పాకిస్తాన్‌కు కలలో కూడా ఊహించని షాక్ తప్పదు

నెల 22న మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ సమీపంలోని పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందడం, మరికొంత మంది గాయపడడం మన దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మనదేశంలో అధికార పర్యటనలో ఉండగా, మరోవైపు మన ప్రధాని సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా ఈ ఘాతుకం జరగడం వెనక పాకిస్తాన్ హస్తం, కుట్ర ఉందని స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో నలుగురు పాకిస్తాన్ వాళ్లే. ఈ ఘాతుకం జరిగిన రోజు దిల్లీలోని పాక్ ఎంబసీలోకి కేక్ తీసుకొని వెళ్తుంటే, మీడియా ఎన్ని ప్రశ్నలు వేసినా సదరు ఎంబసీ ఉద్యోగి సమాధానం చెప్పక బిక్కమొహం వేసిన తీరు గమనిస్తే పాకిస్తాన్ ఈ ఘాతుకానికి పాల్పడి, దానిని కేక్ కటింగ్ ద్వారా వేడుక చేసుకుందా అన్న అనుమానం కలుగుతుంది.

2008 నవంబంర్ 26న జరిగిన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కసబ్ గ్యాంగ్ దారుణ మారణకాండ సమయంలోనూ మా పాత్ర లేదని, కసబ్ మా దేశానికి చెందినవాడు కాదని పాకిస్తాన్ ఎన్నో సార్లు అబద్ధం చెప్పినప్పటికీ, అదే పాక్ మీడియా కసబ్ ఇంటిని, కుటుంబాన్ని చూపి, అందులోని పాక్ పాత్రను స్పష్టం చేసింది. ఓటుబ్యాంకు రాజకీయాలకు అత్యంత నీచంగా దిగజారిన నాయకులు దీనిని హిందూ ఉగ్రవాద చర్యగా చిత్రీకరించే ప్రయత్నాలు కూడా చేశారు. పాక్ పాత్ర బయటపడ్డాక, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్తామని బీరాలు పలికిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆ చర్యలు తీసుకోకపోవడంపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

2016 ఊరిలో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై ప్రత్యక్షంగా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టి 50కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం దాయాదిని కంగుతినిపించింది. 2019లో బిజెపి కూటమి గెలవకూడదని పాక్ పుల్వామా ఉగ్రదాడికి పాల్పడితే,  వారం రోజుల్లో బాలాకోట్ పై వైమానిక దాడులతో వందలాది ఉగ్రవాదులను మట్టుబెట్టి భారత ప్రభుత్వం దీటైన జవాబిచ్చింది. గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లా కాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌కు సైనికపరంగా బుద్ధి చెప్పడమే కాకుండా, ఆర్థికంగా పెద్దనోట్ల రద్దు వంటి కఠిన నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ బిచ్చమెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ప్రస్తుత పాక్ సైన్యాధికారి ఆసిమ్ మునీర్ గత కొంతకాలంగా చేస్తున్న ప్రేలాపనలు మేకపోతు గాంభీర్యంలా ఉన్నప్పటికీ, మోదీ ప్రభుత్వం సరిహద్దులో, ఇతర ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంది. ఈ నెల 20న పర్యాటకుల కోసం బైసరన్ లోయను తెరిచిన స్థానిక ప్రభుత్వ అధికారులు, భద్రతా సంస్థలను సంప్రదించకుండా తెరవడంతో ఈ ఘాతుకానికి ఆస్కారమైంది.  ఈ విషయం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో బయటపడింది. ఉగ్రవాదులు మతం ఆధారంగా ఎంచుకొని చంపడం, దాని వెనక పాకిస్తాన్ ప్రమేయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ 24న జరిగిన అఖిల పక్ష సమావేశంలో స్పష్టంగా వివరించారు. ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు కూడా సమిష్టిగా  స్పష్టం చేశాయి.

ఈ పహల్గాం ఘాతుకం జరిగిన వెంటనే సౌదీ పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ రాత్రికిరాత్రి మన దేశానికి వచ్చి, వెనువెంటనే వరుస సమావేశాలు నిర్వహించారు. 22 సాయంత్రమే 3 గంటల పాటు సాగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సీసీఎస్ సమావేశంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని స్పష్టంగా గుర్తించి, వారికి తగురీతిలో బుద్ధి చెప్పడానికి 6 కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని పక్కకుపెట్టడం, పాక్ వీసాల రద్దు, హైకమిషన్‌లో అధికారుల సంఖ్య తగ్గించడం, అటారీ సరిహద్దును వెంటనే మూసివేయడం వంటివి అందులో ఉన్నాయి. ఈ ఆరింటిలో మొదటి సింధు నదీ జలాల ఒప్పందం ఆపివేయడం పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బతీస్తుంది.

ఈ 24న పంచాయితీరాజ్ దినోత్సవంలో భాగంగా బీహార్‌లో జరిగిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఈ పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించనివిధంగా కఠినంగా శిక్షిస్తామని ప్రపంచానికి చెప్తూ, పాకిస్తాన్‌ను హెచ్చరించారు. అమెరికా, రష్యా, చైనా, సౌదీ అరేబియా సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్‌కు మద్దతు తెలిపాయి. అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌లో పని చేసిన మాజీ అధికారి మైకేల్ రూబిన్.. పాక్ సైన్యాధిపతి మునీర్‌ను అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చడం ఇందులో పాకిస్తాన్ పాత్ర తీవ్రతను ప్రపంచం కూడా అర్థం చేసుకుందని తెలుస్తోంది.

చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలి అన్న నానుడి ఇప్పుడు దేశ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో ఉగ్రవాదులపై, ముఖ్యంగా పాకిస్తాన్‌పై తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టంగా తెలుస్తుంది. పాక్‌కు కలలో కూడా ఊహించని షాక్ తగలాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రధాని కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.