఉద్యాన ఉత్పత్తులకు ఈ విధానాన్ని విస్తరించడం వల్ల రైతు యాజమాన్యంలో సంస్థల జాతీయ నెట్వర్క్ను సృష్టించవచ్చు. సీసీజెడ్ లు రైతుల ఆదాయాన్ని పెంచుతాయి, కోత అనంతర నష్టాలను తగ్గిస్తాయి, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ లో ఉపాధిని సృష్టిస్తాయి. ఈ వ్యవస్థ ప్రభుత్వ సేకరణపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, రైతులు వారి ఆర్థిక భవితవ్యాన్ని నిర్దేశించుకునేందుకు సాధికారత కల్పిస్తుంది. సరైన విధానాలు, సహకార నాయకత్వంతో సీసీజెడ్ లు భారతీయ వ్యవసాయాన్ని స్వయం సమృద్ధిగా, సుసంపన్నంగా, ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయగలవు.

రైతులు మనుగడ నుంచి సంపద వైపు మారాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల తప్పుదోవ పట్టించే కథనాలను తిప్పికొడుతూ సీసీజెడ్ లు ఈ పరివర్తనకు ప్రణాళికను అందిస్తాయి. సీసీజెడ్ నమూనాను ఒక ఆలోచన అని కాకుండా భారతదేశ వ్యవసాయరంగాన్ని పునర్నిర్వచించడానికి, రైతులను ఆర్థిక పురోగతికి కేంద్రబిందువుగా చేయడానికి సిద్ధంగా ఉన్న ఉద్యమంగా పరిగణించాలి.

బినోద్ ఆనంద్,
కేంద్ర వ్యవసాయ శాఖ ఎంఎస్పీ కమిటీ సభ్యుడు