Vajpayee_03

విలువలతో కూడిన పాలన అటల్జీ వారసత్వం

భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి నిస్సందేహంగా మన దేశంలోని అత్యంత ప్రముఖమైన, అందరి ఆమోదం పొందిన నాయకులలో ఒకరు. 2018 ఆగస్టు 16న ఆయన తుది శ్వాస విడిచారు. 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జన్మించిన అద్భుత వక్త అయిన వాజ్‌పేయి, తన జీవితకాలంలోనే భారత్ సరికొత్త శిఖరాలను అధిరోహించడాన్ని చూశారు. రాజకీయాలు, గద్యం, పద్యాలలో ఆయనకున్న విశేష ప్రతిభ కారణంగా ఆయన అందరి గౌరవాన్ని పొందారు. ప్రపంచంలో సమాజం గౌరవాన్ని పొందిన గొప్ప నాయకులు చాలామంది ఉన్నారు. అయితే తమ విమర్శకుల నుంచి కూడా గౌరవాన్ని అందుకున్నవారు చాలా తక్కువ. అటల్ బిహారీ వాజ్‌పేయి ఆ కొద్దిమందిలో ఒకరు. వాజ్‌పేయి మూడుసార్లు భారత ప్రధానిగా పనిచేశారు. 1996లో కేవలం 13 రోజులు, ఆ తర్వాత 1998లో 11 నెలలు, అనంతరం 1999-2004 మధ్య పూర్తికాలం ప్రధానిగా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో పదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెసేతర పక్షం నుంచి పూర్తి కాలం ప్రధానిగా పనిచేసిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 2015లో ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది.

అటల్ జీ భారతదేశ పునరుజ్జీవనానికి అంకితమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన నిబద్ధత కలిగిన’స్వయంసేవక్’. సంఘ్ తో తన అనుబంధం గురించి అటల్ జీ ఒకసారి అమెరికాలో మాట్లాడుతూ, “రేపు నేను ప్రధానమంత్రి కాకపోవచ్చు, కానీ స్వయంసేవక్‌గా ఉండే నా హక్కును ఎవరూ తీసుకోలేరు” అని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ గురించి ఆయన రాస్తూ, “ఆర్ఎస్ఎస్ కేవలం వ్యక్తులను మాత్రమే కాకుండా, సామూహిక దృక్పథాన్ని మారుస్తుంది. ఇదే ఆర్ఎస్ఎస్ నైతికతలోని సౌందర్యం. మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక వ్యక్తి గొప్ప శిఖరాలను చేరుకోగలడు,” అన్నారు. ఆయన హిందుత్వ సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసించారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుండి ఆయన విలువలను, జాతీయ సేవ బలమైన సంప్రదాయాలను స్వీకరించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి 16 ఏళ్ల వయస్సులోనే రాజకీయాలలో చురుకుగా ఉన్నారు. 1951లో ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనసంఘ్‌లో పనిచేయడం ప్రారంభించారు.

సుపరిపాలన దినోత్సవం

రాజకీయాలను విలువలతో, భారతీయ సంప్రదాయాలతో జోడించి సుపరిపాలనకు పునాది వేసిన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి. అటల్ జీ 90వ పుట్టినరోజును 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’సుపరిపాలన దినోత్సవం’గా ప్రకటించారు. దేశ ప్రజలకు పారదర్శకమైన, సమర్థమైన, జవాబుదారీ పాలనను అందించాలనే నిబద్ధత ద్వారా వాజ్‌పేయి మార్గాన్ని అనుసరించాలని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. వాజ్‌పేయి జయంతిని ప్రతి సంవత్సరం సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం భారత ప్రజలకు గర్వకారణం. సుపరిపాలన అంటే అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే, పారదర్శకతతో కూడిన, సేవలను త్వరగా, సులభంగా అందించే ప్రభుత్వం.

అటల్ జీ పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా పాటించడం వెనుక లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి:

    • పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పరిపాలనను అందించడం
    • సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటట్టు చూడటం.
    • సుపరిపాలన కోసం మంచి, సమర్థమైన విధానాలను రూపొందించడం.
    • ప్రజలకు అవినీతి రహిత పరిపాలనను అందించడం.
    • దేశంలో పారదర్శకమైన, జవాబుదారీ పరిపాలనను అందించాలనే ప్రభుత్వ నిబద్ధత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం.
    • దేశంలో వృద్ధిని, అభివృద్ధిని మెరుగుపరచడం.
    • పాలన ప్రక్రియలో క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి పౌరులను ప్రభుత్వానికి దగ్గర చేయడం.

ప్రధానమంత్రిగా తన పదవీకాలమంతా వాజ్‌పేయి పైన పేర్కొన్న అన్ని లక్ష్యాల కోసం కృషి చేశారు. ఆయన పుట్టినరోజున సుపరిపాలన దినోత్సవాన్ని పాటించడం ఆయన జీవితకాల సేవకు నివాళి అవుతుంది. అంతేకాకుండా సుపరిపాలన దినోత్సవాన్ని పాటించడం ద్వారా పాలకపక్షం నిష్పక్షపాతంగా, అభివృద్ధి వైపు మొగ్గు చూపేలా ఉండాలని, వాజ్‌పేయి తన జీవితాన్ని అంకితం చేసిన సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి చేరేలా ఉండాలని భారత ప్రభుత్వానికి నిరంతరం గుర్తు చేస్తుంది.

ఆర్థిక పాలన-వాజ్‌పేయి 

తన పదవీకాలంలో స్వార్థ రాజకీయ శక్తులకు సేవ చేయడం కంటే దేశ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న కార్యక్రమాలకు వాజ్‌పేయి ప్రాధాన్యమిచ్చారు. 2000 సెప్టెంబర్ 7న న్యూయార్క్‌లోని ఆసియా సొసైటీలో చేసిన ప్రసంగంలో వాజ్‌పేయి సుపరిపాలన మౌలిక సూత్రాన్ని వివరించారు. ‘వ్యక్తికి సాధికారత కల్పించడం అంటే దేశానికి సాధికారత కల్పించడం. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన సామాజిక మార్పు ద్వారా సాధికారత లక్ష్యం ఉత్తమమైన స్థాయిలో నెరవేరుతుంది,’ అని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఈ మాటలు దేశానికి ఆయన చేసిన కృషిలో ప్రతిబింబించాయి. ఆయన భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, సమాజంలోని అణగారిన వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు అనేక సామాజిక సంస్కరణలను కూడా ప్రవేశపెట్టారు. 

వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో భారత్ అత్యంత వేగవంతమైన ఆర్థిక వృద్ధి కాలాలలో ఒకదాన్ని వీక్షించింది. ఆయన సమర్థమైన, దార్శనిక మార్గదర్శకత్వంలో అమలు చేసిన సంస్కరణ కార్యక్రమాల కారణంగా దేశం సమాచార సాంకేతికతలో అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. మన దేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి వర్గం, ప్రతి పౌరుడు భారతదేశ సంక్షేమం, పురోగతి ఫలాలను అనుభవించాలని వాజ్‌పేయి గట్టిగా విశ్వసించారు. పేదలకు చౌకగా సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించడానికి ఆయన అంత్యోదయ అన్న యోజనను ప్రారంభించి, సామాన్య మానవుడి పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు.

అటల్ జీ అత్యంత చిరస్మరణీయ విజయాలలో ఒకటి ఆయన ప్రారంభించిన ప్రతిష్టాత్మక రోడ్ల ప్రాజెక్టులు – ‘స్వర్ణ చతుర్భుజి’, ‘ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన’. స్వర్ణ చతుర్భుజి చెన్నై, కోల్‌కతా, దిల్లీ, ముంబైలను హైవేల నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించగా, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనుసంధానం లేని గ్రామాలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే రోడ్ల నెట్‌వర్క్‌గా మార్చింది. స్వర్ణ చతుర్భుజి కేవలం 5 సంవత్సరాల కాలంలో పూర్తయింది. రోడ్డు నిర్మాణం రోజుకు 11 కిలోమీటర్లకు చేరుకుంది. దిల్లీ మెట్రో ప్రాజెక్టును వాజ్‌పేయి 2002లో ప్రారంభించారు.

ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా వాజ్‌పేయి భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. 1998 నుండి 2004 వరకు ఆయన పదవీకాలంలో భారత్ 8 శాతం జిడిపి వృద్ధి రేటును, నాలుగు శాతం కంటే తక్కువ ద్రవ్యోల్బణ స్థాయిని కొనసాగించింది. విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి. వ్యాపారాలు, పరిశ్రమలను నడపడంలో ప్రభుత్వ పాత్రను తగ్గించాలనే అటల్ జీ నిబద్ధత ప్రత్యేక పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటులో ప్రతిబింబించింది. భారత్ అల్యూమినియం కంపెనీ (బాల్కో), హిందుస్థాన్ జింక్, ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వంటివి అత్యంత ముఖ్యమైన పెట్టుబడుల ఉపసంహరణలు. ద్రవ్యలోటును తగ్గించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ద్రవ్య బాధ్యత (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ) చట్టం వాజ్‌పేయి ప్రభుత్వం చేపట్టిన మరో విప్లవాత్మక సంస్కరణ.

డా. వివేక్ కుమార్ మిశ్రా