పల్లె సీమల్లోనూ బిజెపి పాగా
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. గత ఎన్నికలతో పోలిస్తే 6 రెట్ల మెరుగైన ఫలితాలు సాధించింది. గత పంచాయతీ ఎన్నికల్లో 163 స్థానాల్లో గెలిచిన బిజెపి ఈసారి 1000 మార్కుకు చేరువైంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల కృషికి, నాయకుల శ్రమ తోడవడంతో ఈ విజయం సాధ్యమైంది. గ్రామీణాభివృద్ధి పట్ల మోదీ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకూ ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. గతంలో నగరాలకే పరిమితమైన పార్టీ అని బిజెపిని విమర్శించిన వారికి, గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న ఈ విజయాలు గట్టి సమాధానం చెబుతున్నాయి. ఒకప్పుడు పట్టణ పార్టీగా ప్రత్యర్థులు పిలుచుకునే బిజెపి ఇప్పుడు గ్రామాల్లోనూ బలోపేతం అవుతోందని స్పష్టమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన చోట్ల బిజెపికి మంచి ఫలితాలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక నాయకుల బెదిరింపులు, ఒత్తిడులు ఎదురైనా, ప్రజలు ధైర్యంగా బిజెపికి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డబ్బులు, మద్యం పంచి ప్రలోభ పెట్టినా బిజెపి ప్రభావాన్ని అడ్డుకోలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి బలపర్చిన వారిలో దాదాపు 1000 మంది సర్పంచులు, 1200 మంది ఉపసర్పంచులు, 10,000 మందికి పైగా వార్డు మెంబర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 213 మంది బిజెపి బలపర్చిన సర్పంచులు నిర్మల్ జిల్లా నుంచే ఎన్నికవడం విశేషం. నిర్మల్ నియోజకవర్గంలో 128 గ్రామ పంచాయతీలకు గాను దాదాపు 80 గ్రామ సర్పంచులు బిజెపి బలపర్చిన అభ్యర్థులే. ముధోల్ నియోజకవర్గంలో 178 గ్రామ పంచాయతీలకు గాను 98 గ్రామ పంచాయతీల్లో బిజెపికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో దాదాపు 36 గ్రామ సర్పంచులను బిజెపి మద్దతుతో గెలిపించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా బిజెపి అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలిచారు. గత పంచాయతీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 22 సర్పంచ్ స్థానాల్లో బిజెపి బలపర్చిన అభ్యర్థులు గెలిస్తే, ఈసారి 106 స్థానాల్లో గెలిచారు. అంతేకాదు, గెలిచిన పలువురు స్వతంత్ర్య అభ్యర్థులు బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్‌లో తొలిసారిగా ఎస్సీ మహిళ అంజమ్మ సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణలో ప్రతి ఇంటికి పార్టీని విస్తరించేందుకు ఈ విజయాలు బలమైన, స్థిరమైన పునాదిని ఏర్పాటు చేయనున్నాయి.
గత రెండు సంవత్సరాలుగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన అవినీతిలో మునిగిపోయింది. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆరు గ్యారంటీలు, 420 హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాడి తప్పించింది. దీంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. యావత్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. గతంలో అప్పటి రూలింగ్ పార్టీ అధికార దుర్వినియోగం, డబ్బు, పోలీసు ఒత్తిళ్లతో నామినేషన్లు వేయనివ్వకుండా చేసింది. ఈసారి 8 వేల సర్పంచుల నుంచి 2 వేల వరకు పడిపోవడం బీఆర్ఎఫ్ గ్రాఫ్ మరింత దిగజారిందనడానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో ప్రజలు బిజెపినే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.
గ్రామీణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో పనిచేస్తున్నది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఆయుష్మాన్ భారత్, హర్ ఘర్ జల్, గ్రామీణ రహదారుల అభివృద్ధి, ఇలా అనేక పథకాల ద్వారా పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తోంది. ఉచిత బియ్యం, ధాన్యం కొనుగోలుతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం. ఈ దిశగా అధికారమే లక్ష్యంగా గ్రామాల్లో బలపేతమయ్యేందుకు బిజెపి కార్యాచరణను సిద్ధం చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేస్తే 2028లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని స్పష్టమవుతోంది.

