Indian Judiciery system

ప్రజలకు మరింత చేరువైన న్యాయవ్యవస్థ

మానవ నాగరికతకు న్యాయం ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన మూలస్తంభంగా ఉంటూ వస్తోంది. ప్రతి ఒక్క భాగస్వామిలోను న్యాయం, ఉమ్మడి శ్రేయస్సు పట్ల నమ్మకం, అనుబంధం, భాగస్వామ్య భావనను పెంపొందించడంలో న్యాయ సంస్థలు ఒక వారధిగా పనిచేస్తున్నాయి. దీనికోసం ఒక బలమైన న్యాయ పర్యావరణ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కేవలం న్యాయాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ప్రతి పౌరుడి జీవన సౌలభ్యాన్ని కూడా పెంపొందించాలి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పాలనా విధానం ‘కింది స్థాయి నుంచి పైకి’ విధానం ద్వారా జీవన సౌలభ్యాన్ని పెంపొందిస్తూనే, దేశమే ప్రథమం అనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. న్యాయరంగ సంస్కరణల్లో భాగంగా చట్టాల ఆధునికీకరణ, సంస్థాగత పటిష్టత, డిజిటల్ ఆవిష్కరణలను చేర్చారు. ‘న్యాయ సౌలభ్యం’ అనే మంత్రంలో కక్షిదారుల సులభమైన భాగస్వామ్యం, న్యాయవాదులు, న్యాయమూర్తులకు సులువైన పని వాతావరణం, అలాగే పౌరులకు సులభంగా అర్థమయ్యే విధానాలు అంతర్భాగంగా ఉన్నాయి.

కక్షిదారుల కోణం నుంచి చూస్తే, ‘సమగ్ర న్యాయ వితరణకై వినూత్న పరిష్కారాల రూపకల్పన’ పథకం కింద ఉచిత న్యాయ సేవలను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన టెలి-లా, న్యాయ బంధు వంటి సేవలు న్యాయ వితరణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు తక్కువ ఖర్చుతో అందిస్తున్నాయి. టెలి-లా ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన 1.12 కోట్లకు పైగా లబ్ధిదారులు కోర్టుకు వెళ్లడానికి ముందే ఉచిత న్యాయ సలహాలను పొందారు. ఈ-ఫైలింగ్ సేవలు, ఈ-సేవా కేంద్రాలు కక్షిదారులు న్యాయ వ్యవస్థతో సులభంగా అనుసంధానం కావడానికి సహాయపడ్డాయి. న్యాయవాదులు, న్యాయమూర్తుల విషయానికి వస్తే, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల ఆధునికీకరణ వారి పనిని మరింత సులభతరం చేసింది. మెజారిటీ ప్రజలకు దిగువ స్థాయి న్యాయస్థానాలు మొదటి సంప్రదింపుల కేంద్రంగా ఉన్నందున, వాటిని బలోపేతం చేయడం అత్యంత ఆవశ్యకం. 2014 లో 15,818 గా ఉన్న కోర్టు హాళ్ల సంఖ్య ఇప్పుడు 22,712 కి పెరిగింది. 2014 నుంచి అత్యాధునిక సమగ్ర కోర్టు సముదాయాల అభివృద్ధి కోసం రూ. 9,400.40 కోట్లు విడుదల చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. అంతేకాకుండా, ఈ-కోర్ట్స్ మూడోదశ ప్రాజెక్ట్ ద్వారా కోర్టులను పూర్తిగా డిజిటల్, కాగితం రహిత, కృత్రిమ మేధ-ఆధారిత న్యాయ వితరణ సంస్థలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్, వర్చువల్ కోర్టులు, కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం వంటి కార్యక్రమాలు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత దగ్గర చేశాయి.

భారతదేశం లాంటి విభిన్న భాషలు ఉన్న దేశంలో, పౌరులకు సులభంగా అర్థం కావడం న్యాయ సౌలభ్యంలో ఒక ముఖ్యమైన భాగం. సుప్రీంకోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్‌వేర్ (సువాస్), భాషిణి వంటి ఏఐ-ఆధారిత సహజ భాషా ప్రాసెసింగ్ పరికరాలు సుప్రీంకోర్టు తీర్పులను, ఉత్తర్వులను 18 భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నాయి. జాతీయ న్యాయ సమాచార గ్రిడ్ ద్వారా 34 కోట్లకు పైగా కోర్టు ఉత్తర్వుల విశ్లేషణ సమాచారాన్ని కేవలం ఒకే క్లిక్‌తో పొందే అవకాశం లభిస్తోంది. కొత్త క్రిమినల్ చట్టాలు నేటి ఆధునిక వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ-కోర్టులు, ఈ-ప్రాసిక్యూషన్, ఈ-జైళ్ళు , ఈ-ఫొరెన్సిక్స్‌లను ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్’ (CCTNS)తో అనుసంధానించడం ఒక విప్లవాత్మక అడుగు. ‘న్యాయ శృతి’ ప్లాట్‌ఫామ్ ద్వారా వర్చువల్ హాజరు, సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియలు అత్యంత సమర్ధంగా సాగుతున్నాయి. ఎంతలా అంటే కోర్టు ఒక పౌరుడికి బెయిల్ మంజూరు చేసిన వెంటనే, డిజిటల్ బెయిల్ ఉత్తర్వు నేరుగా జైలు పోర్టల్‌కు చేరుకుంటుంది. దీనివల్ల గతంలో విడుదల ఆలస్యం కావడానికి కారణమైన సమస్యలు తొలగిపోయాయి.

హైకోర్టు న్యాయమూర్తుల మంజూరైన సంఖ్య 2014 లో 906 ఉండగా, ప్రస్తుతం అది 1,122 కి పెరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 2019 లో 31 నుండి 34 కి పెంచగా, ఇప్పుడు ఆ సంఖ్యను 38 కి పెంచడం జరిగింది. గత 12 ఏళ్లలో వివిధ సామాజిక, ప్రాంతీయ నేపథ్యాల నుంచి 1,175 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 77 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించడం న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోంది. వాణిజ్య నిర్వహణను సులభతరం చేయడంలో భాగంగా 40,000కి పైగా నిబంధనల భారాన్ని తగ్గించడంతో పాటు, వలసపాలన నాటి కాలం చెల్లిన 1,725 చట్టాలను మోది ప్రభుత్వం రద్దు చేసింది. మధ్యవర్తిత్వ చట్టాన్ని బలోపేతం చేయడం, ‘భారత్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం’ వంటి సంస్థలను స్థాపించడం, ప్రత్యేక ‘మధ్యవర్తిత్వ చట్టం, 2023’ ద్వారా సామరస్యపూర్వక పరిష్కారాలను ప్రోత్సహించడం ప్రత్యామ్నాయ వివాద పరిష్కార రంగంలో అంతర్జాతీయ భారత్ నాయకత్వ పాత్రను చాటిచెబుతోంది. 2026లో జరిగిన బ్రిక్స్ న్యాయమంత్రుల సమావేశంలో మధ్యవర్తిత్వంను బలోపేతం చేయడానికి ఉమ్మడి నిబద్ధతను చాటే ‘గాంధీనగర్ ప్రకటన’ ఆమోదం పొందడంలో భారత్ కీలక పాత్ర పోషించింది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యసాధన దిశలో భారత్ అడుగులు వేస్తున్న తరుణంలో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే న్యాయ వ్యవస్థను నిర్మించాలన్న దృఢసంకల్పంతో ఉన్నాం. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఉమ్మడి ఆకాంక్షల స్ఫూరితో పరిస్థితులకు అనుగుణగా, కొత్త ఆలోచనలతో, సమ్మిళితత్వ లక్ష్యంతో దీనిని నిర్మిస్తున్నాం.

అర్జున్ రామ్ మేఘ్‌వాల్,
కేంద్ర న్యాయ, న్యాయవ్యవహారాల శాఖ సహాయ మంత్రి