sumiran

సోషల్ మీడియా నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం

sumiranతీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కోపాన్ని బిజెపి ప్రదర్శిస్తోంది. బిజెపి సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సుమిరన్ కొమర్రాజు, సోషల్ మీడియా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు అజయ్, తాటిపాముల సాయి కిరణ్ గౌడ్ లను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం. అతేకాదు, వీరిపై BNS 353(1), 353(2) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నియంతృత్వాన్ని చాటుకుంది. సుమిరన్ కొమర్రాజు, అజయ్, తాటిపాముల సాయి కిరణ్ గౌడ్ ల అరెస్టును బిజెపి తెలంగాణ తీవ్రంగా ఖండించింది. దీనిని ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి అనే పేర్కొంది. దీనిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ”అది బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా తెలంగాణలో ప్రతిపక్షాల గొంతును అణచివేసే ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఒక వైపు, తెలంగాణ ప్రభుత్వం సరళమైన విధానాలతో, న్యాయమైన నియంత్రణతో, చట్టబద్ధమైన పాలనను సాగిస్తున్నామని చెప్పుకుంటూ, హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా తెలియజేస్తూ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ వైఫల్యాలను కళ్ళకు కట్టినట్లు తెలిసేలా చేసిన పోస్టర్ గురించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి బిజెపి తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్‌ను అరెస్టు చేసింది. ఇటువంటి ఏకపక్ష అరెస్టులు తెలంగాణ విశ్వసనీయతను ఎలా పెంచుతాయి? రాష్ట్ర ప్రభుత్వం అసహనం, తప్పుదారి పట్టించే నియంతృత్వ విధానాలతో పాలన సాగిస్తున్నదని తెలిస్తే పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా? ఈ అక్రమ అరెస్టును, వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కాలంనాటి విధానాలను, నియంతృత్వ పోకడలను తెలంగాణ ప్రజలు క్షమించరు.” అని అన్నారు.

ఈ మేరకు రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్  ప్రకటన విడుదల చేస్తూ ”గాంధీభవన్ వద్ద వెలిసిన పోస్టర్లు కేవలం ప్రజల తరఫున వస్తున్న ప్రశ్నలు. గత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కాలేదన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేసే విమర్శలు మాత్రమే. ఇవి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ ఈ సాధారణ విమర్శలపైనా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం, రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టే ప్రయత్నం చేయడమే. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలను బయటపెట్టిన వారిపై ఇటువంటి తీవ్ర క్రిమినల్ సెక్షన్లు పెట్టడం, ప్రశ్నల్ని క్రైమ్‌లుగా చూపించడం.. పూర్తిగా అణచివేత రాజకీయాలు, నియంతృత్వ మైండ్‌సెట్, ఎమర్జెన్సీ ధోరణి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా విమర్శలను తట్టుకోలేక అక్రమ అరెస్టులకు పాల్పడిందో.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడుస్తోంది. నిజం చెప్పిన వారిపై కేసులు పెట్టడం.. ప్రభుత్వ హామీలు గుర్తుచేసిన వారిని టార్గెట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో విమర్శ హక్కు, ప్రశ్నించడం బాధ్యత. కానీ ఈ హక్కులను అణగదొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న నియంతృత్వ ధోరణిని బిజెపి దీటుగా ఎదుర్కొంటుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బిజెపి పోరాటం మరింత బలంగా కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టంగా హెచ్చరిస్తున్నాం.” అని పేర్కొన్నారు.