మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న కాంగ్రెస్
కాంగ్రెస్ అసలు రంగు బయటపడింది.. మరోసారి మహిళా వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది.. మహిళా సాధికారత పట్ల పెద్దపెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్ తదితర ఇండీ కూటమి పక్షాలు తమ ముసుగు తొలగించాయి.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అడ్డుకున్నాయి.. రానున్న 2029 ఎన్నికల నుంచి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పం విపక్షాల కుట్రలకు సాకారం కాకుండా పోతుంది.
కాంగ్రెస్, ఇండీ కూటమి ద్రోహం వల్ల చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 298-230 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఏప్రిల్ 17న రాత్రి 7.19 గంటలకు సభలో ఓటింగ్‌కు పెట్టిన ఈ బిల్లు 2/3వంతు మెజార్టీ సాధించలేకపోయింది. సభకు హాజరై ఓటింగ్‌లో పాల్గొన్న 528 మందిలో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో అవసరమైన 2/3వంతు మెజార్టీ రాలేదు. దీంతో దీనిపై తదుపరి కార్యాచరణ చేపట్టడం లేదని స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలు కుట్రలు బయటపడ్డాయి. మహిళా రిజర్వేషన్ల పట్ల ప్రతిపక్షాల వైఖరిని నిరసిస్తూ ఎన్డీయే పక్ష మహిళా ఎంపీలు రాత్రి పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. అయితే, దీంతో ఆగిపోమని, మహిళలకు దక్కాల్సిన హక్కులను వారికి అందించడానికి ఇకముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటామని మోదీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. బిల్లు పాస్ కావడానికి సభకు హాజరై ఓటేసిన 528 మందిలో 352 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా అంతకంటే 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. 2023లో పార్లమెంటు ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ చట్టానికి (మహిళా రిజర్వేషన్ల బిల్లు) ఢోకాలేకపోయినా అమలుకు మాత్రం అడ్డంకులు తొలగనట్లైంది. లోక్‌సభ సీట్లను 850కి పెంచి అందులో మూడోవంతు సీట్లను 2029 ఎన్నికల్లో మహిళలకు కేటాయించాలన్న లక్ష్యం నెరవేరకుండాపోయింది.
మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవడానికి ఇప్పుడున్న 543 స్థానాలను 50 శాతం మేర పెంచి 850కి తీసుకెళ్లడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించడంతో పాటు… 2027 జనగణన వరకు ఆగకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేసేందుకు వీలు కల్పించే ఆర్టికల్ 334A కి సవరణలు చేస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ప్రవేశపెట్టేటప్పుడే ప్రతిపక్షాలు ఓటింగ్ కోరి అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. ఏప్రిల్ 16న ఉదయం 251-185 ఓట్ల తేడాతో ఆ గండాన్ని గట్టెక్కింది. ఈ సవరణ బిల్లులపై దాదాపు 22 గంటలపాటు చర్చ జరిగింది. ఇందులో 130 మంది సభ్యులు పాల్గొన్నారు. అందులో 56 మంది మహిళలు ఉన్నారు. వారి అభిప్రాయాలకు హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు.
చర్చలో ఏప్రిల్ 17న హోంమంత్రి సమాధానం ఇస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ లేచి ”50 శాతం సీట్లు పెంచుతామన్న హామీ ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్‌సభ సీట్లు కేటాయిస్తున్నారో చెబుతూ రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించడంతోపాటు, మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్‌ను డీలింక్ చేయడానికి మీరు సిద్ధమైతే మిగతా అంశాలకు మద్దతివ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. దీనిపై హోంమంత్రి ఏమంటారు” అని ప్రశ్నించారు. అందుకు హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ 50 శాతం పెంపు ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించేదీ చెబుతూ బిల్లులో పొందుపరచడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గంట సమయం ఇస్తే ఆమేరకు బిల్లును సవరించి సభ ముందుంచుతామని ప్రకటించారు. తాము 50 శాతం సీట్లు పెంచుతామని ప్రకటించామని, అందులో దాయడానికి కానీ, చోరీచేయడానికి కానీ ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ప్రతిపక్షాలు పెద్దపెట్టున గొడవ చేశాయి. రాత్రి 7.19 గంటలకు స్పీకర్ ఓటింగ్‌కు పెట్టగా తొలుత నిర్వహించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 278, వ్యతిరేకంగా 211 మంది ఓట్లు కనిపించాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ను రూఢీ చేసుకోవడానికి మళ్లీ సభ్యులకు చీటీలు ఇచ్చి స్వీకరించిన మాన్యువల్ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 మంది ఓటేసినట్లు స్పీకర్ ఓంబిర్లా రాత్రి 7.41 గంటలకు సభాముఖంగా ప్రకటించారు. అవసరమైన 2/3వంతు మెజార్టీ సాధించలేక పోయింది. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచి ఎవ్వరికీ నష్టం జరగకుండా చూస్తామని అటు ప్రధానమంత్రి, ఇటు హోంమంత్రి అమిత్‌షాలు సభాముఖంగా హామీ ఇచ్చినా ప్రతిపక్షాలు పట్టించుకోలేదు.
ఆ నేపథ్యంలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టసవరణ బిల్లు-2026పై తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజూకు స్పీకర్ సూచించారు. అందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ తాము ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుబంధంగా ఉన్నందున వాటిని ప్రత్యేకంగా చూడకూడదన్నారు. దేశంలోని మహిళలకు గౌరవం, హక్కులు కల్పించే చరిత్రాత్మక బిల్లుకు విపక్షాలు మద్దతు ఇవ్వకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. చరిత్ర ఇచ్చిన ఒక అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయాయని నిందించారు. మహిళలకు హక్కులు కల్పించే ప్రయత్నాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలో తాము ముందుకు తీసుకెళ్తామని ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి హక్కులు కల్పించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తూ మిగతా రెండు బిల్లులను ముందుకు తీసుకెళ్లదలచుకోలేదని ప్రకటించారు. దాంతో స్పీకర్ ఓంబిర్లా సభాకార్యకలాపాలను ముగించి వాయిదా వేశారు.

