Shyam Prasad

జాతీయవాద ఆకాంక్షల ప్రతిబింబం

జూన్ 23న శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి, జూలై 6న జయంతి జరుపుకొంటున్న సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం..

Shyam Prasadప్రతి చారిత్రక సందర్భం ఒక నాయకుడిని సృష్టిస్తుంది. అలా భారతదేశ చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న నేత డాక్టర్‌ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఆయనను మనం గుర్తుంచుకోవడానికి కారణం.. భారతదేశంలో నాడు వికసించిన నూతన జాతీయవాద ఆకాంక్షలకు ప్రతిబింబంగా, దాదాపు 14 సంవత్సరాలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేతగా ఆయన ప్రజా హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం.

కలకత్తా యూనివర్సిటీకి అయిదు పర్యాయాలు వైస్ ఛాన్సలర్‌గా పనిచేసి, దేశంలోనే దానికి అత్యున్నత విద్యాసంస్థగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన తండ్రి అశుతోష్ ముఖర్జీ (1864-1924) బాటలోనే శ్యామప్రసాద్‌ నడిచారు. న్యాయవాద శిక్షణ పొందినప్పటికీ ఇంగ్లీషు, బెంగాలీ సాహిత్యంలో పట్టభద్రులయ్యారు. తండ్రి పనిచేసిన యూనివర్సిటీకే తాను కూడా కేవలం 33వ ఏట వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. భారతీయ దృక్పథంలో భారతదేశ చరిత్రపై పరిశోధనను ప్రోత్సహించడమే కాక యూనివర్సిటీలో భారతీయ చరిత్ర, సంస్కృతి, పురాతత్వ శాస్త్రంపై తొలి ప్రదర్శనశాలను ప్రారంభించారు. భారతీయ నాగరికత, సంస్కృతి, సంస్కృతం అధ్యయనం చేసేందుకు తమ విద్యార్థులను పంపాల్సిందిగా ఆయన విదేశీ యూనివర్సిటీలను కోరారు. ఇస్లామిక్ సంస్కృతి, చరిత్రపై కూడా కోర్సు ప్రారంభించారు. సంప్రదాయాలకు భిన్నంగా 1937లో ఆయన గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌ను యూనివర్సిటీకి ఆహ్వానించి స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని బెంగాలీలో ఇప్పించారు. విద్యార్థుల్లో మన దేశం, మన సంస్కృతి, నాగరికత పట్ల అభిమానం పెంపొందించాలని ఆయన అభిలషించారు.

నిజానికి ఆనాటి అతలాకుతలమైన రాజకీయ పరిస్థితులు ప్రేరేపించకపోతే శ్యామప్రసాద్‌ ముఖర్జీ విద్యారంగంలోనే సేవ చేస్తూ ఉండిపోయేవారు. 1939లో వీర్ సావర్కార్ ప్రభావానికి లోనై హిందూ మహాసభలో చేరడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. హిందూ మహాసభ వర్కింగ్ అధ్యక్షుడుగా ఎంపికై ఆయన దేశమంతా పర్యటించారు. హిందూ మహాసభలో చేరడం వల్ల డాక్టర్‌ శ్యామ ప్రసాద్ ముఖర్జీకి తన నాయకత్వ లక్షణాలు, వక్తృత్వ ప్రతిభ, నిర్వాహక సామర్థ్యం ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. అదే సమయంలో ఆయనకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. భారతదేశ గగనతలంలో కమ్ముకున్న మేఘాల మధ్య మెరుపురేఖగా తనకు ఆర్‌ఎస్‌ఎస్‌ కనపడిందని ఆయన లాహోర్‌లో 1940లో స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడుతూ అన్నారు.

శ్యామ ప్రసాద్ ముఖర్జీ జాతీయవాద దృక్పథం మహాత్మాగాంధీని ఆకట్టుకున్నది. ఆయనను జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలోని స్వతంత్ర భారత తొలి మంత్రివర్గంలో చేర్చుకోవాలని గాంధీజీ పట్టుబట్టారు. వీర్ సావర్కార్ సలహాతో మంత్రివర్గంలో చేరిన ముఖర్జీ తొలి పరిశ్రమల మంత్రిగా భారతదేశ పారిశ్రామిక విధానాన్ని రూపుదిద్ది, దేశంలో పారిశ్రామికాభివృద్దికి పునాది వేశారు. తద్వారా దేశంలో బలమైన ప్రభుత్వరంగం ఏర్పడింది.

1950లో తూర్పు బెంగాల్‌లో హిందూ మైనారిటీల దుస్థితిని విస్మరించిన లియాఖత్-నెహ్రూ ఒడంబడికకు నిరనసగా మంత్రివర్గానికి రాజీనామా చేసిన డాక్టర్‌ ముఖర్జీ పదవి కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టకూడదని విశ్వసించారు. భారతీయ జనసంఘ్‌ను స్థాపించి దేశం కోసం పోరాడాలని నిర్ణయించారు. జమ్మూకశ్మీర్‌ పూర్తిగా దేశంలో అంతర్భాగం కావాలని విశ్వసించారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు దేశాధినేతలు, రెండు పతాకాలు చెల్లవని ఆయన ప్రకటించారు పండిట్ ప్రేమ్‌ నాథ్ డోగ్రా స్థాపించిన ప్రజాపరిషద్ ఉద్యమానికి మద్దతునిచ్చి కశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిగా విలీనం చేసేందుకు పోరాడారు. 1952లో జమ్మూకశ్మీర్‌కు వెళ్లి షేక్ అబ్దుల్లా, పండిట్ డోగ్రాలతో మాట్లాడారు. నెహ్రూ, షేక్ అబ్దుల్లాకు అనేక లేఖల్ని సంధించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సత్యాగ్రహానికి మద్దతుగా జమ్మూకు వెళ్లేందుకు నిర్ణయించారు.

ఆ పర్యటనే ఆయన జీవితంలో అంతిమ పర్యటనగా మారింది. 1953 మే 10న ఆయనను పర్మిట్ లేకుండా రాష్ట్రంలో ప్రవేశించినందుకు జమ్మూకశ్మీర్‌ పోలీసులు నిర్బంధించారు. శ్రీనగర్‌కు తీసుకువెళ్లి నిషత్ భాగ్‌లో చిన్న కుటీరంలో బంధించారు. తన జీవితంలో చివరి 40 రోజులు ఆ కుటీరంలో గడిపిన ముఖర్జీ వివాదాస్పద పరిస్థితుల్లో ఒక హాస్పిటల్‌లో మరణించారు. తన కుమారుడి వివాదాస్పద మృతిపై దర్యాప్తు జరపాల్సిందిగా డాక్టర్‌ శ్యామప్రసాద్‌ తల్లి జోగమాయాదేవి పండిత్ నెహ్రూకు లేఖ రాసినప్పటికీ దాన్ని అంగీకరించలేదు. నెహ్రూ పంపిన సంతాప సందేశానికి ఆమె జవాబిస్తూ మీ ఓదార్పు కోసం నేను ఈ లేఖ రాయడం లేదు. న్యాయం కోసం డిమాండ్ చేసేందుకు ఈ లేఖ రాస్తున్నాను. నా కుమారుడు నిర్బంధంలో మరణించాడు. అది ఎలాంటి విచారణ లేకుండా అమలు చేసిన నిర్బంధం.. అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.

తూర్పు బెంగాల్‌లో హిందూ మైనారిటీల దుస్థితికి చలించి నెహ్రూ మంత్రివర్గం నుంచి తప్పుకున్న మూడు సంవత్సరాలలోనే డాక్టర్‌ ముఖర్జీ జమ్మూకశ్మీర్‌ను భారతదేశంలో అంతర్భాగం చేయాలని డిమాండ్ చేస్తూ తన ప్రాణాలు వదిలారు. ఆయన పార్లమెంటరీ జీవితం (1947-53) ఆరేళ్లలోనే ముగిసి పోయి ఉండవచ్చు కాని విలువల కోసం జీవించి వాటి కోసం మరణించిన పార్లమెంటేరియన్‌గా ఆయన మన జ్ఞాపకాల్లో నిలిచిపోయారు. నాడు ఆయన చేసిన ప్రసంగాలు నేటికీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖర్జీ అకాల మరణానంతరం ఆయన స్థాపించిన జనసంఘ్ తొలి సార్వత్రక ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు సాధించి ఉండకపోవచ్చు. కాని జనసంఘ్ స్థాపించినప్పుడు ఆయన దూరదృష్టి ఎటువంటిదో తర్వాతి కాలంలో చరిత్ర నిరూపించింది. నాటి జనసంఘ్ 1957 నుంచి 1977 వరకూ దినదిన ప్రవర్థమానమయింది. జనతా పార్టీ ప్రభుత్వంలో (1977-1979) అతి పెద్ద పార్టీగా కీలక పాత్ర పోషించింది. తర్వాత భారతీయ జనతా పార్టీగా నూతన అవతారం ఏర్పర్చుకుని ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది.

ఇవాళ యువతలో జాతీయవాద, దేశభక్తి విలువలను పెంపొందించి, మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన సమున్నత నాగరికత, దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు వారిని సన్నద్ధం చేయడమే డాక్టర్‌ శ్యామ ప్రసాద్ ముఖర్జీకి మనం అర్పించే ఉత్తమ నివాళి అవుతుంది.

ఎం. వెంకయ్య నాయుడు,
భారత మాజీ ఉపరాష్ట్రపతి