konda surekha

కొండా సురేఖ ఓఎస్డీ దుమారంతో బయటపడ్డ ప్రభుత్వ దౌర్జన్యాలు!

దీపావళి పండుగ శుభాకాంక్షల మాటున రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి దంపతులు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. పైకి సాధారణ శుభాకాంక్షల భేటీగా కనిపించినప్పటికీ, ఇటీవల కొండా కుటుంబం చుట్టూ జరిగిన హైడ్రామా నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించి, అతడిని అరెస్ట్ చేసేందుకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో మంత్రి నివాసానికి చేరుకోవడంతో ఈ డ్రామా మొదలైంది.

కొండా సురేఖ మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం, మంత్రివర్గం నుండి ఆమెను తొలగిస్తున్నారని ప్రచారం జరగడంతో కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో చెలరేగిన దుమారాన్ని కట్టడి చేసేందుకు ఈ భేటీ జరిగినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో పరస్పరం చేసుకున్న తీవ్రమైన ఆరోపణలు ఏమైనట్లు? అనే ప్రశ్న తలెత్తుతుంది. అర్ధరాత్రి ఓ మంత్రి ఇంటికి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లడం సాధారణ విషయం కాదు. ఎందుకు వెళ్లారు? ఏమైనా కేసు నమోదు చేశారా? ఈ విషయమై ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? వంటి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పకుండా అసలేమీ జరగనట్లు నటిస్తూ ఉంటే తెలంగాణలో దౌర్జన్యమే పాలనగా నడుస్తుందా? మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ దక్కన్‌ సిమెంట్స్‌ డైరెక్టర్‌ తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించారని స్వయంగా ఓ మంత్రి ఫిర్యాదు చేశారని, పోలీసులు నేరుగా అర్ధరాత్రి మంత్రి ఇంట్లో ఉన్న అతనిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఏకంగా మంత్రి ఇంటిపైకే పోలీసులు వెళ్లడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ఇప్పుడు అందరూ మౌనం వహించడంతో సర్దుబాటు చేసుకున్నారనే అభిప్రాయం కలుగుతుంది. 

ముఖ్యమంత్రిపై, కొందరు మంత్రులు, బిగ్‌ బ్రదర్స్‌, సలహాదారులు, తదితరులపై తీవ్రాతి తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కూతురు సుస్మిత ఇప్పుడు బయట కనిపించడం లేదు. భూ దందాలు, దక్కన్‌ సిమెంట్స్‌ వ్యవహారాల నేపథ్యంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని ఆమె బాంబు పేల్చారు. అయితే ఇప్పుడు అందరూ ఎందుకు గప్‌చుప్‌ అయ్యారు? బీసీలను రెడ్లు తొక్కేస్తున్నారంటూ తన కూతురు సుస్మిత ఆరోపించిన మరునాడే తమ నాయకుడు రెడ్డి అయినా బీసీల కోసం మద్దతు ఇస్తున్నారంటూ మంత్రి సురేఖ రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించడం వెనుక మతలబేమిటి? అసలేం జరిగింది? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సుమంత్‌ కోసం మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చిన తర్వాత అరెస్ట్ చేసే ప్రయత్నమే చేయలేదు. కనీసం సుమంత్‌పై కేసు కూడా నమోదు కాలేదని పోలీస్‌ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఓ దిల్లీ పెద్ద వద్ద జరిగిన భేటీలో అందరి అక్రమాలు బయటపడడంతో ఎవరికి వారు మౌనం వహిస్తున్నారని తెలుస్తున్నది. ఎఫ్‌ఐఆర్‌ లేకుండా, కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా ఒక మంత్రి ఇంటి మీదికి పోలీసులను ఎలా పంపిస్తారని ముఖ్యమంత్రిని ఓ దిల్లీ నేత ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో దక్కన్‌ సిమెంట్స్‌ నుంచి వసూళ్లతోపాటు ఇతర వ్యవహారాల గురించి ఆయన నిలదీసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి బృందం చేస్తున్న భూ దందాలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆమె చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇలా ఇద్దరి దందాలు బయటపడటంతో ఇద్దరూ రాజీ పడినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి రోజున రాజీ కోసమే కొండా సురేఖ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళారా? కొండా దంపతులను దగ్గరుండి ముఖ్యమంత్రి ఇంటికి తీసుకెళ్లిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ దగ్గరుండి రాజీ చేశారా? ఉమ్మడిగా రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకొందామని, ఒకరి దోపిడీకి మరొకరు అడ్డురావద్దని ఒప్పందానికి వచ్చారా? ఈ ప్రశ్నలకు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పక తప్పదని గ్రహించాలి.

కృష్ణ చైతన్య