Fadnavis

మా నిర్ణయం వల్లే తెలంగాణకు సాగునీరు

Devendra Fadnavisభారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా, ఎలాంటి గొడవలు లేకుండా తెలంగాణకు నీళ్లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. నేడు తెలంగాణలో సాగునీరు అందుతుందంటే, దానికి ఆ నిర్ణయమే కారణమన్నారు. ఉమ్మడి ఆధ్రప్రదేశ్ లో 20 – 25 ఏళ్లుగా మహారాష్ట్రతో నీటి ఘర్షణలు ఉండేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, 2015లో నాటి సీఎం కేసీఆర్ గోదావరి జలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని, అప్పుడు మనమంతా భారతీయులమని, ఘర్షణ వద్దని ఆయనకు చెప్పామని వెల్లడించారు. ప్రాజెక్టు ఎత్తు కొంచెం తగ్గించుకుంటే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని, అలాగే గడ్చిరోలి ముంపు నుంచి బయటపడుతుందని చెప్పామన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఫిబ్రవరి 7న సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాలలో బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ర్యాలీలు తీశారు, కార్నర్ మీటింగులు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో దేవేంద్ర ఫడ్నవిస్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్ కూడా పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలకు బిజెపి కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో స్థానిక ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, మంచిర్యాలలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రసంగించారు.

”బీఆర్ఎస్, కాంగ్రెస్ కారణంగా తెలంగాణ ఖజానా ఖాళీ అయింది. అప్పులు పెరిగాయి, రాష్ట్రం నిధుల కొరతతో అల్లాడుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకుల వైఫల్యం, నిర్లక్ష్యం, అసమర్థత వల్ల మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నాయకులు అవినీతి, అరాచకాల ద్వారా రాష్ట్రాన్ని దోచుకుని తమ జేబులు నింపుకొన్నారు. పేదలు, రైతులకు మాత్రం చేసిందేమీ లేదు. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రాణహిత ప్రాజెక్టు గురించి అడుగుతున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత చర్చించేందుకు మహారాష్ట్రకు రావాలని ఎమ్మెల్యే హరీశ్ బాబును ఆహ్వానిస్తున్నాం. మా రాష్ట్రానికి నష్టం లేకుండా పొరుగు రాష్ట్రానికి మేలు జరుగుతుంటే స్వాగతిస్తాం. ఇక్కడి రైతులకు న్యాయం జరుగుతుందంటే చర్చిద్దాం. తెలంగాణకు నీళ్లు ఇచ్చేందుకు మాకు సంతోషమే.

మేడిగడ్డతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయి. మేం నీళ్లు ఇచ్చినా ఈ రెండు పార్టీలు నీతి తప్పాయి. మహారాష్ట్ర రైతులకు మేం సర్ది చెప్పాం. ఆ తర్వాత మా ప్రభుత్వమే వారికి నష్ట పరిహారం అందించింది. పట్టణాల అభివృద్దికి కేంద్రం నేరుగా నిధులు ఇస్తోంది. స్మార్ట్ సిటీ​, అమృత్​ పథకాలతో పట్టణాలను అభివృద్ధి చేస్తోంది. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు నిధులు విడుదల చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే రోజుల్లో బెల్లంపల్లి నుంచి గడ్చిరోలి వరకు రహదారి నిర్మాణం చేపడతాం. మహారాష్ట్రలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ బిజెపి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం.” అని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బంధం

ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాపాడగలిగేది బిజెపి మాత్రమే. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా పట్టణాల అభివృద్ధి అసాధ్యం. అమృత్, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్ వంటి కీలక పట్టణాభివృద్ధి పథకాలు అన్నీ కేంద్ర ప్రభుత్వమే రూపకల్పన చేసి అమలు చేస్తున్నవే. ఈ పథకాల ద్వారానే తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం, మౌలిక వసతులు మెరుగు పడుతున్నాయి. పేదలకు ప్రతి నెల 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం, వీధి దీపాల ఏర్పాటు, డ్రైనేజీల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు పూర్తిగా కేంద్ర నిధులతోనే కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఈ రోజు కనిపిస్తున్న అభివృద్ధికి మూలాధారం కేంద్ర ప్రభుత్వమే. బిజెపి మాత్రమే అవినీతి రహిత పాలన అందించగలదు. ప్రజలపై అదనపు పన్నులు వేయకుండా, భారం మోపకుండా అభివృద్ధి చేస్తుంది. బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య అవినాభావ బంధం స్పష్టంగా ఉంది. అది తుమ్మబంక బంధమా, యాప బంక బంధమా అన్నది ప్రజలే నిర్ణయించాలి. కానీ ఈ రెండు పార్టీలు ఒకదానికొకటి రక్షణగా నిలుస్తున్నాయన్నది వాస్తవం. గతంలో కేసీఆర్ – కేటీఆర్‌లు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని రక్షించారు. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పాలనలో అవినీతి కేసుల్లో కేసీఆర్- కేటీఆర్‌లను కాపాడే పని జరుగుతోంది. 

హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు అక్కడ ఉన్నాయని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సెక్రటేరియట్‌లో ఫైళ్లు కాలిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే తరహాలో సాక్షాలు మాయం అవుతున్నాయి. అంటే బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా అవినీతికి సంబంధించిన ఆధారాలను నాశనం చేయడంలో రెండూ ఒక్కటే. ఒకరు దొంగ అయితే, మరొకరు గజదొంగ. రేవంత్ రెడ్డి రాహువైతే, కేసీఆర్ – కేటీఆర్ కేతువులు. ఈ రాహు-కేతువుల పాలనలో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. ఈ అంధకారం నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే బిజెపిని గెలిపించుకోవడం ఒక్కటే మార్గం.” అని అన్నారు.