స్వదేశీ ఇంజన్లతో వృద్ధి పథంలో భారత్ పరుగులు
భారత ఆర్థిక చరిత్రలో 1991వ సంవత్సరం ఎలాగైతే ఒక కీలక ఘట్టంగా నిలిచిపోయిందో, 2025 కూడా గతంతో తెగదెంపులు చేసుకున్న సంవత్సరంగా అదే స్థాయిలో గుర్తింపు పొందవచ్చు. ఈ రెండు సంవత్సరాలు కూడా ఒక దేశంగా మన సంకల్పం, ఆకాంక్ష, అమలు తీరును వేగవంతం చేశాయి. అయితే, 1991లో సంభవించిన తొలి విడత ఆర్థిక సంస్కరణలు విదేశీ చెల్లింపుల సంక్షోభం వల్ల ప్రేరేపితమైతే, 2025 నాటి సంస్కరణలు ప్రపంచ దేశాల మధ్య మారుతున్న అధికార సమతుల్యత, అవకాశాలను అందిపుచ్చుకోవాలనే అవగాహనతో సాగుతున్నాయి. గతంలో కంటే మిన్నగా సాగుతున్న ఈ సంస్కరణల పరంపర, విచ్ఛిన్నమవుతున్న ప్రస్తుత ప్రపంచంలో వృద్ధిని ఎలా పెంచి పోషించాలో మన అత్యున్నత నాయకత్వానికి — ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి — ఉన్న లోతైన అవగాహనకు నిదర్శనం.
డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన రాజకీయ, భౌగోళిక-ఆర్థిక సవాళ్లు మోదీలోని పాత విప్లవాత్మక కోణాన్ని మళ్ళీ వెలికితీశాయి. కాలం చెల్లిన పాత సిద్ధాంతాలను ఎదిరిస్తూ, జాతీయ గమ్యాన్ని ఇతరుల చేతుల్లో పెట్టడానికి నిరాకరించే ఒక రాజకీయ, ఆర్థిక విప్లవకారుడు మనకు కనిపిస్తున్నారు. అంతర్జాతీయ సంబంధాలు కేవలం లాభనష్టాల బేరసారాలే అని నిరూపించడం ద్వారా, భారత ఎదుగుదలను ఎవరూ వేడుకలా జరుపుకోరనే చేదు నిజాన్ని అమెరికా అధ్యక్షుడు భారత్ కు గుర్తుచేశారు. పురోగతి కరువైన నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అనేది పంచుకునే వస్తువు కాదు; అది పోటీ పడి సాధించాల్సింది, పోగేసుకోవాల్సింది, అవసరమైతే ఆయుధంగా మలుచుకోవాల్సింది. వృద్ధి అనేది భాగస్వామ్యాల ద్వారా వస్తుందని మనం కొంతకాలం భ్రమపడి ఉండవచ్చు, కానీ వృద్ధి అనేది మనమే స్వయంగా సాధించుకోవాల్సినది అని మోదీ సరిగ్గా గుర్తించారు. నిరంతరం నీరు పోయాల్సిన పెరటి మొక్కలా లేదా ఎప్పటికీ ఆపివేయకూడని ఉక్కు కర్మాగారంలా దీన్ని స్వదేశీయులే పెంచి పోషించాలి. అంతర్జాతీయ సంబంధాలు ముఖ్యమే, కానీ పశ్చిమ దేశాలు మనకు శత్రువులూ కాదు, రక్షకులూ కాదు. వారు కేవలం భాగస్వాములు మాత్రమే; వారి అస్థిర ధోరణులను మనం నిలకడైన చర్చల ద్వారా నియంత్రించుకోవాలి.
1980వ దశకంలో భారత దేశం పాత దేశాల పోకడలతో పోటీ పడేది. కానీ, 2020వ దశకంలో ఒక ప్రాచీన నాగరికత కేవలం మాటలతో కాకుండా, ఆచరణాత్మక ఉదాహరణలతో కొత్త ప్రపంచ ఏకాభిప్రాయానికి దారి చూపుతోంది. ‘భారత్’ అంటే ఇదే. ప్రపంచానికి మనం చూపించగలిగే అత్యుత్తమ నిదర్శనం మన ఆర్థిక వృద్ధే. సంస్కరణల వేగం ఉధృతంగా సాగిన ఈ ఏడాదిలో మోదీ మనకు అందించింది రాబోయే దశాబ్దాల వృద్ధికి అవసరమైన పునాదులే. ఈ సంస్కరణల్లో అత్యంత కీలకమైనది నాలుగు లేబర్ కోడ్ (కార్మిక చట్టాల) అమలు. 1990ల తర్వాత ఆర్థిక మూలకాల మార్కెట్లో జరిగిన అతిపెద్ద మార్పు ఇది. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వ్యాపారాలకు ఎలాంటి మద్దతు అవసరమో నేటి భారత్ చివరికి అర్థం చేసుకుంది. నిబంధనలను 75 శాతం, రిపోర్టింగ్ ఫారాలను 60 శాతం, రిటర్న్ రిజిస్టర్లను 90 శాతం మేర తగ్గించారు. దీనివల్ల 6 కోట్లకు పైగా సంస్థలు ప్రయోజనం పొందుతాయి — ఇది జీఎస్టీ పరిధి కంటే ఐదు రెట్లు ఎక్కువ.
మరోవైపు జీఎస్టీని కూడా ప్రక్షాళన చేశారు. రెండు స్లాబులను తొలగించి, నిబంధనల పాటింపును సరళతరం చేశారు. పన్ను తగ్గింపులు అద్భుతమైన వృద్ధిని అందించడమే కాకుండా, చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాయి. సంస్కరణ అనేది ఏదో ఒకసారి పెట్టే పెట్టుబడి కాదు; అది నిరంతర నిర్వహణ, క్షేత్రస్థాయి వాస్తవాలకు అనుగుణంగా మార్పులు చేయడం. అది నిరంతర పర్యవేక్షణతో కూడిన ప్రక్రియ.
పన్ను తగ్గింపులు నిజానికి పరోక్షంగా ఇచ్చే ఉద్దీపనలు. 2025 కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని నెలకు రూ.1,00,000 కు పెంచడం ద్వారా దేశంలో మధ్యతరగతి వర్గాన్ని ప్రభుత్వ వేధింపుల నుంచి — కేవలం భారీ పన్నుల నుంచే కాకుండా అనవసరమైన వేధింపులు, క్రిమినల్ కేసుల నుంచి — రక్షించాల్సిన అవసరాన్ని మోదీ నిరూపించారు. యూనిఫైడ్ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్, జన్ విశ్వాస్ 2.0 బిల్లు, కొత్త ఆదాయపు పన్ను చట్టం… ఇవన్నీ భారత్ ఇప్పుడు బలవంతపు వసూళ్లపై కాకుండా స్పష్టతపై ఆధారపడి నడుస్తోందని చాటిచెబుతున్నాయి.
చివరగా, డిసెంబర్లో చేపట్టిన మూడు సంస్కరణలు భారత్ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. గతంలో, బీమా, అణుశక్తి వంటి రంగాలలో విదేశీ భాగస్వామ్యంపై రాజకీయ విభేదాల వల్ల తీవ్ర జాప్యం జరిగేది. ఆ రోజులు పోయాయి. ఎటువంటి ఆర్భాటం లేకుండా అణుశక్తి, బీమా రంగాలలో ప్రైవేట్ భాగస్వామ్యానికి తలుపులు తెరిచారు. సంబంధిత చట్టాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించి మన స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను పునరుద్ఘాటించారు. ఈ సంస్కరణల్లో ప్రతి ఒక్కటి దానికదే ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. వాటన్నింటినీ కలిపి చూస్తే అవి విప్లవాత్మకమైనవి. మోదీ ఒకప్పుడు గుజరాత్లో ఏం చేశారో, ఆ తర్వాత డిజిటల్ ఇండియా, జీఎస్టీ విషయంలో ఏం చేశారో ఇప్పుడు జాతీయ స్థాయిలో అదే చేస్తున్నారు. తన అచంచలమైన సంకల్ప బలంతో మొండిబారిపోయిన ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలిస్తూ పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాహ్య ప్రపంచం చేసే మేలు మనల్ని ముందుకు నడిపిస్తుందని ఇకపై ఎవరూ భ్రమపడరు. మనల్ని నడిపించే ఇంజన్లు, ఇంధనం రెండూ స్వదేశీయం కావాల్సిందే.
2025 పొడవునా విదేశాల నుంచి ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి. కానీ మోదీ స్పందన మాత్రం స్వదేశీ శక్తి, స్వదేశీ ఏకాగ్రత, స్వదేశీ సంస్కరణల వైపే ఉంది. ప్రపంచంతో తన భాగస్వామ్యాన్ని పునర్నిర్మించుకోవడానికి ముందు, భారత్ తనతో తాను చేసుకున్న ఒప్పందాన్ని తిరగరాయాలి. ఇది భారతదేశ భవిష్యత్తును లిఖించాల్సిన సమయం, భారతీయులే ఆ పని చేస్తారు.
సమీర్ శరణ్,
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడు

