Singareni Yatra

తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌తో సింగరేణికి దీర్ఘకాలిక భరోసా

Singareni Yatraసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను నామినేషన్ పద్ధతిలో కేటాయించడం సంస్థ భవిష్యత్తుకు భరోసానిచ్చే చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా వేలం ద్వారానే కోల్ బ్లాక్‌లు కేటాయిస్తున్న పరిస్థితుల్లో, దాదాపు 12 సంవత్సరాల తర్వాత సింగరేణికి ప్రత్యేకంగా తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయించడం మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు. జూలై 13, 14న రెండు రోజుల పాటు ‘సింగరేణి భరోసా యాత్ర’ ఉత్సాహంగా సాగింది. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావుతో పాటు బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ బృందం రెండు రోజుల పాటు కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, తాడిచర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటించింది. ఈ యాత్రలో భాగంగా ఎక్కడికి వెళ్లినా బిజెపి బృందానికి బొగ్గు కార్మికులు, స్థానికులు, బిజెపి శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల్లో కార్మికులతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు.

ఈ యాత్రలో భాగంగా జూలై 13న కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు, మేధావులతో సమావేశమయ్యారు. అనంతరం సింగరేణి మణుగూరు PKOC-2 మైన్ లో కార్మికులతో సమావేశమయ్యారు. రెండో రోజు జూలై 14న భూపాలపల్లిలోని KTK-8 లో కార్మికులతో సమావేశమయ్యారు. అధికారిక పర్యటనలో భాగంగా గనిని పరిశీలించిన అనంతరం, అక్కడి సింగరేణి కార్మికులు ఎంతో ప్రేమతో, తమ సొంత చేతులతో సిద్ధం చేసిన అల్పాహారాన్ని మంత్రికి, రాష్ట్ర అధ్యక్షుడికి ఆప్యాయంగా అందించారు. ఆత్మీయంగా అల్పాహారం స్వీకరిస్తూ, కార్మికులతో సరదాగా మాట్లాడుతూ బిజెపి నేతలు వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అనంతరం తాడిచర్ల చేరుకున్న బిజెపి బృందానికి సింగరేణి కార్మికులు ఘనస్వాగతం పలికారు. అటు నుంచి రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో యాత్ర చేపట్టారు.

తాడిచర్ల – 2 గనిని సింగరేణికి కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వ చొరవపై కార్మికులు, కార్మిక సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగ భద్రతతో పాటు, సంస్థ విస్తరణకు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లయిందని కార్మిక వర్గాలు భావిస్తున్నాయి. తమ చిరకాల వాంఛను నెరవేర్చడంలో, సింగరేణి సంస్థను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కిషన్ రెడ్డి, రాంచందర్ రావులకు కార్మికులు, నాయకులు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్బంగా సింగరేణి కార్మికుల సంక్షేమం, మైనింగ్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, భద్రతా ప్రమాణాలు, కార్మికుల డిమాండ్లపై కేంద్ర మంత్రి చర్చించారు. ​సింగరేణి అభివృద్ధి, కార్మికుల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ యాత్రలో పలు చోట్ల మాట్లాడిన కిషన్ రెడ్డి దాదాపు రెండు దశాబ్దాలుగా సింగరేణి కార్మికులు, ప్రజాప్రతినిధులు కోరుతున్న తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను ప్రధాని మోదీ చొరవతో సింగరేణికి కేటాయించారని తెలిపారు. ఈ కోల్ బ్లాక్ ద్వారా 40 నుంచి 50 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉండటంతో పాటు సంస్థకు దీర్ఘకాలిక ఆదాయ వనరులు, కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం సింగరేణిలో ఉత్పత్తి, ఆదాయం, ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో కొత్త కోల్ బ్లాక్‌లు అత్యవసరమని పేర్కొన్నారు. ఒకప్పుడు 70 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 40 వేలకు చేరిందని, మరో 30 వేల మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులు సంస్థపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల-2, నైని కోల్ బ్లాక్‌ల కేటాయింపులో ప్రత్యేక చొరవ తీసుకుందని చెప్పారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో సింగరేణికి కేటాయించిందని, అవసరమైన అనుమతులు పూర్తికావడంతో ప్రస్తుతం అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమై సంస్థకు అదనపు ఆదాయం సమకూరుతోందని వెల్లడించారు. ఇదే విధంగా తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కూడా సింగరేణి ఆర్థిక బలోపేతానికి కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

సింగరేణి ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలు బొగ్గు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన సుమారు రూ.54 వేల కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో సంస్థ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని అన్నారు. ఉద్యోగుల జీతాలు చెల్లించడం, కొత్త యంత్రాలు కొనుగోలు చేయడం, గనుల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు కూడా ఈ కారణంగా ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. సింగరేణికి రావాల్సిన నిధులు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు కాదని, అవి కార్మికుల కష్టార్జితంతో సంస్థకు రావాల్సిన ఆదాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కోల్ బ్లాక్ కేటాయింపులపై సుప్రీంకోర్టు జోక్యంతో పారదర్శక విధానం అమల్లోకి వచ్చిందని గుర్తు చేసిన ఆయన, అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాతే తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించామని తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, సింగరేణి కార్మికుల భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధి, సంస్థ ఆర్థిక బలోపేతం కోసమే తీసుకున్నదని స్పష్టం చేశారు. సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, వేలాది కుటుంబాలకు జీవనాధారమైన ఈ ప్రభుత్వ రంగ సంస్థను పరిరక్షించడం అందరి బాధ్యత అని అన్నారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, “సింగరేణి భరోసా యాత్ర” ద్వారా ఇదే సందేశాన్ని కార్మికులు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే

సింగరేణి కార్మికుల పోరాటం కేవలం ఒక సంస్థకే పరిమితం కాదని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి నాంది కావాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు విధాన పరంగా ఎలాంటి తేడా లేదని విమర్శించారు. అవినీతి చేయడంలో, ప్రజలను వంచించడంలో, ఇచ్చిన ఎన్నికల హామీలను గాలికి వదిలేయడంలో రెండు పార్టీలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కంటే అవినీతిపైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టులపై మాట్లాడుతున్నారే తప్ప, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. విద్యార్థులు, రైతులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఫైరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు (రైతు భరోసా) వంటి పథకాల అమలు సరిగ్గా అమలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతుంటే, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ నిధులను నేరుగా, సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తోందని గుర్తు చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై సంస్థను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సంస్థ సంక్షేమం, కార్మికుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సింగరేణి నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించడం బాధ్యతారాహిత్యమని ఆరోపించారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉన్నప్పటికీ సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదన్నారు. గతంలో నైని కోల్ బ్లాక్, ఇప్పుడు తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం సింగరేణి పరిరక్షణకు తీసుకున్న కీలక నిర్ణయాలని పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ కేటాయింపు సాధ్యమైందని రాంచందర్ రావు తెలిపారు. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే సింగరేణి ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి, సంస్థ ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు.

తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపుతో సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు సింగరేణికి అందుబాటులోకి వస్తాయని, దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల పాటు బొగ్గు తవ్వకాలకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో సంస్థ ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. సాధారణంగా కోల్ బ్లాక్‌ల కేటాయింపులో వేలం ప్రక్రియ ద్వారా భారీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఈ కోల్ బ్లాక్‌ను ఎలాంటి టెండర్ లేదా వేలం నిర్వహించకుండా నేరుగా సింగరేణికి కేటాయించడం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.

తాడిచర్ల కోల్ బ్లాక్ కేటాయింపును రాజకీయ కోణంలో కాకుండా సింగరేణి భవిష్యత్తు, కార్మికుల సంక్షేమ దృష్టితో చూడాలని ఆయన సూచించారు. సింగరేణి తెలంగాణకు అమూల్యమైన ప్రజారంగ సంస్థ అని, దానిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం విషయంలో భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పునరుద్ఘాటించిన రాంచందర్ రావు, ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.