Emergency

కాంగ్రెస్ నియంతృత్వ పోకడలే ఎమర్జెన్సీకి మూలం

1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ అహంకారంతో దేశంలో ఎమర్జెన్సీ విధించడం, శతాబ్దాల నాటి ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని అపహాస్యం చేయడం భారత చరిత్రలో చీకటి అధ్యాయం. జీవించే హక్కును కూడా నిలిపివేసి, పార్లమెంటు, న్యాయవ్యవస్థ, మీడియాలను ఒక నాయకురాలి అధికారకాంక్షకు, నియంతృత్వ ధోరణులకు సాధనాలుగా మార్చిన వైనం ఒక యాధృచ్చిక వైపరీత్యమా లేక కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల సహజ ప్రవృత్తులను ప్రతిబింబిస్తుందా అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న. 

కాంబోజ్, కళింగ, లిచ్చావి రాజ్యాలు వంటి అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక పాలనా వ్యవస్థల ఉదాహరణలతో భారతదేశ పురాతన చరిత్ర నిండి ఉంది. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథంలో కూడా ప్రజాస్వామిక పద్ధతులకు ఆధారాలు ఉన్నాయి. రాచరికాల పాలనలో కూడా కొనసాగిన ప్రజాస్వామిక ఆదర్శాల వైపు సాగిన ఈ పయనం విదేశీ ఆక్రమణదారులు కొల్లగొట్టి, దురాక్రమించి, చివరికి తమ అణచివేత పాలనలను దేశంలోని విస్తారమైన ప్రాంతాలపై రుద్దినప్పుడు మాత్రమే అడ్డంకులను ఎదుర్కొంది. స్వాతంత్ర్యానంతరం భారతదేశం ఆధునిక, ప్రగతిశీల, ప్రజాస్వామిక జాతీయ రాజ్యంగా అవతరించడానికి ఒక పెద్ద అడుగు వేసింది. అన్నింటికీ మించి పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం ద్వారా భవిష్యత్ ప్రభుత్వాలు కలలు, ఆదర్శాలను సాకారం చేయడానికి కృషి చేస్తాయని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. అయితే, స్వాతంత్య్ర పోరాటం నుంచి పుట్టిన కాంగ్రెస్‌కు దేశానికి, ప్రజలకు సేవ చేసే తొలి అవకాశం లభించింది. జవహర్ లాల్ నెహ్రూ హయాంలో మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన తప్పుడు ఆరోపణలను ఉపయోగించి ఆరెస్సెస్‌ను, దాని పాంచజన్య వారపత్రికను నిషేధించింది. ప్రత్యర్థి దృక్పథాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీసేందుకు ‘నిషేధం’ను ఆయుధంగా వాడుకోవడం ఇదే తొలిసారి. 

1951-52లో రాజ్యాంగాన్ని ఆమోదించిన ఒక సంవత్సరం తరువాత, తన విధానాలపై విమర్శలతో కలత చెందిన నెహ్రూ, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ తీవ్ర ప్రతిఘటనను పట్టించుకోకుండా, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడానికి మొదటి రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టడానికి తనకు గల భారీ మెజారిటీని ఉపయోగించారు. ఇందిరాగాంధీ 1975 జూన్ 25 అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ విధించి యావత్ దేశాన్ని జైలుగా మార్చిన నిరంకుశత్వానికి పునాది ఇదే. లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్, ఇతర ప్రధాన ప్రతిపక్ష నాయకులు మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్ కె అద్వానీలను జైలుకు పంపారు. నానాజీ దేశ్‌ముఖ్, జార్జి ఫెర్నాండెజ్ వంటి నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి ప్రతిఘటన ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆరెస్సెస్‌తో పాటు డజన్ల కొద్దీ సామాజిక, సాంస్కృతిక సంస్థలపై నిషేధం విధించారు. మీడియా సంస్థలు దిగ్భ్రాంతికరమైన స్థాయిలో సెన్సార్‌షిప్‌కు గురయ్యాయి. దురదృష్టవశాత్తూ, చాలా పత్రికలు కాంగ్రెస్ పార్టీ గళాలుగా మారిపోయాయి. “మీడియా వంగమని అడిగినప్పుడు పాకింది,” అని అద్వానీ దీనిగురించి తర్వాత వ్యాఖ్యానించారు.

 

ప్రజాస్వామ్యంపై దాడిని నిర్వహించడానికి ఇందిరాగాంధీకి బలమైన కారణం ఉందని కొందరు ఊహాగానాలు చేశారు. కానీ, అది ఏ ఒక్క సంఘటన కాదు, లేదా, కొంతమంది సమర్థకులు వాదించినట్లుగా ఎదో ఒక తక్షణ కారణం అంటూ లేదు. దీనికి కాంగ్రెస్ నాయకత్వం నియంతృత్వ మనస్తత్వమే కారణం. తన ఎన్నిక చట్టవిరుద్ధమని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇందిరాగాంధీ ధిక్కరించడానికి ఇదే కారణమైంది. నిరంకుశత్వం, అసహనం కాంగ్రెస్‌లో లోతుగా పాతుకుపోయాయి కాబట్టే 1977లో ఓటమి నుంచి సరైన గుణపాఠం నేర్చుకోకపోగా, తిరిగి అధికారంలోకి వచ్చి రాజీవ్ గాంధీకి పట్టం కట్టిన తర్వాత అది తిరిగి అప్రజాస్వామిక పద్ధతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఛాంపియన్ గా చెప్పుకునే కాంగ్రెస్ ఆనాడు పరువునష్టం నిరోధక బిల్లు ముసుగులో సెన్సార్‌షిప్‌ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. ప్రతిపక్షాల ప్రతిఘటన కారణంగా ఆ దుర్మార్గమైన లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పటికీ, మీడియాను అణగదొక్కే ప్రయత్నం ప్రజాస్వామ్య సూత్రాల పట్ల దాని తిరస్కారాన్ని, అధికార వ్యామోహాన్ని మరోసారి బయటపెట్టింది. ఈ ధోరణి మనల్ని ఆశ్చర్యపరచకూడదు. కుటుంబ పార్టీగా మారి, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటించని పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలను పరిరక్షిస్తుందని ఆశించలేం. వంశపారంపర్య అధికారాల స్తంభాల మీదే కాంగ్రెస్ భవనం నిర్మితమైంది. ఎమర్జెన్సీకి దారితీసిన నియంతృత్వ ధోరణికి మూలం ఈ ‘ఫ్యామిలీ ఫస్ట్’ (కుటుంబమే పరమోన్నతం) మనస్తత్వమే. 

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి, కుటుంబాల సంకుచిత వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా నడిచే వంశపారంపర్య పార్టీల ఆటకట్టించింది. నేటి భారతదేశంలో, అంతర్గత కార్యకలాపాలలో నిష్పాక్షికత, సమానత్వం, సమాన అవకాశాలు అనే సూత్రాలను ఆచరించే ఏకైక పార్టీ బిజెపి. దాని ఫలాలను అణగారిన వర్గాల ముంగిటకు చేర్చడం ద్వారా దాని విధానాలు ప్రజాస్వామ్య మూలాలను మరింత లోతుగా వేళ్లూనుకునేలా చేశాయి. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఎన్నికల, రాజకీయ ప్రక్రియ మాత్రమే కాదు. ఇది మరింత విస్తృతమైన, లోతైన సాంస్కృతిక అంశం, ఇది సమ్మిళిత అభివృద్ధి, అందరికీ భద్రత, సమాన అవకాశాలు, సమాన హక్కులను సూచిస్తుంది. గత 11 సంవత్సరాలుగా ఎన్డీయే ప్రభుత్వం వివిధ విధానాల ద్వారా వీటిని కొనసాగించేందుకు, పరిరక్షించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. నేడు ప్రజాస్వామ్యంలోని అన్ని విభాగాలు సహకారం, సమన్వయం, సమతుల్యతతో పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ తన హయాంలో న్యాయవవస్థను ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా మార్చాలనుకుంది. అందుకు భిన్నంగా నేడు న్యాయవ్యవస్థ పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తోంది. అవసరం అనిపించినప్పుడల్లా ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసింది. మీడియాకు తన పని తాను చేసుకుపోయే పూర్తి స్వేచ్ఛ ఉంది. గత 11 ఏళ్ళలో భారత పార్లమెంటరీ వ్యవస్థ మరింత బలపడింది.

బాబాసాహెబ్ భీంరావ్ అంబేడ్కర్ రాజ్యాంగ సభలో తన చివరి ప్రసంగంలో, రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే, దానికి అనుబంధంగా సామాజిక రంగంలో కూడా ప్రజాస్వామ్యాన్ని వ్యాప్తి చేయాలని నొక్కి చెప్పారు. ఈ ప్రగతిశీల ఆదర్శాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ప్రధాని మోదీ కృషి చేశారు. అత్యంత నిరుపేదలకు సాధికారత కల్పించడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వం గల దేశాన్ని, న్యాయమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

అమిత్ షా,
కేంద్ర హోం మంత్రి