కొత్త ఉపాధి చట్టంపై అర్థంలేని అపోహలు
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలపై బహిరంగ చర్చ అత్యంత కీలకం. ముఖ్యంగా గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని ప్రభావితం చేసే చట్టాలను అత్యంత నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే, ఇటువంటి పరిశీలన పాత ఆలోచనా ధోరణుల ప్రభావంతోనో లేక ఏదో కోల్పోతామన్న విమర్శకుల అర్థంలేని ఆందోళనలతోనో కాకుండా కొత్త చట్టం అసలు ఏం అందిస్తుందనే అంశంపై స్పష్టమైన అవగాహనతో జరగాలి. ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)’ (వీబీ-జీ రామ్ జీ) చట్టం, 2025పై వస్తున్న విమర్శలలో చాలా వరకు ఇటువంటి అపోహలతో కూడినవే.
రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ ఆదాయాలను స్థిరీకరించడంలో, సంక్షోభ సమయాల్లో భద్రతను కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. కోవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ఈ పథకం ప్రజలను ఎంతగానో ఆదుకుంది. అయితే, కాలక్రమేణా ఈ చట్టంలోని బలహీనతలు బయటపడ్డాయి. వేతనాల చెల్లింపుల్లో విపరీతమైన జాప్యం, నిరుద్యోగ భృతిని అడ్డుకునేలా ఉన్న ప్రక్రియ, రాష్ట్రాల మధ్య అసమానతలు, పరిపాలనా సామర్థ్యంలో లోపాలు, నకిలీ జాబ్ కార్డులు, తప్పుడు హాజరుపట్టీలు, నాణ్యత లేని ఆస్తుల సృష్టి వంటి రూపాల్లో పెద్దయెత్తున అవినీతి చోటుచేసుకుంది. ఇవి కేవలం చిన్నపాటి లోపాలు కావు, వ్యవస్థాగత వైఫల్యాలు. పాత చట్టం విశ్వసనీయతను దెబ్బతీసిన ఈ వైఫల్యాలను సరిదిద్దడంపైనే కొత్త చట్టం (వీబీ-జీ రామ్ జీ) ప్రధానంగా దృష్టి సారించింది. లోపభూయిష్టమైన పాత వ్యవస్థల స్థానంలో ధృవీకరించిన కార్మికుల హాజరుపట్టీలు వస్తాయి. వేతన చెల్లింపులకు చట్టబద్ధమైన గడువులను నిర్ణయించడంతో పాటు ఆలస్యమైతే నష్టపరిహారం చెల్లించేలా నిబంధనలు చేర్చారు. ఆచరణలో నిరుద్యోగ భృతిని నిరుపయోగం చేసిన క్లిష్టమైన నిబంధనలను తొలగించారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నిర్దిష్ట గడువులు, జవాబుదారీతనంతో బలోపేతం చేశారు. ఈ మార్పులు కార్మికులలో నమ్మకాన్ని సడలించిన ఆచరణాత్మక లోపాలను తొలగిస్తాయి. వేతన ఉపాధి పొందే చట్టపరమైన హక్కు యధాతథంగా, న్యాయబద్ధంగా కొనసాగుతుంది. అంతేకాకుండా, చట్టబద్ధమైన పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచారు. ఇక్కడ మారింది అమలు చేసే విధానం మాత్రమే.
కష్టాలు మొదలైన తర్వాత స్పందించే ఆపద్ధర్మ నమూనా నుంచి ముందస్తు ప్రణాళికతో, భరోసా ఇచ్చేలా పనిని కల్పించే పటిష్టమైన విధానం దిశగా మార్పు జరిగింది. చట్టబద్ధమైన సంస్కరణల ద్వారా అమలులో వైఫల్యాలను సరిదిద్దడం ప్రక్షాళనే అవుతుంది. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి పేద జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు పాత చట్టం కింద తక్కువ ప్రయోజనం చేకూరిందన్న ఆందోళనలు వాస్తవమే. ఉపాధి హామీ ఈ రాష్ట్రాల్లో విస్తరించకపోవడం అనేది పథకం వైఫల్యమే. ప్రణాళిక లేని ‘డిమాండ్-స్పందన’ నమూనా పరిపాలనా సామర్థ్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మేలు చేసింది, కానీ అవసరం ఎక్కువగా ఉన్న, వలసలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను వెనుకబాటుకు గురిచేసింది. కొత్త వ్యవస్థ ఈ అసమానతను ‘వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల’ ద్వారా పరిష్కరిస్తుంది. ఇందులో స్థానికంగా వచ్చే ఉపాధి డిమాండ్‌ను, పనుల ముందస్తు ఆమోదం, నిధుల హామీతో అనుసంధానిస్తారు. పాత పద్ధతిలో ఉపాధి కల్పనలో ఉన్న అసమానతల వల్లే ఈ సంస్కరణ అవసరమైంది. పాత పద్ధతినే కొనసాగిస్తే అన్యాయం ఇంకా పెరిగేది. పైగా పారదర్శకమైన ప్రమాణాల ఆధారంగా నిధుల కేటాయింపులు రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ న్యాయంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూస్తాయి.
రాష్ట్రాలు ఇప్పుడు వ్యయంలో వాటాను భరించాల్సి ఉన్నందున 125 రోజుల పెంపు కేవలం భ్రమ మాత్రమేనని మరో విమర్శ వినిపిస్తోంది. ఈ వాదన గతంలో జరిగిన దాన్ని, రక్షణ చర్యలను విస్మరిస్తోంది. ఖర్చులో కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యం కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఉన్న పాత నిబంధనలనే అనుసరిస్తుంది. ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి 90:10 నిష్పత్తిలో ఈ విధానం కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ప్రణాళికాబద్ధమైన అమలు వల్ల నిధుల ప్రవాహంలో స్పష్టత వస్తుంది. గతంలో అమలుకు ఆటంకం కలిగించిన అనిశ్చితి తగ్గుతుంది. ఎక్కువ పనిదినాలు, భాగస్వామ్యం ద్వారా మరింత బాధ్యత ‘సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తి’ని ప్రతిబింబిస్తుంది తప్ప హక్కులను బలహీనపరచడం అవదు. గ్రామీణ రోడ్ల నుంచి గృహ నిర్మాణం, తాగునీటి పథకాల వరకు అనేక విజయవంతమైన జాతీయ కార్యక్రమాలు ఇటువంటి భాగస్వామ్యంతోనే నడుస్తున్నాయి.
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలు కొత్త విధానంలో నష్టపోతాయని కొందరు అంటున్నారు. అయితే కేవలం ఆర్థిక ఒత్తిడి మాత్రమే ఉపాధి కల్పనను ఆపదు. పాత విధానంలో ఉపాధి దొరక్కపోవడానికి ప్రధాన కారణాలు బలహీనమైన ప్రణాళికలు, పరిమిత పరిపాలనా సామర్థ్యం, ఆచరణాత్మకమైన అడ్డంకులు. కొత్త చట్టం ముందస్తు, సాంకేతికతతో కూడిన ప్రణాళిక ద్వారా ఈ నష్టాలను తగ్గిస్తుంది. ప్రణాళికలు ఆమోదం పొందిన తర్వాత పనిని నిరాకరించే అధికారాన్ని తగ్గించింది. కీలకమైన పరిపాలనా వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచడం ద్వారా రాష్ట్రాలు తమ క్షేత్రస్థాయి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలు కలుగుతుంది. రాష్ట్రాల సొంత సమస్యల కారణంగా వ్యవస్థాగత బలహీనతలను సరిదిద్దే జాతీయ సంస్కరణను తప్పు పట్టడం సమంజసం కాదు.
పాత చట్టం కింద ఎక్కువ అవసరం ఉన్న రాష్ట్రాల్లో అతి తక్కువ పనిదినాలు కల్పించబడ్డాయని, చాలా తక్కువ కుటుంబాలు మాత్రమే గరిష్ట పనిదినాలను పొందాయని విమర్శకులు గమనించాలి. కొత్త విధానం నమోదైన డిమాండ్‌కు ఆమోదించిన పనులు, స్పష్టమైన గడువులు, బలమైన నిరుద్యోగ భృతి ద్వారా మద్దతునిస్తుంది. చట్టబద్ధమైన హక్కును వాస్తవ పనిదినాలుగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. పాత విధానం ‘డిమాండ్ ఆధారిత’మని, కొత్తది ‘సరఫరా (నిధులు) ఆధారిత’మని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. కొత్త చట్టం డిమాండ్‌ను తగ్గించాలని చూడదు; దానిని ప్రణాళికాబద్ధం చేసి అమలుకు వీలుగా మారుస్తుంది. నెరవేరని సూత్రప్రాయమైన హక్కు కంటే, నిధుల మద్దతు ఉన్న ప్రణాళికాబద్ధమైన డిమాండ్ కార్మికులకు మరింత మేలుచేస్తుంది. ఉపాధి హామీ హక్కుల స్వభావం బలహీనపడకపోగా, మరింత బలోపేతం అయింది. పనిదినాలు 125 రోజులకు పెంపు, వేతన చెల్లింపు గడువులు, దానంతట అదే (ఆటోమేటిక్) నష్టపరిహారం వంటివి పని హక్కు ఆచరణాత్మక విలువను పెంచుతాయి. పరిపాలనాపరమైన అడ్డంకులు లేనప్పుడే హక్కులకు అర్థం ఉంటుంది. అవినీతి, నకిలీ కార్డులు, నాణ్యత లేని పనులు పాత చట్టం ప్రధాన బలహీనతలు. నిర్ధారించిన లబ్ధిదారుల వ్యవస్థలు, పటిష్టమైన ఆడిట్ల ద్వారా వీటిని పరిష్కరించాలని కొత్త చట్టం లక్ష్యంగా పెట్టుకుంది.
పంట పనుల సమయంలో పథకానికి విరామంపై వస్తున్న ఆందోళనలను కూడా సరైన కోణంలో చూడాలి. ఇది వ్యవసాయ సీజన్లలో కార్మికుల కొరత రాకుండా చూసేందుకు తీసుకున్న జాగ్రత్త మాత్రమే. ఇది చట్టబద్ధమైన 125 రోజుల హక్కుకు ఏమాత్రం భంగం కలిగించదు. వ్యవసాయ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఆదాయాలను రక్షించే సమతుల్యమైన ఆర్థిక విజ్ఞత ఇది. వీబీ-జీ రామ్ జీ చట్టం ఉపాధి హామీని వదిలివేయడం లేదు. ఇది దానిని మరింత బలోపేతం చేస్తోంది, విస్తరిస్తోంది. ముఖ్యంగా అత్యంత అవసరమైన ప్రాంతాల్లో, సమూహాల్లో గతంలో ఉన్న లోపాలను తొలగించి వారిని ఆదుకోవడమే దీని లక్ష్యం.
శైలేష్ కుమార్ సింగ్,
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి

