Kaleshwaram

కాళేశ్వరంను ‘రెడీమేడ్ ఏటీఎం’గా మార్చుకుంటున్న రేవంత్ రెడ్డి!

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల కుంభకోణంకు పాల్పడిందని, తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆ మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేసి, పేదలకు పంచుతానని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో, అంతకు ముందు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి రాబట్టలేదు. పైగా, అసలు అవినీతి జరిగన్నట్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి నిర్ధారణ చేయలేక పోయింది. ఈ ప్రాజెక్టులో అవినీతిని నిర్ధారించేందుకు అంటూ జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ విచారణ పరిధిలో మొత్తం అవినీతికి సంబంధించిన వ్యవహారాలతో సంబంధం లేకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణకు పరిమితం చేశారు. 

రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలలో జరిగిందని చెబుతున్న అవినీతిలో 10 శాతంకు పరిమితం చేయడం ద్వారా విచారణను మొదట్లోనే నిర్వీర్యం కావించారు. పైగా, ఈ అవినీతిలో కీలక భాగస్వామిగా భావిస్తున్న కాంట్రాక్టర్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, అతనినే కొనసాగనిస్తూ, ఆ కంపెనీకి మరిన్ని ప్రభుత్వ పనులను అప్పగించడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో భాగస్వామ్యం కోసం ఆరాటపడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.  కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదిక చెల్లదని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం గమనిస్తే అసలు అవినీతిని వెలికితీసే ఉద్దేశం ఈ ప్రభుత్వంకు లేదని స్పష్టం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో అవినీతిని నిర్ధారించకుండా, లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును వృథాగా ఉంచలేమని, రిపేర్లు చేయిస్తామని చెబుతూ మరికొన్ని వందలు లేదా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. గతంలో కేసీఆర్ కు ‘ఏటీఎం’గా మారిందని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ‘రెడీమేడ్ ఏటీఎం’గా తయారైందని కాంగ్రెస్ వర్గాలలోని ఆరోపణలు చెలరేగుతున్నాయి. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసినా కూడా అందులో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాల పెంపు, అవినీతి విషయాన్ని పూర్తిగా విస్మరించారు. కేవలం ఈ కమిషన్ కు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో జరిగిన అక్రమాలు, అవీనీతి, డిజైన్ల లోపాలు వంటి వాటిపైనే దృష్టి సారించే విధంగా టర్మ్స్ అఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అతి పెద్ద కాంపోనెంట్ అయిన మోటార్లు, పుంపుల విషయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాల విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విస్మరించింది. దీనికి ప్రధాన కారణం ఇందులో భాగస్వాములు ఉన్న కాంట్రాక్టర్లను కాపాడటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా దీన్ని ఒక ‘రెడీ మేడ్ ఏటీఎం’ గా మార్చుకున్నట్లు స్పష్టం అవుతుంది. హైకోర్టు తీర్పును నిశితంగా పరిశీలిస్తే విచారణకు ప్రభుత్వం సరిగ్గా సహకరించలేదని, విచారణ పట్ల ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించలేదని భావించాల్సి వస్తుంది. అందుకనే కమిషన్‌ సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్‌ స్మితాసబర్వాల్‌, మాజీ ఐఏఎస్‌ ఎస్‌కే జోషిపై ఏ విధమైన చర్యలూ తీసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో-6ను సమర్థించిన హైకోర్టు అందులో జ్యుడీషియల్‌ కమిషన్‌ అని ఉన్నంత మాత్రాన అదేమీ జ్యుడీషియల్‌ విచారణ కాబోదని, విచారణ కమిషన్లు చట్టానికి అతీతంగా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేయడం గమనార్హం. 

హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని చట్టపరంగా సమర్థవంతంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వెల్లడి అవుతుంది. ఈ తీర్పు ఇచ్చేందుకు హైకోర్టు సూచించిన అంశాలు, వెల్లడించిన కారణాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల వైపే చూపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ విధివిధానాలు, విచారణలో నిబంధనలు పాటించలేదని వెల్లడవుతుంది. ఈ పరిణామాలు చూస్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాల విషయంలో అసలు అవినీతిపరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు భావించాల్సి ఉంటుంది. చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా తగిన ఆధారాలను సమర్పించలేకపోవడం వల్ల, కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్థతకు నిదర్శనంగా పరిగణించాల్సిందే. అధికారంలోకి రాగానే కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు, చర్యలు తీసుకోకపోవడం గమనిస్తే ఈ రెండు పార్టీలు కుముక్కు రాజకీయాలు ఆడుతున్నట్లు వెల్లడి అవుతుంది. 

ఇంతవరకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల రూపాయల అవినీతి, ఫార్ములా వన్ రేస్ పేరుతో జరిగిన ఖర్చులు, డ్రగ్స్ కేసు, భూఆక్రమణలు, భూకేటాయింపులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలలో అవినీతి, అక్రమాలు జరిగాయని, అవినీతి సొమ్మును కక్కిస్తానని పదే పదే రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ వాటిపై ఒక్కటంటే ఒక్క చర్యకూడా తీసుకోలేదు. గత ప్రభుత్వాలు చేసిన స్కాం లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం, అక్రమంగా సంపాదించిన డబ్బును రికవరీ చేయటం కంటే కూడా పాత స్కాంల నుంచే కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు తమ వంతు వాటాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు కూడా అధికారంలోకి వచ్చిన కొత్తలో కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రాజెక్టు స్కాం విషయంలో మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.

కృష్ణ చైతన్య