ఊహలకే పరిమితమైన విపక్ష నాయకుడు
లోక్‌సభ స్పీకర్‌పై కాంగ్రెస్ నేతృత్వంలో, ‘ఇండీ’ కూటమి మద్దతుతో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని అందరికీ ముందే తెలుసు. విపక్ష నాయకుల ప్రసంగాలను గమనిస్తే ఆ తీర్మానంలో పస లేదని స్పష్టమైంది. మరోవైపు అధికార పక్షం చేసిన ఎదురుదాడిని బట్టి చూస్తే ఇది మొత్తంగా విపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు మరో ‘సెల్ఫ్ గోల్’ (స్వయంకృతాపరాధం) అని రుజువైంది. ఈ విఫల ప్రహసనానికి పూర్తి బాధ్యత నిస్సందేహంగా విపక్ష నేత రాహుల్ గాంధీదే. 2024 ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 స్థానాలను గెలుచుకోవడం రాహుల్‌కు తన రాజకీయ చాతుర్యాన్ని నిరూపించుకోవడానికి, పార్లమెంటరీ విధానాలను అర్థం చేసుకోవడానికి, వక్తృత్వ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, అన్నింటికీ మించి తన నాయకత్వ ప్రతిభను చాటుకోవడానికి ఒక చక్కని అవకాశాన్ని కల్పించింది. కానీ పాపం, గత రెండేళ్లుగా ఈ అంశాల్లో చెప్పుకోదగ్గ పురోగతిని రాహుల్ సాధించలేకపోయారు. దీనికి విరుద్ధంగా, విషయ పరిజ్ఞానం లేకపోవడం, లోక్‌సభ కార్యకలాపాల్లో నిలకడగా పాల్గొనలేక పోవడం, గంభీరత లేని ప్రవర్తన, సరైన ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేయడం వంటి అంశాలు ప్రతిపక్ష నేత వ్యవస్థ గౌరవానికి తీవ్ర నష్టం కలిగించాయి.
ఏ కె గోపాలన్ నుంచి సుష్మా స్వరాజ్ వరకు విపక్ష నేత పదవికి ఎంతో ప్రతిష్ఠను, హుందాతనాన్ని తెచ్చిపెట్టిన వారు ఎందరో ఉన్నారు. మొదటి లోక్‌సభలో కామ్రేడ్ గోపాలన్ అధికారికంగా విపక్ష నేతగా నియమితులు కాలేదు, ఎందుకంటే అప్పట్లో ఆ పదవికి ఇంకా చట్టబద్ధత రాలేదు. అయినప్పటికీ ఆయన పాండిత్యం, ఉద్యమశీలత, వాగ్ధాటి ఆయనను అనధికారిక ప్రతిపక్ష నేతగా నిలబెట్టాయి. ఒక పార్లమెంటేరియన్‌గా కార్మిక వర్గాల హక్కుల పట్ల ఆయనకున్న నిబద్ధత అందరికీ తెలిసిందే. బిజెపి నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్ కె అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి నాయకులు సభలో వారి ప్రవర్తన ద్వారా, చర్చల సమయంలో వారు అందించిన మేధోపరమైన సహకారం ద్వారా విపక్ష నేత పదవి గౌరవాన్ని పెంచారు. విశేషమేమిటంటే 1994లో అప్పటి ప్రధాని పి వి నరసింహారావు, కాశ్మీర్ విషయంలో భారతదేశ వైఖరిని వినిపించడానికి జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌కు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా అప్పటి విపక్ష నేత వాజ్‌పేయిని కోరారు. ప్రధానికి, విపక్ష నేతకు మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన సయోధ్యకు ఈ చర్య ఒక నిదర్శనం. అద్వానీ కూడా విపక్ష నేతగా తనదైన ముద్ర వేశారు. 2009లో తన జూనియర్ అయిన సుష్మా స్వరాజ్ కోసం ఆ పదవిని త్యాగం చేశారు. తన శక్తిమంతమైన ప్రసంగాలకు పేరుగాంచిన సుష్మా స్వరాజ్, ప్రభుత్వాన్ని నిలదీసేవారు. ఆర్థిక విధానాలు, అవినీతి, ధరల పెరుగుదల, భద్రతా అంశాలపై ఆమె చేసే లోతైన అధ్యయనంతో కూడిన ప్రసంగాలు, తిరుగులేని వాదనలు అందరినీ ఆకట్టుకునేవి. కొన్ని సందర్భాల్లో, వివాదాస్పద శాసనపరమైన అంశాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గేలా ఆమె ఒత్తిడి తీసుకురాగలిగారు.
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే అటువంటి విపక్ష నేతల స్ఫూర్తిదాయక వారసత్వాన్ని రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తూ, కనీసం ఇప్పటి వరకు ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కేవలం కాంగ్రెసేతర విపక్ష నేతల నుంచే కాదు, రాహుల్ తన తల్లిదండ్రుల నుంచి, తన నాయనమ్మ నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. విపక్ష నేతగా స్వల్పకాలం పనిచేసిన ఇందిరా గాంధీ, లోక్‌సభకు వెలుపల ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన ఉద్యమ స్ఫూర్తి, క్రియాశీలతల ప్రాముఖ్యతను గుర్తించారు. దేశవ్యాప్తంగా ఆమె చేసిన అవిశ్రాంత పర్యటనల గురించి అప్పటి జర్నలిస్టులు ఎంతో రాశారు. బీహార్‌లోని బెల్చీకి ఆమె చేసిన ప్రసిద్ధ ఏనుగు స్వారీ మాత్రమే కాదు, రోజుకు 10-12 గంటల పాటు ఆమె రోడ్లపైనే గడిపేవారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తాను ఆక్రమించిన అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధమైన పదవికి న్యాయం చేయాలంటే ఆయన కొన్ని విషయాల్లో మారాలి.
రాహుల్ తన ప్రత్యామ్నాయ దార్శనికతకు లేదా ప్రణాళికకు సంబంధించి కొన్ని సాక్ష్యాలను చూపాలి. వ్యవసాయ చట్టాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. పొరుగు దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీశారు. మణిపూర్ అశాంతిపై కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. కానీ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం సరిపోదు. ఈ సమస్యలపై ప్రత్యామ్నాయ పరిష్కారాలను ఆయన సూచించాల్సింది. తాను అధికారంలో ఉంటే వాటిని ఏ విధంగా మెరుగ్గా పరిష్కరించేవాడో ప్రజలకు వివరించాల్సింది. ఉదాహరణకు ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, విద్యా రంగాల్లో అణగారిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేదని ఆయన పదే పదే అంటుంటారు. అయితే కర్ణాటక, తెలంగాణ లేదా హిమాచల్ ప్రదేశ్‌లోని ఆయన పార్టీ ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రత్యేకంగా కృషి చేశాయని చెప్పడానికి ఎటువంటి గట్టి ఆధారాలు లేవు. తన భారత్ జోడో యాత్ర తర్వాత, ఆయన కొన్ని కీలక సమస్యలను చేపట్టి వాటిపై స్థిరంగా పోరాడుతారని ఆశించారు. జీఎస్‌టిని ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని విమర్శించడం ఆయనకు సులభం కావచ్చు. అయితే, విపక్ష నేతగా ఆయన గానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు గానీ వారు కోరుకుంటున్న జీఎస్‌టి సంస్కరణల కోసం ఎటువంటి గట్టి ప్రయత్నాలు చేయలేదు.
మరో ముఖ్యమైన అంశం, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం. కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింప చేయడానికి ఎటువంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు నేడు కనిపించడం లేదు. రాహుల్ విదేశాల్లో గడిపిన రోజులను అటువంటి ప్రయత్నాల కోసం వెచ్చించి ఉంటే, పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరిగేది. ఒక ‘నాన్-రెసిడెంట్’ (ప్రవాస) విపక్ష నేత, కార్యకర్తలను పక్కన పెడితే, కనీసం తన సొంత పార్టీ ఎంపీలలోనైనా ఎలా ఉత్సాహాన్ని నింపగలరు? రాహుల్ పదే పదే విదేశీ పర్యటనలకు వెళ్లడం గురించి హోం మంత్రి అమిత్ షా విమర్శిస్తున్నప్పుడు, కొందరు కాంగ్రెస్ ఎంపీలే చాటుగా నవ్వుకోవడం గుర్తుందా?
ప్రతిపక్ష నాయకుడి పదవిని తేలికగా తీసుకోకూడదు. దేశ ప్రజలు కొన్ని సమస్యలపై ఆందోళన చెందుతున్నారని ఆయన నమ్మితే, దాన్ని వివిధ వేదికలపై, పలు సందర్భాల్లో బహుముఖంగా నిరూపించాలి. తాత్కాలిక ప్రశంసల కోసం ప్రాకులాడటం, సానుభూతి కార్డును ఉపయోగించడం, ప్రధానిని, ఇతర సీనియర్ బిజెపి నేతలను హేళన చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం ‘ఊహల నాయకుడిగా’ ఉండటం సులభంగా, ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ ఒక సమర్థమైన విపక్ష నేతగా ఎదగాలంటే, మేధావులతో చర్చించడం, పారిశ్రామికవేత్తలను కలవడం, దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించడం, లోతైన అధ్యయనంతో కూడిన వాదనలు చేయడం వంటి ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఒక సుస్థిరమైన ముద్ర వేయగలరు. బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరాన్ని, ప్రాముఖ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో నొక్కి చెప్పారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రధాని సీటు దగ్గరకు వెళ్లి ఆయనను కౌగిలించుకోవడం వంటి నాటకీయతలను మాని, రాహుల్ గాంధీ ప్రధానికి, ప్రజలకు తన పదవిపై ఉన్న అంచనాలను అందుకునే దిశగా అడుగులు వేయాలి.
వినయ్ సహస్రబుద్ధే,
బిజెపి సీనియర్ నాయకుడు

