Budget Nirmala

పాతికేళ్ళ ప్రగతికి బాటలు వేసే బడ్జెట్

వికసిత్ భారత్, స్వావలంబన లక్ష్యాలుగా ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని, ప్రతి పౌరుడిని సాధికారీకరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగేందుకు దోహదం చేస్తుంది. 2047 నాటికి వికసిత్ భారత్ ను సాకారం చేసే ప్రణాళికను ప్రతిబింబిస్తూ, రాబోయే 25 సంవత్సరాల దార్శనికతను, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయాలను వ్యక్తీకరిస్తూ నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం 

కర్తవ్య భవన్‌లో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అయిన 2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్, మోదీ ప్రభుత్వ సుస్పష్టమైన దార్శనికతతో రూపొందింది. సందిగ్ధత కంటే కార్యాచరణకు, వాక్చాతుర్యం కంటే సంస్కరణలకు, ప్రజాకర్షక విధానాల కంటే ప్రజల సంక్షేమానికే ఇందులో పెద్దపీట వేశారు. ‘ఆత్మనిర్భరత’ను దిక్సూచిగా చేసుకున్న ఈ బడ్జెట్ నిర్మాణాత్మక సంస్కరణలు, ద్రవ్య క్రమశిక్షణ, స్థిరమైన ప్రభుత్వ పెట్టుబడులపై దృష్టి సారించింది. ఉపాధి కల్పన, వ్యవసాయ ఉత్పాదకత, కుటుంబాల కొనుగోలు శక్తి, ప్రాథమిక సేవల ద్వారా ప్రభుత్వ ప్రతి చర్య వల్ల పౌరులు ప్రయోజనం పొందేలా ఇది చూస్తుంది . ‘వికసిత భారత్ యువ శక్తి సంవాదం 2026’ స్ఫూర్తితో ఇది విశిష్టమైన ‘యువశక్తి’ ఆధారిత బడ్జెట్‌గా నిలుస్తుంది. 

ఈ బడ్జెట్ మూడు ప్రధాన ‘కర్తవ్యాల’పై ఆధారపడి ఉంది: మొదటిది, ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం; రెండోది, ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ వారి సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా వారిని దేశ పురోగతిలో భాగస్వాములను చేయడం; మూడోది, మెరుగైన పాలన కోసం ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయడం. ఈ కర్తవ్యాలు ప్రతి కుటుంబం, ప్రాంతం, రంగానికి వనరులు, సౌకర్యాలు, అవకాశాలు అందేలా చూస్తాయి.

సంస్కరణల ఎక్స్ ప్రెస్ 

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ (వేగంగా సంస్కరణలు) స్ఫూర్తితో, 2025 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఇప్పటివరకు 350కి పైగా సంస్కరణలు అమలులోకి వచ్చాయి. నియంత్రణల సడలింపు, నిబంధనల భారాన్ని తగ్గించడం, విశ్వసనీయతతో కూడిన పాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు ‘రక్షణలు’ నిబంధనలను కల్పించడం ద్వారా ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహిస్తారు. ఆర్థికేతర రంగాల్లోని అన్ని నిబంధనలు, ధృవపత్రాలు, లైసెన్స్‌లను సమీక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే, చిన్నపాటి నేరాలను నేరాల జాబితా నుంచి తొలగించేందుకు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ‘జన్ విశ్వాస్ చట్టం 2.0’ను బడ్జెట్ ప్రతిపాదించింది. 

స్థిరమైన ఆర్థిక వృద్ధి, ద్రవ్య క్రమశిక్షణ 

గడిచిన 12 ఏళ్ల మోదీ పాలనలో, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, క్రమశిక్షణ, మితమైన ద్రవ్యోల్బణంతో ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వాల హయాంలో భారత్ ‘ఐదు బలహీనమైన దేశాల’ జాబితాలో ఉండగా, ప్రస్తుతం మోదీ ప్రభుత్వం 7% వృద్ధి రేటును సాధించడంతో పాటు పేదరిక నిర్మూలనలో గణనీయమైన పురోగతి సాధించింది. సామాజిక అవసరాలతో రాజీ పడకుండానే ప్రభుత్వం ద్రవ్య క్రమశిక్షణను పాటిస్తోంది. 2026-27లో అప్పు-జీడీపీ నిష్పత్తిని 55.6 శాతంగా అంచనా వేయగా ఇది 2030-31 నాటికి 50 శాతానికి తగ్గించే పనిలో ఉన్నారు. ద్రవ్య లోటును జీడీపీలో 4.3%కి తగ్గించారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రాలకు 41% పంపిణీని కొనసాగిస్తూ, రూ. 1.4 లక్షల కోట్లను గ్రాంట్లుగా కేటాయించారు.

మధ్యతరగతికి సాధికారత 

గత ఏడాది ప్రకటించిన రూ.12 లక్షల వరకు ఆదాయంపై ‘సున్నా పన్ను’ విధానాన్ని కొనసాగిస్తూ, పన్ను చెల్లింపుదారులను విశ్వసించే ‘వివాద్ సే విశ్వాస్’ తత్వాన్ని బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. విద్యార్థులు, టెక్ నిపుణులు, ఎన్నారైల కోసం ఆరు నెలల విదేశీ ఆస్తి వెల్లడి పథకాన్ని ప్రతిపాదించారు. విదేశీ విద్య, వైద్య అవసరాల కోసం టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) రేటును 5% నుంచి 2 శాతానికి తగ్గించారు.

 క్యాన్సర్ రోగులకు ఊరటనిస్తూ 17 రకాల మందులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని మినహాయించారు. అలాగే అప్పీళ్ల కోసం ముందస్తు చెల్లింపును 20% నుంచి 10%కి తగ్గించడం, చిన్నపాటి నేరాలకు గరిష్ట శిక్షను రెండేళ్లకు తగ్గించడం వంటి చర్యల ద్వారా న్యాయపరమైన చిక్కులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి, విదేశాల్లో నివసించే వ్యక్తులు, భారతీయ కంపెనీల ఈక్విటీలో 10% వరకు పెట్టుబడి పెట్టడానికి అనుమతిని పెంచారు.

 నైపుణ్యాల పెంపు 

యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సేవల రంగంలో భారత్ వాటాను 2047 నాటికి అంతర్జాతీయంగా 10 శాతానికి చేర్చడమే లక్ష్యంగా ‘విద్య నుంచి ఉపాధి, వ్యాపారం’పై స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రెండో, మూడో శ్రేణి నగరాల్లో ‘కార్పొరేట్ మిత్ర’ కేడర్‌ను రూపొందించడానికి స్వల్పకాలిక కోర్సులను ప్రవేశపెడతారు. ప్రధాన పారిశ్రామిక కారిడార్ల సమీపంలో ఐదు ‘యూనివర్సిటీ టౌన్‌షిప్‌ల’ను అభివృద్ధి చేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది. అదనంగా, రాబోయే ఐదేళ్లలో ఒక లక్ష మంది ఆరోగ్య నిపుణులను తయారు చేసేలా అనుబంధ ఆరోగ్య వృత్తి నిపుణుల (AHP) శిక్షణ సంస్థలను బలోపేతం చేస్తారు.

నాణ్యమైన విద్య ద్వారా యువత సాధికారీకరణ 

యువతకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా, జాతీయ హోటల్ మేనేజ్‌మెంట్ మండలి స్థాయిని పెంచి జాతీయ ఆతిథ్య సంస్థ ‘నేషనల్ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హాస్పిటాలిటీ’ ఏర్పాటు చేస్తారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగానికి ఊతమిస్తూ, దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో ‘కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్’ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే డిజైన్ రంగ విస్తరణ కోసం కొత్తగా ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ డిజైన్’ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఎంఎస్ఎంఈల సామర్థ్య వినియోగం

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని ప్రకటించింది. వీటి ఈక్విటీ మద్దతు కోసం రూ.10,000 కోట్లతో ‘MSME వృద్ధి నిధి’ని, రూ. 2,000 కోట్లతో ‘స్వయం సమృద్ద భారత్ నిధి’ని ఏర్పాటు చేశారు. నగదు లభ్యత కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోళ్లకు ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (TReDS) ప్లాట్‌ఫారమ్‌ను తప్పనిసరి చేశారు. అలాగే, ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ ను TReDSతో అనుసంధానించడం ద్వారా తక్కువ వడ్డీకే ఫైనాన్సింగ్ సౌకర్యం కల్పిస్తారు.

తయారీ రంగ విస్తరణ 

ఏడు వ్యూహాత్మక రంగాలలో స్వదేశీ తయారీని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.10,000 కోట్ల వ్యయంతో ‘బయోఫార్మా శక్తి’ పథకాన్ని ప్రారంభించి, భారత్‌ను అంతర్జాతీయ బయోఫార్మా హబ్‌గా మారుస్తారు. జౌళి రంగం కోసం ‘సమర్థ్ 2.0’, మెగా టెక్స్‌టైల్ పార్కులను ప్రతిపాదించారు. కంటైనర్ తయారీకి రూ.10,000 కోట్లు, హైటెక్ టూల్ రూమ్‌ల ఏర్పాటు, క్రీడా సామాగ్రి తయారీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. అలాగే 200 పాత పారిశ్రామిక క్లస్టర్లను ఆధునికీకరిస్తారు.

మౌలిక సదుపాయాల ద్వారా దీర్ఘకాలిక వృద్ధి 

మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వ మూలధన వ్యయాన్ని రూ.11.2 లక్షల కోట్ల నుంచి రూ.12.2 లక్షల కోట్లకు పెంచారు. ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ‘మౌలిక సదుపాయాల రిస్క్ హామీ నిధి’ని ఏర్పాటు చేస్తారు. పర్యావరణ అనుకూల రవాణా కోసం బెంగాల్ లోని దన్కుని నుండి గుజరాత్ లోని సూరత్ వరకు కొత్త సరుకు రవాణా కారిడార్లను, ఒడిశాలో జాతీయ జలమార్గం-5ని అందుబాటులోకి తెస్తారు. వారణాసి, పాట్నాలో నౌకల మరమ్మతుల కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, పర్యాటక రంగం కోసం సీప్లేన్ తయారీకి రాయితీలు కల్పిస్తారు.

ఎగుమతులకు ఊపు 

గత ప్రభుత్వాల హయాంలో భారత్ ఎగుమతుల సామర్థ్యం స్తబ్ధతకు గురైనప్పటికీ, మోదీ ప్రభుత్వం భారత్‌ను అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా మార్చగలిగింది. ప్రపంచ వాణిజ్యం, బహుళపక్ష సంబంధాలకు ఆటంకాలు ఎదురైనా సరఫరా గొలుసులు దెబ్బతిన్న తరుణంలోనూ భారత్ రికార్డు స్థాయి ఎగుమతులను నమోదు చేసింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల వంటి సాంకేతిక ఎగుమతులు అసాధారణంగా 127 రెట్లు పెరగడం గమనార్హం. ఇదే ఊపును కొనసాగిస్తూ, ప్రస్తుత బడ్జెట్‌లో ‘ఎగుమతి ప్రోత్సాహక మిషన్’ను ప్రతిపాదించారు. ఇది వివిధ రంగాలు, మంత్రిత్వ శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు, ఎగుమతి రుణాలు, నాన్-టారిఫ్ అడ్డంకులను అధిగమించడానికి ఎంఎస్ఎంఈలకు మద్దతునిస్తుంది. విమాన కార్గో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా త్వరగా పాడైపోయే ఉద్యాన ఉత్పత్తుల రవాణా నష్టాలను తగ్గించి, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.