NRR Wgl Tour

కేంద్ర నిధులతోనే వరంగల్ అభివృద్ధి

nrr smmakka sarakkaకేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ అభివృద్ధి జరుగుతోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓరుగల్లుకు ఒరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. ఇటీవల గ్రామపంచాయతీల్లో ప్రజలు బిజెపికి చూపించిన ఆదరణను కొనసాగిస్తూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. జనవరి 8, 9న రెండు రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో వరంగల్,  హన్మకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరిన రాంచందర్ రావుకు మార్గమధ్యలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో రాంచందర్ రావుతో పాటు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, టి. వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్. వి. సుభాష్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ తదితరులు కూడా ఉన్నారు. 

హన్మకొండ చేరుకున్న రాంచందర్ రావు బృందానికి స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరంగల్‌కు బిజెపికి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం ఉందని రాంచందర్ రావు గుర్తుచేశారు. 1984లో బిజెపికి లోక్‌సభలో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్న కష్టకాలంలో, ఆ రెండు సీట్లలో ఒకటి వరంగల్ జిల్లాకు చెందిన జంగారెడ్డి విజయం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటి కీలక సమయంలో కూడా పార్టీకి అండగా నిలిచిన చారిత్రక గడ్డ వరంగల్ అని అన్నారు. అలాంటి వరంగల్ గడ్డపై అడుగుపెట్టడం తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.

అనంతరం వరంగల్ లో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో రాంచందర్ రావు గారు పాల్గొన్నారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలు కాషాయ జెండాలతో, జై బిజెపి నినాదాలతో ఈ ర్యాలీని హోరెత్తించారు. అనంతరం రాంచందర్ రావు  భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం గొప్ప ఆధ్యాత్మిక శక్తిని అందించిందని, పార్టీ ప్రయాణానికి ఇది ఒక ఆశీర్వాదంలా భావిస్తున్నానని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణలో బిజెపి ప్రయాణం మరింత వేగంగా, బలంగా సాగాలని ఆకాంక్షించారు. మాతృభూమికి మరింత గొప్పగా సేవ చేయడానికి బిజెపి కార్యకర్తలందరికీ శక్తి, ధైర్యం, జ్ఞానం ప్రసాదించాలని భద్రకాళి అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో వెనకబాటు

బిజెపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రచార కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజాసేవకై అంకితభావంతో పనిచేసే కౌన్సిలర్లను గెలిపించడానికి పార్టీ సభ్యులు సమన్వయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ ‘‘వరంగల్‌లో అనేక స్థానిక సమస్యలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ సర్కారు “స్లమ్ ఫ్రీ సిటీ”గా మార్చతామని హామీ ఇచ్చినప్పటికీ, ఏ పనీ జరగలేదు. వానాకాలంలో చాలా ప్రాంతాల్లో వరదల కారణంగా ఇండ్లు మునిగిపోవడం వంటి పరిస్థితులు మనం చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ, స్థానిక సమస్యలను పట్టించుకోలేదు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మాస్టర్ ప్లాన్ అమలు, వందల కోట్ల ప్రత్యేక నిధుల హామీలు అంటూ ప్రకటించినా ఏ ఒక్కటీ సాకారం కాలేదు.  బిజెపి నుంచి ఈ ప్రాంతానికి ఒక్క ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని లేకపోయినా, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసి, వరంగల్ అభివృద్ధికి కృషి చేసింది. ఇంకా, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని ఆధునికంగా నిర్మించడం, భద్రకాళి చెరువు, పద్మాక్షి ఆలయం, వేయిస్తంభాల గుడి అభివృద్ధి- ఇలా కేంద్రం సహకారంతోనే సాధ్యమయ్యాయి. మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దీని వల్ల వరంగల్‌కు కమర్షియల్ ఎయిర్ కనెక్టివిటీ, ప్రయాణ సౌకర్యం, వ్యాపార-పారిశ్రామిక అవకాశాల విస్తరణ సాధ్యమవుతుంది. స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్, రూర్బన్ పథకాల ద్వారా వేలకోట్ల నిధులు వరంగల్ అభివృద్ధికి కేటాయించింది. ములుగు సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కూడా కేంద్రం మంజూరుచేసింది. 

గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాలేదు. రైతులు రుణమాఫీ పొందలేకపోయారు, విద్యార్థులు ఉద్యోగాలు పొందలేదు, విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల పేర్లతో ప్రజాధనాన్ని దోచుకుంది. రెండేళ్ల క్రితం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు విషయాన్నే మర్చిపోయింది. గతంలో ఉల్లిగడ్డ దామెరలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించినప్పుడు రైతులు ఎంతో ఆవేదనతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు సరిగ్గా రుణమాఫీ జరగలేదని రైతులు స్పష్టంగా తెలిపారు. అలాగే రైతుభరోసా కింద ఏడాదికి ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ వాగ్ధానం కూడా నెరవేరలేదు. విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, 35 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటోంది. కానీ వారు చెప్పే నియామక పరీక్షలు, ఉద్యోగాల అంశాలు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని అందరికీ తెలుసు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు. రైతులు, యువత, పేదలు, మధ్యతరగతి-అందరూ మోసపోయారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని కేవలం తమ కుటుంబ ప్రయోజనాల కోసం దోచుకుంది. ప్రజలకు చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనపై ఆగ్రహంతో కాంగ్రెస్‌ను గెలిపిస్తే, పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలంగాణ ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో, అక్కడ వాటిని అమ్మడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా మారింది. ఏ భూమిని ఎంత కమిషన్‌తో, ఏ కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్నదానిపైనే వారి దృష్టి ఉంది. అందుకే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కమిషన్ల, కాంట్రాక్టర్ల ప్రభుత్వంగా మారింది.

ఇక మరోవైపు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని తీసుకువచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ హిల్ట్ పాలసీ ద్వారా 22 పారిశ్రామికవాడలను అన్యాక్రాంతం చేయాలనే ఆలోచనలో ఉంది. పరిశ్రమలను మూసివేసి, పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చాలన్న దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల అవినీతి, దోపిడీ వల్ల రాష్ట్రం వెనక్కి నెట్టబడుతోంది. ఈ అవినీతికి చెక్ పెట్టాలంటే, నిజమైన అభివృద్ధిని తీసుకురావాలంటే బిజెపికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మున్సిపాలిటీల స్వరూపాన్ని పూర్తిగా మార్చి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలతో అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాను.’’ అని అన్నారు. 

యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం కన్ను

వరంగల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ప్రసిద్ధ కాకతీయ విశ్వవిద్యాలయంలో సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరు. అయితే ఈ యూనివర్సిటీ భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసి, భూములు అమ్ముకునేందుకు కుట్ర చేస్తున్నది. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 100 ఎకరాల భూమిని ఇండస్ట్రీలకు, రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చే ప్రయత్నం చేసింది. హైదరాబాద్ మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో వేల కోట్ల విలువైన 50 ఎకరాల స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం స్వాధీనం చేసుకోవాలనుకుంది.ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, కనీసం వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం భూముల అమ్మకంపై ఆధారపడే విధంగా రాష్ట్రాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మన భూములు, విశ్వవిద్యాలయ భూములు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లింది. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై సమగ్రంగా, సమర్థవంతంగా చర్చ జరిగింది లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు కేసీఆర్ ఓటీపీ లాగా ఇలా వచ్చి.. అలా మాయమైపోయారు. అసెంబ్లీలో చర్చల కంటే ప్రజల ధనాన్ని, సమయాన్ని వృథా చేశారు. అసలు ప్రజలకు అవసరమైన అంశాలపై చర్చ చేయలేదు. భూముల కబ్జా, రైతు బంధు బంద్, విద్యార్థులకు నిరుద్యోగ భృతి, విద్యా సంస్థలకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ బకాయిలు – ఈ అంశాల్లో దేనిపైనా అయినా చర్చించారా అంటే లేదు. 

గోదావరి, కృష్ణా నదుల విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ సమస్యను సుప్రీం కోర్టు, అపెక్స్ కౌన్సిల్, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సిల్ స్థాయిల్లో చర్చలు జరగడం ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతోంది. గతంలో కృష్ణా నది నీటివాటాలో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కన్నా చాలా తక్కువగా కేవలం 299 టీఎంసీలే సరిపోతాయని కేసీఆర్ స్వయంగా అంగీకరించారు. తెలంగాణ రైతుల హక్కులను కాపాడాల్సిన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా సంతకం పెట్టారు. ఇదే ఈరోజు కొనసాగుతున్న కృష్ణా నీటి అన్యాయానికి ప్రధాన కారణం. 

వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాం

తెలంగాణలో రాజకీయాలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో, గౌరవప్రదంగా జరగాలి. పార్లమెంట్‌లో గానీ, శాసనసభలో గానీ అసభ్యకరమైన మాటలు, బూతులు వాడకూడదు. రాబోయే తరానికి, విద్యార్థులకు, సమాజానికి రాజకీయ నాయకులు మంచి ఆదర్శంగా నిలవాలి. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఉపయోగిస్తున్న అసభ్య భాష ప్రజలకు, విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదు. తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ చేసిన అన్యాయం, మోసం ఏమిటో — వాస్తవాలతో సహా ప్రజల ముందుకు తీసుకువెళ్తాం. ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తాం. ప్రజాహితమే మా లక్ష్యం. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. మున్సిపాలిటీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, విద్యా సంస్థల సమస్యలు కావచ్చు, ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు కావచ్చు -ఈ అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం, బాధ్యతారహిత వైఖరికి వ్యతిరేకంగా బిజెపి గట్టిగా పోరాడుతుంది. ప్రతి విషయంలో బాధిత ప్రజల పక్షాన నిలబడి, వారికి అండగా ఉండి, ప్రతి సమస్యకు న్యాయమైన పరిష్కారం దిశగా పనిచేస్తుంది. 

ఇటీవల పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. గతంలో పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి కేవలం 163 మంది సర్పంచులు మాత్రమే గెలిచారు. కానీ ఇప్పుడు దాదాపు 900కి పైగా సర్పంచులను గెలిపించారు. ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లో బిజెపిపై ప్రజల విశ్వాసం గణనీయంగా పెరిగిందని సూచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ బిజెపికి ఆదరణ బలంగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా మున్సిపాలిటీల్లో కూడా మా పార్టీకి విస్తృతమైన మద్దతు లభిస్తోంది. బిజెపిలో వర్గాలు లేవు. మా పార్టీకి ఒక్కటే వర్గం ఉంది – అది నరేంద్ర మోదీ నాయకత్వంలో నడిచే బిజెపి వర్గం. తెలంగాణ బిజెపి నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు అందరం ఐక్యంగా, సమన్వయంతో ముందుకు సాగుతున్నాం.’’ అని వ్యాఖ్యానించారు.

సమ్మక్క-సారక్క అమ్మవార్ల దర్శనం

అనంతరం అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు ఘన స్వాగతం పలికారు. భూపాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించి స్థానిక నాయకులు, కార్యకర్తలను ఉత్తేజితులను చేశారు. జనవరి 8న రాత్రి అక్కడే రాత్రి బస చేశారు. మరునాడు జనవరి 9న ములుగు జిల్లాలోని ప్రసిద్ధ సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో పవిత్ర గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మేడారం చేరుకున్న రాంచందర్ రావుకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘ములుగు జిల్లా ఏర్పాటులో బిజెపి పార్టీ పాత్ర అత్యంత కీలకమైనది. నేను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో శాసనమండలిలో ములుగు జిల్లా ఏర్పాటుకు డిమాండ్ చేశాను. అఖిలపక్ష సమావేశాల్లో కూడా ములుగు ప్రత్యేక జిల్లా ఏర్పాటులో కీలక భాగస్వామినయ్యాను. ఫలితంగా ములుగు జిల్లా కొత్తగా ఏర్పాటైంది. సమ్మక్క-సారలమ్మ, రామప్ప దేవాలయాలు, లక్నవరం పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అభివృద్ధి పనులు విజయవంతంగా సాగుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్లనే రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. ఇప్పుడు రామప్పలో రూ.150 కోట్ల కేంద్ర నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తున్న సమ్మక్క-సారలమ్మ జాతరకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ములుగులో సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వేర్వేరు ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటూ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ములుగు అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ఆదరించి గెలిపించి, ములుగును మరింత పెద్దఎత్తున అభివృద్ధి చేసుకుందాం.’’ అని అన్నారు. డిసెంబర్ 9న సాయంత్రం మేడారం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకోవడంతో ఈ పర్యటన విజయవంతంగా ముగిసింది.