Rural Roads

గ్రామీణ భారత్ ముఖచిత్రాన్ని మార్చిన ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన

ఒక దేశ అభివృద్ధికి రహదారులు వెన్నెముక వంటివి. ముఖ్యంగా భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో పల్లెలు ప్రగతి పథంలో పయనించాలంటే పటిష్టమైన రోడ్డు వ్యవస్థ అనివార్యం. ఈ లక్ష్యంతో ప్రారంభమైన ‘ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన’ (PMGSY) విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుని రజతోత్సవాల జరుపుకొంటోంది. 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకం నేడు దేశంలోని మారుమూల గ్రామాలను సైతం ప్రధాన స్రవంతితో అనుసంధానిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త జవజీవాలను అందిస్తోంది.

ముఖ్యాంశాలు 

  • అద్భుత పురోగతి: పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 8,25,114 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులకు అనుమతులు లభించగా, 7,87,520 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తయింది.
  • PMGSY–III: ఈ దశలో 1,22,393 కిలోమీటర్ల రహదారులను మంజూరు చేయగా, ఇప్పటికే 1,01,623 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి.
  • PMGSY–IV (2024–29): రాబోయే ఐదేళ్లలో రూ.70,125 కోట్ల వ్యయంతో 25,000 ఆవాసాలను అనుసంధానిస్తూ 62,500 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
  • సాంకేతిక పర్యవేక్షణ: OMMAS (Online Management, Monitoring and Accounting System), ఇ-మార్గ్, GPS ట్రాకింగ్ వంటి ఆధునిక వ్యవస్థల ద్వారా పారదర్శకతను, నాణ్యతను పెంచారు.

అనుసంధానం నుంచి అభివృద్ధికి ప్రస్థానం

2000 డిసెంబర్ 25న అప్పటి అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం ఈ మహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అప్పటివరకు సరైన రవాణా సౌకర్యాలు లేని పల్లెలకు ‘అన్ని కాలాల్లో ఉపయోగపడే’ రహదారులను అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. గడిచిన 25 ఏళ్లలో ఈ పథకం కేవలం రోడ్ల నిర్మాణానికే పరిమితం కాకుండా, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషించింది.

దశలవారీ పురోగతి

  1. మొదటి దశ (2000): జనాభా ప్రాతిపదికన గతంలో రహదారి సౌకర్యం లేని గ్రామాలకు అనుసంధానత కల్పించడంపై వాజపేయి ప్రభుత్వం దృష్టి సారించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 1,63,339 ఆవాసాలకు రహదారి సౌకర్యం లభించింది.
  2. రెండవ దశ (2013): ఉన్న రహదారులను బలోపేతం చేయడంపై, గ్రామీణ మార్కెట్లు, సేవా కేంద్రాలను కలిపే కీలక మార్గాలను అభివృద్ధి చేయడంపై కేంద్రీకరించింది.
  3. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ప్రాజెక్ట్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లోని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాల కదలికలకు, స్థానిక ప్రజల రవాణాకు వీలుగా ప్రత్యేకంగా రహదారులను నిర్మించారు.
  4. మూడవ దశ (2019): గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, ఉన్నత పాఠశాలలు, ఆస్పత్రులను అనుసంధానించే 1.25 లక్షల కి.మీ.ల మార్గాలను ఆధునికీకరించడమే దీని లక్ష్యం. 2025 డిసెంబర్ నాటికి ఈ లక్ష్యంలో 83 శాతం పనులు పూర్తయ్యాయి.
  5. నాల్గవ దశ (2024): 2011 జనాభా లెక్కల ప్రకారం మైదాన ప్రాంతాల్లో 500, కొండ ప్రాంతాల్లో 250 జనాభా ఉన్న మిగిలిన ఆవాసాలను అనుసంధానించేందుకు రూ.70,125 కోట్ల భారీ కేటాయింపుతో ఈ దశ ప్రారంభమైంది.

సాంకేతికతతో నాణ్యతకు భరోసా

PMGSY విజయానికి ప్రధాన కారణం అందులో అమలు చేస్తున్న కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థ. కేవలం రోడ్లు వేయడమే కాకుండా, అవి ఎంత కాలం మన్నుతాయనే దానిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

  • OMMAS: ప్రాజెక్టుల భౌతిక, ఆర్థిక పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షిస్తారు. నాణ్యత పరిశీలకులు క్షేత్రస్థాయి నుంచి ఫోటోలను జియో-ట్యాగ్ చేసి అప్‌లోడ్ చేస్తారు.
  • ఇ-మార్గ్ : రోడ్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన వేదిక. ఐదేళ్ల నిర్వహణ కాలంలో రోడ్డు నాణ్యతను బట్టే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరుగుతాయి.
  • GPS ట్రాకింగ్: 2022 నుండి పనుల్లో వినియోగించే యంత్రాలకు GPS విధిగా అమర్చారు. దీనివల్ల పనితీరులో పారదర్శకత పెరిగింది.

పటిష్టమైన సాంకేతిక ప్రమాణాలు

రహదారుల అభివృద్ధిలో పర్యావరణహితమైన సామాగ్రిని, అధునాతన నిర్మాణ సాంకేతికతలను వినియోగించడాన్ని ప్రభుత్వం చురుగ్గా ప్రోత్సహిస్తోంది. అంతర్జాతీయ అత్యుత్తమ విధానాలు, స్వదేశీ పరిశోధనల ఆధారంగా, ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) కొత్త ప్రమాణాలను రూపొందించడమే కాకుండా, ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను సవరిస్తూ ఈ నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోంది. దీనిలో భాగంగా, లభ్యత, సాంకేతిక సాధ్యాసాధ్యాలను బట్టి జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో విస్తృత శ్రేణి పర్యావరణహిత పదార్థాలను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా:

  • ఫ్లై యాష్, స్లాగ్ 
  • నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలు 
  • ప్లాస్టిక్ వ్యర్థాలు
  •  రబ్బర్, తారు 
  • జియోసింథెటిక్స్, బయో-బిటుమెన్
  • బయో-ఇంజనీరింగ్ పద్ధతులు

ప్రస్తుతం అమలులో ఉన్నాయి. 

ఆవిష్కరణలు-వాతావరణ స్థితిస్థాపకత

వినూత్న నిర్మాణ సాంకేతికతలను అనుసరించడం వల్ల గ్రామీణ రహదారుల మన్నిక పెరగడమే కాకుండా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం తగ్గుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం, కోల్డ్ మిక్స్ టెక్నిక్స్ వంటి పద్ధతులు ఇందుకు దోహదపడుతున్నాయి. జూలై 2025 నాటికి, ఈ సుస్థిరమైన పద్ధతులను ఉపయోగించి దేశవ్యాప్తంగా 1.24 లక్షల కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించారు. ఇది పర్యావరణ అనుకూలమైన మరియు విపత్తులను తట్టుకోగల గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక వ్యూహాత్మక మార్పును ప్రతిబింబిస్తోంది.

మూడంచెల తనిఖీ వ్యవస్థ: నాణ్యత కోసం మూడు స్థాయిల్లో తనిఖీలు నిర్వహిస్తారు:

  • స్థాయి 1: అమలు చేసే ఏజెన్సీ ద్వారా క్షేత్రస్థాయి తనిఖీలు
  • స్థాయి 2: రాష్ట్ర స్థాయి స్వతంత్ర నాణ్యత పరిశీలకులు 
  • స్థాయి 3: కేంద్ర మంత్రిత్వ శాఖ పంపే జాతీయ స్థాయి నాణ్యత పరిశీలకులు

 భారతీయ గ్రామాల సాధికారతకు ‘ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన’ ఒక వారధిలా నిలిచింది. 25 ఏళ్ల ఈ ప్రయాణం పల్లె ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా, పట్టణాలకు, పల్లెలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించింది. రాబోయే కాలంలో PMGSY-IV ద్వారా మిగిలిన మారుమూల ప్రాంతాలను కూడా అనుసంధానిస్తే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్ మరో అడుగు ముందుకు వేసినట్టవుతుంది. గ్రామీణ రవాణా రంగంలో ఈ నిశ్శబ్ద విప్లవం భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందనడంలో సందేహం లేదు.