Muslim Papulation

ముస్లింలను బీసీ జనాభాలో కలిపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణ బీసీ జనాభాలో అత్యధికంగా బీసీ ‘ఈ’ క్యాటగిరీలోని ముస్లింలే అగ్రస్థానంలో నిలిచారు. బీసీల మొత్తం జనాభాలో ముస్లింలు 27,95,727 మంది (7.9%) ఉన్నారు. ఆ తరువాత ముదిరాజ్‌ జనాభా అత్యధికంగా ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి హడావుడిగా రాష్ట్రంలో ప్రతి కులం, జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని వెల్లడించింది. తెలంగాణ బడుగుబలహీన వర్గాల్లో మిగతా అన్ని ఉప కులాల కన్నా ముస్లింలే అత్యధికంగా ఉన్నారని ప్రకటించడం విస్మయం కలిగిస్తుంది. అసలు ముస్లింలను బీసీలుగా పరిగణించడాన్నే బడుగులు వ్యతిరేకిస్తుంటే, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏకంగా అధిక సంఖ్యాక బడుగులు ముస్లింలేనని ప్రకటించడం మరింత విడ్డూరం. ముస్లిం ఓటుబ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్‌ పొలిటికల్‌ గేమ్‌ ఆడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గౌడన్నలు, నేతన్నలు, ముదిరాజన్నలు, గొల్లకురుమలు, మున్నూరుకాపు తదితర సబ్బండ వర్గాలు తెలంగాణలో బలహీన వర్ణాలు గొంతుకలై ప్రతిధ్వనిస్తూ తమ అస్తిత్వం కోసం, రాజకీయాల్లో తమ వాటా కోసం దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుంటే వారందరిపై పిడుగుపాటుగా, శరాఘాతంలా తెలంగాణలో అత్యధికసంఖ్యలో ఉన్న బీసీ వర్గం ముస్లింలేనని రేవంత్‌ సర్కార్‌ చిమ్మ చీకటిలో ప్రకటించడం గమనార్హం. రాష్ట్రంలోని కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన కులగణన నివేదికలో బీసీలు 56.33 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ముస్లింలు 10.45 శాతం ఉన్నారని, బీసీల్లో అత్యధికులు వారేనని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వ్యూహాత్మకంగానే రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల్లో అతిపెద్ద సామాజిక వర్గంగా ముస్లింలను ప్రకటించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 42 శాతం రిజర్వేషన్ల నాటకం బెడిసికొట్టి బీసీల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముస్లిం ఓటర్లను తమ వైపునకు ఆకర్షించే వ్యూహంతోనే బీసీ కులగణన నివేదిక రూపొందించినట్టు స్పష్టం అవుతుంది. బీసీలకు 42 శాతం ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను పెంచకపోగా, ఉన్న కోటాలోనే కొంత భాగాన్ని ముస్లిం సామాజిక వర్గానికి పంచి ఇచ్చే పరిస్థితులను సృష్టిస్తున్నదని బీసీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కులగణన ప్రకారం రాష్ట్రస్థాయి సంక్షేమ, అభివృద్ధి పథకాలతోపాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ప్రధాన వాటా బీసీ ముస్లింలకే దక్కుతాయని చెప్తున్నారు. ఇది గౌడ, యాదవ, మున్నూరుకాపు, పద్మశాలీ తదితర వృత్తికులాల హక్కులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సామాజిక వర్గాన్ని బీసీలుగా నిర్ధారించడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలు పాటించిందో నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు.  

హిందువుల్లో ఉన్నట్టే ముస్లిం సామాజికవర్గంలోనూ స్పష్టమైన కుల వ్యవస్థ ఉన్నదని, మొత్తంగా 25 ఉపకులాలు ఉన్నాయని చెప్తారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలందరినీ ఒకే వర్గంగా చిత్రీకరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిని బీసీల కింద ఎలా చేర్చారనే దానికి ప్రభుత్వం ఎటువంటి శాస్త్రీయ ఆధారం ప్రజల ముందు ఉంచడం లేదు. ఈ నిర్ణయం బీసీలను దెబ్బతీయడంతో పాటు వారిలోని నిజంగా అవసరమైన, వెనుకబడిన కులాలకు లక్షిత ప్రయోజనాలు అందకుండా చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రతి పదేండ్లకూ 13.5 శాతం జనాభా పెరుగుతుందని అంచనా. అయితే  సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే కాంగ్రెస్‌ ప్రభుత్వం జరిపిన కులగణన నివేదికలో హిందూ బీసీల సంఖ్య దాదాపు 21 లక్షల వరకు తగ్గింది. అంటే 5 శాతం పడిపోయింది. జనాభా పెరగాల్సిన చోట బీసీ జనాభా తగ్గడం విస్మయం కలిగిస్తోంది. బీసీ కులాల జనాభాను తక్కువ చూపితే తిరుగుబాటు వస్తుందనే భయంతో ముస్లింలను బీసీల్లో చేర్చినట్టు భావిస్తున్నారు.

ప్రవీణ్