Kishan Reddy

మోదీ వచ్చాకే దేశంలో అభివృద్ధి, సంక్షేమం

Kishan Reddy

2014 వరకు పాలసీ పెరాలసిస్ (విధానపరమైన వైఫల్యం) కారణంగా.. ‘గరీబీ హఠావో’, ‘రోటీ-కపడా-మకాన్’ వంటి రాజకీయ నినాదాలు ప్రజల జీవితాల్లో కనీస మార్పు కూడా రాలేదని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఓ ప్రభావవంతమైన అడుగు ముందుకు పడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కోట్ల మంది భారతీయుల జీవితాల్లో వారి భవిష్యత్తుకు సంబంధించిన ఆశలు, ఆకాంక్షలు పెరిగాయన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఉచితాలు ఇవ్వడం వంటి ఆలోచనల నుంచి బయటపడి.. దీర్ఘకాలంలో ఆర్థికంగా, సామాజికంగా లాభాన్ని చేకూర్చే కార్యక్రమాలను రూపొందించి.. లీకేజీలు లేకుండా వాటిని అమలు చేసిన కారణంగా.. గత పదేళ్లలో భారతదేశం ఈ విషయంలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. ఇతర దేశాలపై ఆధారపడే దశ నుంచి ఆత్మనిర్భరత ద్వారా ప్రపంచానికి సహాయపడే దశకు చేరుకుంటోందని చెప్పారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్లలో 100కోట్లకు పైగా భారతీయులు కనీస సామాజిక-ఆర్థిక అవసరాలకు దూరమయ్యారన్నారు. పీఎం ఆవాస్ యోజన ద్వారా 4 కోట్ల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందుతుందన్నారు. 2014 నుంచి పేదరికం నుంచి బయటపడిన వారి సంఖ్య 25 కోట్ల మంది ఉన్నారని చెప్పారు. పీఎం ఉజ్వల పథకంలో భాగంగా 10 కోట్ల మందికి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు జారీ చేశామన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 14 కోట్ల గ్రామీణ కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా 12 కోట్ల టాయిలెట్ల నిర్మించామని తెలిపారు.

ఏప్రిల్ 1న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆయష్మాన్ భారత్ – పీఎం జన ఆరోగ్య యోజన ద్వారా ఉచిత వైద్యం అందిచడం వల్ల పేదలకు రూ.77వేల కోట్లు ఆదా అయ్యాయి. సౌభాగ్య యోజన ద్వారా 100 శాతం గ్రామీణ ప్రాంతాలకు కరెంట్ ఇచ్చాం. 2014కు ముందు పేదలకు బ్యాంకు అకౌంట్లు లేనందున.. డీబీటీ అమలు జరగలేదు. మోదీ ప్రభుత్వం ఈ పదేళ్లలో రూ.73వేల కోట్ల ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారుల అకౌంట్లలో వేసింది. 2014కు ముందు 55 శాతం గ్రామాలకే రోడ్లు ఉంటే.. పదేళ్లలో 99 శాతం గ్రామాలకు రోడ్ల నిర్మాణం పూర్తయింది. 2014లో దేశవ్యాప్తంగా 80 జన ఔషధి కేంద్రాలుంటే.. ఇప్పుడు ఈ సంఖ్య 10వేలకు పైనే. 2014కు ముందు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పన్నెండున్నర గంటలే ఉండేది. ఇప్పుడు ఇరవై రెండున్నర గంటల కరెంట్ ఉంటోంది. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ను ఆచరణలో పాటించడం ద్వారా మారుమూల ప్రాంతంలో ఉన్న లబ్దిదారుడికి సైతం ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. సబ్సిడీలు.. ఎలాంటి లీకేజీలు లేకుండా నేరుగా అకౌంట్లో పడుతున్నాయి. దీని కారణంగా గతంలో కేంద్రం రూపాయి పంపిస్తే.. చివరి వరకు చేరేది 15 పైసలే అనే పరిస్థితి నుంచి ఇప్పుడు రూ.34లక్షల కోట్లు అకౌంట్లలోకే వచ్చాయి. దాదాపు 3 లక్షల గిరిజన కుటుంబాలు.. ట్రైఫెడ్ (TRIFED) ద్వారా అటవీ ఉత్పత్తులకు సంబంధించి రూ.44 కోట్ల విలువైన రిటైల్ సేల్స్ చేస్తున్నారు. వారిని మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్రం రూ.24వేల కోట్లతో పీఎం జన్‌మాన్ పథకాన్ని తీసుకొచ్చింది. భారతీయ సంప్రదాయ చేతి వృత్తుల వారికి, కళాకారులకు చేయూత అందించి అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకం తీసుకొచ్చాం. వన్ నేషన్, వన్ రేషన్ కార్డు ద్వారా సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. నెలకు 2.5 కోట్లకు పైగా దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ పొందుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ (గ్రామీణ్)లో భాగంగా మరో 2 కోట్ల ఇళ్లను నిర్మించబోతున్నాం. తద్వారా పేదల సొంతింటి కల సాకారం చేస్తాం. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి వచ్చే ఐదేళ్లు ఉచితంగా రేషన్ అందనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడం ద్వారా.. అక్కడ కూడా అభివృద్ధి జరుగుతోంది, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ కారణంగా.. చాలా సానుకూల మార్పులు సాధ్యమయ్యాయి. జన్ ధన్ – ఆధార్ – మొబైల్ ద్వారా అందరికీ అకౌంట్లు.. ఆధార్, మొబైల్ నెంబర్ తో వాటి అనుసంధానత పెరగడం కారణంగా.. పారదర్శకత పెరిగింది. మోదీ సర్కారు నిర్ణయాల కారణంగా.. నిరర్ధక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. 2008 ఆర్థిక సంక్షోభంతో కుదేలైన.. MSMEలకు ప్రోత్సాహం అందించి ఆర్థిక వ్యవస్థలోకి మళ్లీ భాగస్వాములను చేశాం. పన్ను సంస్కరణలతో GST ద్వారా నెలకు సగటున రూ.1.66 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో.. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు, ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా రూపుదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2016 నుంచి 26,500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 78 లక్షల వీధి వ్యాపారులకు రూ.10వేల స్వనిధి రుణాలు అందాయి. రికార్డు స్థాయిలో 596 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.50 లక్షల కోట్లు) FDIలు వచ్చాయి. MSME రంగం 15 కోట్లకు పైగా మందికి ఉపాధి కల్పిస్తోంది. 2015 నుంచి దాదాపు 46 కోట్ల ముద్రా రుణాలు అందించాం. 14 కీలక రంగాలకు రూ.లక్షకోట్లతో PLI (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు) అందించాం. ఒక్క 2022‑23లోనే 775 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.65 లక్షల కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. 51 కోట్ల జన్‌ధన్ అకౌంట్ల ద్వారా రూ.2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నాం. 2014లో 25% ఉన్న కార్పొరేట్ టాక్స్.. 2022లో 15%కు తగ్గించాం. 2014కు ముందు 12.1% ఉన్న ద్రవ్యోల్బణం.. ఈ పదేళ్లలో 5.1%కు తీసుకొచ్చాం. 2014లో రూ.37వేల కోట్ల లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఇవాళ లక్ష 20వేల కోట్ల లాభాల్లో ఉన్నాయి. 2026 నాటికి మన జీడీపీలో డిజిటల్ ఎకానమీ విలువ 20% గా ఉండనుంది. దీని ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీంతో పాటు భారతదేశం ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా, ప్రపంచ సప్లయ్ చైన్‌లో కీలకంగా మారబోతోంది.

నారీ శక్తి – నారీ సమ్మాన్

బేటీ బచావ్ ‑ బేటీ పఢావ్ ద్వారా బాలికల లింగ నిష్పత్తి 918 నుంచి 933కు పెరిగింది. 2016 వరకు ఐఐటీల్లో 8 శాతం ఉన్న యువతుల ఎన్‌రోల్‌మెంట్.. ఇప్పుడు 22 శాతానికి పెరిగింది. ఉన్నతవిద్యకు సంబంధించి.. స్టెమ్ (Science,Technology, Engineering and Mathematics) కోర్సుల్లో యువతుల ఎన్‌రోల్‌మెంట్ 43 శాతానికి పెరిగింది. రానున్న రోజుల్లో మహిళల వర్క్‌ఫోర్స్ మరింత పెరగనుంది అనడానికి సంకేతం ఇది. 28 కోట్ల మంది మహిళలు మొదటిసారి బ్యాంకు అకౌంట్లు తెరిచారు. 31 కోట్ల ముద్ర రుణాలు మహిళలకే ఇచ్చాం. కోటి మంది లక్షాధికారి అక్కలు, చెల్లెమ్మలు.. గ్రామీణ భారతంలో మార్పు తీసుకొస్తున్నారు. 84 లక్షల స్వయం సహాయక బృందాలకు రూ.8 లక్షల కోట్ల రుణాలిచ్చాం. 97.4 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం టాయిలెట్లు నిర్మించాం. పీఎం ఆవాస్ పథకంలో లబ్ధిదారుల్లో 72 శాతం మంది మహిళలే. 3.2కోట్ల సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లలో రూ. 80వేల కోట్లు జమ చేసుకున్నారు. ముస్లిం సోదరీమణుల సమస్య ‘ట్రిపుల్ తలాక్’ను రద్దు చేశాం. ఒక్క రూపాయికే మహిళలకు ‘శానిటరీ ప్యాడ్స్’ అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా.. అసెంబ్లీలు, పార్లమెంటులో మహిళల రిజర్వేషన్ ను 33 శాతానికి పెంచిన ఘనత మోదీదే. భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించి విజయం సాధించిన.. ‘చంద్రయాన్-3’ సక్సెస్ లోనూ.. 100 మంది మహిళా శాస్త్రవేత్తలు వివిధ విభాగాల్లో కృషి చేశారు.

సాంస్కృతిక పునర్వైభవం

2014 నుంచి దేశంలో ఖాదీ వినియోగం 332% పెరిగింది. ‘నమామి గంగే’లో భాగంగా గంగానది పరిశుభ్రత, నదీ పరివాహక ప్రాంతాల్లో కాలుష్య కారకాలను తగ్గించేందుకు రూ.14వేల కోట్లు ఖర్చు చేశాం. 13 కోట్ల మంది భక్తులు గత రెండేళ్లలో కాశీని సందర్శించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. ఇప్పుడది ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి కానుంది. చార్ ధామ్ యాత్ర కనెక్టివిటీ కోసం 900 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. అండమాన్ నికోబార్ లోని 21 దీవులకు 21 మంది పరమ వీర చక్ర అవార్డీల పేర్లు పెట్టి గౌరవించుకున్నాం. గిరిజన పోరాట యోధులను స్మరించుకునేలా దేశవ్యాప్తంగా 10 మ్యూజియంలు సిద్ధమవుతున్నాయి. 2014 వరకు దేశంలో 30 యునెస్కో వారసత్వ కట్టడాలుంటే.. పదేళ్లలో మరో 12 కట్టడాలకు గుర్తింపు కల్పించాం. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిసారి రామప్ప యునెస్కో గుర్తింపు పొందింది. భారతదేశం నుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన మన కళాఖండాలను వెనక్కు తీసుకువస్తున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి 2014 వరకు 13 ఇలాంటి కళాఖండాలు స్వదేశానికి వస్తే.. గత పదేళ్లలో ఈ సంఖ్య 344కు చేర్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది. 50 లక్షల మంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు. అభివృద్ధితో పాటుగా.. మన సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవడంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది.

అన్నదాతకు అండగా..

వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతును సాంకేతికంగా, ఆర్థికంగా ఆదుకునేందుకు జరిగిన ప్రయత్నాలు చాలా తక్కువ. మోదీ గాఅన్నదాతలను ఆర్థిక శక్తిలో భాగం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం వ్యవసాయాన్ని ఆధునీకరించడం మొదలుకుని.. భారీ యూరియా రాయితీలు, భూసార పరీక్షలు, పంట బీమా మొదలైన వివిధ పథకాలతో రైతు సాధికారతకు బాటలు వేస్తున్నారు. 2014తో పోలిస్తే.. వ్యవసాయ బడ్జెట్ 300 శాతం పెరిగి రూ.1.27 లక్షల కోట్లకు చేరింది. 11 కోట్ల మంది రైతులకు రూ.2.6లక్షల కోట్ల పీఎం కిసాన్ లబ్ధి చేకూరింది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 7.3 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు. ప్రపంచ పాల ఉత్పత్తిలో, చిరుధాన్యల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో భారత్ ఉంది. అగ్రి స్టార్టప్ లకు ప్రోత్సాహం అందిస్తున్నాం. ప్రస్తుతం 7వేల అగ్రి స్టార్టప్స్ ఉన్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్ కోసం రూ.19,300 కోట్లు కేటాయించాం. ఇలాంటి వాటి ద్వారా 1.8 కోట్ల మంది రైతులు 1,389 మండీల (మార్కెట్లు) ద్వారా రూ.3 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. 2013-14లో 12 మెట్రిక్ టన్నులుగా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇవాళ 4,200 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఆహార ఉత్పత్తుల ఎగుమతులు కూడా 4.9 బిలియన్ డాలర్ల నుంచి 13.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2014కు ముందు దేశంలో కేవలం 3 మెగా ఫుడ్ పార్కులుంటే.. ఇవాళ 24 మెగా ఫుడ్ పార్కులున్నాయి. 1992 నుంచి 2014 వరకు దేశంలో 11వేల సోలార్ పంపులుంటే.. ఇవాళ 5.3 లక్షల సోలార్ పంపులున్నాయి.

భవిష్యత్ తరానికి చేయూత..

దేశ జనాభాలో సగం 25 ఏళ్ల లోపు వయసున్న వారే. 2047 నాటికి మనం సంకల్పించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు వీరి పాత్ర కీలకం. అందుకే యవశక్తిని ఎక్కుపెట్టి ప్రపంచానికి మన సత్తా చాటేందుకు మోదీ ప్రత్యేక కార్యాచరణతో పని చేస్తున్నారు. అన్నిరంగాల్లో యువతను ప్రోత్సహిస్తున్నారు. వారిలో సృజనాత్మకత పెంచేందుకు కార్యక్రమాలు రూపొందించారు. 8 కోట్ల మంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కు ముద్ర రుణాలు అందించాం. 10వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా కోటి మందికి యువ ఇన్నొవేటర్స్ కు శిక్షణ ఇచ్చాం. యూనివర్సిటీలు 723 నుంచి 1,113కు పెరిగాయి. డిజిటల్ ఎకానమీ ద్వారా 2014 నుంచి 2019 వరకు 6 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాం. డిజిటల్ లిటరసీ పెంచేందుకు 6 కోట్ల మందికి శిక్షణ ఇచ్చాం. స్టార్టప్స్ లో మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వ్యవస్థగా నిలిచాం. నిరుద్యోగం 5.8 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. ఎంబీబీఎస్ సీట్లు రెట్టింపు అయ్యాయి. క్రీడల్లోనూ సత్తాచాటుతున్నాం. గతేడాది జరిగిన పారా ఏషియన్ గేమ్స్ లో గతంలో ఎన్నడూ లేనంతగా.. 111 మెడల్స్ సాధించాం.

దేశాభివృద్ధిలో మధ్య తరగతి భాగస్వామ్యం పెరిగింది. ఆదాయపు పన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపుతో ఊరట కల్పించాం. ఏటా 8 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలవుతున్నాయి. దీని ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య విశ్వాసం పెరుగుతోంది. ఆత్మనిర్భర భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా 60 లక్షల మంది లబ్ధిదారులకు రూ.10,740 కోట్ల లబ్ధి జరుగుతోంది. ESIC ద్వారా 12కోట్ల మందికి బీమా సదుపాయం అందుతోంది. 10వేల జన ఔషధి కేంద్రాల ద్వారా లబ్ధి కలుగుతోంది. 20 నగరాల్లో మెట్రో సేవల ద్వారా మధ్యతరగతి ప్రజలు అందుబాటు ధరల్లో ప్రయాణిస్తున్నారు. తలసరి ఆదాయం 79వేల నుంచి రూ.2లక్షలకు పెరిగింది.

ఆర్థికవ్యవస్థ బలోపేతం

10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ నిర్మాణం లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం. ఈ దిశగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశాం. రోడ్ల నిర్మాణానికి 3.17 లక్షలకోట్లు ఖర్చు చేస్తున్నాం. 4లేన్ హైవేస్.. 18వేల కిలోమీటర్లనుంచి 46 వేల కిలోమీటర్లకు పెంచాం. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా రూ.70వేల కోట్ల విలువైన ఇంధనం ఆదా అయింది. (టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం తగ్గింది) ఉడాన్ సౌకర్యాన్ని 1.3 కోట్ల మంది ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నారు. 3.75లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల అనుసంధానత జరిగింది. ఎన్నో ప్రతిష్టాత్మక రోడ్డు, రైలు ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశాం. 2014కు ముందు 20వేల కిలోమీటర్ల రైల్వేలైన్ విద్యుదీకరణ జరిగితే.. ఇవాళ 40వేల కిలోమీటర్ల లైన్లు విద్యుదీకరించబడ్డాయి. దేశంలో 10కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉన్నారు. 90 కోట్ల ఇంటర్నెట్ (వైఫై) కనెక్షన్లు ఉన్నాయి. 55 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ అయ్యాయి. పెన్షనర్లకు 8.5కోట్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు అందించాం.

సూపర్ పవర్ – డిపెండబుల్ విశ్వ మిత్ర

అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూనే.. అంతర్జాతీయంగా భారత ఖ్యాతిని పెంచడంలో మోదీ ఆలోచనలు అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై కాలిడిన మొదటి దేశంగా.. ప్రపంచంలో రెండో అతిపెద్ద తయారీ కేంద్రంగా.. స్టీల్ ఉత్పత్తిలోనూ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగిన దేశంగా.. 101 దేశాలకు కరోనా టీకాలు సరఫరా చేసిన దేశంగా.. 2014లో 6 కోట్ల మొబైల్స్ మన దేశంలో తయారైతే.. దీన్ని 2022 నాటికి 31 కోట్లకు పెంచిన దేశంగా.. ఇలా ఎన్నో రికార్డులను ఈ పదేళ్లలో భారతదేశం నమోదు చేసింది. విదేశీ నిల్వలుకూడా రెట్టింపును దాటిపోయాయి. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.686 కోట్ల నుంచి రూ.16వేల కోట్లకు పెరిగాయి. జీ20 సమావేశాలకు అధ్యక్షత ద్వారా.. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాం.

అంతర్గత భద్రత

దేశ రక్షణలో 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.6లక్షల కోట్ల రక్షణ బడ్జెట్ కేటాయించాం. ఇందులో 75% దేశీయంగా రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకే.. 2014 నుంచి బార్డర్ రోడ్ బడ్జెట్ (రూ.3,700 కోట్ల నుంచి రూ.14,387 కోట్లకు) 400 శాతం పెరిగింది. ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్ నుంచి 22,500 మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చాం. ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. వామపక్ష తీవ్రవాదం 52శాతం తగ్గింది. మూడోసారి మోదీ ప్రభుత్వం భారీ మెజారిటీతో (400+ సీట్లతో) అధికారంలోకి వచ్చిన తర్వాత.. మరిన్ని అద్భుతమైన మార్పులు రానున్నాయి. ప్రజల సంక్షేమాన్ని, దేశ ప్రతిష్టను మరింత పెంచేలా ఈ మార్పులు ఉండనున్నాయి. అందుకే.. ఈ మార్పులో మీరందరూ భాగస్వాములు కాగలరని.. బిజెపి అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను.’’ అని అన్నారు.