నోయిడా హింస అస్థిరత సృష్టించే కుట్రలో భాగమేనా?
నోయిడాలోని పారిశ్రామికవాడలో ఫ్యాక్టరీ కార్మికులు వేతనాల పెంపు కోసం చేపట్టిన న్యాయమైన నిరసనలు కాస్తా హింస, విధ్వంసం, అరాచకాలకు దారితీశాయి. ‘కొంతమంది ఉద్యమకారులు’ QR కోడ్‌లు, వాట్సాప్ గ్రూపులు, ఇంటింటి ప్రచారాలకు పాల్పడినట్టు వివరాలు వెలుగులోకి రావడంతో ఒక కీలక ప్రశ్న ఉత్పన్నమైంది: ఇది కార్మికులు స్వచ్ఛందంగా చేపట్టిన నిరసనా లేక పారిశ్రామిక వాడను అస్థిరపరిచేందుకు పన్నిన పక్కా కుట్రా? మరీ ముఖ్యంగా, ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనా లేక రాబోయే ప్రమాదకర పరిణామాలను సూచించే ఒక ప్రయోగమా? వెలుగులోకి వస్తున్న వాస్తవాలను బట్టి చూస్తే అతివాద వామపక్ష సంస్థలు ఏదో ఒక కార్యాచరణ నియమావళి (టూల్‌కిట్) ను అమలు చేసినట్టు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. గత మార్చి నెలలో పానిపట్, గుర్గావ్-మనేసర్‌లలో కూడా కార్మికులు ఇలాంటి నిరసనలే చేపట్టారు. ఆ నిరసనల ఫలితంగా వేతనాలు పెరగడమే కాకుండా, పని పరిస్థితులు మెరుగుపరుస్తామనే హామీలు లభించాయి. అదే మూస పద్ధతిని నోయిడాలోనూ అమలు చేశారు. ఒకవేళ ఇది పథకం అయితే, దీనిని రూపొందించి అమలు చేసింది ఎవరు?
కమ్యూనిస్టు అనుబంధ సంస్థల మద్దతు
క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం, సీపీఐ-ఎంఎల్ అనుబంధ సంస్థ అయిన ‘బిగుల్ మజ్దూర్ దస్తా’ దీని వెనుక ఉంది. ఈ సంస్థ తొలుత తన కార్యకర్తలను పానిపట్, గుర్గావ్-మనేసర్‌లకు పంపింది. ఏప్రిల్ ప్రారంభంలో వారు నోయిడాకు చేరుకుని పానిపట్, గుర్గావ్ విజయాల గురించి అక్కడి పారిశ్రామిక కార్మికులకు వివరించారు. మార్చి చివరిలో ఈ కామ్రేడ్లు గ్రేటర్ నోయిడాలోని కులేసరా వంటి ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించి, వారి ప్రచురణ అయిన ‘మజ్దూర్ బిగుల్’ను పంపిణీ చేశారు. ‘ధరల పెరుగుదల, తక్కువ వేతనాలు, అధ్వాన్నమైన పని పరిస్థితులకు’ వ్యతిరేకంగా పోరాడాలని వారు కార్మికులను రెచ్చగొట్టారు.
అరెస్టయిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను పరిశీలించగా, ఈ బృందాలు ‘మజ్దూర్ ఆందోళన్’ (కార్మిక ఉద్యమం) వంటి వివిధ పేర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్రూపుల ద్వారా రెచ్చగొట్టే పోస్ట్‌లను పంపిణీ చేయడమే కాకుండా, వివిధ కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్న ఇతర గ్రూపులకు కూడా ఈ సందేశాలను పంపినట్లు నివేదిక పేర్కొంది. స్వాధీనం చేసుకున్న పరికరాల ద్వారా సేకరించిన ఆధారాలు, కార్మికులను శాంతియుత నిరసనల వైపు కాకుండా హింస వైపు మళ్లించేందుకు సమన్వయంతో కూడిన ప్రయత్నం జరిగినట్లు సూచిస్తున్నాయి.
తొలుత శాంతియుతంగా ఉన్న నిరసనకారులను హింసకు ప్రేరేపించడంలో ‘బయటి వ్యక్తుల’ పాత్ర ఉందని నోయిడా పోలీసులు గుర్తించారు. అధికారుల కథనం ప్రకారం, కార్మికులు శాంతియుతంగా విడిపోయిన తర్వాత, జిల్లా వెలుపలి నుంచి ఒక బృందం సరిహద్దు ప్రాంతాల్లోకి ప్రవేశించి మరింత అశాంతిని సృష్టించడానికి ప్రయత్నించింది. వీరిలో పలువురిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. తగినంత సంఖ్యలో కార్మికులు సిద్ధమైన తర్వాత, బిగుల్ మజ్దూర్ దస్తా ఏప్రిల్ 9న NSEZ మెట్రో స్టేషన్ సమీపంలో నిరసనకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో వందలమంది కార్మికులు పాల్గొన్నారు. అదే సమయంలో పారిశ్రామికవాడ లోని ఫేజ్-2లో ఉన్న రిచా గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికులు కూడా తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. ఈ నిరసన చిత్రాలను బిగుల్ మజ్దూర్ దస్తా వెంటనే విస్తృతంగా ప్రచారం చేస్తూ, నోయిడాలోని దుస్తుల తయారీ క్లస్టర్లకు కూడా ఈ నిరసనలు వ్యాపిస్తున్నాయని రెచ్చగొట్టే సందేశాలను పంపింది. ఏప్రిల్ 8 నాటికి పరిస్థితి మరింత ముదిరి మరిన్ని చోట్ల నిరసనలు మొదలయ్యాయి. ఈ దశలో ‘కార్మికుల ప్రాథమిక హక్కులను దూరం చేస్తున్నారు, పెట్టుబడిదారులు కార్మికుల కష్టార్జితాన్ని కాజేస్తున్నారు’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలతో వామపక్ష వాదనలు తెరపైకి వచ్చాయి. ఏప్రిల్ 10, 11 తేదీల నాటికి దుస్తుల తయారీ క్లస్టర్లలోనే కాకుండా, నోయిడా సెక్టర్-84లోని మదర్సన్ సుమీ సిస్టమ్స్ లిమిటెడ్ వంటి అంతర్జాతీయ ఆటోమోటివ్ విడిభాగాల తయారీ యూనిట్‌కు కూడా ఈ నిరసనలు పాకాయి.
కార్మికులను రెచ్చగొట్టిన శక్తులు
ఈ సమయానికి, పోలీసులు కొంతమంది నిరసనకారులను గుర్తించారు. దీని ప్రకారం రూపేష్, ఆకృతి, సృష్టి, మనీషా అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ వాట్సాప్ గ్రూపులు నిరంతరం కార్మికులను రెచ్చగొడుతూనే ఉన్నాయి. దీనివల్ల వివిధ కంపెనీల కార్యకలాపాలకు విఘాతం కలిగింది. ఏప్రిల్ 13 నాటికి తెర వెనుక ఉన్న శక్తులు తమ వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి. శ్యామ్ మూర్తి అనే కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారని, దానికి నిరసనగా కార్మికులు ఫేజ్-2 పోలీస్ స్టేషన్ వైపు ‘మార్చ్’ నిర్వహిస్తున్నారని సందేశాలు పంపారు. దీంతో దిల్లీ-నోయిడా సరిహద్దులో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఈ సందేశాల ప్రభావంతో కార్మికులు విధ్వంసానికి, దహనకాండకు, రాళ్ల దాడికి పాల్పడటమే కాకుండా వివిధ కంపెనీల అధికారుల కార్లను ధ్వంసం చేశారు. అంతటా అరాచక పరిస్థితి నెలకొంది.
ఈ ఘటన జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. దీని వెనుక ఏదో ప్రమాదకరమైన వ్యూహం ఉన్నట్లు బయటపడింది. బిగుల్ మజ్దూర్ దస్తాతో పాటు, మజ్దూర్ అధికార్ సంఘర్ష్ అభియాన్ (16 కార్మిక సంఘాల కూటమి), మజ్దూర్ ఏక్తా కమిటీ, CITU, IFTU, సర్వహార, ఆల్ ఇండియా లేబర్ రిఫార్మ్ సంఘర్ష్ అభియాన్, సెంటర్ ఫర్ స్ట్రగులింగ్ ట్రేడ్ యూనియన్స్, రివల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా , క్రాంతికారి ఉపాధి హామీ మజ్దూర్ యూనియన్, నౌజవాన్ భారత్ సభ వంటి సంస్థల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇదంతా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం జరుగుతోంది – ఇంటింటి ప్రచారం ద్వారా కార్మికులను చేరుకోవడం, హక్కుల పేరుతో వారిని రెచ్చగొట్టడం, వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతరం వారిలో ఆవేశాన్ని నింపడం, పారిశ్రామిక కార్యకలాపాలను స్తంభింపజేయడానికి అరాచకాన్ని సృష్టించడం జరిగింది. నోయిడాలో దాదాపు 80 ప్రాంతాల్లో సుమారు 45,000 మంది కార్మికులు ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు అంచనా. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. సుమారు 350 మందిని అరెస్టు చేయగా, మరో 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ‘దేశ వ్యతిరేక శక్తుల’ ప్రమేయం ఉన్న ‘ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర’ అని ఉత్తరప్రదేశ్ అధికారులు పేర్కొన్నారు. కొందరు దీనికి పాకిస్థాన్ లింకులు ఉండే అవకాశం ఉందని కూడా అనుమానిస్తున్నారు.
మావోయిస్టు భావజాలం
ఈ పరిణామాలు కేవలం హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఆగ్రహం కాదని, అరాచకం సృష్టించేందుకు అతివాద వామపక్షాలు రూపొందించిన ప్రణాళిక అని స్పష్టమవుతోంది. యూపీ పోలీసుల దర్యాప్తులో వాట్సాప్ చాట్‌లు, ఆడియో క్లిప్‌లు, ఇన్‌స్టాగ్రామ్ సందేశాల ద్వారా వేతన నిరసనలను అల్లర్లుగా మార్చేందుకు కుట్ర జరిగినట్లు తేలింది. ఏప్రిల్ 13కి రెండు మూడు రోజుల ముందే ‘వర్కర్స్ మూవ్‌మెంట్’ వంటి గ్రూపులను క్రియాశీలం చేయడం, ఏప్రిల్ 12 రాత్రికి రాత్రే QR కోడ్‌ల ద్వారా వందలాది మందిని చేర్చుకోవడం వంటివి ఇందులో భాగమే. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కారం వంటి వస్తువులను వెంట తెచ్చుకోవాలని సూచనలు కూడా ఇచ్చారు. మార్క్సిస్టు-లెనినిస్టు భావజాలం కలిగిన ఈ సంస్థలు, వేతన పెంపు డిమాండ్‌ను అస్థిరతకు ఒక సాధనంగా మార్చుకున్నాయి. ఇందులో రివాల్యూషనరీ వర్కర్స్ పార్టీ పాత్ర ప్రత్యేకంగా గమనించదగ్గది. ఈ ఏడాది జనవరిలో నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ పుస్తక ప్రదర్శనలో ఈ సంస్థ ‘జనచేతన’ పేరుతో స్టాల్ ఏర్పాటు చేసి ‘మజ్దూర్ బిగుల్’ ప్రచురణలను పంపిణీ చేసింది. ఆ స్టాల్‌లో మావో ఆలోచనలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ సంస్థకి పుణె, ముంబై, థానే పారిశ్రామిక ప్రాంతాల్లోని మురికివాడల్లో కార్యాలయాలు ఉన్నాయి. ఈ సంస్థ గతంలో ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా మద్దతు నిరసనల్లో కూడా పాల్గొంది. గత ఏడాది పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు కమాండర్ బసవరాజు మృతికి నిరసనగా కూడా ఇది గళమెత్తింది. అలాగే, మావోయిస్ట్ మిలిటరీ కమాండర్ మడ్వి హిడ్మాను కీర్తిస్తూ నినాదాలు చేసిన చరిత్ర కూడా వీరికి ఉంది.
ఈ సంస్థల ప్రమేయం ఒక పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలను కలిగిస్తోంది. సాయుధ మావోయిజం దాదాపు అంతరించిపోయి, మావోయిస్టులు భారీగా లొంగిపోతున్న తరుణంలో దేశవ్యాప్తంగా కార్మిక నిరసనలు పెరగడం కేవలం కాకతాళీయమేనా? ఇది మావోయిస్టుల వ్యూహాత్మక మార్పును సూచిస్తుందా? లొంగిపోయిన పలువురు మావోయిస్టు నేతలు తాము తుపాకీని వదిలి రాజ్యాంగాన్ని చేతబట్టామని, కానీ ‘ప్రజల కోసం పని చేస్తూనే ఉంటామని’ చెప్పడం గమనార్హం. అంటే వారు మావోయిస్టు భావజాలంతో కార్మికులు, రైతులు, విద్యార్థులను ‘ప్రజాస్వామ్య ముసుగులో’ రెచ్చగొడుతున్నారా? ఈ నిరసనలు ‘చట్టబద్ధ మావోయిజం’ అనే ప్రమాదకర ధోరణికి నాంది కాదా? నోయిడా నిరసనలను ఈ కోణంలో విచారించాల్సిన అవసరం ఉంది. ఈ అనుమానం నిజమైతే, ఇది దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించకముందే అరికట్టడం అత్యంత కీలకం.
కార్తీక్ లోఖండే

