ప్రజాసేవకు అంకితమైన అటల్ జీ
1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని బటేశ్వర్‌లో బ్రాహ్మణ కుటుంబంలో అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించారు. ఆయన తల్లి కృష్ణ దేవి. తండ్రి గ్వాలియర్‌లోని పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణ బిహారీ వాజ్‌పేయి. అటల్ జీ వాక్చాతుర్యం అమోఘం- ఆయన ప్రసంగం వినడానికి ప్రజలు మైళ్ల దూరం ప్రయాణించేవారు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఒకసారి ప్రయాగ్‌రాజ్ యూనివర్సిటీలో జరిగిన వక్తృత్వ పోటీకి ఆలస్యంగా వచ్చారు. కార్యక్రమం దాదాపు ముగిసినా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. తన శక్తిమంతమైన వాక్చాతుర్యం, స్పష్టమైన భావ వ్యక్తీకరణ కారణంగా ఉత్తమ వక్తగా అవార్డును గెలుచుకున్నారు. అది అటల్ జీ విశిష్టత.
పండిట్ నెహ్రూ కూడా పార్లమెంటులో ఆయన ప్రసంగాలను మెచ్చుకుని అటల్ బిహారీ ఏదో ఒక రోజు గొప్ప దౌత్యవేత్త అవుతారని వ్యాఖ్యానించారు. 1977లో జనతా పార్టీ ప్రభుత్వ విదేశాంగ మంత్రిగా ఐక్యరాజ్యసమితిలో అటల్ జీ చేసిన ప్రసంగం ప్రపంచ వేదికపై భారతీయ వారసత్వానికి, హిందీ భాషకు గొప్ప ఉదాహరణగా నిలిచింది. భారత రాజకీయాల్లో అటల్ జీ ప్రయాణం అసాధారణమైనది, ఆదర్శవంతమైనది, విస్మయకరమైనది, చిరస్మరణీయమైనది. ప్రగాఢ సాహితీ స్ఫూర్తి, పాత్రికేయ అంతర్దృష్టి కలగలిసిన అరుదైన దృక్పథాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా సామాన్య ప్రజా పోరాటాలతో ఆయన మమేకమయ్యారు. ఒకప్పుడు బందిపోట్లకు ప్రసిద్ధి చెందిన ఆయన గ్రామం బటేశ్వర్ ఇప్పుడు బిజెపి నేతలకు పుణ్యక్షేత్రంగా మారింది.
1990వ దశకంలో అటల్ జీ 81 మంది మంత్రులతో 24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. సహనం, నైతికత, సంకీర్ణ ధర్మం ప్రాముఖ్యతను ఆయన భారత రాజకీయాలకు బోధించారు. ఈ సమయంలో జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి వంటి నాయకులతో సంక్లిష్టమైన పొత్తులను నైపుణ్యంతో నడిపించారు. సంకీర్ణ పాలనకు ఒక కాలాతీత ఉదాహరణగా నిలిచారు. 1999లో కేవలం ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. పార్లమెంటులో నిరాశ చెందిన అటల్ జీ “మన సమయం వస్తుంది” అని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల చైతనవంతమైన నాయకత్వంలో, బిజెపి ప్రభుత్వం దేశ సర్వతోముఖ ప్రగతిని సాధిస్తోంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి స్వర్ణయుగం అనడంలో సందేహం లేదు.
పీవీ నరసింహారావు ప్రభుత్వం తర్వాత 1990 దశకం చివర్లో బిజెపి క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆ సమయంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరగా ఉన్నప్పుడు, మెజారిటీ కోసం చూస్తున్నప్పుడు, శరద్ పవార్ అటల్ జీని ఎగతాళి చేశారు. అటల్ జీ ఎప్పుడూ వివాహం చేసుకోలేదని, ఇప్పుడు ఆయన (ప్రధాని) వరుడు కాబోతున్నప్పుడు, ఆయనకు బరాతీలు, అంటే మెజారిటీ లేదని అన్నారు. వ్యంగ్యాస్త్రాలు, తిట్లు ఎదురైనా అటల్ బిహారీ వాజ్‌పేయి ఏనాడూ తన మార్గాన్ని వీడలేదు. నిరంతర కృషి, అంకితభావంతో విజయవంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బిజెపికే కాకుండా యావత్ దేశానికి కొత్త దిశానిర్దేశం చేశారు. ఆయన నిస్వార్థ సేవాస్ఫూర్తి వల్లే బిజెపి ఇప్పుడు దేశానికి మార్గదర్శక శక్తిగా ఎదుగుతోంది. వాజ్‌పేయి ఆరేళ్ల పాటు మాత్రమే ప్రధానిగా పనిచేసినప్పటికీ ఆయన హయాంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు భారత్ ఆర్థిక వృద్ధికి, అభివృద్ధికి కొత్త దిశను ఇచ్చాయి. వాజ్‌పేయి ప్రభుత్వంలో తీసుకున్న ఐదు ప్రధాన నిర్ణయాలు భారత ఆర్థిక వ్యవస్థను బహుముఖంగా మార్చాయి.
వాజ్‌పేయి శకం: కీలక కార్యక్రమాలు
స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు: దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలను కలుపుతూ భారతదేశపు అతిపెద్ద హైవే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఇది. నాలుగు, ఆరు వరుసల రహదారులతో 5,846 కిలోమీటర్ల మేర విస్తరించి పారిశ్రామిక, వ్యవసాయ, ఆర్థిక అనుసంధానతకు ఊతమిచ్చింది. బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్, వైజాగ్ వంటి నగరాలు కూడా లాభపడి ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయి.
ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన: 2000 సంవత్సరంలో ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి భారతదేశం అంతటా గతంలో రోడ్డు సదుపాయంలేని గ్రామాలను అనుసంధానించడానికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY)ను ప్రారంభించారు. 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు పక్కా రోడ్లతో అనుసంధానతను అందించడం ఈ పథకం ప్రాథమిక లక్ష్యం. మారుమూల, రోడ్డులేని గ్రామాలను విస్తృత రహదారి వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా గ్రామీణ రవాణాను మెరుగుపరచడం, అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
నదుల అనుసంధాన ప్రాజెక్టు: కరువు ప్రాంతాలలో నీటి ఎద్దడిని పరిష్కరించడానికి, వరదలు, కరువుల ప్రభావాలను తగ్గించడానికి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి, జలవిద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి నదుల అనుసంధాన ప్రాజెక్టును వాజ్‌పేయి రూపొందించారు. నీటి వనరుల సమతుల్య పంపిణీకి, సుస్థిర అభివృద్ధికి తోడ్పడటానికి నీటి మిగులు నదులను నీటి లోటు ఉన్న నదులతో అనుసంధానం చేయాలన్నది దీని ఉద్దేశం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాజ్‌పేయి100వ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో భారత దేశంలో మొదటి నదుల అనుసంధాన కార్యక్రమం కెన్-బెట్వా జాతీయ ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. రూ.44,600 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టు మధ్యప్రదేశ్ నట్టనడుమ వాజ్‌పేయికి నివాళిగా నిలిచింది.
పోఖ్రాన్ అణుపరీక్షలు: అటల్ జీ చైతన్యవంతమైన నాయకత్వంలో భారత్ 1998 మే 11, 13 తేదీల్లో రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో ఐదు అణు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 45 కిలోటన్నుల థర్మోన్యూక్లియర్ పరికరం (హైడ్రోజన్ బాంబు), 15 కిలోటన్నుల విచ్ఛిత్తి పరికరం (అణుబాంబు) ఉన్నాయి. ఫలితంగా భారత్ అణుశక్తి దేశంగా అధికారికంగా గుర్తింపు పొందింది. పరీక్షల అనంతరం అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొన్నప్పటికీ భారత్ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని చాటుకోవడంలో దృఢంగా నిలబడింది. ఈ పరీక్షలు భారతదేశ రక్షణ, శాస్త్రీయ చరిత్రలో ఒక కీలక ఘట్టం. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఈ పరీక్షల ద్వారా భారతదేశ అణుశక్తిని ప్రదర్శించింది, దేశానికి గర్వకారణంగా నిలిచింది.
ఆర్థిక సంస్కరణలు మాత్రమే కాక అటల్ జీ దౌత్యపరమైన కృషి కూడా ఎంతో దూరదృష్టితో కూడుకున్నది. లాహోర్‌కు ఆయన చారిత్రాత్మక బస్సు ప్రయాణం దౌత్యపరంగా ఆయన శాంతియుత దృక్పథానికి ప్రతీక. నిస్వార్థ ప్రజాసేవ పట్ల బిజెపి నిబద్ధతకు కమలం ప్రతీక. అవివాహితుడిగా ఉండి నిరాడంబరంగా, సేవాభావంతో జీవితాన్ని గడిపిన అటల్ బిహారీ వాజ్‌పేయి తన జీవితాంతం ఈ తత్వాన్ని ప్రతిబింబించారు. నిస్వార్థ రాజకీయాల స్ఫూర్తిని ఆయన బిజెపిలో నింపారు. అన్నింటికీ మించి పార్టీకి, దేశానికి స్ఫూర్తినిచ్చే వారసత్వమైన అంకితభావాన్ని ఆయన నొక్కిచెప్పారు.
బ్రిజ్ మోహన్ అగర్వాల్,
లోక్ సభ సభ్యుడు, ఛత్తీస్ గఢ్ మాజీ మంత్రి

