గ్రామీణ ఉపాధి రంగంలో విప్లవాత్మక మార్పులు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (విబి-జి రామ్ జి) బిల్లును పార్లమెంట్ డిసెంబర్ 18న ఆమోదించింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు చేసిన వ్యక్తం చేసిన అర్థం లేని భయాలను, ఆరోపణలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తోసిపుచ్చారు. శాశ్వత ఆస్తుల సృష్టి కోసమే ఎంతో లోతుగా అలోచించి ఈ బిల్లును రూపొందించామని ఆయన వివరించారు.
- MGNREGA స్థానంలో కొత్త చట్టం: 2047 నాటికి నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కొత్త చట్టపరమైన చట్రాన్ని తీసుకువచ్చారు.
- పనిదినాల పెంపు: గ్రామీణ కుటుంబాల ఆర్థిక భద్రతను పటిష్టం చేస్తూ, వార్షిక ఉపాధి హామీని 125 రోజులకు పెంచారు.
- మౌలిక సదుపాయాల కల్పన: వేతన ఉపాధిని 4 ప్రాధాన్యత రంగాలలో శాశ్వత గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనతో అనుసంధానించారు.
- వికేంద్రీకృత ప్రణాళిక: ‘వికసిత్ గ్రామ పంచాయతీ’ ప్రణాళికల ద్వారా క్షేత్రస్థాయి నిర్ణయాధికారాన్ని పెంచి, ‘వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల వ్యవస్థ’ ద్వారా జాతీయ స్థాయిలో సమన్వయం చేశారు.
- నిధుల కేటాయింపు: గతంలో మాదిరిగా డిమాండును బట్టిగాక కేంద్రం నిర్దేశించిన నియమాలు, పరిమితులకు లోబడి నిధులు కేటాయిస్తారు. దీనినే నార్మెటివ్ ఫండింగ్ అంటారు. కేంద్ర ప్రాయోజిత విధానం ద్వారా జవాబుదారీతనాన్ని, కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యాన్ని పటిష్టం చేశారు.
గత రెండు దశాబ్దాలుగా భారత సామాజిక భద్రతా వ్యవస్థలో గ్రామీణ ఉపాధి కీలక పాత్ర పోషిస్తోంది. 2005లో ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి గ్రామీణ ఆదాయాల స్థిరీకరణలో, ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనలో ఇది అండగా నిలిచింది. అయితే మారుతున్న కాలంతో పాటు గ్రామీణ భారతం గణనీయంగా అభివృద్ధి చెందింది. పెరిగిన ఆదాయాలు, డిజిటల్ విప్లవం, వైవిధ్యభరితమైన జీవనోపాధి మార్గాల దృష్ట్యా ఉపాధి అవసరాల స్వభావం మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) బిల్లు, 2025 ను ప్రతిపాదించింది. దీనినే వికసిత్ భారత్ – జి రామ్ జి బిల్లు అని పిలుస్తున్నారు. ఇది పాత చట్టాన్ని సమూలంగా మార్చి, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా రూపొందించబడింది.
1960ల నుంచి గ్రామీణ ఉపాధి
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేదరిక నిర్మూలన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, గ్రామీణ శ్రామికులకు ఉపాధి కల్పనపై భారత్ దృష్టి సారించింది. 1960లలో ‘గ్రామీణ మానవ వనరుల కార్యక్రమం’, 1971లో ‘గ్రామీణ ఉపాధి అత్యవసర పథకం’ వంటి ప్రాథమిక కార్యక్రమాలతో ఈ ప్రస్థానం మొదలైంది. తదనంతరం 1980, 90లలో జవహర్ రోజ్‌గార్ యోజన (1993), సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన (1999) వంటి మరింత వ్యవస్థీకృత పథకాలు వచ్చాయి. 1977లో మహారాష్ట్ర ఉపాధి హామీ చట్టం ‘పని చేసే హక్కు’ అనే చట్టబద్ధమైన భావనను తీసుకురాగా, అది చివరకు 2005లో దేశవ్యాప్త గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా రూపుదాల్చింది. .
పరిమితులు-సంస్కరణల ఆవశ్యకత
గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకంలో మహిళల భాగస్వామ్యం 48 శాతం నుంచి 58.15 శాతానికి పెరిగింది. ఆధార్ అనుసంధాన చెల్లింపులు, జియో-ట్యాగింగ్ వంటి సాంకేతిక మార్పులతో పారదర్శకత పెరిగింది. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొన్ని లోపాలు బయటపడ్డాయి. పని జరగకుండానే ఖర్చులు చూపడం, యంత్రాల వినియోగం, డిజిటల్ హాజరులో అక్రమాలు వంటి సమస్యలు తలెత్తాయి. దీనిని పరిష్కరించేందుకు కొత్త బిల్లులో పరిపాలనా వ్యయ పరిమితిని 6 శాతం నుంచి 9శాతానికి పెంచారు. దీనివల్ల సిబ్బంది నియామకం, శిక్షణ, సాంకేతిక సామర్థ్యం పెరుగుతుంది. ఇది ఉపాధి హామీ పథకాన్ని కేవలం సంక్షేమ పథకంగా కాకుండా ఒక వృత్తిపరమైన వ్యవస్థగా మారుస్తుంది.
కొత్త చట్టం ఎందుకు?
2011-12లో 27.1 శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం, 2022-23 నాటికి 5.3 శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రజల జీవనశైలి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. కాబట్టి 2005 నాటి పాత పద్ధతులు నేటి అవసరాలకు సరిపోవు. వికసిత్ భారత్ – జి రామ్ జి బిల్లు 2025 గ్రామీణ ఉపాధిని ఆధునికీకరిస్తూనే, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులను తట్టుకునేలా గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
125 రోజుల ఉపాధి హామీ
ఈ బిల్లు ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి గ్యారెంటీ లభిస్తుంది. గతంలో ఉన్న 100 రోజుల పరిమితిని పెంచుతూ అదనపు ఆదాయ భద్రతను కల్పిస్తోంది. అయితే వ్యవసాయ పనుల రద్దీ సమయాల్లో (నాట్లు, కోతలు) కూలీల కొరత లేకుండా చూసేందుకు 60 రోజుల ‘పని లేని కాలాన్ని’ నిర్దేశించారు. మిగిలిన 305 రోజుల్లో 125 రోజుల పనిని కల్పించడం ద్వారా అటు రైతులు, ఇటు కూలీలు ఇద్దరూ ప్రయోజనం పొందుతారు.
- వేతన చెల్లింపులు: పని చేసిన వారం రోజుల్లోగా లేదా గరిష్టంగా 15 రోజుల్లో వేతనాలు చెల్లించాలి.
- పనుల వర్గీకరణ: ఉపాధిని మౌలిక సదుపాయాలతో అనుసంధానిస్తూ నాలుగు ప్రాధాన్య రంగాలను గుర్తించారు:
- నీటి సంరక్షణ పనులు.
- గ్రామీణ మౌలిక సదుపాయాలు.
- జీవనోపాధి సంబంధిత నిర్మాణాలు.
- ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే పనులు.
జాతీయ గ్రామీణ మౌలికసదుపాయాల వ్యవస్థ
పథకం ద్వారా సృష్టింయిన ఆస్తులన్నీ వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల వ్యవస్థ (నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్)లో చేరుస్తారు. ప్రణాళికా రచనను వికేంద్రీకరిస్తూ ‘వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల’ ద్వారా స్థానికంగా నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని ‘పీఎం గతి శక్తి’ వంటి జాతీయ వ్యవస్థలతో అనుసంధానిస్తారు.
నిధుల కేటాయింపు
ఈ పథకం అమలుకు ఏటా రూ.1,51,282 కోట్లు అవసరమని అంచనా. ఇందులో కేంద్ర వాటా రూ.95,692.31 కోట్లు.
- నిధుల భాగస్వామ్యం: కేంద్ర, రాష్ట్రాల మధ్య 60:40 నిష్పత్తిలో నిధుల కేటాయింపు ఉంటుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో, కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులను కేంద్రమే భరిస్తుంది.
- నిరుద్యోగ భృతి: పని కోరిన 15 రోజుల్లోగా ఉపాధి కల్పించలేకపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది.
పారదర్శకత
అవినీతిని అరికట్టేందుకు ఈ బిల్లు అత్యాధునిక సాంకేతికతను నిర్దేశిస్తుంది:
- AI, బయోమెట్రిక్: కృత్రిమ మేధ, బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా అక్రమాలను ముందే పసిగట్టవచ్చు.
- తక్షణ పర్యవేక్షణ (రియల్ టైమ్ మానిటరింగ్): GPSస్, మొబైల్ ఆధారిత పర్యవేక్షణ, రియల్ టైమ్ డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయవచ్చు.
- సామాజిక తనిఖీ: ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా సామాజిక తనిఖీలు నిర్వహించాలి.
MGNREGA-గ్రామ్-జీ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సాధించిన విజయాలను కొనసాగిస్తూనే, అందులోని నిర్మాణపరమైన లోపాలను ఈ కొత్త బిల్లు సవరిస్తుంది. కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల సృష్టి, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ‘వికసిత్ భారత్ 2047’ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా, గ్రామీణ ఉపాధిని వ్యూహాత్మక అభివృద్ధి సాధనంగా మార్చేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది. స్థిరమైన వృద్ధి, డిజిటల్ పాలన, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా గ్రామీణ భారతం సరికొత్త పుంతలు తొక్కనుంది.

