Atal Bihari Vajpayee

ప్రజల హృదయాల్లో కొలువుదీరిన నిరాడంబర నేత

టల్ బిహారీ వాజ్‌పేయి భారత రాజకీయాలపై, రాజకీయ చర్చలపై, అన్నిటికీ మించి దేశంలో ప్రజాస్వామ్య చైతన్యంపై చెరగని ముద్ర వేశారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం అటల్జీ జనసంఘ్ ఆదర్శానికి, ఆ తర్వాత బిజెపి సిద్ధాంతానికి మూలస్తంభంగా నిలిచారు. దేశమంతా పర్యటించారు, పార్టీ కార్యకర్తల ఇళ్లలో బస చేశారు, బహిరంగ సభల్లో ప్రసంగించారు. తన వ్యక్తిత్వం, వాక్పటిమతోనే పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అటల్జీ తమ పర్యటనల్లో బస చేసి, కుటుంబ అనుబంధాలు పెంచుకున్న ఇళ్లు వందల సంఖ్యలో ఉంటాయి. పట్నాలోని నా ఇల్లు అలాంటి ఇళ్ళలో ఒకటి.

స్వాతంత్య్రానంతరం నెహ్రూజీ, ఇందిరాజీ నేతృత్వంలోని కాంగ్రెస్ దేశ రాజకీయాలను శాసించింది. వివిధ రకాల వామపక్షాలు, సోషలిస్టులు కూడా తమ ప్రభావాన్ని చూపారు. జాతీయత, దేశ భద్రత, మన సాంస్కృతిక, నాగరిక వారసత్వానికి కట్టుబడి ఉండే జనసంఘ్ సిద్ధాంతానికి చోటు సంపాదించడం అనేది ఒక పెద్ద పని. అయినా అటల్జీ ఆ స్థానాన్ని సాధించగలిగారు. చిన్ననాటి నుంచే నేను పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆయన ప్రసంగాలు విని మంత్రముగ్ధుడినయ్యాను. జనసంఘ్ లేదా బిజెపి మద్దతుదారులు మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతిపక్ష కార్యకర్తలు సహా ప్రజలందరూ అటల్జీ ఉపన్యాసం వినాలని కోరుకునేవారు. కేవలం ఆయన హిందీ కవిత్వం కోసమే కాదు, దేశానికి సంబంధించిన అంశాలపైనా ఆయన ప్రసంగాలను వినేందుకు వచ్చేవారు. కొన్ని సభలకు ప్రజలు టేప్‌రికార్డర్లతో వచ్చేవారు.

స్వతంత్ర భారతదేశంలో, పార్లమెంటులో లేదా బయట వాజ్‌పేయి అత్యంత శక్తిమంతమైన వక్త అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. యువకులు ఆయన శైలిని అనుకరించడం ప్రారంభించారు.’మినీ-అటల్స్’గా గర్వించే వందల మంది యువ కార్యకర్తలు ఉన్నారు. దిల్లీలో ఒక బహిరంగ సభలో, ఒక వక్త ఆయన సమక్షంలోనే ఆయనను చాలా చక్కగా అనుకరించారు. అప్పుడు అటల్జీ, ‘డూప్లికేట్ ఇంత బాగా ఉంటే, ఒరిజినల్‌కి శ్రమ ఎందుకు?’ అని చమత్కరించారు. ఆయన ఎల్లప్పుడూ కొన్ని ముఖ్యమైన సూత్రాలను నొక్కి చెప్పేవారు. మీ మాటల్లో గౌరవం ఉండాలి. ‘రాజనీతిలో మత్ భేద్ ఉండాలి, మన్ భేద్ ఉండకూడదు’ (రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండాలి కానీ మనస్పర్థలు ఉండకూడదు) అని ఆయన అన్నారు. మన వారసత్వంపై స్థిరమైన నమ్మకం, భారతదేశ భవిష్యత్తుపై విశ్వాసం కలిగి ఉండాలి. మీ సిద్ధాంతాన్ని గర్వంగా వివరించండి, ప్రత్యర్థులను విమర్శించండి, కానీ వారిని శత్రువులుగా చూడవద్దు. 1977లో (ఎమర్జెన్సీ తర్వాత) ఇందిరా గాంధీ ఎన్నికలను ప్రకటించినప్పుడు, అటల్జీ దిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి, జయప్రకాశ్ నారాయణ్‌ను కలవడానికి పట్నా వస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయం నుంచి ఆయన్ను మా ఇంటికి తీసుకువచ్చాను. మాటల సందర్భంగా ఇందిరా గాంధీ గురించి నేను కోపంతో, అంతగా గౌరవప్రదంగా లేని మాట ఒకటి అన్నాను. జేపీ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఎమర్జెన్సీలో పోరాడిన వ్యక్తిగా, జేపీతో సహా రాజకీయ నాయకులను ఆమె ప్రభుత్వం అమానుషంగా చూసిన తీరును చూసిన నాకు ఆమెపై అంత కోపం ఉండటం సమంజసమే. కానీ అటల్జీ నన్ను సున్నితంగా వారించి, అలాంటి భాషను నేను ఉపయోగిస్తానని ఆశించలేదని స్పష్టంగా చెప్పారు. జైలు నుంచి అప్పుడే విడుదలైన వ్యక్తి ఆయన. అక్కడ ఆయనకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా ఇందిరా గాంధీపై ఆయనకు ఎలాంటి దురభిప్రాయం లేదు. అది నాపై వ్యక్తిగతంగా బలమైన ప్రభావాన్ని చూపింది.

పార్లమెంటరీ చర్చలను ఆయన ఎంతటి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారో చెప్పడానికి, ఆయనకున్న నిబద్ధత, చమత్కారం, హాస్యం, వ్యంగ్యం, తనను తాను చూసి నవ్వుకోగలిగే సామర్థ్యం అద్భుతంగా ఉండేవి. ఇవన్నీ ఒక చరిత్రగా మిగిలిపోయాయి. 13 రోజులు ప్రధానిగా పనిచేసి రాజీనామా చేయడానికి ముందు 1996లో లోక్‌సభలో ఆయన చేసిన ప్రసంగం భారత పార్లమెంటరీ చరిత్రలోనే అత్యుత్తమ ఘట్టాలలో ఒకటిగా నిలిచిపోతుంది. లోక్‌సభలో మాట్లాడుతూ ఆయన ‘సోమనాథ్’ అని పలికి, ఆగి, ప్రతిపక్షాల వైపు చూస్తూ, ‘సోమనాథ్ మందిర్, సోమనాథ్ ఛటర్జీ కాదు’ అని అన్నారు. అటల్జీకి సన్నిహిత మిత్రుడైన దివంగత సోమనాథ్ ఛటర్జీ నవ్వారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, నరేంద్ర మోదీలతో పాటు, వాజ్‌పేయి మాత్రమే భారత ప్రజల నుంచి ప్రజాదరణ పొందిన ఏకైక ప్రధాని. రాజీవ్ గాంధీ తన సొంత వ్యక్తిత్వంపై గెలవలేదు, ఇందిరా గాంధీ హత్య వల్ల వచ్చిన సానుభూతి కారణంగా గెలిచారు. కాంగ్రెసేతర తొలి నిజమైన ప్రధానిగా అటల్జీ దేశం కోసం విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించారు. భారత్ అణు పరీక్షలు నిర్వహించినప్పుడు ఆయన చూపిన ధైర్యం, ప్రపంచ దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా నిలబడిన తీరు మనకు గర్వకారణం. ఆర్థిక సంస్కరణల మార్గంలో కూడా ఆయన దేశాన్ని నడిపించారు. అది తప్పనిసరి పరిస్థితుల్లో కాదు, స్వచ్ఛందంగా సంస్కరణలు చేపట్టారు.

జాతీయ రహదారుల కార్యక్రమం, మొబైల్ ఫోన్ విప్లవాన్ని ప్రారంభించడం, కిసాన్ క్రెడిట్ కార్డు, పాఠశాల విద్యపై అధిక వ్యయం, గ్రామీణ రహదారులు వంటి దూరదృష్టితో కూడిన సంస్కరణలకు ఆయన తన వ్యక్తిత్వంతో బలం చేకూర్చారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఆయన ‘కర్నా హై’ (చేయాలి) అని చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. సందేశాలను పంపడానికి ఆయనకు తనదైన శైలి ఉండేది. అటల్జీకి, అద్వానీజీకి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని ల్యుటెన్స్ దిల్లీలో నిరాధారమైన పుకార్లు ఉండేవి. ఒక రోజు ఆయన అకస్మాత్తుగా కమ్లా అద్వానీజీకి ఫోన్ చేసి, తాను లంచ్‌కి వస్తున్నట్లు చెప్పారు. పీఎంఓలోని ఒక వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు అటల్జీ ఎప్పటికీ అద్వానీజీని ఉప ప్రధానిగా చేయరని రాశారు. అదే రోజు అద్వానీజీ ఉప ప్రధానిగా నియమితులయ్యారు.

ఇరాక్ యుద్ధం సమయంలో, భారత్-అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో, భారత్ సైన్యాన్ని కూడా ఇరాక్‌కు పంపుతారని విస్తృతంగా ఊహాగానాలు వచ్చాయి. కానీ అటల్జీ గట్టిగా దీన్ని ఖండించారు. భారత సైనికులను ఇరాక్‌కు పంపడానికి నిరాకరించారు. ‘ఒక సైనికుడు భారతదేశాన్ని రక్షిస్తూ మరణిస్తే, నేను అతని తల్లితో మీ కొడుకు దేశం కోసం చనిపోయాడని చెబుతాను. ఒక భారతీయ సైనికుడు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ కార్యక్రమంలో మరణిస్తే, అతని తల్లితో మీ కొడుకు ప్రపంచ శాంతిని రక్షిస్తూ చనిపోయాడని చెబుతాను. ఇరాక్‌లో మరణించిన కొడుకు తల్లికి నేను ఏమి చెప్పగలను?’ అని ఆయన మమ్మల్ని అడిగారు. అటల్జీ పనులు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

(ఆగస్టు 16, 2018 న వాజ్ పేయి మరణించినప్పుడు ఆయనకు నివాళులు అర్పిస్తూ రాసిన వ్యాసం)

రవిశంకర్ ప్రసాద్,
బిజెపి సీనియర్ నాయకులు