Modi Kargil Diwas

పాక్ ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తాం

Modi Kargil Diwasరిత్ర నుంచి పాకిస్థాన్‌ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్‌)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. కార్గిల్‌ యుద్ధం 25వ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని జూలై 26న ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం నాటి యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలతో ముచ్చటించారు. ఆ తర్వాత షిన్‌కున్‌ లా సొరంగ పనుల ప్రాజెక్టును మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. టన్నెల్‌ నిర్మాణప్రాంతం వద్ద తొలి బ్లాస్ట్‌ చేశారు. 4.1 కిలోమీటర్ల పొడవైన ఈ ట్విన్‌ ట్యూబ్‌ టన్నెల్‌ను 15,800 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. హిమాచల్‌ ప్రదేశ్, లద్దాఖ్‌లను అనుసంధానించే ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగంగా గుర్తింపు సాధించనుంది. ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన బలానికి, సహనానికి ఈ విజయగాథ నిదర్శనమన్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని తెలిపారు. కార్గిల్‌ యుద్ధానికి లద్దాఖ్‌ సాక్షిగా నిలుస్తుందన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికుల కోసం నిత్యావసరాలు తీసుకొని హెలికాప్టర్‌లో యుద్ధభూమికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ యుద్ధ సమయంలో ఓ సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం నాకు దక్కిందన్నారు. లద్దాఖ్, జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి కోసం ఎలాంటి సవాళ్లనైనా భారత్‌ అధిగమిస్తుందన్నారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారని, పెద్ద కలల గురించి మాట్లాడుకొంటున్నారని మోదీ తెలిపారు. అగ్నిపథ్‌ పథకంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. భారత బలగాలకు సంబంధించి పింఛను నిధులు ఆదా చేసుకునేందుకే ఈ పథకం తీసుకువచ్చారంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ”సైన్యంలో యువరక్తం ఉండేలా చూసుకోవడం, ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేలా చూడటమే ఈ పథకం లక్ష్యం. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై కొందరు రాజకీయాలు చేయడం దురదృష్టకరం. ఆర్మీలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసింది వారే” అని తీవ్రంగా విమర్శించారు.